యరపతినేని గ్యాంగ్‌.. ముస్లింలపై జులుం | Yarapatineni gang attack on YSRCP supporters | Sakshi
Sakshi News home page

యరపతినేని గ్యాంగ్‌.. ముస్లింలపై జులుం

Published Sat, Apr 13 2019 4:52 AM | Last Updated on Sat, Apr 13 2019 4:52 AM

Yarapatineni gang attack on YSRCP supporters - Sakshi

కాసు మహేష్‌రెడ్డి వద్ద తమ గోడు వెళ్లబోసుకుంటున్న ముస్లిం మహిళలు

సాక్షి – గుంటూరు, అమరావతి, సాక్షి నెట్‌వర్క్‌: ఎన్నికల్లో ఓటమి ఖాయమని నిర్ధారణకు వచ్చిన అధికార టీడీపీ అసహనంతో రాష్ట్రవ్యాప్తంగా హింసాత్మక ఘటనలకు తెగబడుతోంది. వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులతో పాటు తమకు ఓటు వేయలేదని అనుమానిస్తున్నవారిపై కిరాతకంగా దాడులకు పురిగొల్పుతోంది. గుంటూరు జిల్లా గురజాలలో ముస్లిం మైనార్టీలపై దాడులు చేసిన రౌడీమూకలతో టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సమావేశం కావడం దీన్ని రుజువు చేస్తోంది. పోలింగ్‌ రోజున ప్రారంభమైన టీడీపీ నేతలు, కార్యకర్తల ఆగడాలు శుక్రవారం కూడా కొనసాగాయి. 

మంచినీళ్లూ ఇవ్వం.. 
గురజాలలో తమకు ఓటు వేయలేదనే ఆగ్రహంతో ముస్లిం మైనార్టీలపై టీడీపీ రౌడీమూకలు పాశవికంగా దాడులు చేయడంతో సగం మంది ఇళ్లకు తాళాలు వేసి ఊరు వదిలి వెళ్లిపోయారు. గురువారం రాత్రి నుంచి మొదలైన టీడీపీ కార్యకర్తల దాడులతో స్థానిక ముస్లింలు భయంతో వణికిపోతున్నారు. ఈ ఘటనలో వైఎస్సార్‌ సీపీ నేతల ఆస్తులు కూడా ధ్వంసం కావడం తెలిసిందే. ముస్లింల ఇళ్లకు తాగునీటిని సరఫరా చేసేందుకు చిన్నబావిలో అమర్చిన మోటర్లను సైతం తొలగిస్తామంటూ టీడీపీ నేతలు శుక్రవారం హెచ్చరికలు జారీ చేయడం చూస్తుంటే అరాచకపర్వం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. టీడీపీ గూండాల విధ్వంసానికి చాలా మంది ఇళ్లకు తాళాలు వేసి ఊరు వదిలి వెళ్లిపోయారని, తాము మాత్రం ఎక్కడికి వెళ్లాలో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నామని ముస్లిం మహిళలు కంట తడిపెడుతున్నారు. తాము చేసిన తప్పేమిటని వారిని పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ గురజాల అసెంబ్లీ అభ్యర్థి కాసు మహేశ్‌రెడ్డి, డీఎస్పీ శ్రీహరిబాబుల ఎదుట బాధితులు విలపించారు.  

మతోన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారని నిరసనలు..
ముస్లింల ఇళ్లకు తాగునీరు అందించే మోటార్లను సైతం తొలగించాలని నిర్ణయించడం, అద్దెకు ఉండేవారిని ఖాళీ చేయాలని బెదిరిస్తూ టీడీపీ నేతలు మతోన్మాదుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. దాడులకు దిగిన టీడీపీ నేతలు, గుంపులు గుంపులుగా యథేచ్ఛగా తిరుగుతున్నా పట్టించుకోని పోలీసులు జంగమహేశ్వరపురంలో మాత్రం రోడ్లపై తిరగొద్దంటూ హెచ్చరికలు జారీ చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మూడు గంటల పాటు దాడులకు తెగబడి ముస్లింల ఇళ్లను ధ్వంసం చేసిన రౌడీమూకలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఇంతవరకూ పోలీసులు వెల్లడించ లేదు. ఎన్నికలకు ముందే గురజాల టౌన్‌ సీఐ రామారావును బదిలీ చేస్తే ఇలాంటి ఘటనలు జరిగేవి కాదని పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు కనీసం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్‌ చేస్తున్నారు. 

కార్యకర్తలతో యరపతినేని సమావేశం 
మరోవైపు ముస్లింలపై దాడులకు పాల్పడ్డ టీడీపీ కార్యకర్తలతో గురజాలలోని ఓ అపార్టుమెంట్‌లో టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు శుక్రవారం సమావేశం కావడం గమనార్హం. వైఎస్సార్‌సీపీ నేతలే దాడులకు పాల్పడ్డారంటూ ఆయన కొత్త డ్రామాలకు తెరతీశారు. బాధిత ముస్లింలను కనీసం పరామర్శించకుండా దాడులకు తెగబడ్డవారితో ఎమ్మెల్యే యరపతినేని సమావేశం కావడం పట్ల అంతా చీత్కరించుకుంటున్నారు. 

పోలీసుల సహకారంతోనే దాడులు: కాసు 
టీడీపీ నేతలు కొందరు పోలీసు అధికారుల సహకారంతోనే ముస్లిం మైనార్టీలపై దాడులకు పాల్పడ్డారని కాసు మహేష్‌రెడ్డి పేర్కొన్నారు. దాడిలో ధ్వంసమైన శ్రీసత్యనారాయణ ఐనాక్స్‌ థియేటర్, శరమాళ్ల శివ కారును ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తితో కలిసి ఆయన పరిశీలించారు. దాడులకు దిగిన టీడీపీ కార్యకర్తలపై కఠినంగా వ్యవహరించాలని, దీన్ని ప్రోత్సహించిన సీఐ రామారావుపై చర్యలు తీసుకోవాలని కాసు మహేశ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సీఐ తీరుపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. టీడీపీ నేతలు గ్రామాల్లో భయానక వాతావరణం సృష్టించేందుకే ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. అనంతరం వారు థియేటర్‌లో భద్రపరిచిన దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని పరిశీలించారు.   

కుప్పంలో ఈవీఎం ఓపెన్‌!
చిత్తూరు జిల్లా కుప్పం పాతపేట ప్రభుత్వ పాఠశాల బూత్‌లో పోలింగ్‌ అనంతరం గురువారం అర్థరాత్రి ఓ టీడీపీ నేత ఈవీఎంలను ధ్వంసం చేసే యత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈవీఎంలను తరలించడంలో ఆలస్యం కావడంతో తన అనుచరులతో కలసి పోలింగ్‌ బూత్‌ వద్దకు చేరుకున్న జెడ్పీటీసీ సభ్యుడు రాజ్‌కుమార్‌ వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఓట్లు పడ్డాయంటూ వీరంగం సృష్టించారు. వైఎస్సార్‌సీపీ ఏజెంటు వెంకటాచలపతిపై దాడి చేయడంతోపాటు 170 పోలింగ్‌ బూత్‌లో ఈవీఎంలను పగలగొట్టే యత్నం చేశాడు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, మీ అంతు చూస్తామని దుర్భాషలాడాడు. 170 పోలింగ్‌ బూత్‌లో ఈవీఎం తెరుచుకోవడంతో విషయం బయటకు పొక్కకుండా అధికారులతో మాట్లాడి సర్దుబాటు చేసినట్లు సమాచారం. అనంతరం పోలీసులు అక్కడకు చేరుకుని అందరినీ బయటకు పంపించారు. కుప్పం గ్రామ పంచాయతీ మొదటి వార్డుకు సంబంధించిన బైరుగానిపల్లె, మునస్వామిపురం కాలనీ, విజయలక్ష్మీ రోడ్డు సంబంధిత ప్రాంతాల కోసం ఈ పోలింగ్‌ బూత్‌ను ఏర్పాటు చేశారు. ప్రారంభంలో ఓట్లు వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా పడుతున్నాయంటూ టీడీపీ ఏజెంట్లు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో గంటపాటు పోలింగ్‌ను నిలిపివేశారు.  

ఊళ్లోకొస్తే చంపేస్తాం.. 
పోలింగ్‌ రోజు తమకు సహకరించలేదనే ఆగ్రహంతో గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం రామాపురంలో శుక్రవారం సాయంత్రం టీడీపీ నేతలు మారణాయుధాలను చేతబట్టుకుని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకుల ఇళ్లకు వెళ్లి బెదిరింపులకు దిగారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు ఊళ్లోకి వస్తే చంపేస్తామంటూ హెచ్చరించారు. పోలింగ్‌ రోజు టీడీపీ నేతలు కంట్లో కారం చల్లడంతో తీవ్ర అస్వస్థతకు గురైన వైఎస్సార్‌సీపీ నేత కర్నాటి కోటిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయన్ను అంతమొందించాలని పథకం వేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత వేముల అచ్చిరెడ్డి మారణాయుధాలతో కోటిరెడ్డి కుటుంబాన్ని దూషిస్తూ బెదిరింపులకు దిగాడు. ఆ సమయంలో భోజనం చేస్తున్న కోటిరెడ్డి కుమారుడు నరసింహ ప్లేటును కాలితో తన్నేశాడు. వృద్ధురాలైన కోటిరెడ్డి తల్లి మంగమ్మతోనూ అసభ్యంగా మాట్లాడాడు. కోటిరెడ్డి కుమార్తెలపై చెయ్యి చేసుకున్నాడు. అనంతరం మలిరెడ్డి పకీరారెడ్డి ఇంటికి వెళ్లి ఆయన భార్య భద్రమ్మను దుర్భాషలాడాడు. గ్రామ పెద్దల సూచనల మేరకు బాధిత కుటుంబాలు దాచేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాయి. 
దాచేపల్లి పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆందోళన చేస్తున్న రామాపురం మహిళలు  

జూలకల్లు, ఆళ్లగడ్డలో అరాచకపర్వం
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం జూలకల్లులో శుక్రవారం వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ఇళ్లపై టీడీపీ శ్రేణులు కత్తులు, కర్రలతో స్వైరవిహారం చేశాయి. ఘటనలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు లక్ష్మారెడ్డి, నర్సిరెడ్డి, వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడ్డారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్త వాతావరణం ఇంకా కొనసాగుతోంది. అహోబిలం, ఆళ్లగడ్డలో గురువారం టీడీపీ శ్రేణుల రాళ్ల దాడుల్లో ఓ కానిస్టేబుల్‌ గాయపడగా, ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆళ్లగడ్డలో అదనపు బలగాలను మోహరించారు. 

ఇర్లపాడులో దళితులపై రెండుసార్లు దాడులు 
వైఎస్సార్‌సీపీకి ఓటేశారనే అక్కసుతో గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం ఇర్లపాడులో దళితులపై టీడీపీ వర్గీయులు రెండు సార్లు దాడులు చేసి కొట్టడంతో ఎనిమిది మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. గ్రామంలోని ఎస్సీ కాలనీ బూత్‌ నంబరు 11లో ఎమ్మెల్యే అభ్యర్థికి పోలైన ఓట్లకు మించి ఎంపీ అభ్యర్థికి 50 ఓట్లు అదనంగా పోలయ్యాయి. బూత్‌ పరిధిలో మొత్తం 490 ఓట్లు ఉండగా ఎమ్మెల్యే ఈవీఎంలో 485 ఓట్లు నమోదయ్యాయి. ఎంపీ ఈవీఎంలో మాత్రం 535 ఓట్లు నమోదయ్యాయి. దీనిపై బూత్‌ ఏజెంట్లు అధికారులను నిలదీశారు. అదనంగా వచ్చిన 50 ఓట్లయినా తీసివేయాలని, లేదంటే రీ పోలింగ్‌ జరపాలని పట్టుబట్టారు. దీంతో టీడీపీ వర్గీయులు కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో ఎస్సీ కాలనీకి చెందిన చీదర్ల సుజ్ఞానమ్మ, చిన్నం రాజాబాబు, సుమలత తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు  శుక్రవారం ఉదయం కూడా ఆరు గంటల సమయంలో టీడీపీ వర్గీయులు 150 మందికి పైగా ఎస్సీ కాలనీలోకి చొరబడి మరోసారి దాడులకు దిగారు. ఘటనలో దూమాల జోజిబాబు, వాసిమళ్ల రవిబాబు, వాసిమళ్ల జోజిబాబు, ఎడ్ల జ్యోతిరాజు, జెట్టి విక్రంలు తీవ్రంగా గాయపడ్డారు. పలువురి తలలు పగిలాయి. సమాచారం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ చిలకలూరిపేట అసెంబ్లీ అభ్యర్థి విడదల రజని ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు.  

ఎన్నికల ఏజెంట్‌ ఇంటికి తాళం.. 
వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో టీడీపీ ఎంపీ సీఎం రమేష్, ఆయన సోదరుడు సురేష్‌ కలసి వైఎస్సార్‌ సీపీ తరపున ఎన్నికల ఏజెంట్‌గా వ్యవహరించిన సంగాల రామ్మోహన్‌రెడ్డిని బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించి తాళం వేశారు. రామ్మోహన్‌రెడ్డి ఇంటికి తమ అనుచరులను పంపి తాళం వేయించారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ సుధీర్‌రెడ్డి శుక్రవారం పోలీసులను కలిసి తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో అక్కడకు చేరుకుని ఇంటి తాళం తీశారు. తాను ఉంటున్న ఇంటిని ప్రభుత్వం 2002లో మంజూరు చేసిందని, ఇంటి పత్రాలు కూడా సీఎం రమేష్‌ సోదరుడు తనకు ఇవ్వడం లె?దని రామ్మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు.  

దాడులు చేసి ఆపై ధర్నాలు! 
గుంటూరు జిల్లా వేమూరు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి మేరుగ నాగార్జునపై దాడి చేసి గాయపరచడమే కాకుండా బాధితుడిపైనే కేసులు నమోదు చేయాలంటూ టీడీపీ నేతలు శుక్రవారం ధర్నాకు దిగటంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఓటమి తప్పదని తేలడంతో ఉక్రోషం పట్టలేక గురువారం వేమూరు మండలం బూతుమిల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్తలు మేరుగ నాగార్జునపై దాడి చేయడమే కాకుండా ఆయన కారును ధ్వంసం చేయడం తెలిసిందే. పోలీసుల అదుపులో ఉన్న తమ వారిని విడిపించుకునేందుకు టీడీపీ నాయకులు తీవ్రంగా ఒత్తిడి తెచ్చినా ఫలించకపోవడంతో వేమూరు టీడీపీ అభ్యర్థి, మంత్రి నక్కా ఆనందబాబు తెనాలి డీఎస్పీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ధర్నాకు దిగారు. తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, బాపట్ల ఎంపీ శ్రీరామ్‌ మాల్యాద్రిలతో కలసి బైఠాయించారు. టీడీపీ కార్యకర్తలను విడుదల చేసేందుకు పోలీసులు అంగీకరించినట్లు అనంతరం నక్కా ఆనందబాబు చెప్పారు. మేరుగ కారును ఆ పార్టీ వాళ్లే ధ్వంసం చేశారని ఆరోపించారు.  

చిత్తూరు జిల్లాలో బ్లేడుతో దాడి.. 
చిత్తూరు జిల్లా గుడిపాల మండలం గుడిపాలలో వైఎస్సార్‌సీపీకి అత్యధికంగా ఓట్లు వేశారనే అనుమానంతో పోలింగ్‌ అనంతరం టీడీపీ నాయకులు విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. గురువారం రాత్రి 10 గంటల సమయంలో మండల వైఎస్సార్‌సీపీ యువత అధ్యక్షుడు నారాయణమూర్తి, వైఎస్సార్‌సీపీ నాయకులు యుగంధర్, జగపతిబాబులపై ఇదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు శ్రీరాములు నాయుడు, ప్రవీణ్, శంకర్, హేమాచలంతోపాటు మరో 15 మంది కర్రలతో దాడి చేసి చితకబాదారు. బ్లేడుతో గొంతు కోసేందుకు ప్రయత్నించగా చేతిని అడ్డు పెట్టడంతో నారాయణమూర్తికి గాయాలయ్యాయి.  

మహిళలపై పోలీసుల దాష్టీకం 
తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలం కొత్తపాలెంలో వైఎస్సార్‌ సీపీకి ఓటేశారని రాష్ట్ర మత్స్యశాఖ కార్పొరేషన్‌ చైర్మన్‌ నాగిడి నాగేశ్వరరావు ప్రోద్బలంతో ఎస్సై వి.శుభాకర్‌ తమను చితకబాదించారని మహిళలు పేర్కొన్నారు. 20 ఏళ్లుగా టీడీపీకి మద్దతు ఇచ్చినా స్థానికంగా వంతెనతోపాటు అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో వైఎస్సార్‌సీపీలో చేరినట్లు తెలిపారు. 
తూర్పు గోదావరి జిల్లా కొత్తపాలెంలో పోలీసుల దాడిలో గాయపడిన మహిళలు, వృద్ధులు 

కృష్ణా జిల్లాలో కవ్వించి ఇంటిపై రాళ్ల వర్షం.. 
కృష్ణా జిల్లా మల్కాపురంలో పోలింగ్‌ రోజు ఉదయం నుంచి టీడీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు దిగినా వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు సంయమనం పాటించారు. పోలింగ్‌ అనంతరం రాత్రి 10 గంటల సమయంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు గనపనేని పిచ్చయ్య చౌదరి ఇంటికి వెళ్తుండగా టీడీపీ కార్యకర్తలు రెడ్డిబోయిన నాగరాజు, చావా కృష్ణయ్య, కళ్యాణం బాస్కరరావులతో పాటు 200 మంది అడ్డుకుని దుర్బాషలాడారు.

అనంతరం పిచ్చయ్య చౌదరి ఇంటిపై రాళ్ల వర్షం కురిపించారు. అక్కడకు చేరుకున్న వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు అంబోజి రామారావు, కుక్కల కిరణ్, ముత్తయ్య, బాగవంతుల నవీన్‌లపై కర్రలతో దాడి చేయడంతో గాయపడ్డారు. అనంతరం గ్రామానికి చేరుకున్న పోలీసులు టీడీపీ నాయకులకు వత్తాసు పలకటంతోపాటు వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై లాఠీచార్జీ చేశారు. వైఎస్సార్‌ సీపీకి చెందిన ముగ్గురు కార్యకర్తలను ఎస్‌ఐ చిరంజీవి స్టేషన్‌కు తరలించారు. టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగటాన్ని వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి సామినేని ఉదయభాను తీవ్రంగా ఖండించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement