Brahmin Corporation
-
'సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు'
సాక్షి, గుంటూరు: బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బీసీ కార్పొరేషన్లో చేర్చడంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. బ్రాహ్మణులను బీసీలలో చేరుస్తున్నారంటూ వస్తున్న పుకార్లు ఎవరూ నమ్మెద్దు. బీసీ కార్పొరేషన్ ద్వారానే గతంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. ఏ లక్ష్యంతో, ఏ ఉద్దేశ్యంతో అయితే కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారో ఆ విధంగానే బ్రాహ్మణ కార్పొరేషన్ పనిచేస్తుంది. పథకాల నిర్వహణ మాత్రమే బీసీ కార్పొరేషన్ పర్యవేక్షణ చేస్తుంది. బ్రాహ్మణ కార్పొరేషన్‌పై రాజకీయ పరంగా విమర్శలు చేయడం తగదు. నవరత్నాల ద్వారా పేద బ్రాహ్మణులకు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. నవరత్నాల్లో లేని పథకాలను బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా అందిస్తాం. అవగాహన లేని వారే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నూతన జిల్లాల ఏర్పాటు కొనసాగుతోంది. సీఎం చెప్పిన తర్వాత కచ్చితంగా అమలవుతాయి. జనగణన వలన కొంత జాప్యం అవుతుంది. వచ్చే సాధారణ బడ్జెట్‌లోపే జిల్లాల ఏర్పాటు ఉండొచ్చు' అని మంత్రి తెలిపారు. -
బీసీ సంక్షేమశాఖ పరిధిలోకి బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్
సాక్షి, విజయవాడ: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయశాఖ పరిధి నుంచి తప్పించింది. కాగా తప్పించిన బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్‌ను జగన్ సర్కార్ బీసీ సంక్షేమ పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ మేరకు గురువారం సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. -
దేవదాయ శాఖ నిధుల మళ్లింపు అవాస్తవం
సాక్షి, అమరావతి: అమ్మఒడి పథకం కోసం దేవదాయ శాఖ నిధులు మళ్లించారంటూ బ్రాహ్మణ కార్పొరేషన్‌పై రాష్ట్ర బీజేపీ నేతలు కొందరు ప్రచారం చేస్తున్నారని.. అవన్నీ పూర్తి అవాస్తవాలని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు స్పష్టం చేశారు. ఇలాంటి అసత్య ప్రచారాన్ని ఖండిస్తున్నామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ‘జగనన్న అమ్మఒడి పథకం అమలుకు ఏ దేవాలయానికి సంబంధించిన నిధులుగానీ, భక్తులు సమర్పించిన విరాళాలు, కానుకలుగానీ, దేవదాయ శాఖ నిధులుగానీ ఉపయోగించలేదు. రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులు మాత్రమే ఉపయోగించాం. దీనిపై ఆరోపణలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఈ విషయం గమనించాలి’.. అని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ప్రకటనలో ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. ► గత సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా 42,33,098 మందికి జగనన్న అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి చేకూరింది. వీరిలో 8,89,113 మంది ఓసీలు కాగా అందులో 17,611 మంది బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన పిల్లలకూ లబ్ధి చేకూరింది. ► ఈ ఏడాది జనవరి 3న రూ.24.24 కోట్లను రాష్ట్ర ఆర్థిక శాఖ జీఓ నెంబరు 20 ద్వారా దేవదాయ శాఖకు అదనపు నిధులు కేటాయించింది. అదే నెల 6న దేవదాయ శాఖ వాటిని బ్రాహ్మణ కార్పొరేషన్‌కు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది. జనవరి 17న మరోసారి రూ.2.16 కోట్లు ఇదే విధానంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌కు విడుదలయ్యాయి. ► బ్రాహ్మణ సంక్షేమ సంస్థకు పాలనాపరమైన ఉత్తర్వులు, ప్రభుత్వ బడ్జెట్, నిధుల మంజూరు, దేవదాయ శాఖ ద్వారానే వస్తాయి. ఈ వాస్తవాన్ని అసత్యాలు ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలు గుర్తించాలి. అది దేవాలయాల సొమ్ము కాదు దేవాలయాల సొమ్ము రూ.25 కోట్ల మేర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి తరలించిందంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య కూడా ఒక ప్రకటనలో ఖండించింది. దేవదాయ శాఖలో ఒక భాగంగా ఉన్న బ్రాహ్మణ కార్పొరేషన్‌కు ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన నిధులను మంజూరు చేసిందని.. కానీ, కొంతమంది దానిని దేవాలయాల సొమ్ముగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి అగ్నిహోత్రం ఆత్రేయబాబు, కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దింటి రాంబాబులు పేర్కొన్నారు. దేవాలయాల్లో పనిచేసే అర్చకులు ఒకొక్కరికి రూ.5వేల చొప్పున ఇచ్చిన సహృదయులు సీఎం వైఎస్ జగన్ అని వారు ప్రశంసించారు. -
ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కీలక పదవి
సాక్షి, అమరావతి: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కీలక పదవి లభించింది. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా మల్లాది విష్ణును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు దేవదాయ శాఖ కార్యదర్శి ఉషారాణి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మల్లాది విష్ణు బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మనుగా బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారని ఉత్తర్వులో పేర్కొన్నారు. మల్లాది విష్ణును బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించడంతో ఆయన మద్దతుదారులు హర్షం వ్యక్తం చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మల్లాది విష్ణు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, సీఎం లక్ష్యాలకు అనుగుణంగా పని చేసి, బ్రాహ్మణ సామాజిక వర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. బ్రాహ్మణులకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అన్యాయం చేసిందని, ఇచ్చిన ఒక్క హామీని కూడా టీడీపీ నిలబెట్టుకోలేదని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ను భ్రష్టు పట్టించారని మల్లాది విష్ణు విమర్శించారు. బ్రాహ్మణులకు మూడు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. వంశపారపర్యానికి ఆమోదం తెలిపి అర్చకుల కుటుంబాల్లో వెలుగులు నింపిన వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. బడ్జెట్ కేటాయింపుల్లో కూడా కార్పొరేషన్‌కు, ఆలయాల్లో ధూప, దీప నైవేద్యాలకు ముఖ్యమంత్రి అధిక నిధులు కేటాయించారన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్లో పెండింగ్‌లో ఉన్న కశ్యప పెన్షన్లు, భారతి స్కీమ్ సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని మల్లాది విష్ణు హామీ ఇచ్చారు. -
‘స్వామీజీ, పీఠాధిపతులను అవమానించిన ప్రభుత్వం ఇది’
సాక్షి, విజయవాడ : టీడీపీ ప్రభుత్వం బ్రాహ్మణులను మోసం చేసిందని, స్వామిజీ, పీఠాధిపతులను అవమానించిన ప్రభుత్వం ఇదేనంటూ ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు జ్వాలాపురం శ్రీకాంత్ మండిపడ్డారు. అన్ని వర్గాలను దగా చేస్తోందీ ప్రభుత్వమని విమర్శించారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి వైఎస్సార్సీపీ సముచిత స్థానం కల్పించిందన్నారు. బ్రాహ్మణ కార్పోరేషన్‌కు వెయ్యి కోట్ల నిధలు కేటాయిస్తామని హామీ ఇచ్చారన్నారు. టీడీపీ ప్రభుత్వం ఐవైఆర్ కృష్ణారావు, రమణ దీక్షితులను ఎలా అవమానపాలు చేశారో అందరికీ తెలుసన్నారు. అర్చకులకు 65ఏళ్ల సర్వీస్, వంశపారపర్యంగా అర్చకత్వపు హక్కు కల్పిస్తామని వైఎస్సార్సీపీ హామీ ఇచ్చిందని ప్రధాన కార్యదర్శి కోడూరి సతీష్ శర్మ అన్నారు. బ్రాహ్మణ కార్పోరేషన్ నిధులను కూడా టీడీపీ పక్కదోవ పట్టించిందని ఆరోపించారు. ఏపిలో ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా తమకు టీడీపీ ఇవ్వలేదన్నారు. విజయవాడలో బ్రాహ్మణసామాజిక వర్గానికి చెందిన వైద్యుడిపై బొండా ఉమా దౌర్జన్యం చేశారన్నారు. -
అంతా ఒక సామాజికవర్గం ప్రయోజనాల కోసమే..
సాక్షి, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) కావడం తృటిలో తప్పిపోయిందని ఐవైఆర్ కృష్ణారావు ‘నవ్యాంధ్రతో నా నడక’ పుస్తకంలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కు తాను సీఎస్ అవుతానని అనుకోలేదని వెల్లడించారు. కానీ తెలుగుదేశం పార్టీ వేసుకున్న సామాజిక వర్గాల లెక్కల వల్ల తనకు యాధృచ్ఛికంగా చీఫ్ సెక్రటరీ పదవి దక్కిందని తెలిపారు. ఈ పుస్తకంలో మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఇంకా ఏం ప్రస్తావించారంటే... ‘‘నేను సీఎస్ అయిన రెండు నెలల్లోనే నాకు, తనకు మధ్య భావసారూప్యత అంతగా లేదన్న విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రహించినట్లున్నారు. గ్రహించిన తర్వాత కీలకమైన నిర్ణయాల్లో నన్ను విశ్వాసంలోకి తీసుకోవడం మానేశారు. నాకు తెలియకుండానే నిర్ణయాలు జరిగేవి. నేను కూడా నా స్థాయి తగ్గించుకుని కలిసిపోవాలని అనుకోలేదు. నాకు నేను ఒక పరిధి ఏర్పరచుకుని పనిచేయడం ప్రారంభించా. చంద్రబాబు సమీక్షించని ప్రాజెక్టులు, కార్యక్రమాలపై దృష్టి పెట్టి చీఫ్ సెక్రటరీగా ప్రభుత్వ వ్యవస్థ సవ్యంగా సాగేలా చూసుకోసాగాను. తమకు అనుకూల నిర్ణయాలు తీసుకునేందుకు నేను అడ్డుగా ఉంటానని భావించారేమో నన్ను ఒకటి రెండు సార్లు తప్పించే అంశంపై అంతర్గతంగా చర్చించినట్లు తెలిసింది. ఇద్దరు అధికారులను నా స్థానంలో తీసుకోవాలని రెండు తడవలు ఈ చర్చలు జరిగాయని నా సమాచారం. కానీ, చివరకు తుది నిర్ణయం తీసుకునేలోపే నా పదవీ కాలం ముగిసింది. పదవీ విరమణ తర్వాత మరో పది, పదిహేనేళ్లు సమాజానికి సేవ చేయాలని అనుకున్నా. వేద మంత్రాలకు విలువ లేకుండా పోయింది నాకు చిన్నప్పటి నుంచీ నా సొంత సామాజికవర్గానికి సేవ చేయాలన్న ఆలోచన ఉంది. అన్ని వర్గాలకూ ఏదో రకంగా మేలు జరుగుతోంది. బ్రాహ్మణులకు మాత్రం ఆర్థికంగా, సామాజికంగా మేలు చేయాలని ఆలోచించేవారే లేరు. చాలామంది పేద బ్రాహ్మణ విద్యార్థులు చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. చిన్న చిన్న గుళ్లలో అర్చకుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. వేద మంత్రాలకు విలువలేని పరిస్థితి నెలకొంది. అందువల్ల బ్రాహ్మణుల కోసం క్రియాశీలకంగా పని చేయాలని నిర్ణయించుకున్నా. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు అప్పటి వరకు చైర్మన్‌గా ఎవరినీ నియమించలేదు. దానికి సంబంధించిన ఫైల్ తీసుకెళ్లా. నాకు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ పదవి అక్కరలేదు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వండని అడిగా. ఆయన(చంద్రబాబు) సరేనని ఒప్పుకున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ అప్పటికే ఏర్పాటై పనిచేస్తోంది. దీని ఏర్పాటుకు ముఖ్యకార్యదర్శిగా నావంతు కృషి చేశా. తర్వాత దీనికి ఎండీని నియమించడానికి ప్రయత్నించా. బ్రాహ్మణులు, దళితుల ప్రయోజనాల మధ్య వైరుధ్యం లేదు ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి జరిగినప్పుడు నా అంతట నేను వెళ్లాను. ఈ సమావేశానికి నేను రావడంతో మంచి స్పందన లభించింది. గత చరిత్ర తవ్వుకుని ప్రయోజనం లేదు. ఇవాళ బ్రాహ్మణులు, దళితులు కలిసి సామాజిక న్యాయం కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. మన ప్రయోజనాల మధ్య వైరుధ్యం లేదు. బ్రాహ్మణులు ఒక అడుగు వేస్తే దళితులు వంద అడుగులు వేస్తారు అని అన్నాను. బ్రాహ్మణ కార్పొరేషన్ తర్వాతి కాలంలో అంబేడ్కర్ జయంతి, బాబూ జగ్జీవన్‌రాం జయంతి కూడా నిర్వహించాలన్నది నా భావన. బ్రాహ్మణ కార్పొరేషన్ సమన్వయకర్తలతో సమావేశాలు పెట్టాను. మల్లేపల్లి లక్ష్మయ్య, ఎంజీకే మూర్తి లాంటి దళిత మేధావులతో ప్రసంగాలను ఇప్పించా. ఇది చంద్రబాబుకు ఇష్టం లేదు. నేను నాకిచ్చిన పరిమితికి మించి జనంలోకి వెళుతున్నాని అనుకుని ఉంటారు. నన్ను దూరం పెట్టడం ప్రారంభించారు. నాపై తప్పుడు ప్రచారం చేశారు ఒక సామాజికవర్గ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఈ పని చేయిస్తున్నదనే విషయంలో సందేహం లేదు. గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాకు వినోదపు పన్ను మినహాయించినప్పుడు కూడా అందులో చరిత్ర వక్రీకరించారని, దానికి పన్ను మినహాయించినందు వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఉద్దేశంతో మిత్రులతో చర్చించాను. దీనిపై విజయకుమార్ స్పందిస్తూ ఐవైఆర్ తెలుగుదేశానికి వ్యతిరేకమన్నట్లుగా ప్రచారం చేశారు. మొదట్లో ఇదంతా విజయకుమార్ అనే వ్యక్తి చేశారని పొరపాటు పడ్డాను. ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు శైలి ప్రతి చోటా కనిపిస్తుంది. అధికారులపై లీకులు ఇచ్చి వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీయడం, ఆపైన తన అనుకూల పత్రికల్లో్ల కథనాలు రాయించడం, చివరకు వేటు వేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆ నోటిఫికేషన్‌పై సీఎం సంతకం పెట్టలేదు నేను బ్రాహ్మణ కార్పొరేషన్‌తో పాటు అర్చక సంక్షేమ ట్రస్టు చైర్మన్‌గా ఉన్నాను. 1987లో ఎన్టీఆర్ టీటీడీలో మిరాశీ వ్యవస్థను రద్దు చేయడం కోసం మొత్తం అన్ని ఆలయాల్లో వారసత్వ వ్యవస్థను రద్దు చేశారు. దీనివల్ల అర్చకులకే కాక వివిధ వర్గాలకు అన్యాయం జరిగింది. 2007లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక చిన్న మందిరాల్లో అర్చక వ్యవస్థను పునరుద్ధరిస్తూ చట్టాన్ని సవరించారు. కానీ, దానికి సంబంధించిన నిబంధనలను రూపకల్పన చేయలేదు. అప్పుడు ఐవీ సుబ్బారావు దేవాదాయ విభాగం సెక్రటరీగా ఉన్నారు. సీఎస్‌గా ఉన్నప్పుడే ఈ విషయం నా దృష్టికి వస్తే నేను ఈ విషయం చేపట్టాను. చొరవ తీసుకుని నిబంధనలను రూపొందించి సీఎంకు పంపించాను. కానీ, చాలా రోజులు సీఎం దాన్ని ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టారు. చేద్దాం, చూద్దాం అనేవారు. ఈ లోపు నేను పదవీ విరమణ చేసి బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ అయ్యాను. ఎంతో కృషి చేశాక చంద్రబాబు అంగీకరించారు. అయితే, ఆ తరువాత కొందరు చంద్రబాబు చెవులు కొరికారు. దీనివల్ల మిరాశీ వ్యవస్థ మళ్లీ పునరుద్ధరించినట్లవుతుందని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. చంద్రబాబు వెనక్కి తగ్గారు. ‘కృష్ణారావు నన్ను తప్పుదోవ పట్టించారు. దీని పర్యవసానాలు ఉన్నాయి. నేను దీన్ని ముందుకు తీసుకెళ్లదలచుకోలేదు’ అని చెప్పారు. అర్చక వారసత్వానికి సంబంధించిన ఫైనల్ నోటిఫికేషన్‌పై ముఖ్యమంత్రి సంతకం పెట్టలేదు. ఆ సంతకం పెట్టించడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు’’ ఎవరిని నియమించినా పార్టీకి ఉపయోగపడాలట! బ్రాహ్మణ కార్పొరేషన్ బోర్డులో వ్యాపారవేత్తలు, మేధావులు ఉంటే బాగుంటుందని, వారిలో బ్రాహ్మణేతరులు కూడా ఉండడం మంచిదని భావించా. జీఎంఆర్, గల్లా రామచంద్రనాయుడు, కేఎస్ఎన్ రాజులతో మాట్లాడి ఒప్పించి వారితోపాటు ఎస్వీ రావు, సుందర్ లక్ష్మణ్‌లను సభ్యులుగా చేర్చి ఫైల్ పంపాను. ఎండీగా వెంకట్ చంగవల్లి పేరుతోపాటు ఈ పేర్లను చంద్రబాబు అనుమతి కోసం పంపించా. చాలారోజులైనా ఆ ఫైల్ తిరిగి రాలేదు. నేను స్వయంగా వెళ్లి వారిని ఎందుకు ప్రతిపాదించానో వివరించా. ‘లేదండీ మనం ఎవరిని నియమించినా పార్టీకి ఉపయోగపడే వారు కావాలి. మనకు కావాల్సింది జెండాలు మోసేవారు. వీళ్లందరినీ పెట్టుకుంటే ఎన్నికల్లో ఎలా ఉపయోగం?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. నేనేమీ మాట్లాడలేదు. బ్రాహ్మణ కార్పొరేషన్ ప్రతిష్టాత్మకంగా, ఒక అత్యున్నత సంస్థగా కార్యకలాపాలు నిర్వహించడం కన్నా అది ఏదో సబ్సిడీలు పంచి పార్టీకి ఉపయోగపడే సంస్థగా మార్చాలన్నదే చంద్రబాబు ఉద్ధేశంలా నాకు కనిపించింది. బహుశా నేను బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రావాలనుకోకపోతే ఆ సంస్థ చైర్మన్‌గా వేమూరి సూర్యనే పెట్టాలని చంద్రబాబు అనుకున్నట్లు తర్వాత తెలిసింది. మొదట్లో కొద్ది రోజులు నేను నా శైలిలో పనిచేస్తుంటే జోక్యం చేసుకోలేదు. కానీ, తర్వాత ఊరుకోలేకపోయారు. ఆయనకు(చంద్రబాబు) కార్పొరేషన్లో పార్టీ జెండాలు మోసేవారు, వారు విదిల్చే డబ్బుల కోసం తమను భుజాన వేసుకుని బ్రాహ్మణులను పార్టీకి దాసోహం చేసేవారు కావాలి. వారిది చాలా పరిమిత దృష్టి. బ్రాహ్మణులకు సాధికారికత కల్పించి, పార్టీతో ప్రమేయం లేకుండా బ్రాహ్మణులందరి అభ్యున్నతికి, వారి సమస్యల పరిష్కారానికి తోడ్పడడం, వారిని ఇతర పదవులు కూడా కోరేలా పైకి తీసుకురావడమే నా ఉద్దేశం. -
ఐవైఆర్‌పై ఆనంద్ సూర్య ధ్వజం
సాక్షి, విజయవాడ : సీఎం చంద్రబాబునాయుడుపై అవాకులు చెవాకులు పేలితే మర్యాద దక్కదని ఐవైఆర్ కృష్ణారావును ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఆనంద్ సూర్య హెచ్చరించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మాజీ సీఎస్ ఐవైఆర్ తీరు గర్హనీయమైందనీ, మాజీ సీఎంలు రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డిలు మిమ్మల్ని పక్కన పెట్టిన సంగతి మర్చిపోయారా అంటూ విమర్శించారు. ఐవైఆర్ సొంత అజెండాతోనే బ్రాహ్మణ కార్పొరేషన్‌ను భ్రష్టు పట్టించారని, రాజధాని నిర్మాణం, హోదా గురించి మొసలికన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. బ్రాహ్మణులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఐవైఆర్ లాంటి కుహానా వ్యక్తులు ఏ వేదికల్లో ఉంటే ఆ వేదికలు అధోగతి పాలవుతాయని ధ్వజమెత్తారు. -
వైఎస్సార్ సీపీ అని..
పీసీపల్లి: నా తల్లికి వృద్ధాప్య పింఛన్ ఇవ్వడంలేదని, పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు చేయలేదని రాజానగర్‌కు చెందిన కుమారి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి సమస్యను విన్నవించింది. వైఎస్సార్ పార్టీ అని పింఛన్ మంజూరు చేయడంలేదని తన బాధను చెప్పుకుంది. టీడీపీ వారికే బ్రాహ్మణ కార్పొరేషన్.. పర్చూరు: తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినప్పటికీ కేవలం అధికార పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మాత్రమే మేలు చేసే విధంగా పరిమితమైందని అద్దంకి సీమ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు పుట్టంరాజు కన్నయ్య వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్ద వాపోయారు. గ్రామాల్లో ప్రస్తుతం బ్రాహ్మణ యువత నిరుద్యోగం, పేదరికాన్ని అధిగమించలేని పరిస్థితుల్లో ఉంది కాబట్టి భార్గవ బ్రాహ్మణ స్టడీ సర్కిల్‌ను రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయాలని కోరారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో రాష్ట్ర స్థాయిలో వివిధ దేవస్థానాలకు ధూప, దీప, నైవేద్యాల స్కీమ్ కింద ఎందరో అర్చకులకు, పూజారులకు జీవన భృతి కల్పించారన్నారు. -
మాజీ సీఎస్ ఐవైఆర్‌పై బాబు కక్షసాధింపు!
సాక్షి, అమరావతి : ఆంధప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుపై రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పూనుకుంది. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ.. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు తీరును ప్రశ్నిస్తున్న ఆయనను మరోసారి టార్గెట్ చేసింది. అర్చకులు, ఉద్యోగుల సంక్షేమ ఫండ్ ట్రస్ట్ చైర్మన్ పదవి నుంచి ఐవైఆర్‌ను తొలగిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. గతంలో బ్రాహ్మణ కార్పొరేషన్ పదవి నుంచి కూడా ఆయనను తొలగించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ప్రభుత్వ తీరును ఐవైఆర్ కృష్ణారావు బాహాటంగానే విమర్శించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ లోపాలను, ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లను ఆయన ఎత్తిచూపేందుకు ప్రయత్నించారు. దీంతో కక్ష పెంచుకున్న చంద్రబాబు సర్కారు.. ఆయనను కావాలనే ఈ పదవుల నుంచి తొలగించిందని ఆయన సన్నిహితులు అంటున్నారు. -
ఎంపీ రాయపాటి ఆరోపణలపై సీఎం విచారణ జరిపించాలి
- ముఖ్యమంత్రికి మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు విజ్ఞప్తి - దొనకొండలో నాకు సెంటు భూమి లేదు - గట్టిగా అడక్కపోతే మేనిఫెస్టోలో హామీలు అమలు చేయరు సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనపై చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని మాజీ సీఎస్, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. హైదరాబాద్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రకాశం జిల్లా దొనకొండలో తనకు సెంటు భూమి కూడా లేదని స్పష్టం చేశారు. దొనకొండలో వేల ఎకరాలు కొన్నారని, అక్కడ రాజధాని ఏర్పాటు చేయాలన్న విజ్ఞప్తిని సీఎం చంద్రబాబు తిరస్కరించినందునే ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేస్తున్నారని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు తనపై చేసిన ఆరోపణలను ఐవైఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. వివిధ అంశాలపై ఐవైఆర్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే... జిల్లాలో ఒక్కసెంటు కూడా లేదు.. నాకు దొనకొండలోనే కాదు. నా సొంత జిల్లా ప్రకాశంలో ఒక్క సెంటు భూమి కూడా లేదు. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పించడం ద్వారా నిజమనిపించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈరోజు ఒకరు ఆరోపిస్తారు. రేపు ఒక పేపర్లో రాస్తారు. మరో రోజు ఫేస్బుక్లో పెడతారు. ఆయన స్పందించలేదు కదా. ఇది నిజమేననిపిస్తారు. అందువల్లే నేను స్పందిస్తున్నాను. ఎంపీ ఆరోపణలపై విచారణ చేపట్టి నిజాలుంటే నాపై చర్యలు తీసుకోవాలని సీఎంకు విన్నవిస్తున్నా. గట్టిగా అడగకపోతే ఎన్నికల మేనిఫెస్టోలోని వాగ్దానాలు నెరవేర్చరు. ముద్రగడ పద్మనాభం గట్టిగా అడగబట్టే కాపు కార్పొరేషన్‌కు నిధులిచ్చారు. బ్రాహ్మణ సంక్షేమానికి కూడా మేనిఫెస్టోలో చెప్పిన మాదిరిగా రూ. 500 కోట్లు కేటాయించాలి. అది ప్రభుత్వ అనుబంధ సొసైటీ... బ్రాహ్మణ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ప్రైవేట్ సంస్థ అని, దానికి నేను నిధులు మళ్లించానని ఆర్థిక శాఖ మంత్రి యనమల ఆరోపించారు. సహకార సంస్థల చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా ఏర్పాటైన ప్రభుత్వ అనుబంధ సంస్థ అది. దానిని ప్రైవేట్ సంస్థ అనడం తప్పు. దీనిపై ఆర్థిక మంత్రి స్పష్టత ఇవ్వాలి. ఇక సొసైటీ సీఈవో నాకు బంధువంటూ అభియోగాలు మోపారు. అది తప్పు. విశాఖలో ప్రభుత్వ భూముల రద్దు తప్పు.. విశాఖపట్నంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు ఇచ్చిన 35 ఎకరాలను రద్దు చేసి ప్రైవేటు సంస్థకు ఇవ్వాలనే ప్రయత్నాలు భూ కేటాయింపుల చట్టంలోని మార్గదర్శకాలకు పూర్తి విరుద్ధం. ప్రభుత్వ భూమి కేటాయింపులో మొదటి ప్రాధాన్యం ప్రభుత్వ సంస్థలకు, రెండో ప్రాధాన్యం ప్రభుత్వరంగ సంస్థలకు ఇవ్వాలి. తర్వాతే ప్రైవేటు వ్యక్తులు, సంస్థలను పరిగణనలోకి తీసుకోవాలి. ప్రభుత్వ సంస్థలకు ఇచ్చిన భూ కేటాయింపులు రద్దు చేసి ప్రైవేటు సంస్థకు ఇస్తే పెద్ద తప్పవుతుంది. -
‘రాయపాటి అబద్దాలు చెబుతున్నారు’
హైదరాబాద్: దొనకొండలో తనకు ఎలాంటి భూములు లేవని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. దొనకొండలో తనకు భూములు ఉన్నట్టు టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశిరావు చెప్పడం పెద్ద అబద్దమని అన్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు ఏవైనా వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించుకోవాలని సూచించారు. ఆదివారం సోమజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వానికి దమ్ముంటే రాయపాటి ఆరోపణలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం టీడీపీ నాయకులకు అలవాటైందని ధ్వజమెత్తారు. ‘చాలా సీనియర్ పార్లమెంటేరియన్ అయిన రాయపాటి వ్యాఖ్యలపై సీఎం విచారణ జరపాలి. నా మనోభావాలు దెబ్బితినడం కాదు.. ఈ ప్రభుత్వంలో చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఏమీ లేకపోయినా వందల కోట్ల రూపాయల విలువైన భూములు ఉన్నట్లు కొందరు ప్రచారం చేస్తున్నారు. నాకు దొనకొండలో ఎటువంటి భూములు లేవు. విశాఖలో కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకుని ప్రైవేటు వారికి అప్పజెప్పడం సబబు కాద’ని ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ. 500 కోట్లు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ హామీయిచ్చిందని, కానీ ఇంతవరకు ఆ దిశగా ఎలాంటి చర్య తీసుకోలేదని తెలిపారు. గట్టిగా అడిగితేనే ప్రభుత్వం స్పందిస్తుందని, ముద్రగడ పద్మనాభం అడిగితేనే కాపులకు నామమాత్రపు నిధులిచ్చిందని చెప్పారు. -
ఆ పోస్టులపై చర్య తీసుకోవాలి
- గవర్నరుకు ఐవైఆర్ కృష్ణారావు ఫిర్యాదు - వాటి గురించి పట్టించుకోవద్దని నరసింహన్ హితబోధ సాక్షి, హైదరాబాద్: సామాజిక మాధ్యమాల్లో తనను అవమానించేలా, అవహేళన చేస్తూ అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని గవర్నరు నరసింహన్‌కు ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. ఆయన బుధవారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నరును కలిశారు. ఈ సందర్భంగా కొందరు పనిగట్టుకుని తన ప్రతిష్టను దెబ్బతీసేలా దురుద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్నారని, ఇలాంటి వాటికి అడ్డుకట్టపడేలా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ‘ఇలాంటి అభ్యంతరకర పోస్టులు పెట్టినవారు, వాటిని చూపెట్టినవారు మురుగు కాలువ (డ్రెయినేజి) స్థాయి మనుషులు. మీరు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేయడమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో గౌరవ ప్రతిష్టలున్నవారు. మురుగు కాలువ స్థాయి వ్యక్తులు చేస్తున్న వాటి గురించి ఆలోచించడం ద్వారా మీ స్థాయిని తగ్గించుకోవద్దు. మీరు వాటి గురించి ఆలోచిస్తే ‘డ్రైనేజి పీపుల్’ స్థాయి పెంచినట్లు అవుతుంది. అసలు వాటి గురించి పట్టించుకోవద్దు..’ అని ఈ సందర్భంగా గవర్నరు ఆయనకు ఉద్బోధించారు. రాజాజీ ఇన్స్టిట్యూట్’ అభివృద్ధికి విజ్ఞప్తి రంగారెడ్డి జిల్లా బొల్లారంలోని రాజాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు మేధావులతో సమావేశం ఏర్పాటు చేయాలని గవర్నరుకు ఈ సందర్భంగా భారతీయ విద్యా భవన్ కమిటీ (హైదరాబాద్) ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. బొల్లారంలోని ’రాజాజీ ఇన్స్టిట్యూట్’లో కొత్తగా పాఠశాల ఏర్పాటు చేయడంతోపాటు దీనిని బాగా అభివృద్ధి చేయాల్సిన అవసరం గురించి గతంలో కూడా ఆయన గవర్నరును కలిసి చర్చించారు. బుధవారం మళ్లీ ఇదే అంశాన్ని గుర్తు చేశారు. ‘త్వరలోనే అందరినీ పిలిచి సమావేశం ఏర్పాటు చేద్దాం. ఎలా చేస్తే బాగుంటుందో చర్చించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేద్దాం. ఈ ఇన్స్టిట్యూట్లో పాఠశాల కచ్చితంగా ఏర్పాటు చేద్దాం...’ అని గవర్నరు హామీ ఇచ్చినట్లు సమాచారం. -
అంతర్గత విషయాలు బయటకు చెబుతారా?
కృష్ణారావుది విపరీత ధోరణి: పరకాల సాక్షి, హైదరాబాద్: ఐవైఆర్ కృష్ణారావు చాలా పెద్ద మనిషి అని, అయితే ఆయనను బ్రాహ్మణ కార్పొరేషన్ పదవి నుంచి తొలగించక తప్పలేదని రాష్ట్ర ప్రభుత్వ కమ్యూనికేషన్ల సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. పరకాల హైదరాబాద్‌లో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ సర్వీసుల్లో 30 ఏళ్లకుపైగా ఐవైఆర్ అత్యుత్తమ సేవలందించారని, అలాంటి వ్యక్తి ప్రభుత్వంలో అంతర్గతంగా జరిగే విషయాలను బయటకు చెప్పరాదనే నియమాన్ని పాటించలేదన్నారు. ఆరు నెలలుగా సీఎం తనను కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న ఐవైఆర్ విమర్శల్లో నిజం లేదని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆయన పెట్టిన పోస్టింగ్‌లు విపరీత ధోరణిని సూచిస్తున్నాయని, ఇలా వ్యవ హరించడాన్ని ప్రభుత్వం అత్యంత అభ్యంతరక రంగా భావించిందన్నారు. -
వైఎస్ జగన్‌ను కలసిన బ్రాహ్మణ సమాఖ్య నేతలు
కార్పొరేషన్‌కు రూ.200 కోట్లు కేటాయించేలా సర్కార్‌పై ఒత్తిడి తేవాలని విన్నపం సాక్షి, హైదరాబాద్: వచ్చే బడ్జెట్లోనైనా బ్రాహ్మణ కార్పొరేషన్‌కు కనీసం రూ.200 కోట్లు కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షు డు వైఎస్ జగన్‌కు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య విజ్ఞప్తి చేసింది. కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా ఆధ్వర్యంలో సమాఖ్య ప్రధాన కార్యదర్శి కోసూరు సతీష్ శర్మ, అర్చక పురోహిత విభాగం అధ్యక్షుడు వెల్లాల మధుసూదనశర్మ, యువజన విభాగం అధ్యక్షుడు ఎం.ఎల్.ఎన్ సురేష్ (కార్పొరేటర్), సమాఖ్య ఉపాధ్యక్షుడు ఆర్.మధుసూదనశర్మ శనివారం జగన్‌ను ఆయన నివాసంలో కలసి తమ సమస్యలు వివరించారు. దివంగత సీఎం రాజశేఖర్‌రెడ్డి హయాంలో దాదాపు 13 వేలకు పైగా దేవాలయాలకు ధూప, దీప, నైవేద్యాల కింద నెలకు రూ.2,500లు ఇచ్చేవారని, చంద్రబాబు సీఎం అయ్యాక ఆ మొత్తాన్ని రూ.5 వేలకు పెంచినట్లు ప్రకటించి.. దేవాలయాల సంఖ్యను 8 వేలకు తగ్గించారని జగన్ దృష్టికి తెచ్చారు. ఈ మొత్తం కూడా మూడు నెలలకో, ఆరు నెలల కో సారి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు కేటాయిస్తామని బాబు హామీ ఇచ్చారని, కానీ మూడేళ్లుగా రూ.165 కోట్లే కేటాయిం చారన్నారు. వచ్చే బడ్జెట్లోనైనా కనీసం రూ.200 కోట్లు కేటాయించేలా ఒత్తిడి తీసుకు రావాలని జగన్‌కు విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ విషయాన్ని తప్పకుండా అసెంబ్లీలో ప్రస్తావించి బ్రాహ్మణ కార్పొరేషన్‌కు తగినన్ని నిధులు కేటాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని జగన్ వారికి హామీ ఇచ్చారు. ఇదిలాఉండగా, కడప మున్సిపల్ కార్పొరేటర్ పాకా సురేష్ కూడా ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ను కలిశారు. -
బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు సాక్షి, హైదరాబాద్: గత బడ్జెట్ సమావేశాల్లో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నామని, బ్రాహ్మణుల అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం, ఎనిమిది నెలలవుతున్నా కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడం బ్రాహ్మణులను మోసగించడమేనని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు ఆదివారం ఓ ప్రకటనలో ఆరోపించారు. వార్షిక బడ్జెట్లో కేటాయించిన రూ.100 కోట్లను వెంటనే విడుదల చేయాలని, అర్చకుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బ్రాహ్మణుల విద్య, వ్యాపార అభివృద్ధికి వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. బ్రాహ్మణ సంక్షేమ కార్యక్రమాలకు నిధులను విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం ఎంతమాత్రం సరికాదన్నారు. -
బ్రాహ్మణులకు సీఎం వరాల జల్లు
హైదరాబాద్ : రాష్ట్రంలోని బ్రాహ్మణులకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు వరాలజల్లు కురిపించారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఆదివారం బ్రాహ్మణ ప్రముఖులు, అధికారులతో కేసీఆర్ సమావేశమయ్యారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుపై ఈ సమావేశంలో సీఎం ప్రత్యేకంగా చర్చించారు. బ్రాహ్మణుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పని చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో 10 నంచి 12 ఎకరాల విస్తీర్ణంలో బ్రాహ్మణ సదన్ నిర్మిస్తామన్నారు. రూ.100 కోట్లతో బ్రాహ్మణ ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ డీజీపీ అరవిందరావు తెలంగాణలో సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని సీఎంను కోరారు. దీనికి సీఎం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బ్రాహ్మణుల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై బ్రాహ్మణ ప్రముఖులు సీఎం కేసీఆర్‌ను అభినందించారు. -
తెలంగాణ బ్రాహ్మణ సంఘాల జేఏసీ ఆవిర్భావం
చైర్మన్‌గా భానుమూర్తి ఏకగ్రీవ ఎన్నిక హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల బ్రాహ్మణ సంఘాలతో తెలంగాణ బ్రాహ్మణ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ(జేఏసీ) ఆవిర్భవించింది. దీనికి తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడు గంగు భానుమూర్తి చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం న్యూనల్లకుంటలోని శ్రీ సీతారామాంజనేయ సరస్వతి దేవాలయం ప్రాంగణంలో గంగు భానుమూర్తి అధ్యక్షతన తెలంగాణ బ్రాహ్మణ సంఘాల జేఏసీ ఆవిర్భావ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 58 మందితో కమిటీని ఏర్పాటు చేయ గా ఆ ప్రతినిధులు గంగు భానుమూర్తిని జేఏసీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా బండారు రామప్రసాద్, మహిళా ప్రతినిధిగా గీతామూర్తిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ భానుమూర్తి మాట్లాడుతూ తెలంగాణలోని బ్రాహ్మణులందరిని ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకే జేఏసీ ఏర్పాటు చేశామన్నారు. సీఎం కేసీఆర్ బ్రాహ్మణ పక్షపాతి అన్నారు. అందుకే ఆయన ఎంతో సహృదయంతో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, రూ.100 కోట్ల బడ్జెట్ కేటారుుస్తాననడం ముదావహమన్నారు. పేద బ్రాహ్మణులకు కల్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేయడంతోపాటు పేద బ్రాహ్మణ విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీరుుంబర్స్‌మెంట్ అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పేద బ్రాహ్మణులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి బ్రాహ్మణుల సంక్షేమం, అభివృద్ధి కోసం తెలంగాణ బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఆదివారం బర్కత్‌పురలోని అర్చక భవన్లో బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర స్థారుు విస్తృత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ వొడితెల విశ్వనాథరావు, మాజీ వీసీ ధర్మేందర్ రావు, గంగు ఉపేంద్రశర్మలు మాట్లాడారు. అక్టోబర్ 16వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా పదివేల మంది బ్రాహ్మణ వధూవరుల కోసం ‘కల్యాణమస్తు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
త్వరలో బ్రాహ్మణ కార్పొరేషన్!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న అధికారపక్షం.. సామాజిక వర్గాల ఓట్లను చేజిక్కించుకోవడంపై దృష్టిసారించింది. జంట నగరాల్లో పెద్ద సంఖ్యలో ఓట్లు ఉన్న బ్రాహ్మణ వర్గాన్ని ఆకట్టుకునేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగం గా రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని సూచనప్రాయంగా నిర్ణయించింది. మంగళవారం క్యాంపు కార్యాలయంలో పలువురు ఉన్నతాధికారులతో భేటీ అయిన సీఎం కేసీఆర్... ఈ అంశంపై చర్చించినట్లు తెలిసింది. ‘కుల మతాలతో సంబంధం లేకుండా పేదలందరి సంక్షేమం ధ్యేయంగా ప్రభుత్వ పనితీరు ఉండాలి. రాష్ట్రంలో అన్ని కులాల్లో ఉన్న నిరుపేదల సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించే క్రమంలో బ్రాహ్మణ సమాజంలో ఆర్థికంగా వెనుకబడినవారి కోసం ఓ ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది..’ అని ఈ సందర్భంగా కేసీఆర్ అభిప్రాయపడినట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే బ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. దాని విధివిధానాలను రూపొందించిన ఐఏఎస్ అధికారి దానకిశోర్, ప్రభుత్వ సలహాదారు రమణాచారిని తెలంగాణలోనూ అటువంటి ప్రత్యేక సంస్థ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. 99 శాతానికి పైగా పేదలు! ప్రభుత్వం వద్ద ఉన్న గణాంకాలతో పాటు సమగ్ర కుటుంబ సర్వే ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం... రాష్ట్రంలో దాదాపు 1.22 లక్షల బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయి. అందులో దాదాపు 85 వేల కుటుంబాలు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే నివాసం ఉంటున్నాయి. మొత్తం బ్రాహ్మణ కుటుంబాల్లో సంపన్న కుటుంబాలు కేవలం 747 (0.6 శాతం) మాత్రమే ఉన్నాయని.. మిగతా 99.4 శాతం పేద కుటుంబాలేనని అంచనా. వారంతా ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల ద్వారా తమకు లబ్ధి కల్పించాలని ఆశిస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం పెద్ద వ్యాపారం, ప్రభుత్వ ఉద్యోగం, స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్‌దారులు, కారు, భారీ వాహనాలు, 7.5 ఎకరాలకు మించి మెట్టభూమి, 3.75 ఎకరాలకంటే ఎక్కువ తరిభూమి ఉన్న కుటుంబాలు సంపన్న కేటగిరీలోకి వస్తాయి. ఈ లెక్కన సర్వే గణాంకాల ప్రకారం బ్రాహ్మణుల్లో 99 శాతం పేద కుటుంబాలుగా అంచనా వేశారు. ఈ అంశం చర్చకు రావడంతో స్పందించిన ముఖ్యమంత్రి... బ్రాహ్మణులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుగా కార్పొరేషన్ ఏర్పాటుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు ‘గ్రేటర్’ ఎన్నికల సమయం కావడంతో బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నంలో ఇదో భాగమనే విమర్శలూ వినిపిస్తున్నాయి. ఓట్ల వేటలో వరుసగా వరాల జల్లు అసలు ‘గ్రేటర్’ ఎన్నికల ప్రకటనకు ముందు నుంచే అధికార పార్టీ ఓటర్లను ఆకర్షించే చర్యలు చేపట్టింది. విద్యుత్, నల్లా బిల్లుల బకాయిలను మాఫీ చేసింది. చట్ట ప్రకారం వ్యాపారం చేసుకునే వీధి వ్యాపారులకు భద్రత కల్పిస్తామని ప్రకటించి... దాదాపు 3.08 లక్షల మందికి భరోసా ఇచ్చింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిర్ణయంతో లబ్ధిపొందే ఉద్యోగులు జంట నగరాల్లోనే అత్యధికంగా ఉన్నారు.