
సాక్షి, తిరుమల : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవో ప్రకారమే 65 ఏళ్లు నిండిన అర్చకులతో పదవీ విరమణ చేయించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈవో అనిల్ సింఘాల్ పేర్కొన్నారు. అర్చకుల వివాదంపై ఈవో మాట్లాడారు. 2013లో ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారమే ఆలయంలోని ముగ్గురు అర్చకులు పదవీ విరమణ చేసినట్లు చెప్పారు.
అలా పదవీ విరమణ చేసిన భక్తవత్సలం, నర్సింహ దీక్షితులు, రామచంద్ర దీక్షితులతో పాటు మరో తొమ్మిది మంది హైకోర్టును ఆశ్రయించారని పేర్కొన్నారు. అర్చకుల పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయస్థానం అర్హత, ఖాళీలు చూసుకుని అవకాశాలు కల్పించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు.
ప్రభుత్వ జీవో ప్రకారం అర్చుకుల పదవీ కాలం 25 ఏళ్లకు తక్కువ కాకుండా, 65 ఏళ్లకు ఎక్కువ కాకుండా అమలు చేయాలని పేర్కొన్నారు. ఒక్కో కుటుంబంలో ఒక్కొక్కరు చొప్పున నలుగురికి ప్రధాన అర్చకుల పదవులు ఇచ్చినట్లు వెల్లడించారు. ఏటా నలుగురు ప్రధాన అర్చకులు సహా మిగతా అర్చకులు స్వామివారి కైంకర్యాలు చేస్తూ వస్తున్నారని వివరించారు.
అర్చకుల పదవీ విరమణ తర్వాత మిగతా వారికి అవకాశం కలుగుతుందని చెప్పారు. కాగా, అర్చకులకు వయో పరిమితి విధించడంపై అర్చక సంఘాలు మండిపడుతున్నాయి. ఇలా చేయడంలో ఆగమశాస్త్ర నిబంధనలను ఉల్లంఘించడమేనని అంటున్నాయి.
వయో పరిమితి నిబంధన కారణంగా ప్రధాన అర్చక పదవి నుంచి రిటైరైన రమణ దీక్షితులు వేంకటేశ్వర స్వామి వారి ఆభరణాల నిర్వహణ గురించి సంచలన ఆరోపణలు చేశారు. సేవా కార్యక్రమాలు, నగల నిర్వహణలో అవకతవకలు జరిగినట్లు ఆయన వ్యాఖ్యానించారు. వీటిపై స్పందించిన సింఘాల్ స్వామి వారి ఆభరణాలను ప్రజల ముందు ఉంచేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించారు.
స్వామివారి ఆభరణాలపై జస్టిస్ వాద్వా, ఎం. జగన్నాథరావు కమిటీలు వేశారని చెప్పారు. 1952 నుంచి తిరుమలలో ఉన్న ఆభరణాలు, దస్త్రాలను కమిటీ పరిశీలించిందని తెలిపారు. స్వామి వారి ఆభరణాలు అన్నింటినీ భద్రపరుస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment