![GVL Narasimha Rao Slams Chandrababu - Sakshi](/styles/webp/s3/article_images/2019/04/15/GVL-NARASIMHA-RAO-4.jpg.webp?itok=TlzPewW0)
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల సంఘం (ఈసీ)పై ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ఎన్నికల్లో ఓట్లు వేసిన 3 కోట్ల మంది ఆంధ్రులకు లేని అనుమానాలు చంద్రబాబుకే ఎందుకు వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. ఆదివారం జీవీఎల్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు తాము ఏ పార్టీకి ఓటు వేసింది వీవీ ప్యాట్‌ల్లో చూసుకున్నారని తెలిపారు. ఎక్కడైనా తప్పులు జరిగి ఉంటే ప్రజలే ఫిర్యాదులు చేసేవారని పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో గెలిచినప్పుడు ఎందుకు ఈవీఎంల గురించి మాట్లాడలేదని చంద్రబాబును ప్రశ్నించారు.
ఇప్పుడు ఎన్నికలు పూర్తయ్యాక ఈసీపై ఆరోపణలు చేస్తుండటం ద్వారా తాను ఓడిపోతున్నానని చంద్రబాబు ఢిల్లీలో దండోరా వేస్తున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఈవీఎంల పనితీరుపై సమావేశం నిర్వహించడం ద్వారా అందులో పాల్గొన్న పార్టీలన్నీ ఓటమిని ముందే అంగీకరించాయన్నారు. కాగా, ఈవీఎంల పనితీరుపై 2010లో తాను రాసిన పుస్తకాన్ని టీడీపీ ఇప్పడు చూపిస్తుండటాన్ని జీవీఎల్ ఆదివారం ఓ ప్రకటనలో తప్పుపట్టారు. గతంలో ప్రజలు ఎవరి ఓటు వేశారన్న విషయం వారి తెలిసేది కాదని, దీన్ని అధిగమించడానికి ప్రజలు ఎవరి ఓటు వేసింది తెలిసేలా చేయాలని డిమాండ్ చేస్తూ పుస్తకాన్ని రాశానన్నారు. ఈ నేపథ్యంలో వీవీ ప్యాట్‌లను ప్రవేశపెట్టారని, ఇప్పుడు వీటి ద్వారా ప్రజలు ఎవరికి ఓటు వేసింది స్పష్టంగా తెలుస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment