వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మంచి జరిగిందని తేల్చిచెప్పిన రైతులు
బ్రిటిష్ కాలం నాటి భూ రికార్డుల్ని మార్చేందుకు జగన్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని వెల్లడి
రీసర్వేపై రైతులతో కేంద్ర గ్రామీణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ముఖాముఖి
తాడేపల్లి రూరల్: భూముల రీసర్వే వల్ల రైతులకు ఎంతో మేలు జరిగిందని, రాష్ట్రంలో అన్నిచోట్లా ఈ కార్యక్రమం పూర్తయితే ఎటువంటి భూ సమస్యలు ఉండవని రైతులంతా ముక్తకంఠంతో తెలిపారు. బ్రిటిష్ కాలం నాటి భూ రికార్డులను మార్చేందుకు వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చరిత్రలో తొలిసారి భూ రీసర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని, దీనివల్ల రైతులకు ఇబ్బందులు తప్పాయని కేంద్ర గ్రామీణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి మనోజ్ జోషికి స్పష్టం చేశారు.
రీసర్వేను పైలట్ ప్రాజెక్ట్‌గా గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చింతలపూడిలో చేపట్టగా.. దీనివల్ల రైతులకు ఏమేరకు మేలు కలిగిందనే విషయాలను తెలుసుకునేందుకు గురువారం కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్స్) సెక్రటరీ మనోజ్ జోషి చింతలపూడి గ్రామంలో గురువారం రైతులతో ముఖాముఖి నిర్వహించారు.
సర్వేయర్ రావాలంటే ఎన్నో ఏళ్లు పట్టేది
మనోజ్ జోషి రైతులను వివిధ ప్రశ్నలు అడగ్గా.. కలెక్టర్ నాగలక్ష్మి తెలుగులో అనువాదం చేశారు. గతంలో పొలం గట్ల గొడవలు, విస్తీర్ణంలో తేడాలు, సర్వే నంబర్లలో తేడాలు ఉండేవి కదా అని మనోజ్ జోషి ప్రశ్నించగా.. గతంలో సర్వేయర్ పొలానికి వచ్చి సర్వే చేయాలంటే ఏళ్ల తరబడి సమయం పట్టేదని రైతులు వివరించారు. రీసర్వేను తమ గ్రామంలోనే పైలట్ ప్రాజెక్టుగా చేపట్టగా.. సర్వేలో ఒకటి, రెండు సెంట్లు పెరగడం, తగ్గడం జరిగాయని, దానివల్ల పెద్దగా నష్టం లేదని రైతులు చెప్పారు.
తమ పొలాలకు సంబంధించిన పక్కా డాక్యుమెంట్లు తమ చేతికి అందాయన్నారు. తాతతండ్రుల కాలం నుంచి వ్యవసాయం చేస్తున్నామని, కానీ.. పొలాలకు సంబంధించి ఎటువంటి పాస్‌పుస్తకాలు, డాక్యుమెంట్లు లేవని చెప్పారు. దాంతో బ్యాంకర్లు రుణాలు ఇచ్చేందుకు నిరాకరించేవారని, రీ సర్వే కార్యక్రమం పూర్తయ్యాక డాక్యుమెంట్లు అందడంతో తాము బ్యాంకుల ద్వారా రుణాలు అందుకున్నామని వివరించారు.
ఇళ్లకు, స్థలాలకు సైతం దస్తావేజులొచ్చాయి
గ్రామంలో ఇళ్ల సర్వే గురించి కేంద్ర గ్రామీణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి మనోజ్ జోషి ప్రశ్నించగా.. తాతలు, తండ్రుల నుంచి ఆస్తి పంచుకున్నా అందరి దగ్గర ఒకే డాక్యుమెంట్ ఉండేదని గ్రామస్తులు చెప్పారు. రీసర్వే పూర్తయ్యాక ఎవరి దస్తావేజులు వారికి అందజేశారని, వాటివల్ల పిల్లల చదువులు, ఇతర అవసరాల నిమిత్తం బ్యాంకు రుణాలు పొందే అవకాశం కలిగిందని వెల్లడించారు.
అనంతరం సర్వే సిబ్బంది నుంచి ఎలా సర్వే చేశారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చింతలపూడి గ్రామంలో మొత్తం 931 ఎకరాలకు సంబంధించి 757 మంది రైతులు, 41.93 సెంట్ల ఇళ్ల స్థలాలకు సంబంధించి 450 మంది లబ్దిదారుల భూములకు రీ సర్వే కార్యక్రమం చేపట్టారు. ప్రతి రైతుకు సంబంధించిన భూమి విస్తీర్ణం, హద్దులను నిర్ణయించి పాస్‌బుక్‌లు అందజేశామని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment