ఆ పోస్టులపై చర్య తీసుకోవాలి | IYR Krishna Rao complaint Governor Narasimhan | Sakshi
Sakshi News home page

ఆ పోస్టులపై చర్య తీసుకోవాలి

Published Thu, Jun 22 2017 3:14 AM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM

ఆ పోస్టులపై చర్య తీసుకోవాలి - Sakshi

ఆ పోస్టులపై చర్య తీసుకోవాలి

- గవర్నరుకు ఐవైఆర్‌ కృష్ణారావు ఫిర్యాదు
- వాటి గురించి పట్టించుకోవద్దని నరసింహన్‌ హితబోధ


సాక్షి, హైదరాబాద్‌: సామాజిక మాధ్యమాల్లో తనను అవమానించేలా, అవహేళన చేస్తూ అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని గవర్నరు నరసింహన్‌కు ఆంధ్రప్రదేశ్‌ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ ఐవైఆర్‌ కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. ఆయన బుధవారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నరును కలిశారు. ఈ సందర్భంగా కొందరు పనిగట్టుకుని తన ప్రతిష్టను దెబ్బతీసేలా దురుద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్నారని, ఇలాంటి వాటికి అడ్డుకట్టపడేలా చర్యలు  తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ‘ఇలాంటి అభ్యంతరకర పోస్టులు పెట్టినవారు, వాటిని చూపెట్టినవారు మురుగు కాలువ (డ్రెయినేజి) స్థాయి మనుషులు. మీరు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేయడమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో గౌరవ ప్రతిష్టలున్నవారు. మురుగు కాలువ స్థాయి వ్యక్తులు చేస్తున్న వాటి గురించి ఆలోచించడం ద్వారా మీ స్థాయిని తగ్గించుకోవద్దు. మీరు వాటి గురించి ఆలోచిస్తే ‘డ్రైనేజి పీపుల్‌’ స్థాయి పెంచినట్లు అవుతుంది. అసలు వాటి గురించి పట్టించుకోవద్దు..’ అని ఈ సందర్భంగా గవర్నరు ఆయనకు ఉద్బోధించారు.

రాజాజీ ఇన్‌స్టిట్యూట్‌’ అభివృద్ధికి విజ్ఞప్తి
రంగారెడ్డి జిల్లా బొల్లారంలోని రాజాజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు మేధావులతో సమావేశం ఏర్పాటు చేయాలని గవర్నరుకు ఈ సందర్భంగా భారతీయ విద్యా భవన్‌ కమిటీ (హైదరాబాద్‌) ఛైర్మన్‌ ఐవైఆర్‌ కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. బొల్లారంలోని ’రాజాజీ ఇన్‌స్టిట్యూట్‌’లో కొత్తగా పాఠశాల ఏర్పాటు చేయడంతోపాటు దీనిని బాగా అభివృద్ధి చేయాల్సిన అవసరం గురించి గతంలో కూడా ఆయన గవర్నరును కలిసి చర్చించారు. బుధవారం మళ్లీ ఇదే అంశాన్ని గుర్తు చేశారు. ‘త్వరలోనే అందరినీ పిలిచి సమావేశం ఏర్పాటు చేద్దాం. ఎలా చేస్తే బాగుంటుందో చర్చించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేద్దాం. ఈ ఇన్‌స్టిట్యూట్‌లో పాఠశాల కచ్చితంగా ఏర్పాటు చేద్దాం...’ అని గవర్నరు హామీ ఇచ్చినట్లు సమాచారం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement