‘అసలు ఆభరణాల స్థానంలో నకిలీ ఆభరణాలు.. పోటులో రహస్య తవ్వకాలు.. క్రమం తప్పిన కైంకర్యాలు.. కుదించుకుపోయిన సేవా కార్యక్రమాలు.. వెరసి విశ్వ విఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట మంటగలిపేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది. భక్తుల మనోభావాలు దెబ్బతింటాయన్న జంకే లేకుండా దైవ భక్తినీ అభాసుపాలుజేసింది. దేవుడి సొమ్మునూ కాజేసేందుకు యత్నాలు సాగించి అప్రతిష్టను మూటగట్టుకుంది. అర్చకులను హీనంగా చూడటంతో పాటు సంప్రదాయాలకు పాతరేసింది. ఈ పాలకులకు దేవుడంటే భయం లేదు.. అర్చకులు, భక్తులంటే లెక్కే లేదు’ – టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు
టీడీపీ అధికారంలోకి వచ్చాక టీటీడీలో నాస్తిక అధికారుల పెత్తనం ఎక్కువైంది. వీరికి దేవుడిపై భక్తి, భయం, నమ్మకం లేదు. సంప్రదాయాలు, ఆగమ శాస్త్రంపై గౌరవం లేదు. ఆగమశాస్త్ర ప్రకారం తోమాల సేవ 45 నిమిషాలు నిర్వహించాలి. వీఐపీల కోసం 10 నిమిషాల్లో ముగించాలని ఒత్తిడి తెస్తున్నారు. సహస్ర నామార్చన 45 నిమిషాల పాటు చేయాల్సి ఉంటుంది. 15 నిమిషాల్లో ముగించేస్తున్నారు. నైవేద్యం సమర్పించాలంటే గంట సమయం పడుతుంది. దానినీ 10 నిమిషాల్లో కానిచ్చేయాలని ఆదేశిస్తున్నారు. ఆగమ శాస్త్రంలో పేర్కొన్న కాల ప్రమాణాల ప్రకారం మొదటి నైవేద్యం వేకువజామున 5.30 గంటలకు సమర్పించాలి. రెండో నైవేద్యం 11–12 గంటల మధ్య పెట్టాలి. ఉదయం 6 గంటలకే రెండో నైవేద్యం సమర్పించేలా అర్చకులపై ఒత్తిడి తెస్తున్నారు. అప్పటినుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీవారికి నైవేద్యం పెట్టకుండా పస్తులు ఉంచుతున్నారు. వీఐపీల మెప్పు కోసం నైవేద్యం, పూజా కైంకర్యాల కాలాన్ని కుదిస్తున్నారు. ఈ పరిస్థితిని ఉన్నతాధికారులు, పాలక మండలికి నివేదించినా ప్రయోజనం లేదు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదు.
అర్చకులకు వైఎస్ హయాం స్వర్ణయుగం
ఆలయాల్లో వంశపారంపర్య అర్చకత్వాన్ని పునరుద్ధరిస్తామని, అన్ని ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు లోటు రాకుండా చూస్తామని వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారు. అర్చకుల జీవనానికి, భృతికి అవసరమైన చర్యలు తీసుకుంటామని మాటిచ్చి మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే వంశపారంపర్య అర్చకత్వాన్ని పునరుద్ధరించి, అర్చక హక్కులు, మర్యాదలను కాపాడారు. ఊరు వదిలి వెళ్లిన అర్చకులందరినీ పిలిపించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ధూప, దీప, నైవేద్య, పూజా కైంకర్యాలకు అవసరమైన చర్యలు చేపట్టారు. వారి జీవన భృతికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. ఆయన హయాంలో నియమించిన శ్రీవారి ఆలయ ధర్మకర్తల మండళ్లు, ఐఏఎస్ అధికారులు ఆలయ సంప్రదాయాలను కాపాడటంతోపాటు నిత్య కైంకర్యాలను ఆగమ శాస్త్ర ప్రకారం జరిపించేందుకు కృషి చేశారు. దురదృష్టవశాత్తు ఆయన మరణంతో అర్చక వ్యవస్థ, ఆలయ సంప్రదాయాల మనుగడకు ప్రమాదం ఏర్పడింది.
(తిరుమల రవిరెడ్డి)సాక్షి, తిరుపతి: రాష్ట్ర ప్రభుత్వ తీరుతో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట మంటగలుస్తోందని టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. భగవంతుడన్న భయమే లేకుండా అరాచకాలకు తెగబడిందని నిప్పులు చెరిగారు. కొన్నేళ్లుగా తిరుమలలో సాగిన అక్రమాల పర్వాన్ని ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎండగట్టారు.
సాక్షి: పింక్ డైమండ్‌తో పాటు వజ్రాలు, వైఢూర్యాలు పోయాయని ఆరోపించారు. గోవిందరాజస్వామి ఆలయంలోని కిరీటాలు మాయమయ్యాయని అన్నారు?
రమణ దీక్షితులు: అవును. మైసూరు మహారాజు ఇచ్చిన ప్లాటినమ్ హారంలో (నడిమి నాయకం) గులాబీ రంగు వజ్రం ఉండేది. ఉత్సవాల్లో భక్తులు విసిరిన నాణేల కారణంగా డైమండ్ పగిలిపోయిందని రికార్డు చేశారు. ఆ సమయంలో డాలర్ శేషాద్రి ఇన్‌చార్జ్. నాణేలు తగిలి డైమండ్ పగిలిపోయిందనటం విచిత్రమైన సమాధానం. పింక్ డైమండ్‌ను చాలా పెద్దమొత్తానికి జెనీవాలో నిర్వహించిన వేలంలో అమ్ముకున్నారు. గోవిందరాజస్వామి ఆలయంలో మాయమైన కిరీటాల విలువపైనా అనుమానం ఉంది. మొదట కిరీటాల విలువ రూ.వందల కోట్లు అన్నారు. ఆ తరువాత వాటి విలువ చాలా తక్కువ అన్నారు.కిరీటాలు ఏమయ్యాయో ఇప్పటికీ వెలుగు చూడలేదు.
సాక్షి: శ్రీవారి ఆలయంలో తవ్వకాలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎందుకంత రాద్ధాంతం జరిగింది?
రమణ దీక్షితులు: 2017 డిసెంబర్‌లో చిన్నపాటి మరమ్మతుల పేరిట 25 రోజులు పోటును మూసివేశారు. ఆ సమయంలో వేరేచోట ప్రసాదాలు తయారు చేశారు. అలా చేయటం అపవిత్రం. దీనివల్ల స్వామివారు 25 రోజులు నైవేద్యాన్ని స్వీకరించలేదు. లోపల గోడల్ని పగులగొట్టి, రాళ్లన్నీ తొలగించిన తవ్వకాలను చూసి ఆశ్చర్యపోయాను. చాలా బీభత్సంగా తవ్వేశారు. భయమేసింది. దీనిపై ఈవోను అడిగితే తెలియదన్నారు. తరువాత 24 గంటల వ్యవధిలో హడావుడిగా పూడ్చివేశారు. ఆ సమయంలో క్షుద్రపూజలు జరిగినట్టు తెలిసింది. 1990లో కప్పు కూలిపోతుందని ఇనుప స్తంభాలు పెట్టి నిలబెట్టారు. బంగారు వాకిలికి 15 అడుగుల దూరంలో.. గర్భాలయానికి, ఆనంద నిలయానికి చాలా దగ్గరలో ఇది ఉంది. వెయ్యేళ్ల క్రితం నాటి ప్రాచీన కట్టడంలో ఇంత పెద్దఎత్తున మరమ్మతులు చేయటం వల్ల గర్భాలయం దెబ్బతినే ప్రమాదముంది. జేఈఈ చిన్న మరమ్మతే అన్నారు. గట్టిగా అడిగితే.. తనకు ఉత్తర్వులు వచ్చాయన్నారు. ఈవో తనకు తెలియదన్నారు. ఆలయంలో ఇంత అపచారం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేక నిలదీశాను. మీడియా ముందుకు వచ్చాను. అందుకే నా పదవీ విరమణ అంశాన్ని తెరపైకి తెచ్చారు.
సాక్షి: కనిపించకుండా పోయిన ఆభరణాలకు విలువ కట్టి, బాధ్యుల నుంచి రాబడుతున్నారా?
రమణ దీక్షితులు: 1996 తరువాత ఏ ఆభరణాలు ఉన్నాయి? ఏవి లేవు? అనేది ఎవరికీ తెలియటం లేదు. ఎన్నిసార్లు వాటిని సరిచూశారు? వాటిలో హెచ్చుతగ్గులేమైనా ఉన్నాయా? ఉంటే ఎవరు బాధ్యత వహిస్తున్నారు? విలువ తగ్గి ఉంటే ఎవరి వద్ద, ఎంత కట్టించుకున్నారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. 22 ఏళ్లుగా ఏం జరుగుతోందో ఇప్పటివరకు ఎవరికీ తెలియదు.
సాక్షి: గుప్త నిధుల కోసమే తవ్వకాలు జరిపారని మీరూ ఆరోపించారు? అసలేం జరిగింది?
రమణ దీక్షితులు: అవును. విలువైన ఆభరణాలు ఉన్నాయి కాబట్టే ఆలయంలో కొన్ని చోట్లకు భక్తులను అనుమతించరు. వెయ్యికాళ్ల మండపం కింద వెయ్యి అడుగుల పొడవు, 30 అడుగల వెడల్పుతో పెద్ద భాండాగారం ఉంది. ఆలయం పోటు వద్ద పల్లవులు, చోళులు, పాండ్యులు, మరికొందరు రాజులు స్వామి వారికి 18 లక్షల మొహర్లతో చేసిన కనకాభిషేకం ఆభరణాలు, మరో 18 లక్షల మొహర్లతో 9.50 అడుగుల మూలవరుల ఆభరణాలన్నీ భాండాగారంతో పాటు ఆలయ రహస్య ప్రదేశాల్లో దాచి ఉంచారనే విషయం తెలుసుకుని ఈ తవ్వకాలు జరిపారు. వెయ్యికాళ్ల మండపం కూల్చివేసిన సమయంలో నాలుగు భోషాణాల్లో ఆభరణాలు లభ్యమైనట్టు తెలిసింది. మిగిలిన ఆభరణాల కోసం మహా సంప్రోక్షణ సమయంలో తొమ్మిది రోజులపాటు భక్తులకు అనుమతి లేదని ప్రకటించారు. ఇది మీడియాలో రావటం, భక్తుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావటంతో వెనకడుగు వేశారు.
సాక్షి: ఆభరణాలు మాయం అయ్యాయంటున్నారు. వాటి స్థానంలో నకిలీవి అలంకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మీరేమంటారు?
రమణ దీక్షితులు: నిజమే. నకిలీ రత్నాలతో చేసిన ఆభరణాలను దాతల నుంచి స్వీకరిస్తున్నారు. ఇందులో బొక్కసం సిబ్బంది ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రాచీనమైన నవరత్నాల ఆభరణాలకు బదులు నకిలీవి ఎక్కువగా వాడటం గమనిస్తున్నాం. మూలవరులు, ఉత్సవరులు, అమ్మవార్ల విగ్రహాలకు సంబంధించిన అనేక ఆభరణాలను నకిలీ రత్నాలతో చేయించారు. మొన్నటి బ్రహోత్సవాల్లో ప్రాచీన ఆభరణాలు అసలు కనిపించలేదు. నకిలీ రత్నాలతో చేయించిన కొత్త ఆభరణాలనే వినియోగించారు.
సాక్షి: అర్చకులెవరికీ పదవీ విరమణ ఉండదని చెప్పారు. ఇప్పుడేమో ఆ అంశాన్ని తెరపైకి తెచ్చారెందుకని?
రమణ దీక్షితులు: వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన చట్టాలన్నిటినీ చంద్రబాబు అధికారంలోకి రాగానే రద్దు చేశారు. వంశపారంపర్య హక్కుల్లో అర్చకులకు పదవీ విరమణ లేదని శాస్త్రంతోపాటు సుప్రీం, హైకోర్టు కూడా చెప్పాయి. ఆలయ సంప్రదాయంలో వేల సంవత్సరాల్లో ఎక్కడా పదవీ విరమణ అనేది లేదు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రమే పదవీ విరమణను తెరపైకి తెచ్చింది. అప్పట్లో జేఈవో బాలసుబ్రహ్మణ్యం, ఇప్పుడున్న శ్రీనివాసరాజు ఇద్దరూ పరమ నాస్తికులు. బ్రాహ్మణ ద్వేషులుగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరూ అన్యమతాన్ని ప్రోత్సహించేవాళ్లే. నైవేద్యాలు, కైంకర్యాలను శాస్త్రోక్తంగా జరపనివ్వకుండా వీళ్లే అడ్డుపడుతున్నారు.
సాక్షి: రాష్ట్రంలో అర్చకుల పరిస్థితి ఎలా ఉంది?
రమణ దీక్షితులు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 34 వేల ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులు, వారి కుటుంబాలు దుర్భర స్థితిలోకి నెట్టబడ్డాయి. 6ఏ ఆలయాల్లో అర్చకుల పరిస్థితి కొంత బాగున్నా.. మిగిలిన ఆలయాల్లో పనిచేస్తున్న వారు దయనీయ జీవితం గడుపుతున్నారు. అంతకుముందు వంశపారపర్య అర్చకత్వం వల్ల వచ్చిన కొద్దిపాటి వరంబడి, వైదిక సంస్కృతి, ఆగమ సంప్రదాయాలు వల్ల వచ్చే వరంబడులు, ప్రసాదాల్లో కొంత భాగం, అర్చన, హారతి సమయంలో భక్తులు పళ్లెంలో వేసే కానుకల ద్వారా వారి జీవితాలు బాగా గడిచేవి. ఎన్టీఆర్ తెచ్చిన మిరాశీ అబాలిష్ చట్టంతో అర్చకులు వాటిక్కూడా దూరమయ్యారు. ప్రభుత్వం జీతభత్యాలు కూడా ఇచ్చే అవకాశం లేకపోవటంతో 75 శాతం ఆలయాలు మూతపడ్డాయి. చాలామంది అర్చకులు జీవన భృతి కోసం వేరే వృత్తుల్లోకి వెళ్లారు. దీనివల్ల ఎన్నో ఆలయాలు ధూప, దీప, నైవేద్యాలకు దూరమయ్యాయి. టీడీపీ హయాంలో అర్చకులకు ఏపాటి గౌరవ, మర్యాదలు లేక చాలా కష్టాలు పడుతున్నారు.
సాక్షి: జీవో నంబర్ 855 ప్రకారం తిరుమల అర్చకుల సర్వీసును రెగ్యులర్ చేస్తామని, పీఆర్‌సీ కింద వేతనాలు ఇచ్చి రిటైర్మెంట్‌కు అవకాశం కల్పిస్తామని చెబుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం?
రమణ దీక్షితులు: ఈ జీవోనే పెద్ద కుట్ర. అర్చకుల మధ్య చిచ్చుపెట్టిన జీవో అది. ఒక్కొక్క కుటుంబంలో సీనియర్ మోస్ట్ అర్చకులను ప్రధాన అర్చకులుగా నియమించారు. తరువాత ప్రధాన, ఉప ప్రధాన అర్చకులు, ముఖ్య అర్చకులుగా విభజించారు. అదేవిధంగా నాతోపాటు మరో ముగ్గురిని ప్రధాన అర్చకులుగా నియమించి మా కుటుంబాల మధ్య చిచ్చుపెట్టారు. నాకు రిటైర్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం ప్రధాన అర్చక హోదా కోసం కొట్టుకుంటున్నారు. ఆలయంలో జేఈవో, మరికొందరు కింకరులు చిచ్చుపెట్టారు. గతంలో ప్రధాన, ముఖ్య అర్చక పోస్టులే లేవు. అందరినీ మిరాశీదారులు అని పిలిచేవాళ్లం. వయసు, అనుభవానికి గౌరవం ఇచ్చేవారు తప్ప.. చిన్నాపెద్ద భేదం ఉండేది కాదు. ఆ జీవో ద్వారా ఒకరిని ప్రధాన అర్చకులుగా చేసి మిగిలిన వారిలో ఈర‡్ష్య, ద్వేషం పెంచింది ఈ ప్రభుత్వమే. వేతనాలు కూడా ఇవ్వలేదు.
సాక్షి: చిన్న ఆలయాలకు తిరుమల నుంచి సుమారు రూ.500 కోట్లు బకాయిలు ఉన్నాయని అర్చక సమాఖ్య నేతలు చెబుతున్నారు. ఇందులో నిజమెంత?
రమణ దీక్షితులు: వైఎస్ రాజశేఖరరెడ్డి 6ఏ ఆలయాల నుంచి ఏటా కొంత మొత్తాన్ని చిన్న ఆలయాలకు ఇచ్చేవారు. ఆ నిధులు ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలు, అర్చకుల వేతనాలకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేశారు. ఇప్పుడా పరిస్థితి లేదు. భక్తుల ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని ప్రభుత్వం తీసుకుంటోంది. 2014లో టీటీడీకి రూ.965 కోట్ల ఆదాయం రాగా.. రూ.900 కోట్లను డిపాజిట్ చేశారు. 2018–19 సంవత్సరంలో రూ.1,600 కోట్లు పైచిలుకు వస్తే.. అందులో రూ.1,600 కోట్లు తినేసి రూ.20, రూ.30 కోట్లు మాత్రమే బ్యాంక్‌లో డిపాజిట్ చేయటమే ఇందుకు నిదర్శనం. టీటీడీ నిధులను అతిథి గృహాల నిర్మాణానికి, అమరావతిలో ఆలయాల నిర్మాణానికి కేటాయిస్తున్నారు. ఇలా టీటీడీ నిధులు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. కానీ.. చిన్న ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు.
సాక్షి: ఆలయాలపై ప్రభుత్వ పెత్తనం తగ్గించాలని హైకోర్టులో వ్యాజ్యం వేశారు. దానిపై మీరేమంటారు?
రమణ దీక్షితులు: మీకు ముందే చెప్పా. టీటీడీ నిధులు పక్కదారి పడుతున్నాయని. వ్యక్తిగత ప్రయోజనాల కోసం టీటీడీ నిధులను వినియోగిస్తున్నారు. ఎక్కడో నిర్మిస్తున్న వాకింగ్ ట్రాక్‌లకు ఆలయ నిధులు ఇవ్వడమేంటి. వారికి కావాల్సిన కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చడానికి టీటీడీ నిధులను ఖర్చుచేస్తున్నారు. ఆలయాలపై ప్రభుత్వ పెత్తనం అధికమైందన్నది వాస్తవం. న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులనే అమలు చేయటం లేదు. సమాచార హక్కు చట్టం కింద ఏదైనా సమాచారం అడిగితే ఇవ్వటానికి లేదంటున్నారు. టీటీడీని పూర్తిగా టీడీపీ సంస్థగా మార్చేసుకున్నారు. తిరుమలను టీడీపీ కార్యాలయంగా మార్చుకున్నారు. ఒక ఐఏఎస్ అధికారి కూడా పూర్తిగా టీడీపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు. ఆయనను బదిలీ చెయ్యకుండా మళ్లీ ఏడాది పొడిగించారు.
Comments
Please login to add a commentAdd a comment