రాజన్న క్యాంటీన్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ఆర్కే(ఫైల్)
సాక్షి, మంగళగిరి : నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్‌పై ఘన విజయం సాధించిన వైఎస్సార్ సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) చరిత్ర సృష్టించారు. 2014 ఎన్నికలలో కేవలం 12 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన ఎమ్మెల్యే ఆర్కే 2019లో లోకేష్‌పై భారీ మెజార్టీతో విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. లోకేష్‌పై ఖచ్చితంగా విజయం సాధిస్తానని చెప్పిన ఆర్కేను నియోజకవర్గ ప్రజలు మరో సారి ఆదరించి విజయం అందించారు.
గురువారం ఉదయం ఆరు గంటలకు కౌంటింగ్‌కు బయలుదేరిన ఆర్కే తొలుత శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాగార్జున యూనివర్సిటీలోని కౌంటింగ్ హాలుకు చేరుకుని కౌంటింగ్‌ను పర్యవేక్షించారు. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఆర్కేకు మెజార్టీ పెరుగుతూ వచ్చింది. లోకేష్ ఎక్కడా పోటీ ఇవ్వలేకపోవడం విశేషం. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ఓటర్లు మాత్రం ఆర్కే నీతి నిజాయతీతో ముఖ్యమంత్రి అవినీతిపై పోరాటం, రాజధాని రైతులకు అండగా నిలవడంతో మద్దతుగా నిలిచారు. రాజన్న క్యాంటీన్ పేరుతో రూ.4లకే పేదల ఆకలి తీర్చడంతో పాటు రాజన్న రైతుబజార్ పేరుతో రూ.10లకు ఏడురకాల కూరగాయలు అందజేయడం వంటివి ఆర్కే విజయానికి కారణమయ్యాయి.
మంత్రి లోకేష్ నియోజకవర్గ ప్రజలను పట్టించుకోకపోవడం, ఐదేళ్ల కాలంలో టీడీపీ నాయకులు చేసిన అవినీతి వారి ఓటమికి కారణమైందని ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల నామినేషన్ రోజు నుంచే ప్రచారంలోనే లోకేష్‌పై ఆర్కే విజయం సాధించారు. నామినేషన్ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలిరావడం, వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, వై.ఎస్. షర్మిల బహిరంగ సభలు విజయవంతం చేయడంతోనే ఆర్కే విజయం ఖరారైంది. వై.ఎస్.జగన్ సైతం ఆర్కేను గెలిపిస్తే తన క్యాబినెట్‌లో మంత్రి అవుతారని చెప్పడం, ఐదేళ్ల పాటు టీడీపీ ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేయడం వంటివాటితో ప్రజలు అండగా నిలిచి గెలిపించుకున్నారు.
మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేసిన వైఎస్సార్ సీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) 5,769 ఓట్లతో విజయం సాధించారు. ఎమ్మెల్యే ఆర్కేకు 1,05,083 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి, ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేష్‌కు 99,314 ఓట్లు వచ్చాయి. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు కలిపి 25,042 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1600పైగా పోల్‌కాగా, ఉద్యోగులకు అవగాహన లేకపోవడంతో 100 ఓట్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయి.
వీటిలో ఎమ్మెల్యే ఆర్కేకు 70 ఓట్లు మెజార్టీ లభించింది. ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వేయడంలో పొరపాటుగా వ్యవహరించారా! లేక అధికారులే కావాలని పోస్టల్ బ్యాలెట్ ఓట్లను రిజక్ట్ చేశారనే విషయంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని 145వ బూత్ ఈవీఎం మొరా యించడంతో అధికారులు వీవీ ప్యాట్లను లెక్కపెడుతుండడంతో రాత్రి పదిన్నర గంటలకు సైతం అధికారులు లెక్కింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఓటమిని ముందే గ్రహించిన టీడీపీ అభ్యర్థి లోకేష్‌తో పాటు టీడీపీ నాయకుడు పోతినేని శ్రీనివాసరావు మినహా మిగిలిన నాయకులు ఎవరు కౌంటింగ్ కేంద్రం వైపు రాలేదు. విజయంపై విశ్వాసంతో ఉన్న ఎమ్మెల్యే ఆర్కే ఉదయం నుంచి కౌంటింగ్ హాలులోనే ఉండి కౌంటింగ్‌ను పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment