ramana deekshitulu
-
అఖండ దీపంపై వదంతులను నమ్మొద్దు..
తిరుమల: తిరుమలలో అఖండ దీపంపై వదంతులను నమ్మొద్దని టీటీడీ ఆగమశాస్త్ర సలహాదారు రమణ దీక్షితులు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సుప్రభాతం నుంచి ఏకాంతసేవ వరకు అఖండ దీపం వెలుగుతూనే ఉంటుందన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. - శ్రీవారి సన్నిధిలోని అఖండ దీపం ఆరిపోయిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇది వాస్తవం కాదు. - కరోనా వైరస్‌ను కట్టుదిట్టం చేయడానికి తిరుమలకు కూడా భక్తులకు ప్రవేశం లేకుండా రహదారులను మూసివేశారు. - ఆలయంలో శ్రీవారికి జరగాల్సిన ఆగమోక్తమైన కైంకర్యాలన్నీ జరుగుతున్నాయి. - గర్భాలయంలో రెండు అఖండ దీపాలుంటాయి. అవి బయట నుంచి భక్తులకు కనిపించవు. గర్భాలయంలో రెండు నిలువెత్తు వెండి దీపాలు రెండు మూలల్లో ఉంటాయి. ఇవి కాకుండా రెండు నందా దీపాలు స్వామి వారికి ఇరువైపులా వేలాడుతూ కనిపిస్తాయి. ఈ అఖండ దీపాలను ఉదయం సుప్రభాతంలో అర్చకులు బంగారు వాకిలి తలుపులు తెరిచి గర్భాలయ ప్రవేశం చేసినప్పుడు పరిచారకులు వెలిగిస్తారు. - రాత్రి ఏకాంత సేవలో స్వామివారు వేంచేసినప్పడు ఈ దీపాలను ఆర్పివేస్తారు. మళ్లీ మరుసటి రోజు ఉదయం సుప్రభాతంలో తిరిగి వెలిగిస్తారు. - శ్రీవారి దేవాలయానికి ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద అఖిలాండం అని భక్తులు పిలుచుకునే దీపారాధన ఉంది. ఆలయానికి ఎదురుగా ఉన్న అఖిలాండం వద్ద భక్తులు కర్పూరం వెలిగించి, కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు తీర్చుకుంటారు. - ఇప్పుడు భక్తులు లేకపోవడంతో అఖిలాండం వద్ద కర్పూర దీపం ఆరిపోయింది.. ఇదీ వాస్తవం. - అఖిలాండం ఆరిపోవడాన్ని అపచారంగానూ, లేక వైపరీత్యంగానూ భావించి పూజలు జరపాలని కొందరు సృష్టిస్తున్న వదంతుల్ని భక్తులు నమ్మోద్దు. -
ఈ పాలకులకు దేవుడంటే భయం లేదు
‘అసలు ఆభరణాల స్థానంలో నకిలీ ఆభరణాలు.. పోటులో రహస్య తవ్వకాలు.. క్రమం తప్పిన కైంకర్యాలు.. కుదించుకుపోయిన సేవా కార్యక్రమాలు.. వెరసి విశ్వ విఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట మంటగలిపేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది. భక్తుల మనోభావాలు దెబ్బతింటాయన్న జంకే లేకుండా దైవ భక్తినీ అభాసుపాలుజేసింది. దేవుడి సొమ్మునూ కాజేసేందుకు యత్నాలు సాగించి అప్రతిష్టను మూటగట్టుకుంది. అర్చకులను హీనంగా చూడటంతో పాటు సంప్రదాయాలకు పాతరేసింది. ఈ పాలకులకు దేవుడంటే భయం లేదు.. అర్చకులు, భక్తులంటే లెక్కే లేదు’ – టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు టీడీపీ అధికారంలోకి వచ్చాక టీటీడీలో నాస్తిక అధికారుల పెత్తనం ఎక్కువైంది. వీరికి దేవుడిపై భక్తి, భయం, నమ్మకం లేదు. సంప్రదాయాలు, ఆగమ శాస్త్రంపై గౌరవం లేదు. ఆగమశాస్త్ర ప్రకారం తోమాల సేవ 45 నిమిషాలు నిర్వహించాలి. వీఐపీల కోసం 10 నిమిషాల్లో ముగించాలని ఒత్తిడి తెస్తున్నారు. సహస్ర నామార్చన 45 నిమిషాల పాటు చేయాల్సి ఉంటుంది. 15 నిమిషాల్లో ముగించేస్తున్నారు. నైవేద్యం సమర్పించాలంటే గంట సమయం పడుతుంది. దానినీ 10 నిమిషాల్లో కానిచ్చేయాలని ఆదేశిస్తున్నారు. ఆగమ శాస్త్రంలో పేర్కొన్న కాల ప్రమాణాల ప్రకారం మొదటి నైవేద్యం వేకువజామున 5.30 గంటలకు సమర్పించాలి. రెండో నైవేద్యం 11–12 గంటల మధ్య పెట్టాలి. ఉదయం 6 గంటలకే రెండో నైవేద్యం సమర్పించేలా అర్చకులపై ఒత్తిడి తెస్తున్నారు. అప్పటినుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీవారికి నైవేద్యం పెట్టకుండా పస్తులు ఉంచుతున్నారు. వీఐపీల మెప్పు కోసం నైవేద్యం, పూజా కైంకర్యాల కాలాన్ని కుదిస్తున్నారు. ఈ పరిస్థితిని ఉన్నతాధికారులు, పాలక మండలికి నివేదించినా ప్రయోజనం లేదు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదు. అర్చకులకు వైఎస్ హయాం స్వర్ణయుగం ఆలయాల్లో వంశపారంపర్య అర్చకత్వాన్ని పునరుద్ధరిస్తామని, అన్ని ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు లోటు రాకుండా చూస్తామని వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారు. అర్చకుల జీవనానికి, భృతికి అవసరమైన చర్యలు తీసుకుంటామని మాటిచ్చి మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే వంశపారంపర్య అర్చకత్వాన్ని పునరుద్ధరించి, అర్చక హక్కులు, మర్యాదలను కాపాడారు. ఊరు వదిలి వెళ్లిన అర్చకులందరినీ పిలిపించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ధూప, దీప, నైవేద్య, పూజా కైంకర్యాలకు అవసరమైన చర్యలు చేపట్టారు. వారి జీవన భృతికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. ఆయన హయాంలో నియమించిన శ్రీవారి ఆలయ ధర్మకర్తల మండళ్లు, ఐఏఎస్ అధికారులు ఆలయ సంప్రదాయాలను కాపాడటంతోపాటు నిత్య కైంకర్యాలను ఆగమ శాస్త్ర ప్రకారం జరిపించేందుకు కృషి చేశారు. దురదృష్టవశాత్తు ఆయన మరణంతో అర్చక వ్యవస్థ, ఆలయ సంప్రదాయాల మనుగడకు ప్రమాదం ఏర్పడింది. (తిరుమల రవిరెడ్డి)సాక్షి, తిరుపతి: రాష్ట్ర ప్రభుత్వ తీరుతో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట మంటగలుస్తోందని టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. భగవంతుడన్న భయమే లేకుండా అరాచకాలకు తెగబడిందని నిప్పులు చెరిగారు. కొన్నేళ్లుగా తిరుమలలో సాగిన అక్రమాల పర్వాన్ని ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎండగట్టారు. సాక్షి: పింక్ డైమండ్‌తో పాటు వజ్రాలు, వైఢూర్యాలు పోయాయని ఆరోపించారు. గోవిందరాజస్వామి ఆలయంలోని కిరీటాలు మాయమయ్యాయని అన్నారు? రమణ దీక్షితులు: అవును. మైసూరు మహారాజు ఇచ్చిన ప్లాటినమ్ హారంలో (నడిమి నాయకం) గులాబీ రంగు వజ్రం ఉండేది. ఉత్సవాల్లో భక్తులు విసిరిన నాణేల కారణంగా డైమండ్ పగిలిపోయిందని రికార్డు చేశారు. ఆ సమయంలో డాలర్ శేషాద్రి ఇన్చార్జ్. నాణేలు తగిలి డైమండ్ పగిలిపోయిందనటం విచిత్రమైన సమాధానం. పింక్ డైమండ్‌ను చాలా పెద్దమొత్తానికి జెనీవాలో నిర్వహించిన వేలంలో అమ్ముకున్నారు. గోవిందరాజస్వామి ఆలయంలో మాయమైన కిరీటాల విలువపైనా అనుమానం ఉంది. మొదట కిరీటాల విలువ రూ.వందల కోట్లు అన్నారు. ఆ తరువాత వాటి విలువ చాలా తక్కువ అన్నారు.కిరీటాలు ఏమయ్యాయో ఇప్పటికీ వెలుగు చూడలేదు. సాక్షి: శ్రీవారి ఆలయంలో తవ్వకాలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎందుకంత రాద్ధాంతం జరిగింది? రమణ దీక్షితులు: 2017 డిసెంబర్లో చిన్నపాటి మరమ్మతుల పేరిట 25 రోజులు పోటును మూసివేశారు. ఆ సమయంలో వేరేచోట ప్రసాదాలు తయారు చేశారు. అలా చేయటం అపవిత్రం. దీనివల్ల స్వామివారు 25 రోజులు నైవేద్యాన్ని స్వీకరించలేదు. లోపల గోడల్ని పగులగొట్టి, రాళ్లన్నీ తొలగించిన తవ్వకాలను చూసి ఆశ్చర్యపోయాను. చాలా బీభత్సంగా తవ్వేశారు. భయమేసింది. దీనిపై ఈవోను అడిగితే తెలియదన్నారు. తరువాత 24 గంటల వ్యవధిలో హడావుడిగా పూడ్చివేశారు. ఆ సమయంలో క్షుద్రపూజలు జరిగినట్టు తెలిసింది. 1990లో కప్పు కూలిపోతుందని ఇనుప స్తంభాలు పెట్టి నిలబెట్టారు. బంగారు వాకిలికి 15 అడుగుల దూరంలో.. గర్భాలయానికి, ఆనంద నిలయానికి చాలా దగ్గరలో ఇది ఉంది. వెయ్యేళ్ల క్రితం నాటి ప్రాచీన కట్టడంలో ఇంత పెద్దఎత్తున మరమ్మతులు చేయటం వల్ల గర్భాలయం దెబ్బతినే ప్రమాదముంది. జేఈఈ చిన్న మరమ్మతే అన్నారు. గట్టిగా అడిగితే.. తనకు ఉత్తర్వులు వచ్చాయన్నారు. ఈవో తనకు తెలియదన్నారు. ఆలయంలో ఇంత అపచారం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేక నిలదీశాను. మీడియా ముందుకు వచ్చాను. అందుకే నా పదవీ విరమణ అంశాన్ని తెరపైకి తెచ్చారు. సాక్షి: కనిపించకుండా పోయిన ఆభరణాలకు విలువ కట్టి, బాధ్యుల నుంచి రాబడుతున్నారా? రమణ దీక్షితులు: 1996 తరువాత ఏ ఆభరణాలు ఉన్నాయి? ఏవి లేవు? అనేది ఎవరికీ తెలియటం లేదు. ఎన్నిసార్లు వాటిని సరిచూశారు? వాటిలో హెచ్చుతగ్గులేమైనా ఉన్నాయా? ఉంటే ఎవరు బాధ్యత వహిస్తున్నారు? విలువ తగ్గి ఉంటే ఎవరి వద్ద, ఎంత కట్టించుకున్నారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. 22 ఏళ్లుగా ఏం జరుగుతోందో ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. సాక్షి: గుప్త నిధుల కోసమే తవ్వకాలు జరిపారని మీరూ ఆరోపించారు? అసలేం జరిగింది? రమణ దీక్షితులు: అవును. విలువైన ఆభరణాలు ఉన్నాయి కాబట్టే ఆలయంలో కొన్ని చోట్లకు భక్తులను అనుమతించరు. వెయ్యికాళ్ల మండపం కింద వెయ్యి అడుగుల పొడవు, 30 అడుగల వెడల్పుతో పెద్ద భాండాగారం ఉంది. ఆలయం పోటు వద్ద పల్లవులు, చోళులు, పాండ్యులు, మరికొందరు రాజులు స్వామి వారికి 18 లక్షల మొహర్లతో చేసిన కనకాభిషేకం ఆభరణాలు, మరో 18 లక్షల మొహర్లతో 9.50 అడుగుల మూలవరుల ఆభరణాలన్నీ భాండాగారంతో పాటు ఆలయ రహస్య ప్రదేశాల్లో దాచి ఉంచారనే విషయం తెలుసుకుని ఈ తవ్వకాలు జరిపారు. వెయ్యికాళ్ల మండపం కూల్చివేసిన సమయంలో నాలుగు భోషాణాల్లో ఆభరణాలు లభ్యమైనట్టు తెలిసింది. మిగిలిన ఆభరణాల కోసం మహా సంప్రోక్షణ సమయంలో తొమ్మిది రోజులపాటు భక్తులకు అనుమతి లేదని ప్రకటించారు. ఇది మీడియాలో రావటం, భక్తుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావటంతో వెనకడుగు వేశారు. సాక్షి: ఆభరణాలు మాయం అయ్యాయంటున్నారు. వాటి స్థానంలో నకిలీవి అలంకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మీరేమంటారు? రమణ దీక్షితులు: నిజమే. నకిలీ రత్నాలతో చేసిన ఆభరణాలను దాతల నుంచి స్వీకరిస్తున్నారు. ఇందులో బొక్కసం సిబ్బంది ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రాచీనమైన నవరత్నాల ఆభరణాలకు బదులు నకిలీవి ఎక్కువగా వాడటం గమనిస్తున్నాం. మూలవరులు, ఉత్సవరులు, అమ్మవార్ల విగ్రహాలకు సంబంధించిన అనేక ఆభరణాలను నకిలీ రత్నాలతో చేయించారు. మొన్నటి బ్రహోత్సవాల్లో ప్రాచీన ఆభరణాలు అసలు కనిపించలేదు. నకిలీ రత్నాలతో చేయించిన కొత్త ఆభరణాలనే వినియోగించారు. సాక్షి: అర్చకులెవరికీ పదవీ విరమణ ఉండదని చెప్పారు. ఇప్పుడేమో ఆ అంశాన్ని తెరపైకి తెచ్చారెందుకని? రమణ దీక్షితులు: వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన చట్టాలన్నిటినీ చంద్రబాబు అధికారంలోకి రాగానే రద్దు చేశారు. వంశపారంపర్య హక్కుల్లో అర్చకులకు పదవీ విరమణ లేదని శాస్త్రంతోపాటు సుప్రీం, హైకోర్టు కూడా చెప్పాయి. ఆలయ సంప్రదాయంలో వేల సంవత్సరాల్లో ఎక్కడా పదవీ విరమణ అనేది లేదు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రమే పదవీ విరమణను తెరపైకి తెచ్చింది. అప్పట్లో జేఈవో బాలసుబ్రహ్మణ్యం, ఇప్పుడున్న శ్రీనివాసరాజు ఇద్దరూ పరమ నాస్తికులు. బ్రాహ్మణ ద్వేషులుగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరూ అన్యమతాన్ని ప్రోత్సహించేవాళ్లే. నైవేద్యాలు, కైంకర్యాలను శాస్త్రోక్తంగా జరపనివ్వకుండా వీళ్లే అడ్డుపడుతున్నారు. సాక్షి: రాష్ట్రంలో అర్చకుల పరిస్థితి ఎలా ఉంది? రమణ దీక్షితులు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 34 వేల ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులు, వారి కుటుంబాలు దుర్భర స్థితిలోకి నెట్టబడ్డాయి. 6ఏ ఆలయాల్లో అర్చకుల పరిస్థితి కొంత బాగున్నా.. మిగిలిన ఆలయాల్లో పనిచేస్తున్న వారు దయనీయ జీవితం గడుపుతున్నారు. అంతకుముందు వంశపారపర్య అర్చకత్వం వల్ల వచ్చిన కొద్దిపాటి వరంబడి, వైదిక సంస్కృతి, ఆగమ సంప్రదాయాలు వల్ల వచ్చే వరంబడులు, ప్రసాదాల్లో కొంత భాగం, అర్చన, హారతి సమయంలో భక్తులు పళ్లెంలో వేసే కానుకల ద్వారా వారి జీవితాలు బాగా గడిచేవి. ఎన్టీఆర్ తెచ్చిన మిరాశీ అబాలిష్ చట్టంతో అర్చకులు వాటిక్కూడా దూరమయ్యారు. ప్రభుత్వం జీతభత్యాలు కూడా ఇచ్చే అవకాశం లేకపోవటంతో 75 శాతం ఆలయాలు మూతపడ్డాయి. చాలామంది అర్చకులు జీవన భృతి కోసం వేరే వృత్తుల్లోకి వెళ్లారు. దీనివల్ల ఎన్నో ఆలయాలు ధూప, దీప, నైవేద్యాలకు దూరమయ్యాయి. టీడీపీ హయాంలో అర్చకులకు ఏపాటి గౌరవ, మర్యాదలు లేక చాలా కష్టాలు పడుతున్నారు. సాక్షి: జీవో నంబర్ 855 ప్రకారం తిరుమల అర్చకుల సర్వీసును రెగ్యులర్ చేస్తామని, పీఆర్సీ కింద వేతనాలు ఇచ్చి రిటైర్మెంట్కు అవకాశం కల్పిస్తామని చెబుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? రమణ దీక్షితులు: ఈ జీవోనే పెద్ద కుట్ర. అర్చకుల మధ్య చిచ్చుపెట్టిన జీవో అది. ఒక్కొక్క కుటుంబంలో సీనియర్ మోస్ట్ అర్చకులను ప్రధాన అర్చకులుగా నియమించారు. తరువాత ప్రధాన, ఉప ప్రధాన అర్చకులు, ముఖ్య అర్చకులుగా విభజించారు. అదేవిధంగా నాతోపాటు మరో ముగ్గురిని ప్రధాన అర్చకులుగా నియమించి మా కుటుంబాల మధ్య చిచ్చుపెట్టారు. నాకు రిటైర్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం ప్రధాన అర్చక హోదా కోసం కొట్టుకుంటున్నారు. ఆలయంలో జేఈవో, మరికొందరు కింకరులు చిచ్చుపెట్టారు. గతంలో ప్రధాన, ముఖ్య అర్చక పోస్టులే లేవు. అందరినీ మిరాశీదారులు అని పిలిచేవాళ్లం. వయసు, అనుభవానికి గౌరవం ఇచ్చేవారు తప్ప.. చిన్నాపెద్ద భేదం ఉండేది కాదు. ఆ జీవో ద్వారా ఒకరిని ప్రధాన అర్చకులుగా చేసి మిగిలిన వారిలో ఈర‡్ష్య, ద్వేషం పెంచింది ఈ ప్రభుత్వమే. వేతనాలు కూడా ఇవ్వలేదు. సాక్షి: చిన్న ఆలయాలకు తిరుమల నుంచి సుమారు రూ.500 కోట్లు బకాయిలు ఉన్నాయని అర్చక సమాఖ్య నేతలు చెబుతున్నారు. ఇందులో నిజమెంత? రమణ దీక్షితులు: వైఎస్ రాజశేఖరరెడ్డి 6ఏ ఆలయాల నుంచి ఏటా కొంత మొత్తాన్ని చిన్న ఆలయాలకు ఇచ్చేవారు. ఆ నిధులు ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలు, అర్చకుల వేతనాలకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేశారు. ఇప్పుడా పరిస్థితి లేదు. భక్తుల ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని ప్రభుత్వం తీసుకుంటోంది. 2014లో టీటీడీకి రూ.965 కోట్ల ఆదాయం రాగా.. రూ.900 కోట్లను డిపాజిట్ చేశారు. 2018–19 సంవత్సరంలో రూ.1,600 కోట్లు పైచిలుకు వస్తే.. అందులో రూ.1,600 కోట్లు తినేసి రూ.20, రూ.30 కోట్లు మాత్రమే బ్యాంక్‌లో డిపాజిట్ చేయటమే ఇందుకు నిదర్శనం. టీటీడీ నిధులను అతిథి గృహాల నిర్మాణానికి, అమరావతిలో ఆలయాల నిర్మాణానికి కేటాయిస్తున్నారు. ఇలా టీటీడీ నిధులు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. కానీ.. చిన్న ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. సాక్షి: ఆలయాలపై ప్రభుత్వ పెత్తనం తగ్గించాలని హైకోర్టులో వ్యాజ్యం వేశారు. దానిపై మీరేమంటారు? రమణ దీక్షితులు: మీకు ముందే చెప్పా. టీటీడీ నిధులు పక్కదారి పడుతున్నాయని. వ్యక్తిగత ప్రయోజనాల కోసం టీటీడీ నిధులను వినియోగిస్తున్నారు. ఎక్కడో నిర్మిస్తున్న వాకింగ్ ట్రాక్‌లకు ఆలయ నిధులు ఇవ్వడమేంటి. వారికి కావాల్సిన కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చడానికి టీటీడీ నిధులను ఖర్చుచేస్తున్నారు. ఆలయాలపై ప్రభుత్వ పెత్తనం అధికమైందన్నది వాస్తవం. న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులనే అమలు చేయటం లేదు. సమాచార హక్కు చట్టం కింద ఏదైనా సమాచారం అడిగితే ఇవ్వటానికి లేదంటున్నారు. టీటీడీని పూర్తిగా టీడీపీ సంస్థగా మార్చేసుకున్నారు. తిరుమలను టీడీపీ కార్యాలయంగా మార్చుకున్నారు. ఒక ఐఏఎస్ అధికారి కూడా పూర్తిగా టీడీపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు. ఆయనను బదిలీ చెయ్యకుండా మళ్లీ ఏడాది పొడిగించారు. -
నన్ను విధుల్లోకి తీసుకోండి..
తిరుమల: అర్చకుల వయోపరిమితి వివాదం టీటీడీని ఇప్పట్లో వీడేలా లేదు. తిరుచానూరు ఆలయంలో మిరాశీ అర్చకులకు వయోపరిమితి లేదంటూ.. వారిని విధుల్లోకి తీసుకోవాలని టీటీడీని హైకోర్టు ఇటీవల ఆదేశించిన నేపథ్యంలో అవే నిబంధనలను తమకూ వర్తింపచేయాలని శ్రీవారి ఆలయ మాజీ ప్రధానార్చకుడు రమణదీక్షితులు టీటీడీ ఈవోకు రెండు రోజుల కిందట లేఖ రాశారు. దీంతో అర్చకుల వివాదం ఒక్క పట్టాన తెగేలా లేదు. 1986లో మిరాశీ వ్యవస్థ రద్దు చేసినప్పటి నుంచి కూడా కోర్టుల చుట్టూ అర్చకుల వివాదం తిరుగుతూనే ఉంది. ఈ ఏడాది మే నెలలో అర్చకులకు 65 ఏళ్ల వయోపరిమితి నిబంధనలను అమలు చేయాలని టీటీడీ బోర్డు.. అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఫలితంగా శ్రీవారి ఆలయంలో ప్రధానార్చక హోదాలో ఉన్న నలుగురు మిరాశీ అర్చకులతో సహా.. తిరుచానూరు ఆలయంలోని అర్చకులతో పాటు దాదాపు 20 మంది అర్చకులకు ఉద్వాసన పలికారు. మిరాశీ అర్చకులకు వయోపరిమితి నిబంధన అమలు చేయడం సబబు కాదంటూ వారు కోర్టును ఆశ్రయించారు. రమణ దీక్షితుల ఉద్వాసనకే.. టీటీడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన రమణదీక్షితులను సాగనంపేందుకే అన్నట్లుగా 65 సంవత్సరాల వయోపరిమితి నిబంధనను పాలకమండలి తెరపైకి తెచ్చింది. శ్రీవారి ఆలయంలో ఏడుగురు, తిరుచానూరు అమ్మవారి ఆలయంలోని ఇద్దరు అర్చకులను ఉద్యోగ విరమణ చేయించారు. తిరుచానూరు అమ్మవారి ఆలయ అర్చకులు హైకోర్టునాశ్రయించగా.. శ్రీవారి ఆలయ అర్చకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ దశలో ఉండగానే.. హైకోర్టులో మాత్రం తిరుచానూరు అమ్మవారి ఆలయ అర్చకులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. మిరాశీ అర్చకులకు రిటైర్మెంట్ అనేదే లేదని, పనిచేసే శక్తి ఉన్నన్నాళ్లు వారిని సంభావన అర్చకులుగా అర్చకత్వానికి అనుమతించాలని టీటీడీని హైకోర్టు ఆదేశించింది. అయితే ఇదే తీర్పును తమకు అమలుజేయాలని రమణదీక్షితులు టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌కు వెంటనే లేఖ రాశారు. హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లే ఆలోచనలో ఉన్న టీటీడీ.. రమణదీక్షితుల వ్యవహారంలో ఎలా ముందుకెళుతుందోనన్నది ఆసక్తిగా మారింది. సుప్రీంకోర్టులో కేసు తేలే వరకు మిరాశీ అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకునే పరిస్థితి మాత్రం ప్రస్తుతానికి టీటీడీలో కనిపించడం లేదు. రమణదీక్షితులు పక్షాన రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యంస్వామి కూడా హైకోర్టులో కేసును దాఖలు చేశారు. రమణదీక్షితులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ దశలోనే ఉంది. ఈ నేపథ్యంలో లేఖను పరిశీలించిన టీటీడీ.. న్యాయశాఖకు పంపినట్లు సమాచారం. -
ఏది జరిగినా మన మంచికే
రెప్పపాటు కాలం శ్రీవారిని సందర్శిస్తే చాలు కొండంత సంతోషం. జీవితకాలం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం.. గంటల తరబడి క్యూలలో వేచి స్వామివారిని దర్శించుకున్నాక భక్తులు పొందే అనుభూతి ఇది. అలాంటిది నిమిషం కాదు..గంట కాదు..రోజు కాదు.. మాసం కాదు.. మూడున్నర దశాబ్దాల పాటు సాక్షాత్తూ శ్రీవారి చెంతనే గడిపే మహద్భాగ్యం పొందిన వ్యక్తి ఏవీ రమణ దీక్షితులు. ఆలయ ప్రధాన అర్చకుడిగా పనిచేసి నాలుగు నెలలుగా విశ్రాంత జీవితం గడుపుతున్న ఆయన శ్రీవారితో తనకున్న అనుబంధాన్ని సాక్షితో పంచుకున్నారు. నాన్నగారు గొల్లపల్లి వెంకటపతి దీక్షితులు. నియమ నిష్టల మధ్య పెంచారు. ఎప్పటికైనా స్వామి వారి అర్చకుడిగా ఉండాలన్న భావనతోనే నన్ను తీర్చిదిద్దారు. మడి కట్టుకోవడం నుంచి అన్ని కట్టుబాట్లు అలవాటుగా మారాయి. తిరుపతిలోనే బీఎస్సీ చదివా. సైన్స్ అంటే ఇష్టం. జువాలజీ ప్రధానాంశంగా ఎమ్మెస్సీ చేశాను. ఒకపక్క సైన్స్.. మరోపక్క శ్రీవారు. రెండు అంశాలూ మనసులో నిండి ఉండేవి. ఈ విషయంలో వైరుధ్యం లేదు. భక్తి కూడా సైన్సే అని విశ్వాసం. మాలిక్యులర్ బయాలజీలో డాక్టరేట్ పూర్తయింది. 1974లో నాన్నగారు పరమపదించారు. కుటుంబ వారసత్వంగా తిరుమల సేవకు వచ్చేశాను.1977లో లివర్ క్యాన్సర్‌పై పరిశోధనకు అమెరికా నుంచి పిలుపు వచ్చినా వెళ్లలేదు. ఆగమశాస్త్ర ప్రకారం సముద్రయానం చేయకూడదు. మ్లేచ్ఛ దేశాలకు వెళ్లితే ధర్మ భ్రష్టత్వం జరుగుతుందని శాస్త్రం చెబుతోంది. అందుకే వెళ్లలేదు. ఏమని చెప్పను... స్వామివారి సేవకు దీర్ఘకాలం అంకితమయ్యాను. ఆ మూలమూర్తితో బంధం ఏమని చెప్పను. అత్యంత సన్నిహిత సంబంధం మాది. ఒక్కొక్కసారి ఆయనతో వాదన చేస్తుంటాను. స్వామి అలుగుతుంటారు.అప్పుడప్పుడూ స్వామితో విభేదిస్తుంటాను. మళ్లీ మామూలే. మాది తాత, మనవడి సంబంధంగా సాగింది. ఒక్కోసారి తాతగారు మనవడితో కలిసి ఆడుతూ పాడుతూ ఆనందిస్తుంటారు. కొడుకు కంటే మనవడి మీదే తాతగారికి ప్రేమ ఎక్కువుంటుంది. మాదీ అంతే. ప్రధానార్చకుడు.. దానివల్ల వచ్చిన గౌరవం, వేతనాలు.. ఇలా భౌతికంగా లభించే రూపాలన్నింటినీ పక్కనబెడితే... ఆత్మార్పణగా స్వామివారితోనే ఉన్నాను. స్మరించుకుంటే ఎదురుగా నిలబడతారు. ఎదురెదురుగా నిలబడి ఒకరితో ఒకరు సంభాషించుకుంటాం. కైంకర్యాల వేళ బిడ్డ.. ఆగమోక్తంగా స్వామివారికి సమయానుసారం కైంకర్యాలు చేయాలి. సుప్రభాతం నుంచి ఏకాంత సేవ దాకా.. మంత్రాశనం, స్నానాశనం, అలంకారాశనం, యాత్రాశనం, భోజ్యాశనం, శయనాశనం అనే ఆరు దశలుంటాయి. స్వామివారు మంత్రాధీనం. గర్భాలయంలో ప్రవచించే వేదమంత్రాల వల్లే ప్రశాంతత నెలకొంటుంది. గర్భాలయంలోనూ తరంగాలుంటాయి. అందుకే మంత్రయుక్తంగా, శాస్త్రోక్తంగా జరిపితేనే స్వామి వారు సంతృప్తి చెందుతారు. ఆగమ శాస్త్రం ప్రకారం అన్నసూక్తంతో ప్రసాదాలను సమర్పించాలి. ప్రసాదాన్ని పవిత్రం చేయాలి. దీనివల్లే పుష్టి, తేజస్సు, దృఢత్వం లభిస్తాయి. కుడిచేతి గ్రాస ముద్రతో ప్రసాదాన్ని తాకి స్వామి కుడిచేతిని తాకిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే గోరుముద్దలు తినిపించడమన్నమాట. మంచినీళ్లిస్తాం. అభిషేకం చేసేటప్పుడు, ఆరగింపు చేసేటప్పుడు స్వామిని బిడ్డగా చూసుకుంటాం. అందుకే కైంకర్య సమయాన కన్నతల్లిగా మారిపోతాం. మిగిలిన వేళల్లో స్వామివారే యజమాని. మేమంతా సేవకులమే. సక్రమంగా జరపకపోతే అపచారం ఆగమోక్త సంప్రదాయం ప్రకారం ఆలయంలో అన్నీ జరగాలి.. అపసవ్యం జరగకూడదు. ముఖ్యంగా కైంకర్యాలన్నీ పద్ధతిప్రకారం సకాలంలో నిర్వర్తించాలి. వీఐపీలొస్తున్నారనో.. భక్తుల సంఖ్య పెరిగిందనో ఆగమేఘాలపై నిర్వహించలేం. స్వామి కార్యక్రమంలో అతి కీలకమైనది ప్రసాదం. అది కూడా ఆయనకు సక్రమంగా నింపాదిగా ఇవ్వకపోతే ఎలా.. చాలా సందర్భాల్లో ఇలాంటివి అధికారుల ఒత్తిళ్ల నుంచి ఎదుర్కొన్నాం. నా వరకూ ఏనాడూ ఇవి చెవులకు సోకకుండా కైంకర్య బాధ్యతలను నిర్వహించగలిగాను. స్వామివారు ప్రసన్నంగా ఉండాలి. అప్పుడే భక్తులకు మంచి జరుగుతుంది. ఆగమశాస్త్రంపై కనీస అవగాహన.. దైవ నియమాలు.. భక్తి.. సంస్కృతులపై నమ్మకం లేని అధికారులుంటే మంచిది కాదు. ఆ స్వామి చలవతోనే టీటీడీ అన్న విషయం మరువకూడదు. ఆగమోక్తంగా కైంకర్యం కూడా నిర్వహించకపోతే అపచారం. త్వరలోనే తెలుగు అనువాదం సా«ధారణంగా స్వామి వారికి సమర్పించే కైంకర్యాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి భక్తులందరికీ ఉంటుంది. అందరికీ తెలిసిన ప్రసాదం లడ్డూ ఒక్కటే. కానీ ఎన్నో రకరకాల ప్రసాదాలుంటాయి. ఏ సమయంలో ఏ నైవేద్యం పెడతారు, వాటిని ఎవరు చేస్తారు, ఎలా తయారు చేస్తారు, వాటిలో ఉండే దిట్టం ఏమిటి లాంటి అంశాలు అందరికీ తెలిసే అవకాశం తక్కువ. కైంకర్యాలకు సంబంధించిన అంశాలతో ఫుడ్స్ ఆఫ్ గాడ్ అనే పుస్తకాన్ని ఆంగ్లంలో రాశాను. దీనిని తెలుగులో అనువదించి ప్రచురించాలని ఎక్కువమంది కోరారు. అందుకే తెలుగులో అనువదించే పనిలో పడ్డా. 80 శాతం పూర్తయింది. కొద్దిరోజుల్లో పుస్తకాన్ని తీసుకువస్తాను. ఆ తాదాత్మ్యంలో ఏదీ గుర్తుండదు వైకుంఠం నుంచి తిరుమలకు రావడానికి మునుపే స్వామి తన ప్రతినిధిగా వైఖానస మహర్షిని పంపారు. వైఖానస ఆగమ శాస్త్రాన్ని సృష్టించారు. ఆ తర్వాతే స్వామివారు తిరుమలకు విచ్చేశారు. అంటే స్వామి భూలోకానికి వచ్చే సమయానికే ఆగమ శాస్త్రం అమల్లో ఉంది. ఇప్పటికీ అత్రి మహర్షి ఆలయంలో సజీవంగా ఉన్నారని భావిస్తాం. వేల సంవత్సరాల కిందట ఒక ప్రయోగం జరిగింది. దేవతలు, మహర్షులంతా కలిసి... ఆలయ ఆవరణలో పరివార దేవతల విగ్రహాలను ప్రతిష్ఠింపజేసి, వారిని స్వామివారికి రక్షణ సిబ్బందిగా నియమించారు. మంత్రపూర్వకంగా ఆవాహన చేశారు. వారంతా స్వామివారి సేవలో సజీవంగా ఉన్నారు. రక్షణ కవచంలా నిలుస్తున్న ఆ దైవశక్తులను సామాన్య మానవులు తట్టుకోలేరు. అందువల్లే స్వామివారిని దర్శనం చేసుకుని, ఆలయం వెలుపలికి వచ్చాక ఇక మళ్లీ స్వామి దివ్యమంగళ స్వరూపం గుర్తుండదు. మనసులో శూన్యత ఆవరిస్తుంది. మనమేదైనా కోరాలన్నా మరచిపోతాం. ఆ తాదాత్మ్యంలో ఏదీ గుర్తుండదు. అర్చావతారంలో కనిపించేది కూడా స్వామి వారి రూపం కాదు. అది వేరే ఉంటుందని నమ్ముతాను. ఆగమశాస్త్రంలో చెప్పబడే లక్షణాలున్న భంగిమ.. లక్షణాలతో స్వామివారున్నారని ధ్యానం చేసుకుంటుంటాను. వైఎస్ హయాంలో... వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర తర్వాత కొండకు వచ్చారు. సుదర్శనయాగం నిర్వహించాం. మా కష్టాలు విన్నారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట మర్చిపోలేదు. రాష్ట్రంలోని 24 వేల దేవాలయాల్లో అర్చకులకు వంశపారంపర్య హక్కు కల్పించారు. ఇందుకోసం చట్టసవరణ చేశారు. అర్చకులకు గౌరవమిచ్చారు. కుటుంబాన్ని పోషించుకునే శక్తిని ఇచ్చారు. వేతనాలు పెంచారు. బ్రాహ్మణులంతా సంతోషించారు. ఆయన తర్వాత మళ్లీ బ్రాహ్మణులకు, పురోహితులకు కష్టాలు మొదలయ్యాయి. అంతకుముందు తొమ్మిదేళ్లపాటు ఎన్నో ఒడిదుడుకులు ..కష్టాలు పడ్డాం. అవమానాలు భరించాం. ముఖ్యంగా జాతీయ నిధిగా చెప్పుకునే వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చేశారు. రథ.. వాహన మండపాలనూ ధ్వంసం చేయించారు. అవన్నీ దివ్యపురుషుడి దేహభాగాలుగా భావిస్తాం. ఇది మహాపాపమని చెప్పినా విన్నవారెవరూ లేరు. నాలుగు నెలలుగా స్వామికి దూరంగా.. ఏదైనా స్వామి అభీష్టానికి వదిలేస్తుంటాను. ఏది జరిగినా దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తాను. అన్నిటి వెనుక స్వామి దయ ఉందనే నమ్మకం. మనసా, వాచా ఏ తప్పు చేయలేదు. నాది కాని దాన్ని తీసుకోలేదు, తీసుకోను కూడా. స్వామివారి పేరు చెప్పి అక్రమంగా ఏదీ పొందలేదు. దైవ సంకల్పంతోనే ఏదైనా జరుగుతుంది. తిరుమలలో వంశపారంపర్య అర్చకులకు పదవీ విరమణ చేయించాలని చట్టాల్లో ఎక్కడా నిబంధనలు లేవు. కానీ, అలా జరిగిపోయింది. తెలతెలవారుతుండగానే గర్భగుడిలో స్వామి సేవలో తరించేవాడిని. నాలుగు నెలలుగా దూరంగా ఉన్నాను. స్వామివారిని దర్శించుకోలేకపోతున్నాననే కొరత.ఎప్పటికైనా స్వామి వారు నన్ను పిలిపించుకుంటారు. ఇప్పుడు నన్ను బయట పెట్టారంటే ఏం జరిగిందో తెలియదు. ఏదో ఒక బలమైన కారణమే ఉండి ఉంటుంది. జరిగేవన్నీ స్వామి వారి సంకల్పమే.ఏది జరిగినా మన మంచి కోసమేనన్నది నా భావన. – పక్కి సత్యారావు పట్నాయక్, తిరుపతి -
గుట్టుగా నా ఖాతాలో రూ.30 లక్షలు టీటీడీ జమ
సాక్షి, అమరావతి: తనకు ఎలాంటి ముందస్తుగా సమాచారం లేకుండా, తాను ఎటువంటి దరఖాస్తు చేయకుండానే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వారు తన పేరిట రూ.30 లక్షలు బ్యాంకు ఖాతాలో జమచేశారని టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ఆరోపించారు. టీటీడీలో జరుగుతున్న అక్రమాలను, అన్యాయాలను, ఆగమ విరుద్ధ అనాచారాలను బయటపెట్టినందుకు తనను కక్షపూరితంగా ఆలయంలో బాధ్యతల నుంచి తొలగించిన టీటీడీ.. ఇప్పుడు మరో ఏకపక్ష నిర్ణయంతో తన బ్యాంకు ఖాతాలో డబ్బులు జమచేశారని విమర్శించారు. డబ్బులు డిపాజిట్ చేసిన తర్వాత అవి తన రిటైర్మెంట్ బెనిఫిట్ డబ్బులని అధికారులు చెబుతున్నారని ఆయన మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తన అర్చక నియామకమే సర్వీసు రూల్స్ ప్రకారం జరగలేదని, వంశపారంపర్య హక్కుల ప్రకారం తాను అర్చక బాధ్యతల్లో పనిచేశానని రమణదీక్షితులు వివరించారు. ఈ కారణంగానే 20–30 ఏళ్ల పాటు తాను ఆ బాధ్యతల్లో కొనసాగినప్పటికీ, తనకు ఎటువంటి అలవెన్స్‌లు, సర్వీసు ఉత్త ర్వులు లేవని అందులో తెలిపారు. పదవీ విరమణ తన సమ్మతితో జరగలేదని.. అలాగే రిటైర్మెంట్ సెటిల్మెంట్ అని చెబుతున్న నగదు కూడా తన సమ్మతితో జమ చేయలేదని ఆయన పేర్కొన్నారు. తనతో పాటు బలవంతంగా తొలగించిన వారి ఖాతాల్లో కూడా ఇంతే మొత్తంలో డబ్బులు జమచేశారన్నారు. అధికారులు ఇంకెంత తరలించారో!? ఎలాంటి వోచర్, రశీదు లేకుండా, ఎవరూ దరఖాస్తు చేసుకోకుండా టీటీడీ యాజమాన్యం ఇష్టమొచ్చినట్లు శ్రీవారి ఖజానాలోని దాదాపు కోటి రూపాయలు తమ ఖాతాల్లో జమ చేసినట్లు వారు మిగిలిన విషయాల్లో ఇంకెన్ని కోట్లు తరలించారో అని రమణదీక్షితులు అనుమానం వ్యక్తంచేశారు. టీటీడీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఇన్నాళ్లూ తాను చెబుతున్న మాటలు వాస్తవమేనని దీంతో స్పష్టమైందని తన ప్రకటనలో రమణదీక్షితులు వివరించారు. టీటీడీలో జరుగుతున్న వ్యవహారాలపై సీబీఐ విచారణ తప్పకుండా జరిపించాలని ప్రజలందరూ కోరాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. టీటీడీ చట్టవ్యతిరేక నిర్ణయాలను, తన పదవీ విరమణ వ్యవహారాలను కోర్టు ద్వారానే పరిష్కరించుకుంటానన్నారు. -
భక్తులకు శ్రీవారిని దూరం చేస్తున్న టీటీడీ బోర్డు
సాక్షి ప్రతినిధి, చెన్నై: టీటీడీ పాలకమండలి, ఈవో తదితరుల చేష్టలతో భక్తులకు శ్రీవారు దూరమవుతున్నారని టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీవారి సాక్షిగా జరుగుతున్న ఈ అన్యాయాలను అరికట్టేదిశగా భక్తులే బోర్డుపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. చెన్నైలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. పరమపవిత్రమైన టీటీడీ బోర్డు ఎలాంటి ఆధ్యాత్మిక భావాలు, దైవభక్తి, హిందూ సంప్రదాయాలు లేని రాజకీయ నేతలతో కళంకితమైపోయిందన్నారు. శ్రీవారి ఆలయ పర్యవేక్షణకు ఆధ్యాత్మికవేత్తలు, ఆగమశాస్త్రాలు, హిందూ సంప్రదాయాల మీద నమ్మకం ఉన్నవారే ఈ ప్రభుత్వానికి దొరకలేదా అని ప్రశ్నించారు. అధికారులు వారు చెప్పినట్లే ఆడటం శోచనీయమన్నారు. మహాసంప్రోక్షణ సమయంలో భక్తులకు దర్శనం పూర్తిగా నిలుపుదల చేయాలనే నిర్ణయం వెనుక ఉన్న నిర్ణేత ఎవరని నిలదీశారు. కొద్దిమందికి దర్శనం కల్పిస్తే సరిపోతుందని సీఎం అన్నట్టు సమాచారం. ఆ కొద్దిమంది ఎవరు.. వీవీఐపీలా, అధికార పార్టీ వందిమాగదులా అన్నారు. చేసిన, చేస్తున్న తప్పులను మసిపూసి మారేడుకాయ చేసేందుకు బోర్డు సిద్ధం అవుతోందని, అందులో భాగంగానే మహాసంప్రోక్షణను అడ్డంపెట్టుకుని దర్శనాలు, తిరుమల మార్గాలన్నీ మూసివేత నిర్ణయం తీసుకున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి పరిస్థితి టీటీడీ చరిత్రలో ఎన్నడూ జరగలేదన్నారు. భక్తుల మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరించడం ప్రస్తుత పాలకమండలి నైజంగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. çసుమారు 12 ఏళ్ల క్రితం మహాసంప్రోక్షణలో పాల్గొన్న వారెవరూ నేడు లేరు. అనుభవం ఉన్నవారిని వెళ్లగొట్టారు.. ఈ విషయంలో ఈఓకు సైతం అవగాహన లేదనే విషయం బట్టబయలైందన్నారు. బలపడుతున్న అనుమానాలు ఆగస్టు 9 నుంచి 17వ తేదీ వరకు ఆలయ సిబ్బందిని సెలవుపై పంపడం, సీసీటీవీలను తాత్కాలికంగా నిలిపివేయడం అనేక అనుమానాలకు అవకాశం ఇస్తోంది. నిధుల కోసం శ్రీవారిపోటులో తవ్వకాలు జరిగాయని, శ్రీవారి ఆభరణాలు కనిపించడం లేదని, విదేశాలకు తరలివెళ్లినట్లుగా కొన్ని నెలల క్రితం తాను చేసిన ఆరోపణలకు బోర్డు చర్యలు బలం చేకూరుస్తున్నాయన్నారు. భక్తులకు దర్శన భాగ్యం లేకుండా పోతుంది, శ్రీవారి నగలు దొంగతనానికి గురవుతాయని పోతులూరి వీరబ్రహ్మం గతంలో చెప్పిన మాటలు అక్షరసత్యాలయ్యాయన్నారు. శ్రీవారి సాక్షిగా జరుగుతున్న అన్యాయాలపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తున్నట్లు బీజేపీ అగ్రనేత సుబ్రహ్మణ్యస్వామి చేసిన ప్రకటనతో టీటీడీ బోర్డు ఉలిక్కిపడిందన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు. గతంలో చేసిన ఆరోపణలకు సైతం కట్టుబడి ఉన్నానన్నారు. తిరుమల విషయాలను పొరుగు రాష్ట్రంలోని చెన్నైకి వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించగా, చెన్నైలో మా పిల్లలు ఉన్నందున వస్తుంటా, మాట్లాడుతున్నా అని మీడియాతో అన్నారు. -
టీటీడీ తీరుపై భక్తాగ్రహం!
సాక్షి, తిరుపతి : మహాసంప్రోక్షణ పేరుతో ఇటీవల కాలంలో ఎన్నడూ లేనివిధంగా ఆరు రోజుల పాటు శ్రీవారి దర్శనం నిలిపివేయాలని టీటీడీ తీసుకున్న నిర్ణయంపై భక్తుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధానార్చకులు రమణదీక్షితులు కొద్దిరోజుల క్రితం చేసిన ఆరోపణల నేపథ్యంలో టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇదే విధంగా మహాసంప్రోక్షణ నిర్వహించిన రోజుల్లో భక్తులకు యథావిధిగా దర్శనాలు కల్పించిన టీటీడీ.. ఈసారి ఆరు రోజులపాటు పూర్తిగా స్వామివారి దర్శనాన్ని నిలిపివేయడంపై భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. పాలక మండలి తీసుకున్న ప్రస్తుత నిర్ణయంతో గతంలో వచ్చిన ఆరోపణలకు బలం చేకూరుతోందని భక్తులు అంటున్నారు. పోటులో తవ్వకాలు జరిగాయని, పింక్ డైమండ్ మాయమైందని వచ్చిన ఆరోపణలు కప్పిపుచ్చుకునేందుకే ప్రస్తుతం ఆలయం లోపల పనులు చేపడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే సంప్రోక్షణ సమయంలో భక్తులను అనుమతించకూడదని టీటీడీ నిర్ణయం తీసుకుందని విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. గతంలో మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించే సమయంలో భక్తులకు కొన్ని గంటలపాటు శ్రీవారి దర్శనం కల్పించామని పలువురు అర్చకులు గుర్తుచేస్తున్నారు. మరోవైపు.. మహాసంప్రోక్షణ సమయంలో దర్శనం చేసుకుంటే ఫలితం వుండదని ప్రస్తుత అర్చకుల్లో కొందరు చెబుతున్నారు. దీంతో టీటీడీ నూతన పాలకమండలి తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి శ్రీవారి దర్శనాన్ని ఆరు రోజులపాటు భక్తులకు దూరంచేయడం మహాపాపం.. మహా అపచారం.. మహాసంప్రోక్షణ కార్యక్రమంలో భాగంగా గతంలో టీటీడీ జేఈవో 40వేల మంది భక్తులను అనుమతిస్తామని చెప్పారు. ఇప్పుడు మాట మార్చారు. రెండు టోల్గేట్లు, రెండు నడకదారి మార్గాలను మూసివేస్తామని ప్రకటించడం టీటీడీ చరిత్రలో ఇదే మొదటిసారి. ఆగమ సలహా మండలి, పెద్ద జీయర్, చిన్న జీయర్, మఠాధిపతులను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంవల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. గతంలో పద్మావతి అమ్మవారి ఆలయంలో మహాసంప్రోక్షణ కార్యక్రమం జరిగినప్పుడు అమ్మవారి ప్రతిరూపాన్ని తయారుచేసి అమ్మవారి శక్తిని ఆ ప్రతిమలలో ఆవాహన చేసి భక్తుల సందర్శనార్థం ఉంచారు. మరి తిరుమల శ్రీవారి ఆలయ సంప్రోక్షణ విషయంలో అలా ఎందుకు చేయడంలేదు? ఆలయం మూసివేసే హక్కు, అధికారం టీటీడీ ధర్మకర్తల మండలి, ఐఏఎస్ అధికారులకు లేదు. భక్తులను దర్శనానికి అనుమతించకుండా మహాసంప్రోక్షణ నిర్వహించాలని ఆగమ శాస్త్రం చెప్పిందా!? – నవీన్‌కుమార్‌రెడ్డి, శ్రీవారి భక్తుడు -
అర్చక హక్కు
-
ఆభరణాల తనిఖీ ఆగమశాస్త్ర బద్ధమేనా?
తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఇటీవల టీటీడీ బోర్డు నిర్వాకంపై, చంద్రబాబు ప్రభుత్వ ధార్మిక వ్యతిరేక పాలనపై, తిరుమల ఆలయంలో అవినీతిపై చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం అందరికీ తెలిసిందే. కృష్ణదేవరాయల కాలం నాటి స్వామివారికి అర్పించిన అమూల్య ఆభరణాలు మాయమైపోయాయని, అత్యంత విలువైన ఆభరణాలను అంతర్జాతీయ వేలం పాటల్లో అమ్మకానికి పెడుతున్నారని సాక్షాత్తూ ఆలయ ప్రధాన అర్చకులే ఆరోపించడం తీవ్రమైన విషయం. దానికి తక్షణ చర్యగా ఆయనను ప్రధాన అర్చకత్వ బాధ్యతలనుంచి తొలగించి ఆలయ మండలి సభ్యత్వంనుంచి కూడా తీసివేసిన టీడీపీ ప్రభుత్వం, టీటీడీ బోర్డు ఇప్పుడు ఈ తీవ్ర ఆరోపణలపై విచారణను పక్కనబెట్టడానికి ఆగమ శాస్త్రాన్ని సాకుగా తీసుకోవడం దారుణం. శ్రీవేంకటేశ్వరుడి అమూల్య మైన ఆభరణాలను సామాన్య ప్రజానీకానికి చూపిం చడానికి ఆగమ శాస్త్రం అంగీకరించదని టీటీడీ అధికారులూ, సంబంధిత ప్రభుత్వాధికారులు, మంత్రులు కలిసి కట్టుగా చెబుతున్నారు. బోర్డు సభ్యులు ఆభరణాలను నిశితంగా పరిశీలించారని, ఆభరణాలు ఏవీ పోలేదని, అన్నీ ఉన్నాయని నిర్ధారించేశారు. కాబట్టే శ్రీవారి ఆభరణాల చౌర్యంపై ఏ విచారణా అవసరం లేదని చెబుతున్నారు. ఇంతకన్నా ముఖ్యవిషయం ఏమిటంటే టీటీడీ సభ్యుల అర్హతలు ఏమిటన్నదే. తిరుమల తిరుపతి దేవస్థాన మండలి సభ్యులుగా తమ పార్టీకి సహాయ సహకారాలు అందించిన వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నియమిస్తున్నారు. వీరిలో కొంతమంది నల్లధనం దాచుకుని, పట్టుబడ్డవారు, కొంతమంది కల్లు, సారాయి దుకాణాలను పెట్టుకున్నవారు, కొంతమంది లారీ వ్యాపారాలు చేసేవారు. ఇలాంటి తరహా సభ్యులు వేంకటేశ్వరస్వామి ఆభరణాలను పరిశీలించడానికి ఆగమశాస్త్రం ఒప్పుకుంటుందా? ఈ వ్యాపారులేమైనా విశిష్టమైన దైవభక్తులా? ప్రజలను తప్పుదారి పట్టించకుండా, అన్ని అనుమానాలను నివారించడం కోసం హైకోర్టు న్యాయమూర్తులచే కాకుండా, సీబీఐ ద్వారానే విచారణ చేయడం సముచితంగా ఉంటుంది. త్రిపురనేని హనుమాన్ చౌదరి కార్ఖానా, సికింద్రాబాద్ మొబైల్ : 98490 67359 -
వంశపారంపర్య అర్చకులుగా కొనసాగవచ్చు
సాక్షి, హైదరాబాద్: వంశ పారంపర్య అర్చకత్వంపై వివాదం నడుస్తున్న నేపథ్యంలో హైకోర్టు ఇటీవల కీలక తీర్పునిచ్చింది. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ చట్టం 1987 ప్రకారం అర్హులైన అర్చక కుటుంబ సభ్యులు వంశపారంపర్య అర్చకులుగా కొనసాగవచ్చునని హైకోర్టు స్పష్టం చేసింది. రద్దు చేసిన 17/1966 ఏపీ దేవాదాయ చట్టంలో అర్హులైన అర్చక కుటుంబ సభ్యులుగా అర్చకత్వంలో ఎవరైతే కొనసాగుతూ ఉన్నారో, వారికి వంశపారంపర్య అర్చకులుగా కొనసాగే హక్కు ఉందని హైకోర్టు తేల్చి చెప్పింది. అంతేకాక వంశపారంపర్య అర్చకుడికి కొడుకులు లేని పక్షంలో అతని కుమార్తె కొడుకు (మనుమడు) సైతం వంశపారంపర్య అర్చకుడిగా కొనసాగవచ్చునని స్పష్టం చేసింది. వంశపారంపర్య ప్రధాన అర్చకుడిగా కొనసాగుతూ వచ్చిన రమణదీక్షితులను ఆ పదవి నుంచి టీటీడీ అధికారులు ఇటీవల తప్పించిన నేపథ్యంలో ఈ తీర్పునకు ప్రాధాన్యత ఏర్పడింది. వివరాల్లోకి వెళితే కృష్ణా జిల్లా, కంకిపాడులోని శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానంలో.. స్వర్ణ గధాధరబాబు తన తాత మరణించిన నాటి (1984) నుంచి ఆయన రాసిన వీలునామా ప్రకారం వంశపారంపర్య అర్చకుడిగా కొనసాగుతున్నారు. మిగిలిన వంశపారంపర్య అర్చకులతో కలిసి ప్రతి మూడేళ్లకొకసారి ఏడాది పాటు అర్చకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మిగిలిన 2 సంవత్సరాలు కుటుంబ జీవనం నిమిత్తం మరోచోట ఓ చిరు వ్యాపారం చేసుకుంటున్నారు. దీనిని కారణంగా చూపుతూ గధాధరబాబును అర్చకత్వ బాధ్యతల నుంచి తప్పిస్తూ, అతని స్వాధీనంలో ఉన్న 3.30 ఎకరాల భూమిని సైతం తమ స్వాధీనంలోకి తీసుకుంటూ దేవాదాయశాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ 2017లో ప్రొసీడింగ్స్ జారీ చేశారు. దీనిని సవాలు చేస్తూ గధాధరబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు విచారణ జరిపారు. దేవాదాయ చట్టం 1987 ప్రకారం 1966లో రద్దు చేసిన దేవాదాయ చట్టంలో ఎవరైతే వంశపారంపర్య అర్చకత్వ కుటుంబ సభ్యులుగా కొనసాగుతున్నారో వారు వంశపారంపర్య అర్చకులుగా కొనసాగవచ్చునని తీర్పునిచ్చారు. అంతేకాక 33/2007లో తీసుకొచ్చిన సవరణ చట్టంలో పితృ లేదా మాతృ అన్న పదాలు లేవని,b వంశపారంపర్య అర్చక కుటుంబ సభ్యులని మాత్రమే ఉందన్న పిటిషనర్ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. వంశపారంపర్య ఆర్చకునికి కుమారులు లేనప్పుడు కుమార్తె కుమారుడు సైతం వంశపారంపర్య అర్చకునిగా కొనసాగేందుకు 2007 సవరణ చట్టం అవకాశం కల్పిస్తోందని జస్టిస్ శివశంకరరావు స్పష్టం చేశారు. గధాధరబాబు అర్చకత్వాన్ని రద్దు చేస్తూ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేశారు. తిరిగి అతనికి అర్చకత్వ బాధ్యతలు అప్పగించడంతో పాటు 3.30 ఎకరాలను స్వాధీనం చేయాలని ఆదేశించారు. రమణ దీక్షితుల తొలగింపు తప్పుని తేలింది: ఏపీ అర్చక సమాఖ్య ఆయనను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ కృష్ణా జిల్లా కంకిపాడు శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో పనిచేసే వంశపారంపర్య అర్చకుని విషయంలో హైకోర్టు వెలువరించిన తీర్పుతో తిరుమల ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తొలగింపు చట్టవిరుద్ధమని స్సష్టమైందని ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ తీర్పు తిరుమల వివాదానికి ఒక పరిష్కారం సూచించిందని.. ఉన్నత న్యాయస్థానాల తీర్పును ప్రభుత్వం గౌరవించి రమణదీక్షితులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఏపీ అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఆత్రేయబాబు, కార్యదర్శి పి.రాంబాబు ఆ ప్రకటనలో డిమాండ్ చేశారు. 2007లో అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి పాత దేవదాయ చట్టానికి సవరణ చేసి అర్చకుల వంశపారంపర్య హక్కులు పునరుద్ధరించినప్పటికీ, ఆ ఫలితాలు పూర్తి స్థాయిలో అర్చకులకు అందకుండా నేటి ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని తప్పుపట్టారు. -
టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
-
ఆగమ సలహాదారుడిగానూ రమణదీక్షితులు తొలగింపు
సాక్షి, తిరుపతి/తిరుమల: టీటీడీ ప్రధాన అర్చకునిగా ఉన్న రమణదీక్షితులును రిటైర్మెంట్ పేరుతో ఇంటికి పంపిన పాలకమండలి తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఆగమ సలహాదారునిగా ఉన్న ఆయనను ఆ హోదా నుంచి కూడా తొలిగిస్తున్నట్లు చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ ప్రకటించారు. రమణదీక్షితులు ఆగమసలహాదారునిగా కొనసాగుతారని సోమవారం స్వామివారి ఆభరణాల పరిశీలన సమయంలో చెప్పిన ఆయనే 24 గంటలు గడవక ముందే నిర్ణయం మార్చుకోవడం చర్చనీయాంశమైంది. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. నూతనంగా ఏర్పాటైన పాలకమండలి వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నెలరోజుల వ్యవధిలోనే మూడు పర్యాయాలు పాలకమండలి సమావేశాలు నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకుంది. మొదటి సారిగా నిర్వహించిన పాలకమండలి సమావేశంలో రమణదీక్షితులిని ప్రధాన అర్చకుని బాధ్యతల నుంచి రిటైర్మెంట్ పేరుతో తొలగించి వివాదాలకు తెరతీశారు. తాజా సమావేశంలో మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుని చర్చనీయాంశంగా మార్చారు. సినీ నటుడు బాలకృష్ణ నియోజక వర్గంపై టీటీడీకి అమితమైన ప్రేమ హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ, టీడీపీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి నియోజకవర్గాల అభివృద్ధి కోసం గతంలో టీటీడీ నుంచి నిధులు కేటాయించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి హిందూపురం నియోజక వర్గంలో శ్రీఆంజనేయస్వామి ఆలయ పునరుద్ధరణకు టీటీడీ రూ.25 లక్షలు కేటాయించింది. అదే విధంగా ప్రకాశం జిల్లా దొడ్డుకూరు గ్రామంలో చెన్నకేశవస్వామి ఆలయ పునరుద్ధరణకు రూ.25లక్షలు, అనంతపురం జిల్లా పరిగి గ్రామం శ్రీ ఆంజనేయస్వామి, రొద్దకంభ ఆలయం సమీపంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.1.50 కోట్లు టీటీడీ కేటాయించింది. కాగా తిరుమలలో యాత్రికుల వసతి సముదాయాలు నిర్మించకూడదని గతంలో టీటీడీ నిర్ణయం తీసుకోగా తిరుమలలో కొత్తగా పీఏసీలు నిర్మించేందుకు రూ.79 కోట్లు కేటాయించాలని నిర్ణయించడం తీవ్ర చర్చనీయాంశమైంది. పాలకమండలి ముఖ్యమైన నిర్ణయాలు: - తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ గోపురం బంగారు తాపడానికి రూ.32.26 కోట్లు. - గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు తలనీలాల ద్వారా రూ.133.32 కోట్లు రాబడి. - తిరుమలలో మరో పీఏసీల నిర్మాణానికి రూ.79 కోట్ల అంచనాలతో ఆమోదం. - ఆగమసలహాదారుగా రమణదీక్షితులు స్థానంలో వేణుగోపాల్ దీక్షితులు నియామకం. - మీరాశీ వంశీకుల నుంచి అర్హత కలిగిన 12 మంది అర్చకులుగా నియామకం. - రమణదీక్షితులకు ఇచ్చిన నోటీసులపై ఇంకా వివరణ అందలేదు. మరో మూడు రోజుల్లో రమణదీక్షితులు, వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వివరణ ఇవ్వాలి. - ఒంటిమిట్ట అభివృద్ధి కోసం రూ.36 కోట్లు, యాత్రికుల వసతి గృహాలకు 5.25 కోట్లు . - రాష్ట్ర ప్రభుత్వం 2017లో ప్రవేశపెట్టిన దివ్యదర్శనం పథకం అమలు చేయటంలో భాగంగా రవాణా సౌకర్యం కోసం 50 శాతం వ్యయాన్ని టీటీడీ ఖర్చు చేసేందుకు ఏపీఎస్ఆర్టీసీకి రూ.1.25 కోట్లు చెల్లించేందుకు ఆమోదం. - చిల్లర నాణేల మార్పిడి కోసం ఆర్బీఐతో సంప్రదింపుల కోసం కమిటీ. - నూతన కల్యాణమండపాల నిర్మాణంపై సబ్‌కమిటీ నివేదిక తర్వాత నిర్ణయం. - తిరుమలలో మాస్టర్‌ప్లాన్‌లో రూ.15 కోట్లు వెచ్చించి మురుగుదొడ్ల నిర్మాణం. -
అయిదుగురు సభ్యుల్లో దీక్షితులు ఒకరు
సాక్షి, తిరుమల : గత కొంతకాలంగా టీటీడీ పాలకమండలిపై రమణదీక్షితులు చేస్తున్న ఆరోపణలపై జేఈఓ శ్రీనివాస రాజు స్పందించారు. ప్రసాదం పోటులో ఎలాంటి తవ్వకాలు జరగలేదనీ, ఆగమ శాస్త్ర పండితుల సలహాల మేరకే మరమ్మతు పనులు చేశామని చెప్పారు. శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. శ్రీవారి ఆశిస్సులతో సుదీర్ఘ కాలంగా ఈ పదవిలో ఉన్నానని అన్నారు. ఆలయ ప్రతిష్ట దెబ్బతీసేల వస్తున్న అసత్య ఆరోపణలుపై వివరణ ఇవ్వడం తన బాధ్యత అని తెలిపారు. ఆగమ శాస్త్ర సలహామండలి సూచనల మేరకే ప్రసాదం పోటులో మరమ్మతులు చేశామని వెల్లడించారు. అందుకనే ప్రసాదాలను పడి పోటులో తయారు చేశామని తెలిపారు. ఒక సందర్భంలో రమణదీక్షితులు అంగీకారం తెలపకపోవడంతో పూర్తిస్థాయిలో మరమ్మతులు చెయ్యలేదని అన్నారు. సలహామండలిలో గల అయిదురు సభ్యుల్లో దీక్షితులు ఒకరని.. శ్రీవారి సన్నిదిలో ఏదో అపకార్యం జరదిగిందని ఎలా ప్రచారం చేస్తారని మండిపడ్డారు. మరమ్మతులు చేయకుండా వదిలిపెడితే..! ఏదైనా ప్రమాదం జరిగితే.. బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. ఆలయంలో జరిగే పూజా కైంకర్యాల నిర్వహణలో అధికారుల ప్రమేయం ఏమాత్రం ఉండదనీ, అటువంటప్పుడు కార్యక్రమాల నిర్వహణలో తొందర పెట్టారని దీక్షితులు ఆరోపించడం భావ్యం కాదని అన్నారు. అయినా, 22 గంటల పాటు భక్తుల సంచారం ఉండే ఆలయంలో భక్తులకు తెలియకుండా ఏం జరుగుతుందని అన్నారు. ప్రతి సంవత్సరం అభరణాల తనిఖీలు జరుగుతాయని స్పష్టం చేశారు. -
ప్రశ్నిస్తే పరువు నష్టమా?
సాక్షి, హైదరాబాద్: కలియుగంలో మనుషులకు దురాశ పెరిగిపోయి డబ్బు మీద వ్యామోహంతో ఎక్కడలేని అరాచకాలకు పాల్పడుతున్నారని టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు వ్యాఖ్యానించారు. బుధవారం హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వరుడిని టీటీడీ రోజుల తరబడి పస్తులు ఉంచి అవమానించటానికి నిరసనగా జూలైలో తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్నట్లు ప్రకటించారు. స్వామివారి సంపదను కాపాడమని అడగడమే తాను చేసిన తప్పా? అని ప్రశ్నించారు. తనకు శ్రీనివాసుడి సేవ, గుడి మినహా మరో వ్యాపకం, కార్యక్రమాలు లేవని స్పష్టం చేశారు. స్వామివారికి సంబంధించిన కైంకర్యాలు, తిరువాభరణాలు, ఆలయ భద్రత, పూజల తీరు, అసలు నగలు ఎవరి ఆధ్వర్యంలో ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? తదితర అంశాలపై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విచారణ జరిపాక దావా వేసుకోండి టీటీడీ తనపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేయడం విచిత్రమని రమణ దీక్షితులు పేర్కొన్నారు. తన ప్రశ్నలకు జవాబు చెప్పకుండా నోటీసులు ఇవ్వటం, పరువు నష్టం దావా వేయటం సబబుగా లేదన్నారు. తన ఆరోపణలన్నింటిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి కావాలంటే అప్పుడు పరువునష్టం దావా వేయాల్సిందన్నారు. తన ఆరోపణల విలువ రూ.100 కోట్లేనా అనే సందేహం కలుగుతోందన్నారు. స్వామి పాదాల చెంత రూ.25 వేల కోట్లు పెట్టాలి.. కోట్ల కుటుంబాలకు ఇష్ట దైవమైన తిరుమల శ్రీవారికి ఎన్నో శతాబ్దాలుగా ఆగమశాస్త్రం ప్రకారం కైంకర్యాలు, పూజలు జరుగుతున్నాయని రమణ దీక్షితులు చెప్పారు. అయితే ఇటీవల స్వామివారి చెంత అపచారాలు జరుగుతున్నాయని తెలిపారు. 25 రోజులపాటు స్వామివారిని పస్తులు ఉంచినందుకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పి రోజుకు రూ.1,000 కోట్లు చొప్పున 25 రోజులకు గాను రూ. 25 వేల కోట్లు స్వామివారి పాదాల చెంత పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రతాపరుద్రుడి కానుక 18 లక్షల మోహరీలు కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుడు స్వామివారికి 18 లక్షల బంగారు మోహరీలు కానుకగా ఇచ్చారని రమణ దీక్షితులు చెప్పారు. ఒక్క మోహరీ అంటే 100 గ్రాముల బంగారం అని వివరించారు. ఈ సంపదను ఆలయ ప్రాకారంలోనే దాచి ఉంచినట్లుగా చరిత్ర చెబుతోందన్నారు. స్వామివారికి నైవేద్యం తయారు చేసే పాకశాల నుంచి సంపద దాచిన ప్రాకారానికి సొరంగ మార్గం ఉందన్నారు. అలాంటి పాకశాలలో నిర్మాణ పనులు ఎందుకు చేశారో వెల్లడించాలన్నారు. ఆ మేడం ఎవరు? భూకంపం వచ్చిన మాదిరిగా తిరుమల ఆలయంలో పోటును తవ్వేశారని రమణ దీక్షితులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అనుమతితోనే ఈ పనులు నిర్వహిస్తున్నామని జేఈవో తనతో స్వయంగా చెప్పారన్నారు. ‘ఒక మేడం గారు కూడా చెప్పారని జేఈవో అన్నారు. ఆ మేడం ఎవరో తెలియాలి. నా మాట వినకుండా అతి క్రూరంగా వెయ్యికాళ్ల మండపాన్ని తొలగించారు. వెయ్యేళ్ల క్రితం నిర్మించిన కట్టడాలకు మరమ్మతుల పేరుతో అసలేం చేస్తున్నారో చెప్పాలి. రాబోయే తరాలకు అందించాల్సిన చారిత్రక సంపదను నిర్వీర్యం చేస్తున్నారు’అని రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ మళ్లీ అవే ఎందుకు? తిరుమల వెంకన్నకు కిరీటం, స్వర్ణపత్రాలు, కంటెలు, శంఖుచక్రాలు, హస్తములు, సహస్ర నామహారం, లక్ష్మీహారం, తులసీహారం, సాలగ్రామ హారం, సూర్యకిరీటం, అంతెలు, పద్మపీఠం లాంటివన్నీ ఉన్నా భక్తులతో మళ్లీ మళ్లీ అదే నమూనాలో ఎందుకు తయారు చేయిస్తున్నారో అర్థం కావటం లేదని రమణ దీక్షితులు చెప్పారు. కొత్తగా హారాలు వచ్చినప్పుడు పాతవాటిని భద్రపరిచే ట్రెజరీని ఎవరు పర్యవేక్షిస్తున్నారో చెప్పాలన్నారు. ప్రభుత్వం దీనిపై సమాధానం ఇవ్వకుండా దాటవేస్తోందని ఆరోపించారు. 2017లో అతి నీచమైన కార్యక్రమాలు... 2017లో అతి నీచమైన, అపవిత్ర కార్యక్రమాలు ఎన్నో స్వామివారి సన్నిధిలో జరిగాయని రమణ దీక్షితులు తెలిపారు. ‘అంటు’లో ఉన్న ఇద్దరు అర్చకులతో పవిత్రోత్సవం, బ్రహ్మోత్సవాల్లో పూజలు చేయించారన్నారు. ఇలా చేయటం స్వామివారి పట్ల అపచారమని చెప్పినందుకే తనను ఇలా వేధిస్తున్నారన్నారు. 1994–95లో అప్రైజర్స్ ఆభరణాల లెక్క తేల్చగా తాను టీటీడీకి రూ.34 వేలు కట్టానని చెప్పారు. ప్రభుత్వం నియమించే అధికారుల వల్లే అన్ని సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. తిరుమలలో చోటు చేసుకుంటున్న ఘటనలపై పెద్దలు, రాజకీయ ప్రముఖులు, స్వామివారి భక్తులను కలుస్తానని ప్రకటించారు. -
స్వామి వారి విలువ వంద కోట్లేనా...?
సాక్షి, హైదరాబాద్ : గత కొంతకాలంగా టీటీడీ పాలకమండలిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరోసారి తెరపైకి వచ్చారు. తన ఆరోపణలకు సమాధానం చెప్పలేకనే టీటీడీ పాలకమండలి తనపై పరువు నష్టం దావా వేసిందని మండిపడ్డారు. తాను చెప్పినవన్ని వాస్తవాలేనని, వాటి గురించి సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘స్వామి వారి పూజలు, నైవేద్యాల్లో లోపాలు జరుగుతున్నాయి. స్వామి వారికి ఆరాధనలు సరిగా జరగడం లేదన్నందుకు నా మీద 100 కోట్ల రూపాయల పరువు నష్టం వేసారు. అంటే స్వామి వారి పరువును కేవలం వంద కోట్లకే పరిమితం చేస్తున్నారా’ అంటూ ప్రశ్నించారు. ఆభరణాలు తరలిపోతున్నాయి... శ్రీవారికి ఎందరో రాజులు విలువైన ఆభరణాలు సమర్పించారు. వాటి వివరాలను శిలాశాసనాలలో కూడా పొందుపరిచారు. కానీ నేడు అవన్ని తరలిపోతున్నాయి. వంటశాల నుంచి నేలమాళిగకు దారి ఉన్నట్లు తెలుస్తుంది. స్వామి వారి సంపద అంతా నేలమాళిగలోనే ఉందని, అక్కడకు సామాన్యులు వెళ్లలేరని తెలిపారు. స్వామి వారిని పస్తులు ఉంచారు... ఎవరికి చెప్పకుండా పోటును మూసివేసారు. పోటు మూసి వేస్తే ప్రసాదాలు, నైవేద్యాలు ఎక్కడ తయారు చేస్తారని ప్రశ్నించారు. అందుకే స్వామి వారిని 25 రోజుల పాటు పస్తులు ఉంచారని విమర్శించారు. పోటును మూసివేసి అక్కడ భారీగా తవ్వకాలు జరిపారని...పోటు తలుపులు తీసిన తరువాత చూస్తే అక్కడ భూకంపం వచ్చినట్లుగా ఉందన్నారు. తాను వెంటనే ఈ విషయం గురించి జేఈఈని అడిగానని..కానీ ఆయన సరిగా స్పందించలేదన్నారు. ఎవరో మేడం చెప్పిందని తవ్వకాలు జరిపామన్నారు. కానీ తరువాత కాలంలో స్వయంగా జేఈఈనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే పోటులో తవ్వకాలు జరిపామని తెలిపారన్నారు. వీటన్నింటి గురించి ప్రశ్నిస్తే తనను ఉద్యోగం నుంచి తొలగించారని మండిపడ్డారు. తాను వద్దని వారించిన వినకుండా అతిక్రూరంగా ఆనాడు వెయ్యికాళ్ల మండపాన్ని తొలగించారని మండిపడ్డారు. ఈ తొలగింపుల్లో నాలుగైదు నిధులు దొరికాయని బయట ప్రచారం జరుగుతుందని తెలిపారు. మిరాశీ, వంశ పారంపర్య అర్చకత్వం రెండూ వేరు. కానీ ద్వేషపూరితంగా మిరాశీ వ్యవస్థను రద్దు చేయడమే కాక వంశపారంపర్య అర్చకత్వాన్ని కూడా రద్దు చేశారని విమర్శించారు. కానీ దీనిపై తాము సుప్రీం కోర్టుకు వెళ్లి న్యాయం సాధించమని గుర్తు చేసారు. సీబీఐ విచారణ జరపాలి... గతంలో ఆభరణాల్లో ఏమైనా తరుగులు ఉంటే అర్చకుల నుంచి డబ్బులు వసూలు చేసే వారని... అందుకే అర్చకులు ఆభరణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారని గుర్తు చేసారు. కానీ నేడు శ్రీవారి ఆభరణాల బాధ్యత సరిగా నిర్వర్తించడం లేదని.. తరుగులు, రాలిపోయిన రాళ్లకు బాధ్యత లేకుండా పోయిందని వాపోయారు. తాను చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు. ఆలయంలో అపవిత్ర కార్యక్రమాలు... 2017లో శ్రీవారి ఆలయంలో రెండు అపవిత్ర కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. ఇలా స్వామి వారికి అపవిత్రత ఆపాదించే కార్యక్రమాలు ఆలయంలో నిర్వహించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. వైదిక విజ్ఞానం లేని అధికారులను నియమిస్తున్నారని అందువల్లే మన ఆచార, వ్యవహారాలు వారికి తెలియడంలేదని ఆరోపించారు. అధికారులు శుచి, శుభ్రత పాటించడం లేదని మండిపడ్డారు. తాను ఉన్నంత వరకూ శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడనని, కానీ ఇప్పటికి శ్రీవారి ఆలయంలో అర్చకులకు విలువ లేదని బాధపడ్డారు. -
ఆరోపణలపై వివరణ ఇవ్వండి: టీటీడీ
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయం మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు, ఎంపీ విజయసాయిరెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నోటీసులు పంపించింది. పోస్టు ద్వారా వీటిని పంపి నట్లు టీటీడీ వర్గాలు వెల్లడించాయి. శ్రీవారికి భక్తులు సమర్పించిన విలువైన ఆభరణాలు మాయమయ్యాయని.. అందులో పింక్ డైమండ్ కూడా ఉందని రమణదీక్షితులు ఇటీవల ఆరో పించారు. అలాగే ఆగమశాస్త్రానికి విరుద్ధంగా పోటులో తవ్వకాలు జరిపారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై సరైన సమాధాన మివ్వని పాలకమండలి.. రమణ దీక్షితులపై మాత్రం క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కొన్ని రోజుల కిందట నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో బుధవారం రమణ దీక్షితులతో పాటు విజయసాయిరెడ్డికి నోటీసులు పంపిం చినట్లు టీటీడీ వర్గాలు తెలిపాయి. టీటీడీపై చేసిన ఆరోపణలపై రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నట్లు తెలిసింది. -
సుప్రీంకోర్టుకు చేరిన టీటీడీ వివాదం
సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానం వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. రమణ దీక్షితులు కంటే ముందే టీటీడీ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో బుధవారం వేణుగోపాల దీక్షితులు న్యాయవాది కేవియెట్ పిటిషన్‌ను దాఖలు చేశారు. టీటీడీ బోర్డు వేణుగోపాల్ దీక్షితులును ప్రధాన అర్చకులగా నియమిస్తూ జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఎవరైనా కోర్టుని ఆశ్రయిస్తే తమకు ముందస్తు సమాచారమివ్వకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని కేవియట్ దాఖలు చేసిన్టటు న్యాయవాది తెలిపారు. టీటీడీ ప్రతిష్టను దెబ్బ తీయడానికి కొందరు ప్రయత్నిస్తున్నరని ఆయన అన్నారు. తిరుమల దేవస్థానంపై వస్తున్న ఆరోపణలను భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. కాగా తనను అక్రమంగా టీటీడీ ప్రధాన అర్చక పదవి నుంచి తొలగించారని, వచ్చే నెలలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తానని రమణదీక్షితులు చెప్పిన విషయం విదితమే. -
టీటీడీ వివాదంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి
సాక్షి, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తీరుపై విద్యాగణేషానంద భారతీస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీలో పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. తిరుమలలో పరిస్థితులపై భక్తులు సైతం ఆందోళన చెందుతున్నారని చెప్పారు. మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని భారతీ స్వామి డిమాండ్ చేశారు. టీటీడీలో అన్యమతస్తులు ఉన్నారని, దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పాలకమండలిని, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శ్రీవారి పింక్ వజ్రం పగిలిపోయే ఆస్కారం లేదని చెప్పారు. పూలు, నాణెలు పడినంత మాత్రాన వజ్రాలు పగిలిపోతాయా? అని ప్రశ్నించారు. అర్చకత్వం, సన్నిధి, గొల్లల విషయంలో వంశపారంపర్య పరంపరలపై పీఠాధిపతులు శనివారం సమావేశమయ్యారు. టీటీడీ బోర్డులో సభ్యులుగా నియమితులు అయ్యేవారికి ఆగమ సంప్రదాయాలు తెలిసి ఉండాలని పీఠాధిపతులు పేర్కొన్నారు. ప్రస్తుతం బోర్డులో అలాంటి వ్యక్తులు లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీలో పరిణామాలు కలతకు గురి చేస్తున్నాయని చెప్పారు. ఇదివరకటి రీతిలోనే కైంకర్యాలు జరగాలని సూచించారు. రమణ దీక్షితులు లేవనెత్తిన ఆరోపణలపై ప్రభుత్వం తప్పనిసరిగా సమాధానం చెప్పాలని అన్నారు. -
టీటీడీలో పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి
-
జగన్-దీక్షితులు భేటీ; ఆపరేషన్ గరుడా?
సాక్షి, హైదరాబాద్: జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టీటీడీ మాజీ ప్రధానార్చకుడు రమణదీక్షితులు కలుసుకోవడంపై చవాకులు పేలుతున్నవారికి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఘాటుగా బదులిచ్చారు. శ్రీవారి నగలు మాయం కావడంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ‘ముఖ్య’నేతల ప్రమేయంపై అనుమానాలు వ్యక్తం చేసిన రమణదీక్షితులు, మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు సవాలు విసరడం తెలిసిందే. విధుల నుంచి తొలగిస్తూ టీడీపీ ప్రభుత్వం తనకు చేసిన అన్యాయాన్ని చెప్పుకునేందుకుగానూ ఆయన గురువారం హైదరాబాద్‌లో వైఎస్ జగన్‌ను కలుసుకున్నారు. ఈ భేటీపై కొందరు విమర్శలు చేయగా, ఐవైఆర్ కౌంటర్ చేశారు. ‘‘రమణదీక్షితులు గారు ప్రతిపక్ష నేత జగన్ గారిని బహిరంగంగా కలిశారు. ఒకరేమో ఇది ఆపరేషన్ గరుడలో భాగమన్నారు. మరో తీవ్రవాది మాట్లాడుతూ.. దీక్షితులుగారు జగన్‌కు పాదాకాంత్రమయ్యారని అంటాడు. వేరొక ఉగ్రవాది.. ఇరువురికీ బంధుత్వాన్ని అంటగడతాడు. ఇంకో చానెల్లో అయితే శ్రీ వైష్ణవులకు ఇది కూడని పని అని ఏవో వైష్ణవ సంఘాలు అన్నట్లు వార్తలు ప్రసారం చేశాయి’’ అని ఐవైఆర్ తన ట్విటర్లో రాశారు. ఆపరేషన్ గరుడ.. సూపర్ ఐడియా: రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల తరచూ వినిపిస్తున్న ‘ఆపరేషన్ గరుడ’కు దర్శక, నిర్మాత, రచయిత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబేనని ఐవైఆర్ ఇదివరకే వెల్లడించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు తాను రాసుకున్న స్క్రిప్టును నటుడు శివాజీతో చెప్పించి, ఆపై ‘ఆపరేషన్ గరుడ నిజం కావచ్చు..’ అంటూ నవ నిర్మాణ దీక్షలో ఆయనే దీర్ఘాలు తీయడం కుట్రలో భాగమేనని ఆయన ఆరోపించారు. వైఎస్ జగన్‌తో భేటీపై రమణ వివరణ: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌తో భేటీ అనంతరం టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు మీడియాతో మాట్లాడారు. ‘‘టీటీడీలో నాతోపాటు మరో ముగ్గురిని విధుల నుంచి అక్రమంగా తొలగించారు. ఇదే విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అపాయింట్మెంట్ కోసం చాలాసార్లు ప్రయత్నించాను. కానీ ఆయన సమయం ఇవ్వలేదు. జరిగిన అన్యాయాన్ని గురించి వైఎస్ జగన్‌కు చెప్పుకుందామనే ఇక్కడికొచ్చాను’’ అని దీక్షితులు వివరించారు. (చదవండి: వైఎస్ జగన్‌ను కలిసిన రమణ దీక్షితులు) -
వైఎస్ జగన్‌ను కలిసిన రమణ దీక్షితులు
సాక్షి, హైదరాబాద్ : టీటీడీ ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గురువారం సాయంత్రం ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఈ సందర్భంగా వైఎస్ జగన్ దృష్టికి తీసుకు వచ్చారు. టీటీడీలో తనతో పాటు మరో ముగ్గురిని అక్రమంగా తొలగించారని తెలిపారు. వారసత్వంగా వచ్చిన అర్చకత్వ విధుల నుంచి తమను తొలగించారంటూ రమణ దీక్షితులు చెప్పిన విషయాలపై వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. రమణ దీక్షితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. భేటీ అనంతరం రమణ దీక్షితులు మాట్లాడుతూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను కలిసి తన ఆవేదన చెప్పుకున్నానని అన్నారు. తాను చాలాసార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోరినాని, అయితే ఆయన సమయం ఇవ్వలేదన్నారు. తమకు జరిగిన అన్యాయం గురించి వైఎస్ జగన్‌కు చెప్పుకున్నామని రమణ దీక్షితులు పేర్కొన్నారు. కాగా నిక్షేపాల కోసం తిరుమల శ్రీవారి పోటులో కొందరు తవ్వకాలు జరిపారని రమణ దీక్షితులు తీవ్ర ఆరోపణలు చేసిన విషయం విదితమే. తవ్వకాలు జరిగాయనడంలో ఎలాంటి సందేహం లేదని.. ఆ వంట గదిలో జరిగిన మార్పులే ఇందుకు సాక్ష్యమని ఆయన అన్నారు. గతేడాది డిసెంబర్ 8న రహస్యంగా ఈ తవ్వకాలు జరిగాయన్నారు. ఓ జాతీయ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రమణ దీక్షితులు పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. -
రమణదీక్షితులుపై చర్యలకు సిద్ధమైన టీటీడీ
-
రమణదీక్షితులుపై క్రిమినల్ కేసులు
సాక్షి, తిరుపతి: టీటీడీపై గత కొంత కాలంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్న ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులుపై క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు పాలకమండలి సిద్ధమైంది. మాజీ ఈఓ ఐవైఆర్ కృష్ణారావుకు లీగల్ నోటీసులు జారీ చేయాలని, తిరుమల టీటీడీ పరువు తీసే విధంగా విమర్శలు చేసిన మరికొందరిపైనా పరువునష్టం దావా వేయాలని నిర్ణయించారు. టీటీడీ న్యాయ నిపుణుల సలహా తీసుకుని రెండు మూడు రోజుల్లో చర్యలకు దిగనున్నారు. తిరుమల అన్నమయ్య భవన్లో మంగళవారం జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ అధ్యక్షతన ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ సమావేశం రమణదీక్షితులు వ్యవహారమే ప్రధాన అజెండాగా సాగింది. మాజీ ప్రధాన అర్చకులు చేసిన ఆరోపణలపై టీటీడీ పాలకమండలి సభ్యులు కొందరు అధికారులతో కలిసి ఇటీవల అమరావతికి చేరుకుని సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. అందులో భాగంగానే మంగళవారం మరోసారి టీటీడీ పాలకమండలి సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. అన్నమయ్య భవన్లో జరిగిన సమావేశంలో రమణదీక్షితులుపై క్రిమినల్ కేసులు నమోదు చేసే విషయాన్ని ప్రస్తావించిన సమయంలో ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్‌తో పాటు మరి కొందరు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ విషయంపైనే ఆయన సమావేశం నుంచి అలిగి వెళ్లారని కూడా ప్రచారం జరుగుతోంది. సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి సైతం రాలేనని తేల్చిచెప్పినట్లు తెలిసింది. అయితే ప్రభుత్వ పెద్దలు, పాలకమండలి సభ్యుల ఒత్తిడితో విలేకరుల సమావేశానికి హాజరయ్యారని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ పెద్దల సూచనల మేరకే రమణదీక్షితులుపై క్రిమినల్ కేసు నమోదు చేయటం, ఐవైఆర్ కృష్ణారావుకి నోటీసులు జారీ చేయటం, మరి కొందరిపై పరువునష్టం దావా వేయాలని నిర్ణయించారు. ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలి? పరువు నష్టం ఎంతకు వేయాలి? అనే అంశాలపై టీటీడీ న్యాయ నిపుణులతో చర్చించి రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు. ఆభరణాల ప్రదర్శనకు ఆగమశాస్త్రం అభ్యంతరం? ఆభరణాలు మాయమయ్యాయన్న రమణదీక్షితుల ఆరోపణలపై ఈఓ అనిల్కుమార్సింఘాల్ ఇటీవల సుధీర్ఘ వివరణ ఇచ్చారు. 1952లో రికార్డుల్లో నమోదైన ఆభరణాలన్నీ భద్రమేనని వివరించారు. ఆగమశాస్త్రం ఒప్పుకుంటే ఆభరణాలన్నీ ప్రదర్శించటానికి సిద్ధమని వెళ్లడించారు. ఆ విషయంపైనా మంగళవారం పాలకమండలి సమావేశంలో చర్చ జరిగింది. ఆగమశాస్త్రం ప్రకారం ఆభరణాల ప్రదర్శన చేయవచ్చా అన్న దానిపై పలువురు అర్చకులు, పూజారులతో సమావేశమైనట్లు తెలిసింది. వారు అభ్యంతరం వ్యక్తం చేశారని సమాచారం. ఆభరణాలను ప్రదర్శిస్తే... 1952కి ముందు ఉన్న ఆభరణాలు ఏమయ్యాయి? అనే ప్రస్తావన వస్తుందని, అనవసరంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని సలహాలు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఆభరణాల ప్రదర్శన విషయమై టీటీడీ వెనక్కు తగ్గినట్లు సమాచారం. అయితే ఈఓ విలేకరుల సమావేశంలో మాత్రం ఆగమశాస్త్రం ఒప్పుకుంటే ఆభరణాల ప్రదర్శనకు సిద్ధమని ప్రకటించారు. అదే విధంగా రమణదీక్షితులు సీబీఐ విచారణకు సిద్ధమని ప్రకటించిన విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా... సమాధానం దాటవేశారు. తిరుమలకు రా తేల్చుకుందాం ఇరవై ఏళ్లుగా తిరుమలలో పనిచేసి దేవుడిపై అప ప్రచారం చేస్తావా? చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్‌లో కూర్చొని చెప్పటం కాదు. తిరుమలకు రా తేల్చుకుందాం. దేవుడే నీకు గుణపాఠం చెబుతారు’ అని టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులుపై తీవ్రస్తాయిలో ఆగ్రహం వ్యక్తం చేయటం గమనార్హం. శ్రీవారి భక్తులకు మరింత భద్రత శ్రీవారి భక్తులకు మరింత భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ చైర్మెన్ పుట్టా సుధాకర్‌యాదవ్ ప్రకటించారు. టీటీడీ బోర్డు సమావేశం తీర్మానాలను ఆయన వెల్లడించారు. ఇవీ ప్రధానాంశాలు. - భక్తుల కోసం టీటీడీ నిఘా, భద్రతా ఆధ్వర్యంలో కామన్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు రూ.1.60 కోట్లు మంజూరు. నిర్వాహణ బాధ్యతను హైదరాబాద్‌కు చెందిన మ్యాట్రిక్ సెక్యూరిటీస్, సర్వీసెస్ కంపెనీకి అప్పగింత. - దళిత, గిరిజన వాడలు, మత్స్యకార కాలనీలు ఇతర గ్రామాల్లో శ్రీవేంకటేశ్వరస్వామి, శ్రీరామ ఆలయాల నిర్మాణానికి ఇచ్చే నిధులను రూ.8లక్షల నుంచి రూ.10లక్షలకు పెంపు. - చిత్తూరు జిల్లా నాగలాపురం ఆలయ ప్రాముఖ్యతను చాటిచెప్పేందుకు అక్కడ వేదపాఠశాల ఏర్పాటు. - 2018–19 సంవత్సరానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆసుపత్రులు, వాటి అనుసంధాన ఆసుపత్రుల్లో మందులు, సర్జికల్ పరికరాల కొనుగోలుకు రూ.4.84 కోట్లు మంజూరు. - తిరుపతిలోని అలిపిరి వద్ద టాటా ట్రస్టు ఆధ్వర్యంలో క్యాన్సర్ ఆసుపత్రికి (అలిమేలు చారిటబుల్ ట్రస్టు పౌండేషన్) 33 సంవత్సరాల పాటు లీజుకు 25 ఎకరాల స్థలం కేటాయింపు. ఏడాదికి ఎకరాకు రూ.లక్ష లీజుగా నిర్ణయించారు. - తిరుపతి– చెర్లోపల్లి మధ్య మార్గంలో సైన్స్ మ్యూజియంకు 19.15 ఎకరాలు, సైన్స్‌సిటీకి 50.96 ఎకరాలను కేటాయింపు. - తిరుమలలో ధర్మగిరి వేదపాఠశాలలో వేద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఇచ్చే తరహాలోనే శ్రీవేంకటేశ్వర వేద యూనివర్సిటీలో వేద విద్యను అభ్యసించే విద్యార్థులకు రూ.3లక్షలు డిపాజిట్. - ఎస్వీ వేద విద్యాలయం ఆధ్వర్యంలో శ్రీబాలాజీ వేదపరిపోషణ ట్రస్టు ఏర్పాటు. దీనికి విరాళాలు అందించే భక్తులకు బస, స్వామివారి దర్శనం. - ఆంధ్రప్రదేశ్‌లోని పాల ఉత్పత్తిదారులను ప్రోత్సహించాలని నిర్ణయం. - 29 మంది ఇంజనీరింగ్ మజ్దూర్లకు హెడ్ మజ్దూర్లుగా పదోన్నతి. -
ఆరోపణలు చేసే వారు సీబీఐ విచారణకు సిద్ధమేనా?
-
సీబీఐ విచారణకు సిద్ధం
హైదరాబాద్: ఇటీవల కాలంలో కొందరు టీటీడీ అధికారులు, రాజకీయ నాయకులు చేస్తున్న ఆరోపణలపై తాను సీబీఐ విచారణకైనా సిద్ధమని టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు స్పష్టం చేశారు. అయితే ఆరోపణలు చేసే వారూ, వారి బినామీలూ సీబీఐ విచారణకు సిద్ధమేనా? అని ప్రశ్నించారు. సోమవారం సికింద్రాబాద్‌లోని ఓ హోటల్లో మీడియాతో మాట్లాడారు. తనపై వస్తున్న ఆరోపణలకు బాధపడ్డానని, భక్తులకు వాస్తవాలు తెలియాలనే మీడియా ముందుకు వచ్చినట్లు వెల్లడించారు.1994 నుంచి స్వామి వారి సన్నిధిలో అర్చకుడిగా ఉన్నానని గతంలో జేఈవోలుగా పనిచేసిన బాల సుబ్రమణ్యం, ధర్మారెడ్డి, శ్రీనివాసరాజు.. బ్రాహ్మణ, అర్చక వ్యతిరేకులుగా, నాస్తికులుగా పనిచేశారన్నారు. వెయ్యి కాళ్ల మంటపాన్ని మాస్టర్‌ప్లాన్ కోసం అంటూ కూల్చిన సమయంలో గట్టిగా పోరాటం చేశానని అన్నారు. తనపై కక్ష కట్టిన అధికారులు ఎంతో ప్రాచీనమైన, వంశపారంపర్యంగా వచ్చిన తన ఇంటిని కూడా కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బాలసుబ్రమణ్యం చట్టవ్యతిరేక విధానాలు, వ్యసనాలకు అలవాటుపడి అర్చకులను క్రూరంగా హింసించేవాడన్నారు. ఇక శ్రీనివాసరాజు అవినీతి, అక్రమాలు ప్రపంచానికి మొత్తం తెలుసని ఆరోపించారు. 24 ఏళ్లుగా ఇలాంటి అధికారులతో హింసకు గురయ్యానని చెప్పారు. 2001లో పింక్ డైమండ్ మాయమైందని, ఇది నాణేలు తగిలి పగిలిపోయిందని అధికారులు చెబుతున్నారని.. ఎంతో కఠినంగా ఉండే వజ్రం ఎలా పగులుతుందని ప్రశ్నించారు. 1800లో బ్రిటిష్ మ్యానువల్స్‌లో స్వామివారి వంటశాల పక్కనున్న నేలమాలిగల్లో నిధులున్నాయని ఉందని.. అక్కడ తవ్వకాలపైనా సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. 2 నెలలకోసారి అపోలో ఆస్పత్రికి వైద్య పరీక్షల కోసం వస్తానని, ఇప్పుడు కూడా దీని కోసమే వచ్చినట్లు తెలిపారు.