తెరపడని భూబాగోతం | IYR Krishna Rao article on Andhra pradesh land records | Sakshi
Sakshi News home page

తెరపడని భూబాగోతం

Published Sun, Jan 7 2018 12:19 AM | Last Updated on Sun, Jan 7 2018 12:19 AM

IYR Krishna Rao article on Andhra pradesh land records - Sakshi

ఆ భూమి మార్కెట్‌ విలువ కోటి రూపాయలు ఉన్నప్పటికీ కూడా, రాష్ట్ర ఖజానాకు మేలు చేకూర్చే క్రమంలో వారు చేస్తున్న సేవకు గాను, దానిని పది లక్షల రూపాయలకీ, ఇంకా వీలైతే ఒక లక్ష రూపాయలకే బహుమానంగా దఖలు పరుస్తారు. ఈ భూమిని తీసుకున్నవారు అక్కడ పరిశ్రమను స్థాపించేందుకు పెట్టుబడులు కావలసివస్తాయి. ఆ పెట్టుబడులకు అవసరమైన వనరులను సేకరించేందుకు వీలుగా, ఆ భూమినే తాకట్టు పెట్టే అధికారం కూడా కోరతారు (ఆ విన్నపాన్ని ప్రభుత్వం తప్పనిసరిగా మన్నిస్తుంది కూడా).

ఏదైనా ఒక సహజ వనరు ఉంటే, దానిని కొంతకాలంగా రాజకీయ పెద్దలు తమ స్వప్రయోజనాల కోసం అనుభవిస్తూ ఉన్నారంటే, అది ప్రభుత్వ ఆస్తి అయి ఉంటుంది. రాజకీయ పలుకుబడి పుష్కలంగా ఉండడంతో పాటు, తగిన సమయం కోసం వేచి ఉండే ఓపిక దండిగా ఉన్నా కూడా ఆ భూమిని చక్కగా అలాంటి వ్యక్తులు సొంతం చేసుకోవచ్చు. వెలకట్టలేని ఆ భూమి క్షణాలలో అలాంటివారికి చట్టబద్ధమైన పద్ధతిలో కేటాయించే సౌకర్యం కూడా ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వాలు మారిపోయినా ఇలాంటి వ్యవహారాలకు వచ్చిన ఢోకా ఏమీ ఉండదు. ఎందుకంటే మళ్లీ ఆ వంచక పాత పాత్రలే చక్రం తిప్పుతూ ఉంటాయి.

రెవెన్యూ దస్త్రాలను భద్రపరచడంలో మనకున్న పద్ధతి, ఇలాంటి వాటిని చూసీచూడనట్టు వదిలేసే అధికారులు వెరసి అలాంటి భూములకు సంబంధించిన అక్రమాలు అనంతంగా కొనసాగడానికి విరివిగా అవకాశం కల్పిస్తున్నాయి. దీనికి ఉన్న పద్ధతి కూడా చాలా సులభమైనదే. ఒక దొంగ సంస్థను ఏర్పాటు చేసి, వాళ్లు కోరుకున్న మొత్తం భూమి కోసం ప్రభుత్వాన్ని అంటకాగుతారు. ఈ ప్రక్రియ మొత్తం మరింత తేలికగా సాగడానికి చార్టర్డ్‌ అకౌంటెంట్లు ఎలాగూ ఉంటారు. ఆ పారిశ్రామికవేత్తలు స్థాపించబోయే సంస్థతో జరగబోతున్న ‘ఉద్యోగావకాశాల కల్పన’ గురించీ, ఇబ్బడిముబ్బడిగా ‘ఖజానా నిండడం’ గురించీ ఘనంగా నివేదికలు రూపొందించి పెడతారు. ఇంకా ‘గుర్తిం చిన’ భూములను నామమాత్రపు ధరలకి పరిశ్రమలు స్థాపించబోతున్న ఆ సంస్థకు ధారాదత్తం చేయడం ఎంత సబబో కూడా సీఏలు నివేదిస్తారు.

భూదానం
ఆ భూమి మార్కెట్‌ విలువ కోటి రూపాయలు ఉన్నప్పటికీ కూడా, రాష్ట్ర ఖజానాకు మేలు చేకూర్చే క్రమంలో వారు చేస్తున్న సేవకు గాను, దానిని పది లక్షల రూపాయలకీ, ఇంకా వీలైతే ఒక లక్ష రూపాయలకే బహుమానంగా దఖలు పరుస్తారు. ఈ భూమిని తీసుకున్నవారు అక్కడ పరిశ్రమను స్థాపించేందుకు పెట్టుబడులు కావలసివస్తాయి. ఆ పెట్టుబడులకు అవసరమైన వనరులను సేకరించేందుకు వీలుగా, ఆ భూమినే తాకట్టు పెట్టే అధికారం కూడా కోరతారు (ఆ విన్నపాన్ని ప్రభుత్వం తప్పనిసరిగా మన్నిస్తుంది కూడా). అంటే ఆ భూమిని తాకట్టు పెట్టి ఆర్థిక సంస్థల ద్వారా పెట్టుబడిని సేకరిస్తారు. ఇందుకు సంబంధించి వారికి అనుమతి అంటూ లభిస్తే అప్పటి మార్కెట్‌ ధరకు ఆ భూమిని తాకట్టు పెడతారు.

కాబట్టి ఐదు కోట్లు చెల్లిస్తే , మార్కెట్‌ ధర ప్రకారం రూ. 50 కోట్లు విలువ చేసే భూమి ప్రభుత్వం నుంచి వారికి దక్కుతుంది. అసలు విషయం అది కాదు. సంస్థలే కాదు, ఆ భూమిని తాకట్టు పెట్టడం ద్వారా వ్యక్తిగతంగా కూడా రూ. 50 కోట్ల రూపాయలు ఆర్థిక సంస్థల నుంచి రుణంగా పొందవచ్చు. లంచాల కోసం, అధికారులకు చెల్లించడం కోసం, రాజకీయ నాయకులకు ఇవ్వవలసింది ఇచ్చుకోవడానికీ పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా తెలివైన ఆ పారిశ్రామికవేత్తకి ఇంకా చాలా డబ్బు మిగులుతుంది. ఒకవేళ తీసుకున్న రుణం తిరిగి చెల్లించలేకపోతే, తనఖాలో ఉన్న భూమిని బ్యాంకు అమ్ముతుంది. నిజానికి వసూలు చేసుకోలేని రుణాలంటూ ఏమీ ఉండవు. ఏదిఏమైనా అంతిమంగా నష్టపోయేది ఎవరంటే, ప్రభుత్వమే. ఎందుకంటే యాభయ్‌ కోట్ల రూపాయల విలువైన భూమి చేజారిపోయింది. ఇంకా, అక్కడ పరిశ్రమ అంటూ ఏదీ కూడా కని పించదు. చురుకైన పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ భూముల విషయంలో చేసే అవినీతిలో ఇది ముఖ్యమైన చర్య. భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్‌గా ఉన్నప్పుడు నేనొక విశ్వ ప్రయత్నం చేశాను.

ఒక విఫలయత్నం
భూములను పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం కేటాయించినప్పుడు వారు ఎంత ధర చెల్లించారో, ఆర్థిక సంస్థలకు అంతకు మించిన ధరతో తాకట్టు పెట్టరాదన్న నిబంధన ఒకటి తీసుకురావాలని గట్టిగా ప్రయత్నించి విఫలమయ్యాను. భూప రిపాలన కమిషనర్‌గా ఉన్నప్పుడు, ఆఖరికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో కూడా ఈ ప్రయత్నం చేసినా కూడా సాగలేదు. ఇలాంటి భూముల కేటాయింపులలో అధికారులకు ఉండే పరస్పర ప్రయోజనాలు ఎలాంటివంటే, అవి కదపడానికి సాధ్యం కానంత లోతుగా ఉంటాయి.

అసలు భూ కేటాయింపు విషయాలన్నీ మంత్రిమండలి దగ్గరకు వెళతాయి. ఎందుకంటే భూ కేటాయింపులు చేసేది మంత్రివర్గమే. అయితే నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే భూకేటాయింపును రద్దు చేసే అవకాశం, అధికారం ఉంది. భూ కేటాయింపు నిర్ణయం తిరిగి మంత్రిమండలి ముందుకు వెళితే అది పరిష్కారం కావడానికి చాలా సమయం అవసరం. కాబట్టి నేను భూ కేటా యింపు రద్దు అధికారాన్ని కలెక్టర్లకు బదలాయించాను. అందుకే నిబంధనలకు విరుద్ధంగా ఏం జరిగినా కలెక్టర్లు వెంటనే భూకేటాయింపును రద్దు చేస్తారు.

ఇలాంటి భూముల విషయంలో జరిగే మరో రకం అవినీతి కూడా ఉంటుంది. స్థానిక  రెవెన్యూ యంత్రాంగం సాయంతో ఆ భూములను కొంతకాలం తరువాత ప్రైవేటు భూములుగా రాయించుకుంటారు. ఈ ప్రక్రియకి చాలా సమయం పడుతుంది. కాబట్టి దండిగా సహనం ఉండాలి. పలు స్థాయిల న్యాయస్థానాలలో వ్యాజ్యాలు నడపాలి. పలు స్థాయిలలో ప్రభుత్వ శాఖలను మేనేజ్‌ చేయాలి. ఇలాంటి విన్యాసాలు చేయడంలో ఆరితేరిన వృత్తి నిపుణులు కూడా ఉన్నారు. ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరి ప్రభుత్వం ఉన్నది అనే అంశంతో వారికి పనిలేదు. ఆ ప్రక్రియ మొత్తం సక్రమంగా పూర్తి చేయించి, భూమిని వారు విజయవంతంగా సొంతం చేయిస్తారు. రాజ కీయ నేతలతో వారికి ఉండే అవినాభావ సంబంధాలు అంత పటిష్టంగా ఉంటాయి. అంతేకాదు, అవి విశాఖపట్నంలో దసపల్లా హిల్స్‌ భూములు కావచ్చు, హైదరాబాద్‌లోని మియాపూర్‌లోని భూములైనా కావచ్చు. ప్రభుత్వ భూముల మీద టైటిల్‌ డీడ్స్‌ను సంపాదించడంలో వీరిని ఏ శక్తీ ఆపలేదు. అందుకు ఎంతకాలమైనా పట్టవచ్చు. అంతదాకా వారు ఓపికగా వేచి ఉంటారు. చేతికి ఎముకలేని రీతిలో ఖర్చు పెడతారు. మధ్యలో కొరకరాని కొయ్య అనిపించే అధికారి ఎవరైనా వస్తే, అతడు వెళ్లిపోయే దాకా కూడా వేచి ఉండగలరు. లేకపోతే ఏదో మతలబు చేసి ఆయన్ని అక్కడ నుంచి వెళ్లిపోయేటట్టు చేస్తారు.

సక్రమంగా లేని భూదస్త్రాలు
భూదస్త్రాల నిర్వహణ సరిగా లేకుంటే, అది కూడా ఆ ‘నిపుణుల’కు అవకాశం కల్పిస్తూ ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో అనుకూలురైన రెవెన్యూ అధికారులు, సేవాభావం మెండుగా ఉన్న రాజకీయ నేతల సాయం కూడా అందుతుంది. ల్యాండ్‌ రెవెన్యూ కమిషనర్‌ కార్యాలయంలో అప్పీళ్ల కమిషనర్‌ అనే పేరుతో ఒక ఉద్యోగం ఉంది. అత్యంత అవినీతిపరుడు, అలాంటి ఉద్యోగం కోసం అర్రులు చాచేవారినే చూసి ఆ ఉద్యోగంలో నియమిస్తారు. భూ వివాదాలకు సంబంధించిన అన్ని అప్పీళ్లను ఆయనే విని, పరిష్కరిస్తాడు. కానీ నిజం చెప్పాలంటే, ఇప్పటికే ప్రభుత్వానికి చెందిన విలువైన భూములన్నింటికీ రెక్కలు వచ్చాయి. మిగిలినవి కూడా మాయం కావడానికి కొద్ది సమయం మాత్రమే చాలు.

ఇలాంటి పరిస్థితులలో మిగిలిన ఆ భూములను బహిరంగ వేలం పాటతో అమ్మివేయాలని ప్రతిపాదించడమే మంచిది. ఆ డబ్బుతో ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి. ప్రభుత్వానికి అవసరమైనప్పుడు భూములను కొనడానికి, అంటే ప్రభుత్వం తన భూములను అట్టే పెట్టుకోలేనప్పుడు, ఈ నిధి ఉపయోగపడుతుంది. ఇంకా చెప్పాలంటే తన భూములను రక్షించుకోవాలన్న అభిప్రాయం, రక్షించుకునే శక్తి లేనప్పుడు తనకు అవసరమైన భూములను సమకూర్చుకోవడానికి ఆ నిధి ఉపయోగపడుతుందన్నమాట.


ఐవైఆర్‌ కృష్ణారావు
వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement