
సాక్షి, హైదరాబాద్ : టీటీడీ ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గురువారం సాయంత్రం ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఈ సందర్భంగా వైఎస్ జగన్ దృష్టికి తీసుకు వచ్చారు. టీటీడీలో తనతో పాటు మరో ముగ్గురిని అక్రమంగా తొలగించారని తెలిపారు. వారసత్వంగా వచ్చిన అర్చకత్వ విధుల నుంచి తమను తొలగించారంటూ రమణ దీక్షితులు చెప్పిన విషయాలపై వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. రమణ దీక్షితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
భేటీ అనంతరం రమణ దీక్షితులు మాట్లాడుతూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను కలిసి తన ఆవేదన చెప్పుకున్నానని అన్నారు. తాను చాలాసార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపాయింట్‌మెంట్ కోరినాని, అయితే ఆయన సమయం ఇవ్వలేదన్నారు. తమకు జరిగిన అన్యాయం గురించి వైఎస్ జగన్‌కు చెప్పుకున్నామని రమణ దీక్షితులు పేర్కొన్నారు.
కాగా నిక్షేపాల కోసం తిరుమల శ్రీవారి పోటులో కొందరు తవ్వకాలు జరిపారని రమణ దీక్షితులు తీవ్ర ఆరోపణలు చేసిన విషయం విదితమే. తవ్వకాలు జరిగాయనడంలో ఎలాంటి సందేహం లేదని.. ఆ వంట గదిలో జరిగిన మార్పులే ఇందుకు సాక్ష్యమని ఆయన అన్నారు. గతేడాది డిసెంబర్ 8న రహస్యంగా ఈ తవ్వకాలు జరిగాయన్నారు. ఓ జాతీయ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రమణ దీక్షితులు పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.