సాక్షి, విజయవాడ: తిరుమల శ్రీవారి ఆభరణాల మాయంలో టీడీపీ పెద్దల ప్రమేయంపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఆరోపణలపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం భయపడుతున్నట్లు తేటతెల్లమైంది. ‘‘రమణదీక్షితులుని బొక్కలో వేసి నాలుగు తగిలిస్తే నిజాలు బయటికొస్తాయి..’’అన్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. 24 గంటలు తిరక్కముందే.. ‘‘తప్పుగా మాట్లాడాను క్షమించండి..’’ అని వేడుకున్నారు. ఆదివారం విజయవాడలో ప్రారంభమైన టీడీపీ మహానాడులో ఆయన మాట్లాడారు.
అదే తెలంగాణలో అయితే ఇంటరాగేషన్ చేసేవారే: ‘‘రమణదీక్షితులు గారిని ఉద్దేశించి అన్న మాటలకు క్షమాపణలు చెబుతున్నాను. బ్రాహ్మణుల ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను. అందుకే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను. నిజానికి నేను ప్రతిపక్షం వారిని విమర్శించాలనుకుని రమణదీక్షితులును అనేశాను. అయినా, ముఖ్యమంత్రి ఇంట్లో శ్రీవారి నగలు ఉన్నాయని ఎవరైనా ఆరోపిస్తే.. తెలంగాణలో అయితే ఖచ్చితంగా బొక్కలోవేసి ఇంటరాగేషన్ చేసేవారు. అసలు వేంకటేశ్వర స్వామి నగల గురించి మాట్లాడినందుకు శిక్షించేవారు..’’ అని సోమిరెడ్డి అన్నారు. తద్వారా ఈ వ్యవహారంలో దర్యాప్తు ఉండబోదని టీడీపీ మరోసారి వెల్లడించింది.
వెంకన్న చౌదరి.. రమణదీక్షితులు ఎవరు?: శ్రీవారి ఆభరణాల మాయం వ్యవహారం గుట్టురట్టైన దగ్గర్నుంచి టీడీపీ నేతల్లో ఆందోళన తీవ్రస్థాయికి చేరడం చూస్తూనేఉన్నాం. టీడీపీ ఎంపీ మురళీమోహన్ ఏకంగా దేవుడికి కులాన్ని ఆపదిస్తూ ‘వెంకన్న చౌదరి’ అని, ఆ తర్వాత నోరుజారానని చెప్పుకొచ్చారు. అంతలోనే మంత్రి సోమిరెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ‘ఎవరా రమణదీక్షితులు.. బొక్కలోవేసి నాలుగు తగిలిస్తే నిజాలు బయటికొస్తాయి’అని అన్నారు. సోమిరెడ్డి వ్యాఖ్యలపై బ్రాహ్మణ సంఘాలతోపాటు పలు వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో చివరికి వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment