మేమంతా చంద్రబాబు తీరు చూసి నవ్వుకొనేవాళ్లం.. | BJP Leader Kanna Lakshmi Narayana Interview | Sakshi
Sakshi News home page

చంద్రబాబు మళ్లీ వస్తే.. అరాచకమే: కన్నా

Published Sat, Mar 23 2019 9:47 AM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

BJP Leader Kanna Lakshmi Narayana Interview - Sakshi

అవినీతి సొమ్ము వెదజల్లి ప్రజల తీర్పును కొనుక్కోలేరు. ఈ నిజాన్ని చంద్రబాబు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. చంద్రబాబు స్వభావమే అంత. ఏదో ఒక ఆధారం చూసుకొని ఎన్నికలు గట్టెక్కాలని చూస్తారు. 2004లో అవినీతి సొమ్ము, బాకా ఊదే మీడియా చంద్రబాబును రక్షించలేకపోయాయి. ఇప్పుడూ అంతే. అవేమీ రక్షించలేవు. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది.  అవినీతి, అరాచక ప్రభుత్వం పోవాలని కోరుకుంటున్నారు.రాష్ట్రంలో చంద్రబాబు పాలనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...

‘చంద్రబాబు ఒంటరిగా ఎన్నికలకు వెళుతున్నారని ఎవరన్నారు? అడ్డంగా దోచేసిన రూ.వేల కోట్ల అవినీతి సొమ్ము ఆయనకు తోడుంది.  మసిపూసి మారేడుకాయచేసి చూపించే మీడియా అండగా ఉంది. మరి ఒంటరిఅని ఎలా అనగలం?’
‘చంద్రబాబును మళ్లీ నమ్మితే రాష్ట్రాన్ని భగవంతుడు కూడా రక్షించలేడు. మళ్లీ వస్తే జరిగే అవినీతి, అరాచకం అంచనాల కందదు’
‘బాబుకు, వైఎస్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది.. వైఎస్‌ ప్రజల మనిషి’ 
‘కాపీ కొట్టడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. వైఎస్‌ ప్రకటించే పథకాలను  ముందుగానే తెలసుకొని ప్రతిపక్ష నేతగా ఉన్న బాబు అవన్నీ కావాలని డిమాండ్‌ చేసేవారు. ‘‘నేను డిమాండ్‌ చేశాను.. ప్రభుత్వం ఇచ్చింది’’ అని చెప్పేవారు’
‘2014లో తల్లి కాంగ్రెస్‌.. పిల్ల కాంగ్రెస్‌ అన్నారు. జగన్‌కు ఓటేస్తే కాంగ్రెస్‌కు ఓటేసినట్లే అన్నారు. ఇప్పుడు అదే కాంగ్రెస్‌ చంకలో చంద్రబాబు దూరారు’
‘గత ఎన్నికల్లో మోదీ ఇమేజితో ఎన్నికలు గట్టెక్కారు. ఇప్పుడు అదే బీజేపీని బూచిగా చూపిస్తున్నారు. జగన్‌కు ఓటేస్తే మోదీకి వేసినట్లేనని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. జగన్‌ ఓటు బ్యాంకును చీల్చడానికి బాబు చేస్తున్న కుట్ర ఇది’  అని అంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.

ఏ గాలికి ఆ చాప ఎత్తడం బాబు నైజం
2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీని వాడుకొని చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఎన్డీఏలోనే ఉంటూ మోదీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. 2015 బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలోనే బాబు చేస్తున్న కుటిలయత్నాలను చెప్పాను. చంద్రబాబు తెలివితేటలన్నీ మాకు తెలుసు. 30 ఏళ్లుగా అతన్ని చూస్తున్నాం. స్వయం ప్రకటిత మేధావి చలసాని శ్రీనివాస్, సినిమా యాక్టర్‌ శివాజీ ద్వారా మోదీకి వ్యతిరేకంగా మాట్లాడించారు. నాలుగేళ్లకుపైగా బీజేపీతో ఉండి, ఎన్నికలకు ఏడాది ముందు మోదీకి వ్యతిరేకంగా పాట అందుకున్నారు. ఏ గాలికి ఆ చాప ఎత్తడం బాబుకు అలవాటే.

బాబు పాలనలో అభివృద్ధి ఊసే లేదు
దేశంలో ఏ రాష్ట్రానికీ ఇవ్వనన్ని నిధులు కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చాయి. అవినీతి చేయడానికి అవకాశం లేని పథకాల కింద ఇచ్చిన నిధులను తీసుకోవడానికి చంద్రబాబు ఇష్టపడలేదు. కొన్ని నిధులను తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇవ్వడానికి ఇష్టం లేక కొన్ని నిధులను తీసుకోలేకపోయారు. భారీగా నిధులు తీసుకున్న పథకాల్లో తీవ్రమైన అవినీతికి పాల్పడ్డారు.  ఈ 5 సంవత్సరాల్లో తాను ఇది చేశానని చెప్పడానికి చంద్రబాబుకు ఏమీ లేదు. అవినీతి, అరాచకం తప్ప.. ఈ ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఏమీ చేయలేదు. ఈ ఎన్నికల్లో లబ్ధికోసం కేంద్రం నిధులు ఇవ్వలేదని, అభివృద్ధి జరగకపోవడానికి బీజేపీనే కారణమని దోషిగా నిలబట్టి పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

రాజధానిని దోపిడీ కేంద్రంగా మార్చారు
గుంటూరు జిల్లా ప్రజల త్యాగం దోపిడీకి గురైంది. మూడు పంటలు పండే 53 వేల ఎకరాలు తీసుకొని రాజధానిని దోపిడీ కేంద్రంగా మార్చుకొని లూటీ చేశారు. పర్యావరణాన్ని గాలికి వదిలి లక్షల మంది ప్రాణాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నారు. కృష్ణా నదిలో ఇసుక తోడి రాజధాని ప్రాంతాన్ని మెరక చేస్తున్నారు.

సీఎం కుర్చీ ఎక్కగానే హామీలు మరచిపోయారు
 2014లో అడ్డమైన హామీలు ఇచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. సీఎం కుర్చీ ఎక్కగానే హామీలు మరిచిపోయారు. రుణమాఫీ చేయలేదు. బ్యాంకులకు రుణాలు చెల్లించవద్దని ఎన్నికల్లో చెప్పారు. బాబు సీఎం అయిన తర్వాత బంగారు నగలన్నీ బ్యాంకులు వేలం వేశాయి. డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదు. ఒక్క హామీనీ నిలబెట్టుకోలేదు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ముందున్న ఒకేఒక మార్గం... ప్రజల సొమ్ముతో ఓట్లు కొనుక్కోవడం. 2019 జనవరి తర్వాత.. ఉన్నట్లుండి సంక్షేమ పథకాలు గుర్చొచ్చాయి. ప్రజలకు నేను చెప్పేది ఒక్కటే. చంద్రబాబు వ్యక్తిత్వాన్ని గుర్తుపెట్టుకోండి. గత ఎన్నికల్లో ఇచ్చిన ఇచ్చిన హామీలను మరిచిపోయారు. చంద్రబాబు మళ్లీ వస్తే అవినీతి, అరాచకం.. అంచనాలకు అందదు.

నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా
 వైఎస్‌ ప్రజల మనిషి. వైఎస్‌తో చంద్రబాబుకు పోలికా! నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది ఇద్దరికీ. మరో మాట అక్కర్లేదు.

అవినీతి కోణాలెన్నో రాజధానిలో చూశా
రాజధాని గుంటూరు జిల్లాకు వచ్చినప్పుడు నేను స్వాగతించాను. సంతోషించాను. కానీ.. చంద్రబాబు, ఆయన మనుషులు, మంత్రులు, అధికార పార్టీ నాయకులు రాజధానిని బంగారు బాతుగా మార్చుకున్నారు. వరదలు వస్తే గుంటూరు, కృష్ణా జిల్లాలకు ప్రాణ, ఆస్తి నష్టం ఎంత జరుగుతుందో అంచనా వేయలేం. రాజధాని కుంభకోణాలు ఒకటీరెండూ కాదు. దోపిడీలో వినూత్న కార్యక్రమం అది. గుంటూరుకు రాజధాని వచ్చిందని సంతోషించాలో, దోపిడీ–పర్యావరణ విధ్వంసం గురించి బాధపడాలో ప్రజలకు అర్థం కావడం లేదు.

జగన్‌ ఓటు బ్యాంకును దెబ్బతీయాలనే కుట్ర
దీని వెనుక జగన్‌ ఓటు బ్యాంకును దెబ్బతీయాలనే కుట్ర దాగి ఉంది. మైనార్టీ ఓట్లు జగన్‌కు రాకుండా చేయడానికి చంద్రబాబు ఈ కుట్రను అమలు చేస్తున్నారు. దానికి ఆయన అనుకూల మీడియా తందానా అంటోంది. టీడీపీ మేనిఫెస్టో ఎలా ఉండబోతోందో ఆరు నెలల క్రితం నేనే  చెప్పాను. నాలుగున్నర సంవత్సరాలలో చంద్రబాబు అవినీతి తప్ప అభివృద్ధి చేయలేదని వెల్లడించాను. 2019 ఎన్నికల అజెండాగా ‘బీజేపీ బూచి’గా ఎంపిక చేసుకుంటారని చెప్పాను. ఇప్పుడు ఎన్నికలొచ్చాయి. నేను ఆరు నెలల క్రితం చెప్పిన దానికి, ఇప్పటికీ ఏమైనా తేడా ఉందా? చంద్రబాబు కుయుక్తులన్నీ నాకు తెలుసు. 2014 ఎన్నికల్లో  చంద్రబాబు ‘తల్లి కాంగ్రెస్‌... పిల్ల కాంగ్రెస్‌’ అన్నారు. జగన్‌కు ఓటేస్తే తల్లి కాంగ్రెస్‌కు ఓటేసినట్లేనని ప్రచారం చేసి లబ్ధి పొందారు. తల్లి కాంగ్రెస్‌కు.. జగన్‌కు సంబంధం లేదని చంద్రబాబుకు తెలియని విషయం కాదు. ఇప్పుడేమో.. అదే తల్లి కాంగ్రెస్‌ చంకలో చంద్రబాబు దూరారు. చంద్రబాబు నైజమే అంత. ఏదో ఒకదాన్ని బూచిగా చూపించాల్సిందే తప్ప.. తాను ఏం చేశాడో ఎప్పుడూ చెప్పరు. తన గురించి ఎన్నికల్లో చెబితే ప్రజలు ఛీకొడతారని ఆయనకు స్పష్టంగా తెలుసు.

బాబుకు అండగా అవినీతి సొమ్ము
రాష్ట్రంలో అడ్డంగా దోచేసిన రూ.వేల కోట్ల అవినీతి సొమ్ము ఆయనకు అండగా ఉంది. చంద్రబాబు ఒంటరిగా వెళుతున్నారని ఎవరు చెప్పారు? ఈ ఎన్నికల్లో డబ్బును వెదజల్లి గట్టెక్కగలననే నమ్మకంతో చంద్రబాబు ఎన్నికలకు వెళుతున్నారు. చంద్రబాబు నంది అంటే నంది అని, పంది అంటే పంది అని ప్రచారం చేసి.. తిమ్మిని బమ్మిని చేయడానికి బాకా ఊదే పత్రికలు, టీవీలు ఆయనకు తోడుగా ఉన్నాయి. అడ్డంగా రాష్ట్రాన్ని దోచేసినా, అవినీతిని విచ్చలవిడిగా చేసినా, అడ్డమైన పనులు చేసినా.. ఆ మీడియా అండగా ఉంది. అవన్నీ తోడుగా ఉంటే.. చంద్రబాబు ఒంటరిగా ఎన్నికలకు వెళుతున్నారని ఎలా అనగలం?

జగన్‌ పథకాలు కాపీ కొడుతున్నారు
కాపీ కొట్టడం చంద్రబాబు రక్తంలోనే ఉంది. మూడు దశాబ్దాలుగా ఆయన్ను చూసిన వాడిగా చెబుతున్నా. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ అంతే. ప్రభుత్వం ప్రకటించే పథకాలు, కార్యక్రమాలను ముందుగా తెలుసుకునేవాడు. అలా తెలుసుకోవడానికి చంద్రబాబు మనుషులు కొద్ది మంది ప్రభుత్వంలో ఏదో స్థాయిలో ఉండేవారు. ఆ పథకంలో ఉన్న వాటిని ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్‌ చేసే వారు. తీరా వైఎస్‌ రాజశేఖరరెడ్డి పథకాన్ని ప్రకటించగానే.. ‘నేను డిమాండ్‌ చేశాను ముందే, ప్రభుత్వం దిగొచ్చి ప్రకటించింది’ అని చంద్రబాబు నిస్సిగ్గుగా చెప్పేవారు. మేమంతా బాబు తీరు చూసి నవ్వుకొనేవాళ్లం. ఇప్పుడు జగన్‌ నవరత్నాల పథకాలను కాపీ కొడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement