సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న అధికారపక్షం.. సామాజిక వర్గాల ఓట్లను చేజిక్కించుకోవడంపై దృష్టిసారించింది. జంట నగరాల్లో పెద్ద సంఖ్యలో ఓట్లు ఉన్న బ్రాహ్మణ వర్గాన్ని ఆకట్టుకునేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగం గా రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని సూచనప్రాయంగా నిర్ణయించింది. మంగళవారం క్యాంపు కార్యాలయంలో పలువురు ఉన్నతాధికారులతో భేటీ అయిన సీఎం కేసీఆర్... ఈ అంశంపై చర్చించినట్లు తెలిసింది. ‘కుల మతాలతో సంబంధం లేకుండా పేదలందరి సంక్షేమం ధ్యేయంగా ప్రభుత్వ పనితీరు ఉండాలి.
రాష్ట్రంలో అన్ని కులాల్లో ఉన్న నిరుపేదల సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించే క్రమంలో బ్రాహ్మణ సమాజంలో ఆర్థికంగా వెనుకబడినవారి కోసం ఓ ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది..’ అని ఈ సందర్భంగా కేసీఆర్ అభిప్రాయపడినట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే బ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. దాని విధివిధానాలను రూపొందించిన ఐఏఎస్ అధికారి దానకిశోర్, ప్రభుత్వ సలహాదారు రమణాచారిని తెలంగాణలోనూ అటువంటి ప్రత్యేక సంస్థ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
99 శాతానికి పైగా పేదలు!
ప్రభుత్వం వద్ద ఉన్న గణాంకాలతో పాటు సమగ్ర కుటుంబ సర్వే ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం... రాష్ట్రంలో దాదాపు 1.22 లక్షల బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయి. అందులో దాదాపు 85 వేల కుటుంబాలు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే నివాసం ఉంటున్నాయి. మొత్తం బ్రాహ్మణ కుటుంబాల్లో సంపన్న కుటుంబాలు కేవలం 747 (0.6 శాతం) మాత్రమే ఉన్నాయని.. మిగతా 99.4 శాతం పేద కుటుంబాలేనని అంచనా. వారంతా ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల ద్వారా తమకు లబ్ధి కల్పించాలని ఆశిస్తున్నారు.
ప్రభుత్వ లెక్కల ప్రకారం పెద్ద వ్యాపారం, ప్రభుత్వ ఉద్యోగం, స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్‌దారులు, కారు, భారీ వాహనాలు, 7.5 ఎకరాలకు మించి మెట్టభూమి, 3.75 ఎకరాలకంటే ఎక్కువ తరిభూమి ఉన్న కుటుంబాలు సంపన్న కేటగిరీలోకి వస్తాయి. ఈ లెక్కన సర్వే గణాంకాల ప్రకారం బ్రాహ్మణుల్లో 99 శాతం పేద కుటుంబాలుగా అంచనా వేశారు. ఈ అంశం చర్చకు రావడంతో స్పందించిన ముఖ్యమంత్రి... బ్రాహ్మణులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుగా కార్పొరేషన్ ఏర్పాటుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు ‘గ్రేటర్’ ఎన్నికల సమయం కావడంతో బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నంలో ఇదో భాగమనే విమర్శలూ వినిపిస్తున్నాయి.
ఓట్ల వేటలో వరుసగా వరాల జల్లు
అసలు ‘గ్రేటర్’ ఎన్నికల ప్రకటనకు ముందు నుంచే అధికార పార్టీ ఓటర్లను ఆకర్షించే చర్యలు చేపట్టింది. విద్యుత్, నల్లా బిల్లుల బకాయిలను మాఫీ చేసింది. చట్ట ప్రకారం వ్యాపారం చేసుకునే వీధి వ్యాపారులకు భద్రత కల్పిస్తామని ప్రకటించి... దాదాపు 3.08 లక్షల మందికి భరోసా ఇచ్చింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిర్ణయంతో లబ్ధిపొందే ఉద్యోగులు జంట నగరాల్లోనే అత్యధికంగా ఉన్నారు.
త్వరలో బ్రాహ్మణ కార్పొరేషన్!
Published Wed, Jan 13 2016 4:54 AM | Last Updated on Sun, Sep 3 2017 3:33 PM
Advertisement
Advertisement