విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న అంబటి రాంబాబు, పక్కన నిమ్మకాయల, బాసు లింగారెడ్డి తదితరులు
సత్తెనపల్లి: ప్రశాంతంగా ఉండే సత్తెనపల్లి నియోజకవర్గంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఫ్యాక్షన్ సంస్కృతిని తీసుకొచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబు అన్నారు. ఇనిమెట్ల సంఘటనలో ప్రధాన ముద్దాయి కోడెలే కాని ప్రజలు కాదన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను, బాసు లింగారెడ్డి, నిమ్మకాయల రాజనారాయణ ముగ్గురం కలిసి కుట్రచేసి కోడెలపైకి ఇనిమెట్లలో ప్రజలను ఉసిగొల్పామని టీడీపీ వారు ఫిర్యాదు చేశారన్నారు. తమపై ఇంతకుముందు ఎలాంటి ఎన్నికల కేసులూ లేవని.. కానీ, కోడెల చరిత్ర అంతా బూత్‌లు ఆక్రమించుకోవడం.. అధికారులను, ఓటర్లను బెదరించడం వంటి వాటిల్లో ఆయనపై కేసులున్నాయన్నారు.
ఎన్నికల సమయంలోనే నరసరావుపేటలో ఆయన ఇంట్లో బాంబులు కూడా పేలాయని గుర్తుచేశారు. ఒక క్రిమినల్ సంస్కృతి కలిగిన వ్యక్తి కోడెల అని.. గెలుపు కోసం ఆయన ఎంతకైనా తెగించే మనస్తత్వం కలిగిన వ్యక్తి అని అంబటి విమర్శించారు. ముప్పాళ్ళ మండల ఎంపీటీసీలను గుంటూరు నుంచి తీసుకుని వస్తుండగా మేడికొండూరు వద్ద తమపై దాడిచేసి గాయపరిచిన ఘటనను అంబటి గుర్తుచేశారు. అప్పట్లో కేసు పెట్టామని.. కానీ, కోడెల స్పీకర్ కావడంతో ఒత్తిళ్ళ కారణంగా దానిని చెత్తబుట్టలో పారేశారన్నారు. తాజా ఎన్నికల్లో తాము కుట్ర చేశామని కోడెల చెబుతున్నారని, అందుకు తాము విచారణకు సిద్ధంగా ఉన్నామని, పారిపోయే ప్రశ్నేలేదని అంబటి స్పష్టంచేశారు. ఎన్నికల రోజున తాను ముప్పాళ్ళ మండలం నార్నెపాడు గ్రామానికి వెళ్లానని, కానీ.. బూత్‌లోకి వెళ్తుంటే టీడీపీ నేతలు అడ్డుపడి బయటకు తోసేశారన్నారు.
అధికారుల సూచనతో ఉప్పలపాడులోనే ఆగిపోయా..
కోడెల ఇనిమెట్ల బూత్‌లోకి వెళ్లి ఆ బూత్‌లో రిగ్గింగ్ చేసుకుంటున్నారని తనకు సమాచారం అందడంతో ఆర్వో సూర్యప్రకాష్‌కు ఫోన్ చేయగా, మీరు వెళ్తే మరింత రెచ్చిపోతారని.. ఆయన వద్దని చెప్పారని, డీఎస్పీ కూడా మీరు రావద్దని చెప్పడంతో తాను ఉప్పలపాడులోనే ఆగిపోయానని వివరించారు. కోడెల కుట్రపూరిత మనస్తత్వం, వ్యవహారశైలి కారణంగానే అక్కడ గొడవ జరిగిందన్నారు. చిరిగిన చొక్కా వేసుకుని తిరుగుతూ సానుభూతి పొందాలనుకోవడం.. ఓటర్లను రెచ్చగొట్టే పని కాదా అని అంబటి ప్రశ్నించారు. కోడెల వెంట నరసరావుపేట రౌడీలు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. పోలీసులు గ్రామాన్ని ముట్టడించి ఇప్పటికి ఏడుగురిని తీసుకొచ్చారని, నేరం జరిగితే కేసు రిజిస్టర్ చేయాలని.. ప్రజలను వేధింపులకు గురిచేస్తే వైఎస్సార్‌సీపీ సహించబోదన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒత్తిడి చేస్తున్నారని, ఒక బెటాలియన్ పోలీసులను పంపి ముస్లింలను, కాపులను, ఎస్సీలను తీసుకురమ్మని చెబుతున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. మరోవైపు.. ముప్పాళ్ళ ఎస్‌ఐ వ్యవహారశైలిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశానని అంబటి చెప్పారు. బూత్‌ను ఆక్రమించుకున్న కోడెలపై కేసు నమోదుచేసి అరెస్టుచేయాలని ఆయన డిమాండ్ చేశారు.
నరసరావుపేట వారికి ఇనిమెట్లలో ఏం పని?
పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ మాట్లాడుతూ.. ఎన్నికల నామినేషన్ల ఘట్టం నుంచి నరసరావుపేటకు చెందిన రౌడీషీటర్లు సత్తెనపల్లి హోటళ్లు, అపార్టుమెంట్‌లలో 500 మంది ఉన్నారన్నారు. దాడిలో దెబ్బలుతిన్న రవి, కృష్ణ నరసరావుపేట వాళ్లు కాదా, వారికి ఇనిమెట్ల బూత్‌లో ఏం పని అని రాజనారాయణ నిలదీశారు. నర్రా బాబురావుతోపాటు మరో 50–60 మంది ఇనిమెట్లలో ఎందుకు ఉన్నారన్నారు. బాసు లింగారెడ్డి మాట్లాడుతూ.. ఇనిమెట్ల పోలింగ్ కేంద్రంలోకి కోడెల వెళ్లి గంటన్నర కూర్చోవచ్చా అని ప్రశ్నించారు. ఆయనకు ఆయనే చొక్కా చింపుకుని తలుపులు వేయించుకోవడంతో బయట ప్రజలు ఆందోళన చెందారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment