కోడెల అనుచరుల దాడిలో గాయపడిన అంబటి రాంబాబు (ఫైల్)
సాక్షి, గుంటూరు: రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యక్తే అందుకు భిన్నంగా వ్యవహరించారు.. స్పీకర్ స్థానంలో ఉన్న ఐదేళ్లూ ప్రతిపక్షంపట్ల అడ్డగోలుగా వ్యవహరించి ఇప్పుడు నీతి వాక్యాలు వల్లిస్తున్నారు. 23మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలోగానీ, అసెంబ్లీలో ఆ పార్టీ ఎమ్మెల్యేల హక్కుల విషయంలోగానీ ఆయన వ్యవహరించిన తీరు అత్యంత దారుణం.. తన పార్టీ అధినేత ఫొటోకు క్షీరాభిషేకం చేసి స్పీకర్ స్థానానికున్న గౌరవాన్ని మంటగలిపినప్పుడు ఆయనకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదు.. ఇంత అరాచకంగా వ్యవహరించిన ఆయన ఈనెల 11న జరిగిన ఎన్నికల్లో ఆయనకు ఎదురైన పరాభవంపై గగ్గోలు పెట్టడం హాస్యాస్పదంగా ఉందని ప్రజాస్వామ్యవాదులు, మేథావులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎప్పుడూ, ఎవరూ చేయని విధంగా గంటన్నరపాటు పోలింగ్‌ను అడ్డుకున్న స్పీకర్ కోడెల శివప్రసాద్ తీరుపై ఇప్పుడు సర్వత్రా ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఐదేళ్లలో ఆయన, ఆయన కుటుంబ సభ్యులు చేసిన అరాచకాలను మేథావులు, ప్రజాస్వామ్యవాదులు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. ఉదాహరణకు..
- 2014 జూలై 13న ముప్పాళ్ళ ఎంపీపీ ఎన్నిక సందర్భంగా ఎంపీటీసీలతో వెళ్తున్న గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా కారును ధ్వంసం చేసి, ఆయన్ని తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడిలో అంబటి రాంబాబుతో పాటు, పలువురికి గాయాలయ్యాయి. ఎంపీటీసీలు ప్రయాణిస్తున్న బస్సును సైతం ధ్వంసంచేసి ఏడుగురు ఎంపీటీసీలను కిడ్నాప్ చేసి పోలీసుల పహారాలో ఎంపీపీ పదవిని అక్రమ మార్గంలో తమ ఖాతాలో వేసుకున్నారు.
- స్పీకర్, ఆయన తనయుడే ఎమ్మెల్యేపై దాడులు చేయించిన దుర్మార్గ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారంటే స్పీకర్ ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో అర్థం చేసుకోవచ్చు.
- 2014 ఎన్నికల్లో నరసరావుపేట ఎమ్మెల్యేగా వైఎస్సార్‌సీపీ తరఫున డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోటీచేసి గెలుపొందారు. అయితే, నరసరావుపేటకు సైతం స్పీకర్ కోడెల అనధికార ఎమ్మెల్యేగా వ్యవహరించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సైతం ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డికి కనీసం ఆహ్వానం పంపకుండా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ వచ్చారు.
- స్పీకర్ స్థానంలో ఉన్నప్పటికీ పార్టీ అధినేత చంద్రబాబు చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేయడం వంటి చర్యలకు పాల్పడి స్పీకర్ స్థానం గౌరవాన్ని దిగజార్చారు.
- 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసి రాజీనామాలు చేయించకుండానే తమ పార్టీలో చేర్చుకోవడంతో పాటు, వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. దీనిపై వైఎస్సార్‌సీపీ స్పీకర్ కోడెలకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు.
అడ్డగోలుగా దందాలు..
ఇదిలా ఉంటే.. స్పీకర్ కోడెల తన సొంత నియోజకవర్గంలో చేసిన అరాచకాలకు అంతేలేదు. కమీషన్లు ఇవ్వలేదనే కారణంతో నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణ పనులను నిలిపివేయించడం.. కాంట్రాక్టు సంస్థ, ఉద్యోగులపై దాడులకు తెగబడడం వంటి దుశ్చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి.
- నరసరావుపేట పట్టణంలో జీసీవీ, ఎన్‌సీవీల కార్యాలయాలపై కోడెల తనయుడు దాడులు చేయించి ధ్వంస రచనకు పాల్పడడంతో పాటు, అడ్డువచ్చిన వారిపై దాడులకు సైతం తెగబడ్డారు.
- ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తూ వచ్చిన కోడెలకు ఇప్పుడు పోలింగ్ సందర్భంగా తనకెదురైన అవమానంతో అకస్మాత్తుగా ప్రజాస్వామ్యం గుర్తుకువచ్చి గగ్గోలు పెడుతుండడంపై మేథావులు, ప్రజాస్వామ్యవాదులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తనదాకా వస్తేగానీ ఆయనకు రాజ్యాంగం, ప్రజాస్వామ్యం గుర్తుకురావా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.
గంటన్నరపాటు పోలింగ్‌ను అడ్డుకున్న కోడెలపై చర్యల్లేవా!?
సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామంలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతున్న సమయంలో టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావు అక్కడికి వెళ్లి ఓటర్లపై దౌర్జన్యానికి తెగబడ్డారు. తనకు ఓట్లు ఎందుకు వేయరంటూ దూషణలకు దిగుతూ పోలింగ్ బూత్‌లోకి వెళ్లి తలుపులు మూసి లోపల కూర్చుండిపోయారు. గంటన్నరపాటు కోడెల తలుపులు తీయకపోయినా పోలీసులుగానీ, పోలింగ్ అధికారులుగానీ పట్టించుకోలేదు. కోడెల పోలింగ్ బూత్‌లో రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారనే అనుమానంతో ఆగ్రహించిన ఓటర్లు తలుపులు నెట్టేసి ఆయన్ను బయటకు లాక్కొచ్చేందుకు యత్నించారు. దీంతో సొమ్మసిల్లి పడిపోయినట్లుగా కోడెల కొత్త డ్రామాకు తెరతీశారు.
పోలీసులు ఆయన్ని తమ వాహనంలో అక్కడి నుంచి తీసుకెళ్లారు. అయితే, గ్రామం నుంచి వచ్చిన తరువాత కూడా చిరిగిన చొక్కాతో.. లేని నీరసాన్ని నటిస్తూ పోలింగ్ బూత్‌ల వద్ద తిరుగుతూ సానుభూతి పొందే కుయుక్తులు పన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఓటమి ఖాయమని గ్రహించిన కోడెల.. తనపై హత్యాయత్నం జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు చకచకా అనేక సెక్షన్లతో పాటు, హత్యాయత్నం కేసు నమోదు చేసేశారు. కానీ, అసలు ఇనిమెట్ల గ్రామంలోకి అడుగు కూడా పెట్టని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబు, వైఎస్సార్‌సీపీ నేతలు నిమ్మకాయల రాజనారాయణ, బాసు లింగారెడ్డిలతో పాటు, పలువురు గ్రామస్తులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారంటే పోలీసులు టీడీపీ నేతలకు ఏ స్థాయిలో ఊడిగం చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. గంటన్నరపాటు పోలింగ్ నిలిచిపోవడానికి కారకుడైన కోడెలపై మాత్రం ఎలాంటి కేసు నమోదు కాకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment