‘రాయపాటి అబద్దాలు చెబుతున్నారు’
హైదరాబాద్: దొనకొండలో తనకు ఎలాంటి భూములు లేవని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. దొనకొండలో తనకు భూములు ఉన్నట్టు టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశిరావు చెప్పడం పెద్ద అబద్దమని అన్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు ఏవైనా వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించుకోవాలని సూచించారు.
ఆదివారం సోమజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వానికి దమ్ముంటే రాయపాటి ఆరోపణలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం టీడీపీ నాయకులకు అలవాటైందని ధ్వజమెత్తారు. ‘చాలా సీనియర్ పార్లమెంటేరియన్ అయిన రాయపాటి వ్యాఖ్యలపై సీఎం విచారణ జరపాలి. నా మనోభావాలు దెబ్బితినడం కాదు.. ఈ ప్రభుత్వంలో చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఏమీ లేకపోయినా వందల కోట్ల రూపాయల విలువైన భూములు ఉన్నట్లు కొందరు ప్రచారం చేస్తున్నారు. నాకు దొనకొండలో ఎటువంటి భూములు లేవు. విశాఖలో కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకుని ప్రైవేటు వారికి అప్పజెప్పడం సబబు కాద’ని ఐవైఆర్ కృష్ణారావు అన్నారు.
బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ. 500 కోట్లు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ హామీయిచ్చిందని, కానీ ఇంతవరకు ఆ దిశగా ఎలాంటి చర్య తీసుకోలేదని తెలిపారు. గట్టిగా అడిగితేనే ప్రభుత్వం స్పందిస్తుందని, ముద్రగడ పద్మనాభం అడిగితేనే కాపులకు నామమాత్రపు నిధులిచ్చిందని చెప్పారు.