
స్వామికి దండం పెడుతున్న చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితుల వ్యవహారంలో తీవ్ర విమర్శలెదుర్కొంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. జరిగిన నష్టాన్ని పూడ్చుకోవా లని అనుకున్నారో ఏమో తాజాగా ఓ దొంగ స్వామీజీ విషయంలో తప్పులో కాలేశారు. సదరు స్వామీజీ గురించి ఏమాత్రం తెలుసుకోకుండానే ఒంగి ఒంగి దండాలు పెట్టడం ఇప్పుడు విశాఖ నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. ముక్కూమొహం తెలియని.. నేరచరిత్ర కలిగి వున్న ఆ దొంగ స్వామీజీ పట్ల సీఎం ఎంతో భక్తిప్రపత్తులు ప్రదర్శించి ఆయన నుంచి ఆశీస్సులు అందుకోవడం ఇప్పుడు వివాదా స్పదమవుతోంది.
శాలువా కప్పుతున్న శంకరస్వామి
చోరీ కేసులో స్వామి (ఫైల్)
విశాఖ విమానాశ్రయంలో గత మంగళవారం జరిగిన ఈ ఎపిసోడ్ కథాకమామిషు ఏంటంటే.. ధర్మపోరాట సభ పురస్కరించుకుని విశాఖకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబును విమానాశ్రయంలో దొంగ స్వామి కలుసుకున్నారు. తాను శంకర విద్యానంద సరస్వతినని, అమ్మవారి ఉపాసకుడినని చెప్పుకోవడంతో సీఎం ఆయనపట్ల ఎంతో భక్తి ప్రదర్శించారు. అంతేకాక.. ఆయనకు ఒంగి ఒంగి దండాలు పెట్టి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. ఆ తర్వాత సదరు శంకర సదానంద స్వామి అలియాస్ శంకరస్వామి అలియాస్ శ్రీ శంకర విద్యానంద సరస్వతిస్వామి నేరచరిత్ర వెలుగులోకి వచ్చింది. తీగలాగితే డొంక కదిలినట్లు.. స్వామీజీ లీలలు బయటపడ్డాయి. అవి..
- 2014 మే నెలలో పోలీసు జీపు నుంచి వైర్‌లెస్ సెట్, మైక్రో ఫోన్, వాకీటాకీ తదితర సామగ్రి అపహరించాడంటూ విశాఖ నాలుగో టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో అతనిని సీఐ లక్ష్మణరావు అరెస్టుచేసి రిమాండ్‌కు పంపారు. ఆ కేసు ఇప్పటికీ నడుస్తోంది.
- ఆ తర్వాత కూడా శంకరస్వామిపై అనేక ఆరోపణలు వచ్చాయి. రాత్రిపూట బీచ్‌రోడ్‌లో బ్లూలైట్ ఉన్న కారులో తిరుగుతూ మఫ్టీలో ఉన్న పోలీస్ అధికారినని ప్రజలను భయపెట్టిన దాఖలాలూ ఉన్నాయి.
- ఇటీవల ఓ కారు షోరూమ్‌కు వెళ్లి ఐదు వేలు అడ్వాన్స్, మిగిలిన మొత్తానికి పోస్ట్‌డేటెడ్ చెక్‌తో కారు కొనుగోలు చేసిన స్వామి.. ఆ తర్వాత నయాపైసా కూడా చెల్లించలేదు. దీంతో షోరూమ్ వారు వాహనాన్ని వెనక్కి తీసేసుకున్నారు. ఇంత ఘనమైన నేర చరిత్ర ఉన్న దొంగ స్వామి నుంచి ఆశీస్సులు అందుకోవడం ఇప్పుడు విశాఖలో చర్చనీయాంశమైంది. కాగా, దీనిపై విశాఖ నగర సీపీ యోగానంద్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. జరిగిన సంఘటనపై విచారణ జరుపుతున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment