సాక్షి, హైదరాబాద్: కలియుగంలో మనుషులకు దురాశ పెరిగిపోయి డబ్బు మీద వ్యామోహంతో ఎక్కడలేని అరాచకాలకు పాల్పడుతున్నారని టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు వ్యాఖ్యానించారు. బుధవారం హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వరుడిని టీటీడీ రోజుల తరబడి పస్తులు ఉంచి అవమానించటానికి నిరసనగా జూలైలో తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్నట్లు ప్రకటించారు. స్వామివారి సంపదను కాపాడమని అడగడమే తాను చేసిన తప్పా? అని ప్రశ్నించారు. తనకు శ్రీనివాసుడి సేవ, గుడి మినహా మరో వ్యాపకం, కార్యక్రమాలు లేవని స్పష్టం చేశారు. స్వామివారికి సంబంధించిన కైంకర్యాలు, తిరువాభరణాలు, ఆలయ భద్రత, పూజల తీరు, అసలు నగలు ఎవరి ఆధ్వర్యంలో ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? తదితర అంశాలపై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
విచారణ జరిపాక దావా వేసుకోండి
టీటీడీ తనపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేయడం విచిత్రమని రమణ దీక్షితులు పేర్కొన్నారు. తన ప్రశ్నలకు జవాబు చెప్పకుండా నోటీసులు ఇవ్వటం, పరువు నష్టం దావా వేయటం సబబుగా లేదన్నారు. తన ఆరోపణలన్నింటిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి కావాలంటే అప్పుడు పరువునష్టం దావా వేయాల్సిందన్నారు. తన ఆరోపణల విలువ రూ.100 కోట్లేనా అనే సందేహం కలుగుతోందన్నారు.
స్వామి పాదాల చెంత రూ.25 వేల కోట్లు పెట్టాలి..
కోట్ల కుటుంబాలకు ఇష్ట దైవమైన తిరుమల శ్రీవారికి ఎన్నో శతాబ్దాలుగా ఆగమశాస్త్రం ప్రకారం కైంకర్యాలు, పూజలు జరుగుతున్నాయని రమణ దీక్షితులు చెప్పారు. అయితే ఇటీవల స్వామివారి చెంత అపచారాలు జరుగుతున్నాయని తెలిపారు. 25 రోజులపాటు స్వామివారిని పస్తులు ఉంచినందుకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పి రోజుకు రూ.1,000 కోట్లు చొప్పున 25 రోజులకు గాను రూ. 25 వేల కోట్లు స్వామివారి పాదాల చెంత పెట్టాలని డిమాండ్ చేశారు.
ప్రతాపరుద్రుడి కానుక 18 లక్షల మోహరీలు
కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుడు స్వామివారికి 18 లక్షల బంగారు మోహరీలు కానుకగా ఇచ్చారని రమణ దీక్షితులు చెప్పారు. ఒక్క మోహరీ అంటే 100 గ్రాముల బంగారం అని వివరించారు. ఈ సంపదను ఆలయ ప్రాకారంలోనే దాచి ఉంచినట్లుగా చరిత్ర చెబుతోందన్నారు. స్వామివారికి నైవేద్యం తయారు చేసే పాకశాల నుంచి సంపద దాచిన ప్రాకారానికి సొరంగ మార్గం ఉందన్నారు. అలాంటి పాకశాలలో నిర్మాణ పనులు ఎందుకు చేశారో వెల్లడించాలన్నారు.
ఆ మేడం ఎవరు?
భూకంపం వచ్చిన మాదిరిగా తిరుమల ఆలయంలో పోటును తవ్వేశారని రమణ దీక్షితులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అనుమతితోనే ఈ పనులు నిర్వహిస్తున్నామని జేఈవో తనతో స్వయంగా చెప్పారన్నారు. ‘ఒక మేడం గారు కూడా చెప్పారని జేఈవో అన్నారు. ఆ మేడం ఎవరో తెలియాలి. నా మాట వినకుండా అతి క్రూరంగా వెయ్యికాళ్ల మండపాన్ని తొలగించారు. వెయ్యేళ్ల క్రితం నిర్మించిన కట్టడాలకు మరమ్మతుల పేరుతో అసలేం చేస్తున్నారో చెప్పాలి. రాబోయే తరాలకు అందించాల్సిన చారిత్రక సంపదను నిర్వీర్యం చేస్తున్నారు’అని రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు.
మళ్లీ మళ్లీ అవే ఎందుకు?
తిరుమల వెంకన్నకు కిరీటం, స్వర్ణపత్రాలు, కంటెలు, శంఖుచక్రాలు, హస్తములు, సహస్ర నామహారం, లక్ష్మీహారం, తులసీహారం, సాలగ్రామ హారం, సూర్యకిరీటం, అంతెలు, పద్మపీఠం లాంటివన్నీ ఉన్నా భక్తులతో మళ్లీ మళ్లీ అదే నమూనాలో ఎందుకు తయారు చేయిస్తున్నారో అర్థం కావటం లేదని రమణ దీక్షితులు చెప్పారు. కొత్తగా హారాలు వచ్చినప్పుడు పాతవాటిని భద్రపరిచే ట్రెజరీని ఎవరు పర్యవేక్షిస్తున్నారో చెప్పాలన్నారు. ప్రభుత్వం దీనిపై సమాధానం ఇవ్వకుండా దాటవేస్తోందని ఆరోపించారు.
2017లో అతి నీచమైన కార్యక్రమాలు...
2017లో అతి నీచమైన, అపవిత్ర కార్యక్రమాలు ఎన్నో స్వామివారి సన్నిధిలో జరిగాయని రమణ దీక్షితులు తెలిపారు. ‘అంటు’లో ఉన్న ఇద్దరు అర్చకులతో పవిత్రోత్సవం, బ్రహ్మోత్సవాల్లో పూజలు చేయించారన్నారు. ఇలా చేయటం స్వామివారి పట్ల అపచారమని చెప్పినందుకే తనను ఇలా వేధిస్తున్నారన్నారు. 1994–95లో అప్రైజర్స్ ఆభరణాల లెక్క తేల్చగా తాను టీటీడీకి రూ.34 వేలు కట్టానని చెప్పారు. ప్రభుత్వం నియమించే అధికారుల వల్లే అన్ని సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. తిరుమలలో చోటు చేసుకుంటున్న ఘటనలపై పెద్దలు, రాజకీయ ప్రముఖులు, స్వామివారి భక్తులను కలుస్తానని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment