
సాక్షి, హైదరాబాద్: జననేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని టీటీడీ మాజీ ప్రధానార్చకుడు రమణదీక్షితులు కలుసుకోవడంపై చవాకులు పేలుతున్నవారికి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఘాటుగా బదులిచ్చారు. శ్రీవారి నగలు మాయం కావడంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ‘ముఖ్య’నేతల ప్రమేయంపై అనుమానాలు వ్యక్తం చేసిన రమణదీక్షితులు, మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు సవాలు విసరడం తెలిసిందే. విధుల నుంచి తొలగిస్తూ టీడీపీ ప్రభుత్వం తనకు చేసిన అన్యాయాన్ని చెప్పుకునేందుకుగానూ ఆయన గురువారం హైదరాబాద్‌లో వైఎస్ జగన్‌ను కలుసుకున్నారు. ఈ భేటీపై కొందరు విమర్శలు చేయగా, ఐవైఆర్ కౌంటర్ చేశారు.
‘‘రమణదీక్షితులు గారు ప్రతిపక్ష నేత జగన్ గారిని బహిరంగంగా కలిశారు. ఒకరేమో ఇది ఆపరేషన్ గరుడలో భాగమన్నారు. మరో తీవ్రవాది మాట్లాడుతూ.. దీక్షితులుగారు జగన్‌కు పాదాకాంత్రమయ్యారని అంటాడు. వేరొక ఉగ్రవాది.. ఇరువురికీ బంధుత్వాన్ని అంటగడతాడు. ఇంకో చానెల్‌లో అయితే శ్రీ వైష్ణవులకు ఇది కూడని పని అని ఏవో వైష్ణవ సంఘాలు అన్నట్లు వార్తలు ప్రసారం చేశాయి’’ అని ఐవైఆర్ తన ట్విటర్‌లో రాశారు.
ఆపరేషన్ గరుడ.. సూపర్ ఐడియా: రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల తరచూ వినిపిస్తున్న ‘ఆపరేషన్ గరుడ’కు దర్శక, నిర్మాత, రచయిత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబేనని ఐవైఆర్ ఇదివరకే వెల్లడించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు తాను రాసుకున్న స్క్రిప్టును నటుడు శివాజీతో చెప్పించి, ఆపై ‘ఆపరేషన్ గరుడ నిజం కావచ్చు..’ అంటూ నవ నిర్మాణ దీక్షలో ఆయనే దీర్ఘాలు తీయడం కుట్రలో భాగమేనని ఆయన ఆరోపించారు.
వైఎస్ జగన్‌తో భేటీపై రమణ వివరణ: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌తో భేటీ అనంతరం టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు మీడియాతో మాట్లాడారు. ‘‘టీటీడీలో నాతోపాటు మరో ముగ్గురిని విధుల నుంచి అక్రమంగా తొలగించారు. ఇదే విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అపాయింట్‌మెంట్ కోసం చాలాసార్లు ప్రయత్నించాను. కానీ ఆయన సమయం ఇవ్వలేదు. జరిగిన అన్యాయాన్ని గురించి వైఎస్ జగన్‌కు చెప్పుకుందామనే ఇక్కడికొచ్చాను’’ అని దీక్షితులు వివరించారు. (చదవండి: వైఎస్ జగన్‌ను కలిసిన రమణ దీక్షితులు)