సాక్షి, తిరుపతి : మహాసంప్రోక్షణ పేరుతో ఇటీవల కాలంలో ఎన్నడూ లేనివిధంగా ఆరు రోజుల పాటు శ్రీవారి దర్శనం నిలిపివేయాలని టీటీడీ తీసుకున్న నిర్ణయంపై భక్తుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధానార్చకులు రమణదీక్షితులు కొద్దిరోజుల క్రితం చేసిన ఆరోపణల నేపథ్యంలో టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇదే విధంగా మహాసంప్రోక్షణ నిర్వహించిన రోజుల్లో భక్తులకు యథావిధిగా దర్శనాలు కల్పించిన టీటీడీ.. ఈసారి ఆరు రోజులపాటు పూర్తిగా స్వామివారి దర్శనాన్ని నిలిపివేయడంపై భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు.
పాలక మండలి తీసుకున్న ప్రస్తుత నిర్ణయంతో గతంలో వచ్చిన ఆరోపణలకు బలం చేకూరుతోందని భక్తులు అంటున్నారు. పోటులో తవ్వకాలు జరిగాయని, పింక్ డైమండ్ మాయమైందని వచ్చిన ఆరోపణలు కప్పిపుచ్చుకునేందుకే ప్రస్తుతం ఆలయం లోపల పనులు చేపడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే సంప్రోక్షణ సమయంలో భక్తులను అనుమతించకూడదని టీటీడీ నిర్ణయం తీసుకుందని విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. గతంలో మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించే సమయంలో భక్తులకు కొన్ని గంటలపాటు శ్రీవారి దర్శనం కల్పించామని పలువురు అర్చకులు గుర్తుచేస్తున్నారు. మరోవైపు.. మహాసంప్రోక్షణ సమయంలో దర్శనం చేసుకుంటే ఫలితం వుండదని ప్రస్తుత అర్చకుల్లో కొందరు చెబుతున్నారు. దీంతో టీటీడీ నూతన పాలకమండలి తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది.
భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి
శ్రీవారి దర్శనాన్ని ఆరు రోజులపాటు భక్తులకు దూరంచేయడం మహాపాపం.. మహా అపచారం.. మహాసంప్రోక్షణ కార్యక్రమంలో భాగంగా గతంలో టీటీడీ జేఈవో 40వేల మంది భక్తులను అనుమతిస్తామని చెప్పారు. ఇప్పుడు మాట మార్చారు. రెండు టోల్‌గేట్లు, రెండు నడకదారి మార్గాలను మూసివేస్తామని ప్రకటించడం టీటీడీ చరిత్రలో ఇదే మొదటిసారి. ఆగమ సలహా మండలి, పెద్ద జీయర్, చిన్న జీయర్, మఠాధిపతులను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంవల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి.
గతంలో పద్మావతి అమ్మవారి ఆలయంలో మహాసంప్రోక్షణ కార్యక్రమం జరిగినప్పుడు అమ్మవారి ప్రతిరూపాన్ని తయారుచేసి అమ్మవారి శక్తిని ఆ ప్రతిమలలో ఆవాహన చేసి భక్తుల సందర్శనార్థం ఉంచారు. మరి తిరుమల శ్రీవారి ఆలయ సంప్రోక్షణ విషయంలో అలా ఎందుకు చేయడంలేదు? ఆలయం మూసివేసే హక్కు, అధికారం టీటీడీ ధర్మకర్తల మండలి, ఐఏఎస్ అధికారులకు లేదు. భక్తులను దర్శనానికి అనుమతించకుండా మహాసంప్రోక్షణ నిర్వహించాలని ఆగమ శాస్త్రం చెప్పిందా!?
– నవీన్‌కుమార్‌రెడ్డి, శ్రీవారి భక్తుడు
Comments
Please login to add a commentAdd a comment