ఇక రెండో అంశం– కొందరు అధికారులు అనవసరంగా సందేహాలు లేవనెత్తి, రాష్ట్రానికి పెట్టుబడులు రావడంలో జాప్యానికి కారణమవుతున్నారన్న ఆరోపణ. ఇక్కడ అధికారులు లేవనెత్తే అభ్యంతరాలను అవాంఛనీయమని ముద్ర వేయడం సరికాదు. రాష్ట్ర చరిత్రలో చూస్తే చాలా ఉత్తుత్తి కంపెనీలు ప్రభుత్వం నుంచి భూములు తీసుకుని దుర్వినియోగం చేశాయి. అందుకే అధికారులు పరిశ్రమలకు భూములు కేటాయించడంలో కొంత జాగరూకతతోనే ఉంటారు.
పలువురు రాష్ట్ర ప్రభుత్వాధికారులు తమ విధులను శ్రద్ధగా నిర్వహించడం లేదనీ, వారు హైదరాబాద్–అమరావతి మధ్య రాకపోకలు సాగిస్తూ ఉంటారనీ, ఫలి తంగా కొత్త రాష్ట్రం పురోగతి దెబ్బ తింటున్నదనీ స్నేహబంధం కలిగిన ఓ వార్తా పత్రిక కథనాన్ని ప్రచురిస్తుంది. ఈ వార్తను గురించే తరువాతి సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి ప్రస్తావిస్తారు. కొత్త రాష్ట్రానికి పరిశ్రమలు రావడానికి చేయవలసినంతగా ప్రయత్నం చేయ కుండా ఇలా అటూ ఇటూ తిరగడంతో కాలయాపన చేయడం ఏమిటని ఆయన తప్పు పడతారు.
పనిలో పనిగా కొందరు అధికారులు ఏమాత్రం సబంధంలేని, లేనిపోని అనుమానాలు అభ్యంతరాలు తెస్తున్నారనీ, దీని ఫలితంగా కూడా ప్రగతి కుంటుబడిపోతున్నదనీ అంటారు. కానీ ముఖ్యమంత్రి గారి కుమారుడు మాత్రం దీనికి కొనసాగింపుగా అధికారులను వెనకేసుకుని వస్తారు. ఎవరో కొద్దిమంది అధికారులు మాత్రం అలా వ్యవహరిస్తున్నా, ఎక్కువ మంది రాష్ట్రాభివృద్ధికి పాటు పడుతూనే ఉన్నారని ఆయన ప్రకటిస్తారు. దీనితో సమావేశంలో మళ్లీ మామూలు వాతావరణం నెలకొంటుంది. అంటే స్క్రీన్‌ప్లేలో రాసినట్టు అంతా యథాతథంగానే నడిచిపోతుంది.
కానీ, ఈ తతంగంలో స్క్రీన్‌ప్లే రచయిత మరచిపోయిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే – అటూ ఇటూ రాకపోకలు సాగిస్తున్న ఆ అధికారులను రాజధానిలో ఉండి పనిచేయమని చెప్పడానికీ, అలా పనిచేయించగలమని భరోసా ఇవ్వడానికీ ప్రభుత్వానికి ఉన్న ఆటంకాలేమిటి? పరిపాలన నిర్మాణాత్మకంగా జరగడానికి ప్రభుత్వాన్ని అడ్డుతున్న అంశం ఏమిటి? హైదరాబాద్ నగరాన్ని పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
కానీ వేర్వేరు కారణాల వల్ల కొత్త రాష్ట్రం ఆవిర్భవించిన మొదటి రెండేళ్లలోనే ప్రభుత్వ యంత్రాంగాన్ని హైదరాబాద్ నుంచి అమరావతి/విజయవాడకు తరలించారు. కొన్ని కొన్ని రిజర్వేషన్లు వారికి ఉన్నప్పటికీ చాలా మంది అధికారులు ఆంధ్రప్రదేశ్‌ను ఎన్నుకోవడానికి కారణం – పదేళ్లపాటు రాజధాని హైదరాబాద్‌లోనే ఉంటుందనే. అందువల్ల కొత్త రాష్ట్ర రాజధాని నుంచి పనిచేయడానికి ఆటంకం ఉండదనే ఉద్దేశం కూడా. శుక్రవారం సాయంత్రం నుంచి హైదరాబాద్ ప్రయాణం కోసం ఎదురుతెన్నులు చూడడం వల్ల, మళ్లీ సోమవారం ఉదయం తాపీగా తిరిగి అమరావతి చేరుకోవడం వల్ల పరిపాలన మీద దృష్టి పెట్టడం కష్టం కాబట్టి కొత్త రాజధానిలోనే ఉండి సేవలు అందించమని ప్రభుత్వం అధికారులను ఆదేశించవచ్చు.
నిజంగా ఈ విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి, ఈ మేరకు ఆదేశాలు పంపిస్తే అంతా దారికి వస్తారు కూడా. బాపట్లలో మానవ వనరుల అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసే బాధ్యతను అప్పగించిన ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గురించి నాకు తెలుసు. ఆయన బాపట్లలోనే ఉండి ఆ సంస్థను నిర్మించడానికి ఎల్ల వేళలా పనిచేస్తున్నారు. అలాగే విజయవాడలో ఉంటూ తమ విధులను నిజాయితీగా నిర్వర్తిస్తున్న అధికారులు కూడా నాకు తెలుసు. అడపా దడపా అనుమతి తీసుకుని హైదరాబాద్ వెళితే దానిలో తప్పు పట్టవలసిన పని లేదు. కొందరిని సరిదిద్దేందుకు మాత్రం క్రమశిక్షణ నేర్పవలసిందే.
ఇక రెండో అంశం – కొందరు అధికారులు అనవసరంగా సందేహాలు లేవనెత్తి, రాష్ట్రానికి పెట్టుబడులు రావడంలో జాప్యానికి కారణమవుతున్నారన్న ఆరోపణ. ఇక్కడ అధికారులు లేవనెత్తే అభ్యంతరాలను అవాంఛనీయమని ముద్ర వేయడం సరికాదు. రాష్ట్ర చరిత్రలో చూస్తే చాలా ఉత్తుత్తి కంపెనీలు ప్రభుత్వం నుంచి భూములు తీసుకుని దుర్వినియోగం చేశాయి. అందుకే అధికారులు పరిశ్రమలకు భూములు కేటాయించడంలో కొంత జాగరూకతతోనే ఉంటారు. అంతేకాదు, ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కొందరు ఎన్‌ఆర్‌ఐ (నేను వాళ్లని ఎన్‌ఆర్‌కేలు అంటాను) పెట్టుబడుల ప్రమోటర్లుగా మారువేషాలు వేస్తున్నారు.
కానీ పరిశ్రమలు స్థాపిస్తున్నామంటూ ముందుకు వస్తున్న కొందరు సందేహాస్పదులైన వ్యక్తులకు భూములు కేటాయించే విషయంలో మధ్యవర్తులుగా వ్యవహరించడమే వారు చేసే అసలు పని. ముఖ్యమంత్రి ప్రస్తావించిన ఏదో కంపెనీ విషయంలో అలా జరగకపోవచ్చు. అలా కాకుండా ఆ పెట్టుబడులు సక్రమమైనవని, రాష్ట్ర ప్రయోజనాలకు మంచిదని రాజకీయ నాయకత్వం భావిస్తే ఇక అడ్డేవారు ఉండరు. అధికారులు లేవనెత్తిన సందేహాలు, అభ్యంతరాలు కొట్టిపారేస్తారు.
గౌరవ ముఖ్యమంత్రిగారు ఇంతకు ముందు ఆ పదవిలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయం నిర్వహించిన పాత్రను ఒకసారి గుర్తు చేసుకోవాలి. అలాగే రణదీప్ సుదాన్ చేసిన సేవలను కూడా గుర్తు చేసుకోవాలి. బహుశా రాష్ట్రం ఎదుర్కొంటున్న అన్ని ఇక్కట్లకు సమాధానం ఏమిటో తద్వారా తెలుస్తుంది. ఆ కాలంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సుదాన్ వంటి అధికారులు ఎంతో నిబద్ధతతో పనిచేశారు. వారి నిజాయితీపై, నిబద్ధతపై అధికారులకు ఎలాంటి అనుమానాలూ ఉండేవి కాదు.
ఆ రకమైన విశ్వాసం సీఎంఓలో పనిచేస్తూ ఆదేశాలిచ్చే బృందంపై అధికారులకు లేకపోతే, వారి వ్యవహార సరళి వెనక రహస్య అజెండా ఉన్నదని అనుమానిస్తే సహజంగానే వారిచ్చే ఆదేశాల పట్ల స్పందన నిస్సందేహంగా నిరాసక్తంగానే ఉంటుంది. చక్కదిద్దవలసినచోట పరిష్కారమేమిటని అన్వేషించడానికి బదులు ప్రభుత్వం బలి పశువు కోసం వెదుకుతోంది.
ఐవైఆర్ కృష్ణారావు
వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment