
ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఈ ఎన్నికలు అబద్ధానికి..నిబద్ధతకు మధ్య జరుగుతున్నాయి. రాష్ట్ర విభజన తరువాత జరిగిన జరిగిన గత ఎన్నికల్లో కేవలం సీనియర్ అని మాత్రమే చంద్రబాబుకు ప్రజలు పట్టం కట్టారు. ఆ విలువ నిలుపుకోలేకపోయారు. ఐదేళ్లలో చంద్రబాబు కృష్ణ, గుంటూరు, చిత్తూరు జిల్లాలకే ముఖ్యమంత్రిగా వ్యవహరించాడే తప్ప ఉత్తరాంధ్రకి కాదు. ఈ ఎన్నికల్లో చంద్రబాబును ఓడించి ఉత్తరాంధ్రను కాపాడుకుంటామని సామాజిక శాస్త్రవేత్త, ఏయూ సోషయాలజీ ప్రొఫెసర్ విజయ్‌కుమార్ స్పష్టం చేశారు. ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేకఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
సాక్షి: సంక్షేమ పథకాలతో ఓటర్లను చంద్రబాబు మభ్యపెడుతున్నారా..?
విజయ్‌కుమార్ : ఔను. ఐదేళ్ల పాటు గుర్తు రాని సంక్షేమ పథకాలు ఎన్నికలు రెండు నెలలుండగా ఎందుకు గుర్తొస్తున్నాయి. అంటే ప్రజలు పట్టించుకోరనే ఆలోచనలో ఈ రాజకీయనాయకులున్నారు. పవిత్రమైన ‘పసుపు–కుంకుమ’ పేరుతో ఎన్నికలకు ముందు మహిళలకు గాలం వేస్తున్నారు.
సాక్షి: ఉత్తరాంధ్ర వాసులను మోసం చేస్తున్నారనుకుంటున్నారా..?
విజయ్‌కుమార్ : శాఖపట్నం దేశంలోనే అద్భుతమైన నగరం. అంతర్జాతీయ సదస్సులు ఇక్కడ నిర్వహించి..ఆ ఇమేజ్‌తో విదేశీ పెట్టుబడులను అమరావతికి తరలించుకుపోతున్నారు. విశాఖలో పాలు తాగి విషం చిమ్మి తన నైజాన్ని చంద్రబాబు చాటుకుంటున్నాడు.
సాక్షి: రాష్ట్రాన్ని పాలించే నాయకుడు ఎలా ఉండాలనుకుంటున్నారు.?
విజయ్‌కుమార్ : నిస్వార్థ సేవకుడు, మాట తప్పని నాయకుడు కావాలి.
సాక్షి: రాజధాని ఎంపికలో విశాఖకు అన్యాయం జరిగిందంటారా..?
వంద శాతం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అంతర్జాతీయ, జాతీయ కార్పొరేట్ సంస్థలన్నీ హైదరాబాద్ నుంచి విశాఖకు తరలివచ్చేవి. రాష్ట్రం విడిపోయిన తర్వాత విశాఖకు రావల్సిన కార్పొరేట్ సంస్థలన్నీ విజయవాడ, తిరుపతి, చిత్తూరు, గుంటూరు నగరాలకు తరలించుకుపోయారు. 2014లో హుద్‌హుద్ తుఫాన్ వస్తే అప్పుడు నష్టపోయిన ప్రజలకు సహాయం చేయలేదు కానీ..దాన్ని బూచిగా చూపి రాజధానికి విజయవాడ అనుకూలమని చంద్రబాబు ప్రజలను నమ్మించాడు.
సాక్షి: తెలంగాణ ప్రజలు తిరస్కరించినట్టు ఏపీ ప్రజలూ సిద్ధంగా ఉన్నారా...?
విజయ్‌కుమార్ : తెలంగాణ ప్రజలు చంద్రబాబు కుతంత్ర రాజకీయాలను ముందుగానే పసికట్టారు. ఉత్తరాంధ్ర ప్రజలు కూడా చంద్రబాబు అసలు నైజాన్ని తెలుసుకున్నారు. కచ్చితంగా టీడీపీకి ఈ ఎన్నికలు బుద్ధి చెబుతాయి.
సాక్షి: పవన్ కల్యాణ్ గురించి..?
పవన్ చెప్పిన మాట వేరు. చేస్తోంది వేరు. విశాఖ ఎంపీగా జేడీ లక్ష్మీనారాయణను పోటీ చేయించకూడదు. గతేడాది జూన్ 28న ఇదే పవన్‌కళ్యాణ్ ఆవేశంతో ఊగిపోతూ వ్యాపారం కోసం వలసదారులు ఉత్తరాంధ్రలో చొరబడి ఈ ప్రాంతాన్ని హస్తగతం చేసుకున్నారని ఘాటుగా విమర్శించారు. మరి ఇప్పుడు ఆయన చేస్తోంది ఏంటీ?.
సాక్షి: ఉత్తరాంధ్ర వెనుకబాటుకు కారణం?
విజయ్‌కుమార్ : ఉత్తరాంధ్రలో బలమైన రాజకీయ నాయకులను ఎదగనివ్వకపోవడం మొదటి కారణం. వలసలు వచ్చి ఉత్తరాంధ్రలో గెలిచి వారి సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారే తప్ప ఈ ప్రాంతంలో విద్యా వ్యవస్థపై ఆలోచించిన నాయకుడే కరువయ్యాడు. ఉత్తరాంధ్రలో విద్యా పరిశోధకలు ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఎనిమిదో తరగతి చదివే విద్యార్థి మేదస్సు మూడో తరగతి చదివే విద్యార్థి సామర్థ్యానికి సమానంగా ఉందని సర్వేల్లో వెల్లడించారు. ఇదంతా డొల్ల విద్యా విధానాలకు ప్రతీక.