
సాక్షి, అమరావతి: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కీలక పదవి లభించింది. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా మల్లాది విష్ణును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు దేవదాయ శాఖ కార్యదర్శి ఉషారాణి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మల్లాది విష్ణు బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మనుగా బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారని ఉత్తర్వులో పేర్కొన్నారు. మల్లాది విష్ణును బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించడంతో ఆయన మద్దతుదారులు హర్షం వ్యక్తం చేశారు.
బ్రాహ్మణ కార్పొరేషన్ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మల్లాది విష్ణు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, సీఎం లక్ష్యాలకు అనుగుణంగా పని చేసి, బ్రాహ్మణ సామాజిక వర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. బ్రాహ్మణులకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అన్యాయం చేసిందని, ఇచ్చిన ఒక్క హామీని కూడా టీడీపీ నిలబెట్టుకోలేదని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ను భ్రష్టు పట్టించారని మల్లాది విష్ణు విమర్శించారు.
బ్రాహ్మణులకు మూడు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. వంశపారపర్యానికి ఆమోదం తెలిపి అర్చకుల కుటుంబాల్లో వెలుగులు నింపిన వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. బడ్జెట్ కేటాయింపుల్లో కూడా కార్పొరేషన్‌కు, ఆలయాల్లో ధూప, దీప నైవేద్యాలకు ముఖ‍్యమంత్రి అధిక నిధులు కేటాయించారన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌లో పెండింగ్‌లో ఉన్న కశ్యప పెన్షన్లు, భారతి స్కీమ్ సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని మల్లాది విష్ణు హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment