
సాక్షి, అమరావతి : గత నెల రోజులుగా ఓట్ల వేటలో పడిన రాజకీయ పార్టీల నేతలు, అభ్యర్థులు ఇప్పుడు ఆ ఓట్లు ఎవరి ఖాతాలో పడ్డాయోనని తెలుసుకునే పనిలో పడ్డారు. తుది ఫలితం తెలుసుకోడానికి మాత్రం 40 రోజులు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నడూ లేని విధంగా ఈసారి ఫలితాల కోసం నెల రోజులకు పైగా ఎదురుచూడాల్సి వస్తోంది. మండే ఎండలను సైతం లెక్కచేయకుండా విస్తృత ప్రచారం చేసిన ఆయా పార్టీల అభ్యర్థులు ఇప్పుడు ఫలితాల కోసం ఈ 40 రోజులూ ఎలా గడపాలా అని ఒత్తిడికి గురవుతున్నారు.
పోలింగ్ ముగియడంతో అభ్యర్థులందరూ ఇక ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే లెక్కలపైనే దృష్టి సారించారు. పోలింగ్ సరళిని బట్టి అంచనాలు వేసుకుంటున్నారు. విజయం సాధిస్తామని వైఎస్సార్‌సీపీ ప్రకటించగా.. తెలుగుదేశం పార్టీ అధినేత మాత్రం ఎన్ని సీట్లు వస్తాయనే విషయాన్ని చెప్పకుండా ఈవీఎంలను మేనేజ్ చేశారంటూ ఆరోపించి తన పార్టీ విజయంపై అనుమానాలను వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్‌ను కూడా వచ్చే నెల 19 వరకు ప్రకటించడానికి వీల్లేదని ఈసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన సంస్థల నుంచి అభ్యర్థులు తమ భవిష్యత్ ఎలాగుందనే విషయాన్ని రాబట్టే పనిలో పడ్డారు.
అభ్యర్థులు విహార యాత్రలకు..
ఇదిలా ఉంటే.. ఇక్కడే ఉంటూ ఫలితాలు ఎలాగుంటాయోనని నిత్యం ఒత్తిడికి గురయ్యే బదులు విదేశీ యాత్రలకు వెళ్లడం మేలనే అభిప్రాయానికి అనేకమంది అభ్యర్థులు వచ్చారు. చాలామంది విదేశీ యాత్రలకు వెళ్లి సేద తీరేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. పోలింగ్‌కు ఫలితాలకు మధ్య ఈసారి చాలా రోజులుండటంతో పక్షం రోజుల పాటు విహార యాత్రలకు వెళ్లనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment