ఆస్తి పన్ను, వాటర్, కరెంట్ బిల్లులు, చెత్త సేకరణ చార్జీలు సైతం ఒకేసారి
సక్రమంగా చెల్లించే వారికి ప్రోత్సాహకాలు
నెలనెలా చెల్లించని పక్షంలో చర్యలు
అధికారుల్లో జవాబుదారీతనం
త్వరలో అమలుకు సిద్ధమవుతున్న బల్దియా యంత్రాంగం
సాక్షి, సిటీబ్యూరో: ఆస్తి పన్ను సంవత్సరంలో రెండు దఫాలుగా ఆర్నెల్లకోసారి చెల్లించే విధానం ప్రస్తుతం అమల్లో ఉంది. ఇకనుంచి అలా కాకుండా ఏకమొత్తంలో ఆర్థిక సంవత్సరం మొదటి నెలలోనే చెల్లించేవారికి ‘ఎర్లీబర్డ్’ ద్వారా అయిదు శాతం రాయితీ సదుపాయం ఉంది. ఆస్తిపన్ను ఏడాదికో, ఆర్నెల్లకో కాకుండా కరెంటు బిల్లు మాదిరిగానే నెలనెలా చెల్లిస్తే తమకు సదుపాయంగా, పెద్ద భారంగా కనిపించకుండా ఉంటుందని భావిస్తున్నవారూ ఉన్నారు. అలాంటి వారికి సదుపాయంగా ఆస్తిపన్నును సైతం నెలనెలా చెల్లించే విధానాన్ని ప్రభుత్వం త్వరలో అందుబాటులోకి తేనుంది. అంతేకాదు.. ఆస్తిపన్ను, కరెంటు, నల్లా బిల్లులు వేర్వేరు పర్యాయాలు వేర్వేరు సంస్థలకు చెల్లించనవసరం లేకుండా ఒకే విండో ద్వారా, ఏకకాలంలో అన్ని పనులు నెలవారీగా చెల్లించే సదుపాయం కలి్పంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇంటింటి నుంచి చెత్త సేకరించే వారికి చెల్లించే మొత్తాన్ని కూడా వాటితో పాటే చెల్లించే సదుపాయం అందుబాటులోకి తేవాలనుకుంటోంది.
సీఎం ఆలోచనతో..
👉 గ్రేటర్ పరిధిలో ప్రస్తుతమున్న పన్నుల విధానాన్ని సరళీకృతం చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. సిటీలో ప్రస్తుతం ఆస్తి పన్నులను జీహెచ్‌ఎంసీ, నల్లా బిల్లులను హైదరాబాద్ జలమండలి వసూలు చేస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని నివాసాలకు నెలకు 20 వేల లీటర్ల వరకు తాగు నీటిని ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తోంది. అంతకు మించి నీటిని వాడుతున్న అపార్ట్‌మెంట్ల నుంచి మాత్రమే నల్లా బిల్లులను జలమండలి వసూలు చేస్తోంది. జీహెచ్‌ఎంసీ ఆస్తి పన్ను ఆర్నెల్లకోసారి చెల్లించే సదుపాయం ఉండగా, జలమండలి నల్లా బిల్లులను నెలకోసారి జారీ చేస్తోంది. ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించేందుకు కొన్ని ప్రాంతాల్లో నామమాత్రంగా రూ.50 వసూలు చేస్తున్నారు. ఈ బిల్లుల చెల్లింపు వినియోగదారులకు మరింత వెసులుబాటుగా ఉండేలా కొత్త విధానం ఉండాలనే తలంపులో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారు. ఇటీవల అధికారులతో చర్చల సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు.
👉 డిస్కంలు ప్రతి నెలా కరెంట్ బిల్లు పద్ధతి ప్రకా రం జారీ చేస్తున్నాయి. గడువు తేదీలోగా చెల్లించే విధానం అనుసరిస్తున్నాయి. యూపీఐ ద్వారా ఆన్‌లైన్‌లోనే ప్రతి నెలా కరెంట్ బిల్లు చెల్లించే సదుపాయం అందుబాటు లో ఉంది. దీంతో వినియోగదారులు క్రమం తప్పకుండా బిల్లులు చెల్లిస్తున్నారు. ఇదే తరహాలో ఆస్తి పన్ను, నల్లా బిల్లు, చెత్త సేకరణ బిల్లు కూడా నెల వారీగా జారీ చేసే లా కొత్త విధానం పై అధికారులు కసరత్తు చేస్తున్నారు. అలా చేయడంవల్ల ఒకేసారి ప్రజలపై ఎక్కువ ఆర్థిక భారం పడకుండా ఉంటుందని, సులభ వాయిదాల పద్ధతిలో బిల్లులు చెల్లించినట్లు ఉంటుందని వచ్చిన విజ్ఞప్తులు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న సీఎం నెల నెలా బిల్లుల జారీకి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
యూపీఐతో పాటు అన్ని ఈ పేమెంట్ ప్లాట్ ఫామ్ ల ద్వారా నెల నెలా ఈ బిల్లులు చెల్లించేలా సిటిజన్ ప్రెండ్లీ ఈజీ పేమెంట్ విధానం ఉండాలని సూచించారు.కరెంట్ బిల్లు చెల్లించకుంటే గడువు దాటిన తర్వాత అపరాధ రుసుము విధింపుతో పాటు కరెంటు కట్ చేసేలా చర్యలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. అలాగే కొత్త గా జీహెచ్‌ఎంసీ, జలమండలి అనుసరించే విధానంలోనూ ఆస్తి పన్ను, నల్లా బిల్లులకు కూడా నిరీ్ణత గడువు ఉండాలని, గడువు దాటితే ఒకదానికొకటి లింక్ ఉండేలా తగిన చర్యలకు అధికారులు కసరత్తు చేయనున్నారు.
సక్రమంగా చెల్లించేవారికి ప్రోత్సాహకాలు..
క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించే వారికి ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాంటి వారికి ఆర్థిక సంవత్సరం చివరి నెల బిల్లులో రాయితీలు ఇవ్వాలని, లేదా కాలనీల వారీగా కొందరికి బహుమతులు ఇవ్వాలనే ఆలోచనలున్నాయి. బిల్లుల చెల్లింపుల విషయంలో కచి్చతంగా ఉన్నట్లుగా అంతే బాధ్యతగా మున్సిపల్ సేవలను మహా నగర ప్రజలకు అందించే విషయంలో జవాబుదారీగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు.
భారీ బకాయిలకు అడ్డుకట్ట..
నెలనెలా ఆస్తిపన్ను విధానం వల్ల బకాయిలు పేరుకుపోకుండా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం బకాయిలపై నెలకు 2 శాతం చొప్పున పెనాల్టీ విధిస్తుండటంతో చాలామందికి అసలు కంటే పెనాలీ్టల భారం ఎక్కువ కావడంతో చెల్లించడంలేదు. ముఖ్యంగా, వాణిజ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న భవనాల యజమానులు వీరిలో ఎక్కువగా ఉన్నారు. వన్‌టైమ్ సెటిల్మెంట్‌ల ద్వారా పెనాలీ్టల్లో 90 శాతం రాయితీలిచ్చినప్పటికీ చెల్లించని వారూ ఉన్నారు. నెలనెలా చెల్లించే విధానంతో, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నందున ఆస్తిపన్ను బకాయిలు భారీగా పేరుకుపోకుండా ఉంటాయనే అభిప్రాయాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment