
మంగళవారం జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో పాల్గొన్న పాలకవర్గం
సాక్షి, తిరుపతి: టీటీడీపై గత కొంత కాలంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్న ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులుపై క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు పాలకమండలి సిద్ధమైంది. మాజీ ఈఓ ఐవైఆర్ కృష్ణారావుకు లీగల్ నోటీసులు జారీ చేయాలని, తిరుమల టీటీడీ పరువు తీసే విధంగా విమర్శలు చేసిన మరికొందరిపైనా పరువునష్టం దావా వేయాలని నిర్ణయించారు. టీటీడీ న్యాయ నిపుణుల సలహా తీసుకుని రెండు మూడు రోజుల్లో చర్యలకు దిగనున్నారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో మంగళవారం జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ అధ్యక్షతన ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ సమావేశం రమణదీక్షితులు వ్యవహారమే ప్రధాన అజెండాగా సాగింది. మాజీ ప్రధాన అర్చకులు చేసిన ఆరోపణలపై టీటీడీ పాలకమండలి సభ్యులు కొందరు అధికారులతో కలిసి ఇటీవల అమరావతికి చేరుకుని సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు.
అందులో భాగంగానే మంగళవారం మరోసారి టీటీడీ పాలకమండలి సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. అన్నమయ్య భవన్‌లో జరిగిన సమావేశంలో రమణదీక్షితులుపై క్రిమినల్ కేసులు నమోదు చేసే విషయాన్ని ప్రస్తావించిన సమయంలో ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్‌తో పాటు మరి కొందరు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ విషయంపైనే ఆయన సమావేశం నుంచి అలిగి వెళ్లారని కూడా ప్రచారం జరుగుతోంది. సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి సైతం రాలేనని తేల్చిచెప్పినట్లు తెలిసింది. అయితే ప్రభుత్వ పెద్దలు, పాలకమండలి సభ్యుల ఒత్తిడితో విలేకరుల సమావేశానికి హాజరయ్యారని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ పెద్దల సూచనల మేరకే రమణదీక్షితులుపై క్రిమినల్ కేసు నమోదు చేయటం, ఐవైఆర్ కృష్ణారావుకి నోటీసులు జారీ చేయటం, మరి కొందరిపై పరువునష్టం దావా వేయాలని నిర్ణయించారు. ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలి? పరువు నష్టం ఎంతకు వేయాలి? అనే అంశాలపై టీటీడీ న్యాయ నిపుణులతో చర్చించి రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు.
ఆభరణాల ప్రదర్శనకు ఆగమశాస్త్రం అభ్యంతరం?
ఆభరణాలు మాయమయ్యాయన్న రమణదీక్షితుల ఆరోపణలపై ఈఓ అనిల్‌కుమార్‌సింఘాల్ ఇటీవల సుధీర్ఘ వివరణ ఇచ్చారు. 1952లో రికార్డుల్లో నమోదైన ఆభరణాలన్నీ భద్రమేనని వివరించారు. ఆగమశాస్త్రం ఒప్పుకుంటే ఆభరణాలన్నీ ప్రదర్శించటానికి సిద్ధమని వెళ్లడించారు. ఆ విషయంపైనా మంగళవారం పాలకమండలి సమావేశంలో చర్చ జరిగింది. ఆగమశాస్త్రం ప్రకారం ఆభరణాల ప్రదర్శన చేయవచ్చా అన్న దానిపై పలువురు అర్చకులు, పూజారులతో సమావేశమైనట్లు తెలిసింది. వారు అభ్యంతరం వ్యక్తం చేశారని సమాచారం. ఆభరణాలను ప్రదర్శిస్తే... 1952కి ముందు ఉన్న ఆభరణాలు ఏమయ్యాయి? అనే ప్రస్తావన వస్తుందని, అనవసరంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని సలహాలు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఆభరణాల ప్రదర్శన విషయమై టీటీడీ వెనక్కు తగ్గినట్లు సమాచారం. అయితే ఈఓ విలేకరుల సమావేశంలో మాత్రం ఆగమశాస్త్రం ఒప్పుకుంటే ఆభరణాల ప్రదర్శనకు సిద్ధమని ప్రకటించారు. అదే విధంగా రమణదీక్షితులు సీబీఐ విచారణకు సిద్ధమని ప్రకటించిన విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా... సమాధానం దాటవేశారు.
తిరుమలకు రా తేల్చుకుందాం
ఇరవై ఏళ్లుగా తిరుమలలో పనిచేసి దేవుడిపై అప ప్రచారం చేస్తావా? చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్‌లో కూర్చొని చెప్పటం కాదు. తిరుమలకు రా తేల్చుకుందాం. దేవుడే నీకు గుణపాఠం చెబుతారు’ అని టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులుపై తీవ్రస్తాయిలో ఆగ్రహం వ్యక్తం చేయటం గమనార్హం.
శ్రీవారి భక్తులకు మరింత భద్రత
శ్రీవారి భక్తులకు మరింత భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ చైర్మెన్ పుట్టా సుధాకర్‌యాదవ్ ప్రకటించారు. టీటీడీ బోర్డు సమావేశం తీర్మానాలను ఆయన వెల్లడించారు. ఇవీ ప్రధానాంశాలు.
- భక్తుల కోసం టీటీడీ నిఘా, భద్రతా ఆధ్వర్యంలో కామన్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు రూ.1.60 కోట్లు మంజూరు. నిర్వాహణ బాధ్యతను హైదరాబాద్‌కు చెందిన మ్యాట్రిక్ సెక్యూరిటీస్, సర్వీసెస్ కంపెనీకి అప్పగింత.
- దళిత, గిరిజన వాడలు, మత్స్యకార కాలనీలు ఇతర గ్రామాల్లో శ్రీవేంకటేశ్వరస్వామి, శ్రీరామ ఆలయాల నిర్మాణానికి ఇచ్చే నిధులను రూ.8లక్షల నుంచి రూ.10లక్షలకు పెంపు.
- చిత్తూరు జిల్లా నాగలాపురం ఆలయ ప్రాముఖ్యతను చాటిచెప్పేందుకు అక్కడ వేదపాఠశాల ఏర్పాటు.
- 2018–19 సంవత్సరానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆసుపత్రులు, వాటి అనుసంధాన ఆసుపత్రుల్లో మందులు, సర్జికల్ పరికరాల కొనుగోలుకు రూ.4.84 కోట్లు మంజూరు.
- తిరుపతిలోని అలిపిరి వద్ద టాటా ట్రస్టు ఆధ్వర్యంలో క్యాన్సర్ ఆసుపత్రికి (అలిమేలు చారిటబుల్ ట్రస్టు పౌండేషన్) 33 సంవత్సరాల పాటు లీజుకు 25 ఎకరాల స్థలం కేటాయింపు. ఏడాదికి ఎకరాకు రూ.లక్ష లీజుగా నిర్ణయించారు.
- తిరుపతి– చెర్లోపల్లి మధ్య మార్గంలో సైన్స్ మ్యూజియంకు 19.15 ఎకరాలు, సైన్స్‌సిటీకి 50.96 ఎకరాలను కేటాయింపు.
- తిరుమలలో ధర్మగిరి వేదపాఠశాలలో వేద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఇచ్చే తరహాలోనే శ్రీవేంకటేశ్వర వేద యూనివర్సిటీలో వేద విద్యను అభ్యసించే విద్యార్థులకు రూ.3లక్షలు డిపాజిట్.
- ఎస్వీ వేద విద్యాలయం ఆధ్వర్యంలో శ్రీబాలాజీ వేదపరిపోషణ ట్రస్టు ఏర్పాటు. దీనికి విరాళాలు అందించే భక్తులకు బస, స్వామివారి దర్శనం.
- ఆంధ్రప్రదేశ్‌లోని పాల ఉత్పత్తిదారులను ప్రోత్సహించాలని నిర్ణయం.
- 29 మంది ఇంజనీరింగ్ మజ్దూర్లకు హెడ్ మజ్దూర్లుగా పదోన్నతి.
Comments
Please login to add a commentAdd a comment