రెప్పపాటు కాలం శ్రీవారిని సందర్శిస్తే చాలు కొండంత సంతోషం. జీవితకాలం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం.. గంటల తరబడి క్యూలలో వేచి స్వామివారిని దర్శించుకున్నాక భక్తులు పొందే అనుభూతి ఇది. అలాంటిది నిమిషం కాదు..గంట కాదు..రోజు కాదు.. మాసం కాదు.. మూడున్నర దశాబ్దాల పాటు సాక్షాత్తూ శ్రీవారి చెంతనే గడిపే మహద్భాగ్యం పొందిన వ్యక్తి ఏవీ రమణ దీక్షితులు. ఆలయ ప్రధాన అర్చకుడిగా పనిచేసి నాలుగు నెలలుగా విశ్రాంత జీవితం గడుపుతున్న ఆయన శ్రీవారితో తనకున్న అనుబంధాన్ని సాక్షితో పంచుకున్నారు.
నాన్నగారు గొల్లపల్లి వెంకటపతి దీక్షితులు. నియమ నిష్టల మధ్య పెంచారు. ఎప్పటికైనా స్వామి వారి అర్చకుడిగా ఉండాలన్న భావనతోనే నన్ను తీర్చిదిద్దారు. మడి కట్టుకోవడం నుంచి అన్ని కట్టుబాట్లు అలవాటుగా మారాయి. తిరుపతిలోనే బీఎస్సీ చదివా. సైన్స్ అంటే ఇష్టం. జువాలజీ ప్రధానాంశంగా ఎమ్మెస్సీ చేశాను. ఒకపక్క సైన్స్.. మరోపక్క శ్రీవారు. రెండు అంశాలూ మనసులో నిండి ఉండేవి. ఈ విషయంలో వైరుధ్యం లేదు. భక్తి కూడా సైన్సే అని విశ్వాసం. మాలిక్యులర్ బయాలజీలో డాక్టరేట్ పూర్తయింది. 1974లో నాన్నగారు పరమపదించారు. కుటుంబ వారసత్వంగా తిరుమల సేవకు వచ్చేశాను.1977లో లివర్ క్యాన్సర్‌పై పరిశోధనకు అమెరికా నుంచి పిలుపు వచ్చినా వెళ్లలేదు. ఆగమశాస్త్ర ప్రకారం సముద్రయానం చేయకూడదు. మ్లేచ్ఛ దేశాలకు వెళ్లితే ధర్మ భ్రష్టత్వం జరుగుతుందని శాస్త్రం చెబుతోంది. అందుకే వెళ్లలేదు.
ఏమని చెప్పను...
స్వామివారి సేవకు దీర్ఘకాలం అంకితమయ్యాను. ఆ మూలమూర్తితో బంధం ఏమని చెప్పను. అత్యంత సన్నిహిత సంబంధం మాది. ఒక్కొక్కసారి ఆయనతో వాదన చేస్తుంటాను. స్వామి అలుగుతుంటారు.అప్పుడప్పుడూ స్వామితో విభేదిస్తుంటాను. మళ్లీ మామూలే. మాది తాత, మనవడి సంబంధంగా సాగింది. ఒక్కోసారి తాతగారు మనవడితో కలిసి ఆడుతూ పాడుతూ ఆనందిస్తుంటారు. కొడుకు కంటే మనవడి మీదే తాతగారికి ప్రేమ ఎక్కువుంటుంది. మాదీ అంతే. ప్రధానార్చకుడు.. దానివల్ల వచ్చిన గౌరవం, వేతనాలు.. ఇలా భౌతికంగా లభించే రూపాలన్నింటినీ పక్కనబెడితే... ఆత్మార్పణగా స్వామివారితోనే ఉన్నాను. స్మరించుకుంటే ఎదురుగా నిలబడతారు. ఎదురెదురుగా నిలబడి ఒకరితో ఒకరు సంభాషించుకుంటాం.
కైంకర్యాల వేళ బిడ్డ..
ఆగమోక్తంగా స్వామివారికి సమయానుసారం కైంకర్యాలు చేయాలి. సుప్రభాతం నుంచి ఏకాంత సేవ దాకా.. మంత్రాశనం, స్నానాశనం, అలంకారాశనం, యాత్రాశనం, భోజ్యాశనం, శయనాశనం అనే ఆరు దశలుంటాయి. స్వామివారు మంత్రాధీనం. గర్భాలయంలో ప్రవచించే వేదమంత్రాల వల్లే ప్రశాంతత నెలకొంటుంది. గర్భాలయంలోనూ తరంగాలుంటాయి. అందుకే మంత్రయుక్తంగా, శాస్త్రోక్తంగా జరిపితేనే స్వామి వారు సంతృప్తి చెందుతారు. ఆగమ శాస్త్రం ప్రకారం అన్నసూక్తంతో ప్రసాదాలను సమర్పించాలి. ప్రసాదాన్ని పవిత్రం చేయాలి. దీనివల్లే పుష్టి, తేజస్సు, దృఢత్వం లభిస్తాయి. కుడిచేతి గ్రాస ముద్రతో ప్రసాదాన్ని తాకి స్వామి కుడిచేతిని తాకిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే గోరుముద్దలు తినిపించడమన్నమాట. మంచినీళ్లిస్తాం. అభిషేకం చేసేటప్పుడు, ఆరగింపు చేసేటప్పుడు స్వామిని బిడ్డగా చూసుకుంటాం. అందుకే కైంకర్య సమయాన కన్నతల్లిగా మారిపోతాం. మిగిలిన వేళల్లో స్వామివారే యజమాని. మేమంతా సేవకులమే.
సక్రమంగా జరపకపోతే అపచారం
ఆగమోక్త సంప్రదాయం ప్రకారం ఆలయంలో అన్నీ జరగాలి.. అపసవ్యం జరగకూడదు. ముఖ్యంగా కైంకర్యాలన్నీ పద్ధతిప్రకారం సకాలంలో నిర్వర్తించాలి. వీఐపీలొస్తున్నారనో.. భక్తుల సంఖ్య పెరిగిందనో ఆగమేఘాలపై నిర్వహించలేం. స్వామి కార్యక్రమంలో అతి కీలకమైనది ప్రసాదం. అది కూడా ఆయనకు సక్రమంగా నింపాదిగా ఇవ్వకపోతే ఎలా.. చాలా సందర్భాల్లో ఇలాంటివి అధికారుల ఒత్తిళ్ల నుంచి ఎదుర్కొన్నాం. నా వరకూ ఏనాడూ ఇవి చెవులకు సోకకుండా కైంకర్య బాధ్యతలను నిర్వహించగలిగాను. స్వామివారు ప్రసన్నంగా ఉండాలి. అప్పుడే భక్తులకు మంచి జరుగుతుంది. ఆగమశాస్త్రంపై కనీస అవగాహన.. దైవ నియమాలు.. భక్తి.. సంస్కృతులపై నమ్మకం లేని అధికారులుంటే మంచిది కాదు. ఆ స్వామి చలవతోనే టీటీడీ అన్న విషయం మరువకూడదు. ఆగమోక్తంగా కైంకర్యం కూడా నిర్వహించకపోతే అపచారం.
త్వరలోనే తెలుగు అనువాదం
సా«ధారణంగా స్వామి వారికి సమర్పించే కైంకర్యాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి భక్తులందరికీ ఉంటుంది. అందరికీ తెలిసిన ప్రసాదం లడ్డూ ఒక్కటే. కానీ ఎన్నో రకరకాల ప్రసాదాలుంటాయి. ఏ సమయంలో ఏ నైవేద్యం పెడతారు, వాటిని ఎవరు చేస్తారు, ఎలా తయారు చేస్తారు, వాటిలో ఉండే దిట్టం ఏమిటి లాంటి అంశాలు అందరికీ తెలిసే అవకాశం తక్కువ. కైంకర్యాలకు సంబంధించిన అంశాలతో ఫుడ్స్ ఆఫ్ గాడ్ అనే పుస్తకాన్ని ఆంగ్లంలో రాశాను. దీనిని తెలుగులో అనువదించి ప్రచురించాలని ఎక్కువమంది కోరారు. అందుకే తెలుగులో అనువదించే పనిలో పడ్డా. 80 శాతం పూర్తయింది. కొద్దిరోజుల్లో పుస్తకాన్ని తీసుకువస్తాను.
ఆ తాదాత్మ్యంలో ఏదీ గుర్తుండదు
వైకుంఠం నుంచి తిరుమలకు రావడానికి మునుపే స్వామి తన ప్రతినిధిగా వైఖానస మహర్షిని పంపారు. వైఖానస ఆగమ శాస్త్రాన్ని సృష్టించారు. ఆ తర్వాతే స్వామివారు తిరుమలకు విచ్చేశారు. అంటే స్వామి భూలోకానికి వచ్చే సమయానికే ఆగమ శాస్త్రం అమల్లో ఉంది. ఇప్పటికీ అత్రి మహర్షి ఆలయంలో సజీవంగా ఉన్నారని భావిస్తాం. వేల సంవత్సరాల కిందట ఒక ప్రయోగం జరిగింది. దేవతలు, మహర్షులంతా కలిసి... ఆలయ ఆవరణలో పరివార దేవతల విగ్రహాలను ప్రతిష్ఠింపజేసి, వారిని స్వామివారికి రక్షణ సిబ్బందిగా నియమించారు. మంత్రపూర్వకంగా ఆవాహన చేశారు. వారంతా స్వామివారి సేవలో సజీవంగా ఉన్నారు. రక్షణ కవచంలా నిలుస్తున్న ఆ దైవశక్తులను సామాన్య మానవులు తట్టుకోలేరు. అందువల్లే స్వామివారిని దర్శనం చేసుకుని, ఆలయం వెలుపలికి వచ్చాక ఇక మళ్లీ స్వామి దివ్యమంగళ స్వరూపం గుర్తుండదు. మనసులో శూన్యత ఆవరిస్తుంది. మనమేదైనా కోరాలన్నా మరచిపోతాం. ఆ తాదాత్మ్యంలో ఏదీ గుర్తుండదు. అర్చావతారంలో కనిపించేది కూడా స్వామి వారి రూపం కాదు. అది వేరే ఉంటుందని నమ్ముతాను. ఆగమశాస్త్రంలో చెప్పబడే లక్షణాలున్న భంగిమ.. లక్షణాలతో స్వామివారున్నారని ధ్యానం చేసుకుంటుంటాను.
వైఎస్ హయాంలో...
వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర తర్వాత కొండకు వచ్చారు. సుదర్శనయాగం నిర్వహించాం. మా కష్టాలు విన్నారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట మర్చిపోలేదు. రాష్ట్రంలోని 24 వేల దేవాలయాల్లో అర్చకులకు వంశపారంపర్య హక్కు కల్పించారు. ఇందుకోసం చట్టసవరణ చేశారు. అర్చకులకు గౌరవమిచ్చారు. కుటుంబాన్ని పోషించుకునే శక్తిని ఇచ్చారు. వేతనాలు పెంచారు. బ్రాహ్మణులంతా సంతోషించారు. ఆయన తర్వాత మళ్లీ బ్రాహ్మణులకు, పురోహితులకు కష్టాలు మొదలయ్యాయి. అంతకుముందు తొమ్మిదేళ్లపాటు ఎన్నో ఒడిదుడుకులు ..కష్టాలు పడ్డాం. అవమానాలు భరించాం. ముఖ్యంగా జాతీయ నిధిగా చెప్పుకునే వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చేశారు. రథ.. వాహన మండపాలనూ ధ్వంసం చేయించారు. అవన్నీ దివ్యపురుషుడి దేహభాగాలుగా భావిస్తాం. ఇది మహాపాపమని చెప్పినా విన్నవారెవరూ లేరు.
నాలుగు నెలలుగా స్వామికి దూరంగా..
ఏదైనా స్వామి అభీష్టానికి వదిలేస్తుంటాను. ఏది జరిగినా దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తాను. అన్నిటి వెనుక స్వామి దయ ఉందనే నమ్మకం. మనసా, వాచా ఏ తప్పు చేయలేదు. నాది కాని దాన్ని తీసుకోలేదు, తీసుకోను కూడా. స్వామివారి పేరు చెప్పి అక్రమంగా ఏదీ పొందలేదు. దైవ సంకల్పంతోనే ఏదైనా జరుగుతుంది. తిరుమలలో వంశపారంపర్య అర్చకులకు పదవీ విరమణ చేయించాలని చట్టాల్లో ఎక్కడా నిబంధనలు లేవు. కానీ, అలా జరిగిపోయింది. తెలతెలవారుతుండగానే గర్భగుడిలో స్వామి సేవలో తరించేవాడిని. నాలుగు నెలలుగా దూరంగా ఉన్నాను. స్వామివారిని దర్శించుకోలేకపోతున్నాననే కొరత.ఎప్పటికైనా స్వామి వారు నన్ను పిలిపించుకుంటారు. ఇప్పుడు నన్ను బయట పెట్టారంటే ఏం జరిగిందో తెలియదు. ఏదో ఒక బలమైన కారణమే ఉండి ఉంటుంది. జరిగేవన్నీ స్వామి వారి సంకల్పమే.ఏది జరిగినా మన మంచి కోసమేనన్నది నా భావన.
– పక్కి సత్యారావు పట్నాయక్, తిరుపతి
Comments
Please login to add a commentAdd a comment