సాక్షి, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) కావడం తృటిలో తప్పిపోయిందని ఐవైఆర్ కృష్ణారావు ‘నవ్యాంధ్రతో నా నడక’ పుస్తకంలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కు తాను సీఎస్ అవుతానని అనుకోలేదని వెల్లడించారు. కానీ తెలుగుదేశం పార్టీ వేసుకున్న సామాజిక వర్గాల లెక్కల వల్ల తనకు యాధృచ్ఛికంగా చీఫ్ సెక్రటరీ పదవి దక్కిందని తెలిపారు. ఈ పుస్తకంలో మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఇంకా ఏం ప్రస్తావించారంటే...
‘‘నేను సీఎస్ అయిన రెండు నెలల్లోనే నాకు, తనకు మధ్య భావసారూప్యత అంతగా లేదన్న విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రహించినట్లున్నారు. గ్రహించిన తర్వాత కీలకమైన నిర్ణయాల్లో నన్ను విశ్వాసంలోకి తీసుకోవడం మానేశారు. నాకు తెలియకుండానే నిర్ణయాలు జరిగేవి. నేను కూడా నా స్థాయి తగ్గించుకుని కలిసిపోవాలని అనుకోలేదు. నాకు నేను ఒక పరిధి ఏర్పరచుకుని పనిచేయడం ప్రారంభించా. చంద్రబాబు సమీక్షించని ప్రాజెక్టులు, కార్యక్రమాలపై దృష్టి పెట్టి చీఫ్ సెక్రటరీగా ప్రభుత్వ వ్యవస్థ సవ్యంగా సాగేలా చూసుకోసాగాను. తమకు అనుకూల నిర్ణయాలు తీసుకునేందుకు నేను అడ్డుగా ఉంటానని భావించారేమో నన్ను ఒకటి రెండు సార్లు తప్పించే అంశంపై అంతర్గతంగా చర్చించినట్లు తెలిసింది. ఇద్దరు అధికారులను నా స్థానంలో తీసుకోవాలని రెండు తడవలు ఈ చర్చలు జరిగాయని నా సమాచారం. కానీ, చివరకు తుది నిర్ణయం తీసుకునేలోపే నా పదవీ కాలం ముగిసింది. పదవీ విరమణ తర్వాత మరో పది, పదిహేనేళ్లు సమాజానికి సేవ చేయాలని అనుకున్నా.
వేద మంత్రాలకు విలువ లేకుండా పోయింది
నాకు చిన్నప్పటి నుంచీ నా సొంత సామాజికవర్గానికి సేవ చేయాలన్న ఆలోచన ఉంది. అన్ని వర్గాలకూ ఏదో రకంగా మేలు జరుగుతోంది. బ్రాహ్మణులకు మాత్రం ఆర్థికంగా, సామాజికంగా మేలు చేయాలని ఆలోచించేవారే లేరు. చాలామంది పేద బ్రాహ్మణ విద్యార్థులు చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. చిన్న చిన్న గుళ్లలో అర్చకుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. వేద మంత్రాలకు విలువలేని పరిస్థితి నెలకొంది. అందువల్ల బ్రాహ్మణుల కోసం క్రియాశీలకంగా పని చేయాలని నిర్ణయించుకున్నా. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు అప్పటి వరకు చైర్మన్‌గా ఎవరినీ నియమించలేదు. దానికి సంబంధించిన ఫైల్ తీసుకెళ్లా. నాకు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ పదవి అక్కరలేదు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వండని అడిగా. ఆయన(చంద్రబాబు) సరేనని ఒప్పుకున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ అప్పటికే ఏర్పాటై పనిచేస్తోంది. దీని ఏర్పాటుకు ముఖ్యకార్యదర్శిగా నావంతు కృషి చేశా. తర్వాత దీనికి ఎండీని నియమించడానికి ప్రయత్నించా.
బ్రాహ్మణులు, దళితుల ప్రయోజనాల మధ్య వైరుధ్యం లేదు
ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి జరిగినప్పుడు నా అంతట నేను వెళ్లాను. ఈ సమావేశానికి నేను రావడంతో మంచి స్పందన లభించింది. గత చరిత్ర తవ్వుకుని ప్రయోజనం లేదు. ఇవాళ బ్రాహ్మణులు, దళితులు కలిసి సామాజిక న్యాయం కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. మన ప్రయోజనాల మధ్య వైరుధ్యం లేదు. బ్రాహ్మణులు ఒక అడుగు వేస్తే దళితులు వంద అడుగులు వేస్తారు అని అన్నాను. బ్రాహ్మణ కార్పొరేషన్ తర్వాతి కాలంలో అంబేడ్కర్ జయంతి, బాబూ జగ్జీవన్‌రాం జయంతి కూడా నిర్వహించాలన్నది నా భావన. బ్రాహ్మణ కార్పొరేషన్ సమన్వయకర్తలతో సమావేశాలు పెట్టాను. మల్లేపల్లి లక్ష్మయ్య, ఎంజీకే మూర్తి లాంటి దళిత మేధావులతో ప్రసంగాలను ఇప్పించా. ఇది చంద్రబాబుకు ఇష్టం లేదు. నేను నాకిచ్చిన పరిమితికి మించి జనంలోకి వెళుతున్నాని అనుకుని ఉంటారు. నన్ను దూరం పెట్టడం ప్రారంభించారు.
నాపై తప్పుడు ప్రచారం చేశారు
ఒక సామాజికవర్గ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఈ పని చేయిస్తున్నదనే విషయంలో సందేహం లేదు. గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాకు వినోదపు పన్ను మినహాయించినప్పుడు కూడా అందులో చరిత్ర వక్రీకరించారని, దానికి పన్ను మినహాయించినందు వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఉద్దేశంతో మిత్రులతో చర్చించాను. దీనిపై విజయకుమార్ స్పందిస్తూ ఐవైఆర్ తెలుగుదేశానికి వ్యతిరేకమన్నట్లుగా ప్రచారం చేశారు. మొదట్లో ఇదంతా విజయకుమార్ అనే వ్యక్తి చేశారని పొరపాటు పడ్డాను. ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు శైలి ప్రతి చోటా కనిపిస్తుంది. అధికారులపై లీకులు ఇచ్చి వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీయడం, ఆపైన తన అనుకూల పత్రికల్లో్ల కథనాలు రాయించడం, చివరకు వేటు వేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.
ఆ నోటిఫికేషన్‌పై సీఎం సంతకం పెట్టలేదు
నేను బ్రాహ్మణ కార్పొరేషన్‌తో పాటు అర్చక సంక్షేమ ట్రస్టు చైర్మన్‌గా ఉన్నాను. 1987లో ఎన్టీఆర్ టీటీడీలో మిరాశీ వ్యవస్థను రద్దు చేయడం కోసం మొత్తం అన్ని ఆలయాల్లో వారసత్వ వ్యవస్థను రద్దు చేశారు. దీనివల్ల అర్చకులకే కాక వివిధ వర్గాలకు అన్యాయం జరిగింది. 2007లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక చిన్న మందిరాల్లో అర్చక వ్యవస్థను పునరుద్ధరిస్తూ చట్టాన్ని సవరించారు. కానీ, దానికి సంబంధించిన నిబంధనలను రూపకల్పన చేయలేదు. అప్పుడు ఐవీ సుబ్బారావు దేవాదాయ విభాగం సెక్రటరీగా ఉన్నారు. సీఎస్‌గా ఉన్నప్పుడే ఈ విషయం నా దృష్టికి వస్తే నేను ఈ విషయం చేపట్టాను. చొరవ తీసుకుని నిబంధనలను రూపొందించి సీఎంకు పంపించాను. కానీ, చాలా రోజులు సీఎం దాన్ని ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టారు. చేద్దాం, చూద్దాం అనేవారు.
ఈ లోపు నేను పదవీ విరమణ చేసి బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ అయ్యాను. ఎంతో కృషి చేశాక చంద్రబాబు అంగీకరించారు. అయితే, ఆ తరువాత కొందరు చంద్రబాబు చెవులు కొరికారు. దీనివల్ల మిరాశీ వ్యవస్థ మళ్లీ పునరుద్ధరించినట్లవుతుందని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. చంద్రబాబు వెనక్కి తగ్గారు. ‘కృష్ణారావు నన్ను తప్పుదోవ పట్టించారు. దీని పర్యవసానాలు ఉన్నాయి. నేను దీన్ని ముందుకు తీసుకెళ్లదలచుకోలేదు’ అని చెప్పారు. అర్చక వారసత్వానికి సంబంధించిన ఫైనల్ నోటిఫికేషన్‌పై ముఖ్యమంత్రి సంతకం పెట్టలేదు. ఆ సంతకం పెట్టించడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు’’
ఎవరిని నియమించినా పార్టీకి ఉపయోగపడాలట!
బ్రాహ్మణ కార్పొరేషన్ బోర్డులో వ్యాపారవేత్తలు, మేధావులు ఉంటే బాగుంటుందని, వారిలో బ్రాహ్మణేతరులు కూడా ఉండడం మంచిదని భావించా. జీఎంఆర్, గల్లా రామచంద్రనాయుడు, కేఎస్‌ఎన్ రాజులతో మాట్లాడి ఒప్పించి వారితోపాటు ఎస్‌వీ రావు, సుందర్ లక్ష్మణ్‌లను సభ్యులుగా చేర్చి ఫైల్ పంపాను. ఎండీగా వెంకట్ చంగవల్లి పేరుతోపాటు ఈ పేర్లను చంద్రబాబు అనుమతి కోసం పంపించా. చాలారోజులైనా ఆ ఫైల్ తిరిగి రాలేదు. నేను స్వయంగా వెళ్లి వారిని ఎందుకు ప్రతిపాదించానో వివరించా. ‘లేదండీ మనం ఎవరిని నియమించినా పార్టీకి ఉపయోగపడే వారు కావాలి. మనకు కావాల్సింది జెండాలు మోసేవారు. వీళ్లందరినీ పెట్టుకుంటే ఎన్నికల్లో ఎలా ఉపయోగం?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. నేనేమీ మాట్లాడలేదు.
బ్రాహ్మణ కార్పొరేషన్ ప్రతిష్టాత్మకంగా, ఒక అత్యున్నత సంస్థగా కార్యకలాపాలు నిర్వహించడం కన్నా అది ఏదో సబ్సిడీలు పంచి పార్టీకి ఉపయోగపడే సంస్థగా మార్చాలన్నదే చంద్రబాబు ఉద్ధేశంలా నాకు కనిపించింది. బహుశా నేను బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రావాలనుకోకపోతే ఆ సంస్థ చైర్మన్‌గా వేమూరి సూర్యనే పెట్టాలని చంద్రబాబు అనుకున్నట్లు తర్వాత తెలిసింది. మొదట్లో కొద్ది రోజులు నేను నా శైలిలో పనిచేస్తుంటే జోక్యం చేసుకోలేదు. కానీ, తర్వాత ఊరుకోలేకపోయారు. ఆయనకు(చంద్రబాబు) కార్పొరేషన్‌లో పార్టీ జెండాలు మోసేవారు, వారు విదిల్చే డబ్బుల కోసం తమను భుజాన వేసుకుని బ్రాహ్మణులను పార్టీకి దాసోహం చేసేవారు కావాలి. వారిది చాలా పరిమిత దృష్టి. బ్రాహ్మణులకు సాధికారికత కల్పించి, పార్టీతో ప్రమేయం లేకుండా బ్రాహ్మణులందరి అభ్యున్నతికి, వారి సమస్యల పరిష్కారానికి తోడ్పడడం, వారిని ఇతర పదవులు కూడా కోరేలా పైకి తీసుకురావడమే నా ఉద్దేశం.
Comments
Please login to add a commentAdd a comment