ఓటర్లతో గొడవకు దిగిన లోకేశ్‌ | Huge Police Support to the TDP For Their Criminal Activities In Elections | Sakshi
Sakshi News home page

పోలీసుల ‘పచ్చ’పాతం!

Published Sun, Apr 14 2019 3:24 AM | Last Updated on Sun, Apr 14 2019 4:23 PM

Huge Police Support to the TDP For Their Criminal Activities In Elections - Sakshi

పోలింగ్‌ రోజు బూత్‌ వద్ద నుండి వెళ్లాలని సూచిస్తున్న ఎస్పీపై మండిపడుతున్న లోకేశ్‌

నారా లోకేశ్‌ గుంటూరు జిల్లా తాడేపల్లి క్రిస్టియన్‌పేటలోని పోలింగ్‌ కేంద్రంలోకి నిబంధనలకు విరుద్ధంగా పదిమంది అనుచరులతో కలిసి ప్రవేశించారు. ఓటర్లతో గొడవకు దిగారు. పోలింగ్‌కు విఘాతం కలిగించేలా లోకేశ్‌ వ్యవహరిస్తుండటంతో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఆయనను నిలువరించే యత్నం చేశారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై లాఠీచార్జి చేసి లోకేశ్‌ను అక్కడి నుంచి పంపించారు. అనంతరం తాడేపల్లి ఎస్సై, ఆర్‌ఐ, హెడ్‌కానిస్టేబుల్‌తో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై మూడు ఫిర్యాదులిప్పించి అక్రమ కేసులు నమోదు చేశారు. పోలింగ్‌ బూత్‌ వద్ద ఓటర్లతో ఘర్షణ పడ్డ నారా లోకేశ్‌పై పోలింగ్‌ అధికారులు గానీ, పోలీసులు గానీ ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. 

సాక్షి, గుంటూరు/సాక్షి నెట్‌వర్క్‌:
-
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని వీరాపురంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వర్గీయులు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైఎస్సార్‌సీపీ శ్రేణులపై వేట కోడవళ్లతో దాడులకు దిగారు. ఈ దాడిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త పుల్లారెడ్డి దుర్మరణం పాలయ్యాడు. 
- చిత్తూరు జిల్లా పుంగనూరులో వైఎస్సార్‌సీపీ కార్యకర్త వెంకటరమణప్పను టీడీపీ కార్యకర్తలు రాళ్లతో కొట్టి హత్య చేశారు. 
- గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య బెదిరింపులకు దిగారు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరించాలంటూ ఏకంగా ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులను హెచ్చరించారు.  
- విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలోని జీఎంవలస మండలం చినకుదమ గ్రామంలో ఓటర్లను పోలింగ్‌ బూత్‌లోకి రానివ్వకుండా టీడీపీ నేతలు ఏకపక్షంగా ఓట్లు వేశారు. వైఎస్సార్‌సీపీ నేత శత్రుచర్ల పరీక్షిత్‌రాజుపై దాడికి పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుష్పశ్రీవాణిపైనా టీడీపీ నేతలు దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు.  
- చిత్తూరు జిల్లా పూతలపట్టు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎంఎస్‌ బాబును టీడీపీ నేతలు కిడ్నాప్‌ చేశారు. టీడీపీ శ్రేణుల దాడితో ఎంఎస్‌ బాబు తీవ్రంగా గాయపడ్డాడు. 
- నెల్లూరు నగరంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అనిల్‌కుమార్‌ యాదవ్‌పై టీడీపీ నేతలు దాడికి దిగారు. 
- గుంటూరు జిల్లా యలమందలో నరసరావుపేట వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై టీడీపీ నాయకుడు దాడికి దిగడంతోపాటు ఆయనను కారుతో ఢీకొట్టారు.  
- అనంతపురం జిల్లా రాప్తాడులో మంత్రి పరిటాల సునీత వర్గీయులు దౌర్జన్యానికి దిగారు.  
- కృష్ణా జిల్లా విజయవాడలో వైఎస్సార్‌సీపీ నాయకుడు వాహబ్‌పై టీడీపీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ దాడి చేశారు. 
- పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి బడేటి బుజ్జి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి చేసి కొట్టారు.  
- తూర్పుగోదావరి జిల్లాలో పి.గన్నవరంలో టీడీపీ కార్యకర్తల దాడిలో ముగ్గురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. 
- మంత్రి అచ్చెన్నాయుడు అనుచరులు శుక్రవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం బొప్పాయిపురం పంచాయతీ పరిధి నీలాపురం గ్రామంలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఇళ్లలోకి చొరబడి 16మంది టీడీపీ మద్దతుదారులు కర్రలు, మారణాయుధాలతో విధ్వంసానికి పాల్పడ్డారు. క్షతగాత్రులంతా టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 
- పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ముక్కంపాడులో శనివారం రాత్రి టీడీపీ నేతలు రాడ్లు, కర్రలతో వైసీపీ కార్యకర్తలపై దాడికి దిగారు. తమ పార్టీకి ఓటు వేయకుండా ప్రతిపక్షానికి వేస్తారా? అంటూ దౌర్జన్యం చేశారు.   

... ఇలా చెప్పుకుంటూ పోతే అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల అరాచకాలు, దౌర్జన్యాలకు అంతే లేదు. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో బీభత్సం సృష్టించారు. వైఎసాŠస్‌ర్‌సీపీ అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలపై ఇష్టారాజ్యంగా దాడులకు దిగారు. రాక్షసంగా వ్యవహరించారు. వారి వాహనాలను సైతం ధ్వంసం చేశారు. విచిత్రం ఏమిటంటే.. ఇంతగా బరితెగించిన టీడీపీ నేతలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కొన్నిచోట్ల మాత్రం తూతూమంత్రంగా కేసులు పెట్టి వదిలేశారు. ఐదేళ్ల పాటు అధికార తెలుగుదేశం పార్టీ నేతల సేవలో తరించిన పోలీసులు ఎన్నికలు ముగిసిన తరువాత కూడా వారికి జీహుజూర్‌ అంటున్నారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి, పోలింగ్‌కు విఘాతం కలిగిస్తూ అడ్డగోలుగా వ్యవహరించిన టీడీపీ అభ్యర్థులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారు.

పోలింగ్‌ కేంద్రాల వద్ద హల్‌చల్‌ చేసిన టీడీపీ అభ్యర్థులను నిలదీసిన పాపానికి వైఎస్సార్‌సీపీ నేతలతోపాటు, ఓటర్లపై సైతం కేసులు నమోదు చేస్తున్నారు. పోలింగ్‌కు విఘాతం కలిగించిన స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్‌లపై కేసులు పెట్టని పోలీసులు వైఎస్సార్‌సీపీ నేతలపై మాత్రం అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై రాళ్లు, మారణాయుధాలతో దాడికి దిగి, కార్లను ధ్వంసం చేసిన టీడీపీ నేతలపై పోలీసులు ఈగ కూడా వాలనివ్వడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు 
స్పీకర్‌ కోడెల ఫిర్యాదుపై తీవ్రంగా స్పందించిన పోలీసులు ఏకంగా హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇక నారా లోకేశ్‌ విషయంలో అయితే అత్యుత్సాహం ప్రదర్శించారు. లోకేశ్‌ ఫిర్యాదు చేయకపోయినా పోలీసు అధికారులతో ఫిర్యాదులు చేయించి మరీ వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, విలేకరులపై సైతం అక్రమ కేసులు బనాయించి స్వామి భక్తిని చాటుకున్నారు. పోలింగ్‌ అధికారులు సైతం టీడీపీ నేతలపై ఫిర్యాదు చేయకుండా వైఎస్సార్‌సీపీ నేతలపైనే ఫిర్యాదులు చేయడం గమనార్హం. దీన్నిబట్టి అధికార యంత్రాంగం టీడీపీ నేతలకు ఏవిధంగా అండగా నిలుస్తోందో అర్థమవుతోంది. 

కోడెలపై హత్యాయత్నం చేశారట! 
రాజుపాలెం మండలం ఇనిమెట్లలో ప్రశాంతంగా పోలింగ్‌ జరుగుతున్న సమయంలో తమకు ఓట్లు పడడం లేదని గ్రామ టీడీపీ నేతలు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న కోడెల శివప్రసాదరావు ఓటర్లతో గొడవకు దిగడమే కాకుండా పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి తలుపులు మూసేశారు. గంటన్నరపాటు తలుపులు తెరవకపోవడంతో లోపల రిగ్గింగ్‌ జరుగుతోందనే అనుమానంతో ఓటర్లు తలుపులు బద్ధలు కొట్టి కోడెలను బయటకు రప్పించారు. దీంతో కోడెల సొమ్మసిల్లినట్లుగా డ్రామా ఆడుతూ పోలీసుల సాయంతో అక్కడి నుంచి నిష్క్రమించారు. ఆయన ఫిర్యాదు మేరకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అంబటి రాంబాబుతోపాటు పలువురు వైఎస్సార్‌సీపీ నేతలపై హత్యాయత్నం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అంబటి రాంబాబు ఆ గ్రామంలోకి వెళ్లకపోయినా కుట్రపూరితంగా కేసులో ఇరికించారు. 

కాసు మహేష్‌రెడ్డిపై దాడి 
గురజాల నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కాసు మహేష్‌రెడ్డి మాచవరం మండలం కొత్తగణేశునిపాడు గ్రామానికి వెళ్లిన సమయంలో టీడీపీ నేతలు రాళ్లు, మారణాయుధాలతో దాడికి దిగి, ఆయన కారును ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. 

మేరుగ నాగార్జునపై రాళ్లతో దాడి 
గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల మండలం గుత్తికొండలో టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి, పోలింగ్‌ అధికారిపై చెయ్యి చేసుకున్నాడు. అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఆయనపై ఫిర్యాదు కూడా చేసే సాహసం ఎవరూ చేయలేకపోయారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.  వేమూరు మండలం బూతుమల్లి గ్రామంలో పోలింగ్‌ కేంద్రం వద్ద వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేరుగ నాగార్జునపై టీడీపీ నేతలు రాళ్లు, మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసి రెండు రోజులు దాటినా ఇంతవరకూ కేసు నమోదు చేయలేదు. 

ఎన్నికల్లో గొడవలు సృష్టించడం కోడెలకు కొత్తేమీ కాదు 
- 1989లో రొంపిచర్ల మండల పరిషత్‌ ఉపాధ్యక్షుని ఎన్నిక సమయంలో మంత్రి హోదాలో అక్కడకు వెళ్లి గొడవలు సృష్టించడంతో పరిస్థితి చేయి దాటిపోయి కాల్పుల వరకూ వెళ్లింది.  
- 1996లో సైతం రొంపిచర్ల ఎంపీపీ ఎన్నికల్లో అక్కడికి వెళ్లి హల్‌చల్‌ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. 
- 1999లో ఏకంగా కోడెల శివప్రసాదరావు ఇంట్లోనే బాంబులు పేలడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో కోడెల అనుచరులు నలుగురు మృతి చెందారు. 
- 2004లో రొంపిచర్ల పోలింగ్‌ బూత్‌ వద్దకు వెళ్లి రిగ్గింగ్‌ చేసేందుకు యత్నించడం అప్పటి కాంగ్రెస్‌పార్టీ ఎంపీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పరిస్థితిని చక్కదిద్దడానికి పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. 
- 1989 నుంచి 2004 వరకు నరసరావుపేట నియోజకవర్గంలో ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ప్రత్యర్థులపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేయడంతో అనేక మంది గ్రామాలు వదిలి వెళ్లిన సంఘటనలు ఉన్నాయి. 

మైనారిటీలపై గూండాగిరి 
గురజాలలో తమకు ఓట్లు వేయలేదని టీడీపీ గూండాలు ముస్లిం మైనారిటీల ఇళ్లపై దాడులకు తెగబడడంతోపాటు కర్రలు, కత్తులు, రాడ్లతో పట్టణంలో విధ్వంసం సృష్టించారు. ముస్లింలు ఇళ్లకు తాళాలు వేసి ఊరు వదిలి వెళ్లిపోయారు. టీడీపీ నేతలు గంటల తరబడి పట్టణంలో వీరంగం చేస్తూ వైఎస్సార్‌సీపీ నేత యెనుముల మురళీధర్‌రెడ్డికి చెందిన కేబుల్‌ కార్యాలయం, వైఎస్సార్‌సీపీ నాయకుడు కేతు శ్రీనివాసరెడ్డికి చెందిన శ్రీసత్యనారాయణ ఐనాక్స్‌ థియేటర్‌లపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఇదంతా సీఐ రామారావు సమక్షంలోనే జరిగినప్పటికీ ఆయన వారికి ఎస్కార్ట్‌లా వ్యవహరించారే తప్ప, నిలువరించే ప్రయత్నం చేయలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement