సాక్షి, అమరావతి: తనకు ఎలాంటి ముందస్తుగా సమాచారం లేకుండా, తాను ఎటువంటి దరఖాస్తు చేయకుండానే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వారు తన పేరిట రూ.30 లక్షలు బ్యాంకు ఖాతాలో జమచేశారని టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ఆరోపించారు. టీటీడీలో జరుగుతున్న అక్రమాలను, అన్యాయాలను, ఆగమ విరుద్ధ అనాచారాలను బయటపెట్టినందుకు తనను కక్షపూరితంగా ఆలయంలో బాధ్యతల నుంచి తొలగించిన టీటీడీ.. ఇప్పుడు మరో ఏకపక్ష నిర్ణయంతో తన బ్యాంకు ఖాతాలో డబ్బులు జమచేశారని విమర్శించారు.
డబ్బులు డిపాజిట్ చేసిన తర్వాత అవి తన రిటైర్మెంట్ బెనిఫిట్ డబ్బులని అధికారులు చెబుతున్నారని ఆయన మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తన అర్చక నియామకమే సర్వీసు రూల్స్ ప్రకారం జరగలేదని, వంశపారంపర్య హక్కుల ప్రకారం తాను అర్చక బాధ్యతల్లో పనిచేశానని రమణదీక్షితులు వివరించారు. ఈ కారణంగానే 20–30 ఏళ్ల పాటు తాను ఆ బాధ్యతల్లో కొనసాగినప్పటికీ, తనకు ఎటువంటి అలవెన్స్‌లు, సర్వీసు ఉత్త ర్వులు లేవని అందులో తెలిపారు. పదవీ విరమణ తన సమ్మతితో జరగలేదని.. అలాగే రిటైర్మెంట్ సెటిల్మెంట్ అని చెబుతున్న నగదు కూడా తన సమ్మతితో జమ చేయలేదని ఆయన పేర్కొన్నారు. తనతో పాటు బలవంతంగా తొలగించిన వారి ఖాతాల్లో కూడా ఇంతే మొత్తంలో డబ్బులు జమచేశారన్నారు.
అధికారులు ఇంకెంత తరలించారో!?
ఎలాంటి వోచర్, రశీదు లేకుండా, ఎవరూ దరఖాస్తు చేసుకోకుండా టీటీడీ యాజమాన్యం ఇష్టమొచ్చినట్లు శ్రీవారి ఖజానాలోని దాదాపు కోటి రూపాయలు తమ ఖాతాల్లో జమ చేసినట్లు వారు మిగిలిన విషయాల్లో ఇంకెన్ని కోట్లు తరలించారో అని రమణదీక్షితులు అనుమానం వ్యక్తంచేశారు. టీటీడీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఇన్నాళ్లూ తాను చెబుతున్న మాటలు వాస్తవమేనని దీంతో స్పష్టమైందని తన ప్రకటనలో రమణదీక్షితులు వివరించారు. టీటీడీలో జరుగుతున్న వ్యవహారాలపై సీబీఐ విచారణ తప్పకుండా జరిపించాలని ప్రజలందరూ కోరాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. టీటీడీ చట్టవ్యతిరేక నిర్ణయాలను, తన పదవీ విరమణ వ్యవహారాలను కోర్టు ద్వారానే పరిష్కరించుకుంటానన్నారు.
గుట్టుగా నా ఖాతాలో రూ.30 లక్షలు టీటీడీ జమ
Published Wed, Aug 29 2018 1:16 AM | Last Updated on Wed, Aug 29 2018 1:17 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment