ఈ ప్రణాళికతో అంతా సులువే | Devotees must prepare early plans | Sakshi
Sakshi News home page

ఈ ప్రణాళికతో అంతా సులువే

Published Sun, Oct 7 2018 2:19 AM | Last Updated on Sun, Oct 7 2018 2:19 AM

Devotees must prepare early plans - Sakshi

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానికి తరలి వచ్చే భక్తులతో 365 రోజులూ తిరుమలకొండ  కిటకిటలాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తిరుమల యాత్ర చేయాల్సిన భక్తులు తప్పనిసరిగా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. తిరుమలలో బస, శ్రీవారి దర్శన విషయాల్లో రిజర్వేషన్లు్ల తప్పనిసరి. లేకపోతే ఇబ్బందులు తప్పవు. ఇంటర్‌నెట్‌ ద్వారా గదులు, సేవాటికెట్లు 

∙ఇంటర్నెట్‌ సౌకర్యం ఉంటే చాలు తిరుమలలోని బస, శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం, ఆర్జిత సేవలు ముందస్తుగా రిజర్వ్‌ చేసుకునే సౌకర్యం ఉంది. దేశవిదేశాల్లో ఎక్కడున్నా సరే ఇంటర్‌నెట్‌ ద్వారా రిజర్వేషన్‌ చేసుకునే వెసులుబాటు టీటీడీ కల్పించింది.

∙ఇంటర్‌నెట్‌ ద్వారా సాధారణ సేవలైన కల్యాణోత్సవం, వసంతోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు భక్తులు సులభంగా పొందవచ్చు. ఇక అతిముఖ్యమైన శ్రీవారి సుప్రభాతసేవ, అర్చన, తోమాలసేవ, విశేషపూజ, అష్ట దళ పాదపద్మారాధనసేవ, నిజపాద దర్శనం తదితర సేవలు బుక్‌ చేసుకునే సౌకర్యం కూడా టీటీడీ కల్పించింది. దీనికి సంబంధించిన కోటాను ప్రతి నెలా మొదటి శుక్రవారం కోటా విడుదల చేస్తారు. టికెట్ల కోసం భక్తులు ముందస్తుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వన్‌ టైం పాస్‌వర్డ్‌తో ఒకరికి ఒక టికెట్టు చొప్పున కేటాయిస్తారు.

ఈ –దర్శన్‌ కేంద్రాల ద్వారా ముందస్తు బుకింగ్‌
మన రాష్ట్రంతోపాటు చెన్నయ్, బెంగళూరు, న్యూ ఢిల్లీ, ఇతర ముఖ్యనగరాల్లో మొత్తం 86 ఈ– దర్శన్‌ కేంద్రాలు టీటీడీ నిర్వహిస్తోంది. వీటి ద్వారా  ఫోటోమెట్రిక్‌ పద్ధతిలో భక్తుడి వేలిముద్ర, ఫోటో ద్వారా స్వామి దర్శనం, ఆర్జితసేవలు, గదులు రిజర్వేషన్‌ చేసుకోవచ్చు. 

∙తిరుమలలో నిత్యం భక్తులకు 7 వేల వరకు అద్దె గదులు కేటాయిస్తుంటారు. ఇందులో పద్మావతి అతిథి గృహాల పరిధిలో మొత్తం 2 వేల గదులున్నాయి. రూ.500 నుంచి 6 వేల వరకు అద్దె కలిగిన గదులు కేటాయిస్తారు. ఫోన్‌ నెంబరు 877–2263731 ∙గదులు కావాలంటే ఆధార్‌కార్డు / ఓటరు కార్డు/ పాన్‌ కార్డు వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డులోని ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుంది ∙రూ.100 నుంచి రూ.7100 (జీఎస్‌టీతో కలిపి) వరకు అద్దెగదుల్లో అవసరమైన గదిని పొందవచ్చు ∙సీఆర్‌వో విచారణ కార్యాలయ పరిధిలో మొత్తం 3 వేల గదులున్నాయి. రూ.50 నుంచి రూ.500 వరకు అద్దె కలిగిన గదులు మంజూరు చేస్తారు. వరుస క్రమంలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న భక్తులకు గదులు కేటాయిస్తారు. సిఫారసు లేఖలపై కూడా భక్తులకు ఇక్కడే గదులు కేటాయిస్తారు. ఫోన్‌ నెంబరు– 0822–2263492  ∙ఎంబీసీ–34లో పరిధిలో మొత్తం 3 వేల గదులున్నాయి. ఫోన్‌ నెంబరు : 0877–2263929, 2263523.

20 వేల మందికి నాలుగు ఉచిత యాత్రి సదన్లు
భక్తులకు గదులు లభించకపోతే కనీస మౌలిక సదుపాయాల కల్పన కోసం టీటీడీ ప్రత్యేకంగా నాలుగు ఉచిత యాత్రి సదన్లు నిర్మించింది. ఇందులో లాకర్లు, స్నానపు గదులు, మరుగుదొడ్లు, ఉచిత భోజన సౌకర్యం, కళ్యాణకట్టలు ఏర్పాటు చేశారు. భక్తులు ఎటువంటి నగదు చెల్లించకుండానే అన్ని సౌకర్యాలు ఉచితంగా పొందవచ్చు.  

ఇంటెర్నెట్, టీటీడీ ఈ–యాప్‌ ద్వారా రోజూ రూ.300 టికెట్ల కేటాయింపు
∙రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కేటాయింపులో మార్పు వచ్చింది. 2009 నుండి తిరుమలలోనే టికెట్లు కేటాయించేవారు. ఇటీవల పూర్తిగా రద్దు చేశారు. ∙ఆ కోటాలో  రోజూ కేటాయించే  26 వేల టికెట్లను ఇంటర్నెట్‌ ద్వారా కేటాయిస్తున్నారు. టీటీడీ యాప్‌ ద్వారా కూడా భక్తులు తమ సెల్‌ఫోన్ల నుండి టికెట్లు పొందవచ్చు. ∙ఓ కుటుంబంలోని భక్తుల్లో ఒకరు తమ ఫొటో గుర్తింపు కార్డును అప్‌లోడ్‌ చేయాలి.మొదటి వ్యక్తితోపాటు మిగిలినవారి పేర్లు నమోదు చేసుకోవాలి. స్వామి దర్శనం తర్వాత ఆలయం వెలుపల ఆ టికెట్లపై భక్తులు సులభంగా లడ్డూలు పొందే అవకాశం ఉంది.  ∙ఆన్‌లైన్‌తోపాటు టీటీడీ ఈ–దర్శన్‌ కేంద్రాల్లోనూ, మండల పోస్టాఫీసుల్లోనూ రూ.300 దర్శన టికెట్లు తీసుకునే సౌకర్యం కల్పించారు. ఇటీవల టీటీడీ ఏపీ, తెలంగాణలోని సుమారు 2500 పోస్టాïఫీసులకు విస్తరించింది. రోజుకు 5 వేల టికెట్ల వరకు భక్తులు పోస్టాఫీసుల ద్వారా పొందే అవకాశం ఉంది.

లక్కీడిప్‌లో అభిషేకం, వస్త్రాలంకార సేవ టికెట్లు  
∙తిరుమలేశునికి నిర్వహించే తోమాల, అర్చన, సహస్ర కలశాభిషేకం, తిరుప్పావడ, పూర్ణాభిషేకం, మేల్‌ఛాట్‌ వస్త్రం అరుదైన సేవల్లో సామాన్య భక్తులు స్వామిని దర్శించే భాగ్యాన్ని టీటీడీ కల్పించింది. ∙ఆయా ఆర్జిత సేవలకు ముందు రోజు ఉదయం 11 నుండి సాయంత్రం 5 గంటల వరకు భక్తులు తిరుమలలోని విజయాబ్యాంకు కౌంటర్‌లో తమ వ్యక్తిగత వివరాలు, వేలిముద్రలు, సెల్‌ నెంబర్‌ కంప్యూటర్‌లో నమోదు చేసుకుని టోకెన్‌ పొందాలి. నమోదు చేసుకున్నవారిలో కంప్యూటర్‌ ర్యాండమ్‌ పద్ధతిలో అందుబాటులో ఉన్న ఆర్జితసేవా టికెట్లు  కేటాయిస్తారు. తర్వాత ఎంపికైన భక్తుడి సెల్‌ నెంబరుకు సమాచారం అందజేస్తారు.

లడ్డూలు పొందటం సులువు
∙వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోనే  సర్వదర్శనం క్యూలో  వెళ్లే భక్తుల్లో ఒకరికి రాయితీ ధరపై రూ.20కి రెండు లడ్డూలు ఇస్తారు. మరో రూ.50 చెల్లిస్తే మరో రెండు లడ్డూలు ఇస్తారు. ఒక్కొక్కరు నాలుగు లడ్డూలు పొందవచ్చు. ∙వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోనే  కాలిబాటలో వచ్చిన  భక్తుల్లో ఒకరికి ఒక ఉచిత లడ్డూ, రూ.20కి రెండు రాయితీ లడ్డూలు, రూ.50కి మరో రెండు లడ్డూలు ఇస్తారు. అంటే ఒకరికి ఐదు లడ్డూలు లభిస్తాయి. ∙ రూ.300 టికెట్ల భక్తులకు టికెట్టుపై రెండు లడ్డూలతోపాటు అదనంగా రూ.50 చెల్లిస్తే మరో రెండు లడ్డూలు ఇస్తారు ∙ఇక టీటీడీ చైర్మన్, బోర్డు సభ్యులు, ఈవో, జేఈవో సిఫారసులతో రూ.500 వీఐపీ  టికెట్ల భక్తులు కూడా టికెట్టు తీసుకునే సందర్భంలో కనిష్ఠంగా రూ.50కి రెండు లడ్డూలు, రూ.150కి ఆరు లడ్డూలు అందజేస్తున్నారు. 

నడకదారిలో ఉచిత దివ్యదర్శనం టోకెన్లు 
∙ఈ ఏడాది నుండి కాలిబాటల్లో నడిచి వచ్చే భక్తులకు టైమ్‌ స్లాట్‌ విధానం అమలు చేశారు. రోజుకు 20 వేల చొప్పున టికెట్లు కేటాయిస్తున్నారు. ఇందులో అలిపిరి మార్గంలో 14వేలు, శ్రీవారి మెట్టు మార్గంలో 6 వేల టికెట్లు ఇస్తున్నారు. 

సర్వదర్శనంలో యాక్సెస్‌ కార్డులు అమలు
రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ నుంచే సర్వదర్శనం భక్తులను స్వామి దర్శనానికి అనుమతిస్తారు. మొత్తం 31 కంపార్ట్‌మెంట్లు ఉన్నాయి. దర్శన సమయం ఎక్కువ గంటలు పడుతుంటే లోనికి వెళ్లిన భక్తులు సులభంగా బయటకు వెళ్లి రావటానికి యాక్సెస్‌ కార్డులు ప్రవేశ పెట్టారు. ఫొటోమెట్రిక్‌ విధానంతో కూడిన కార్డులు పొందిన భక్తులు అందులో నిర్ణయించిన దర్శన సమయానికి తిరిగి వచ్చే అవకాశం టీటీడీ కల్పించింది. నిత్యం వేలాది మంది భక్తులు ఈ సౌకర్యాన్ని పొందుతూ ఆ సమయాన్ని  సద్వినియోగం చేసుకుంటున్నారు. 

∙వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో ఉచిత టెలిఫోన్‌ సౌకర్యం కల్పించారు. దీని ద్వారా భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ కంపార్ట్‌మెంట్ల నుండే ఉచితంగా మాట్లాడవచ్చు. ఇక్కడే భక్తులకు దర్శన సమయం తెలిపేందుకు వీలుగా శ్రీవారి సేవకులతో  హెల్ప్‌డెస్క్‌లు కూడా ఏర్పాటు చేశారు.  

భారతీయ సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి 
∙శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయ సంప్రదాయం తెలియజేసేందుకు టీటీడీ కొత్త నిబంధనలు అమలు చేస్తోంది. ప్రారంభంలో కల్యాణోత్సవం, ఆ తర్వాత అన్ని రకాల ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు సంప్రదాయ వస్త్రధారణ అమలు చేసింది.కొత్తగా ప్రవేశ పెట్టిన రూ.300 ఆన్‌లైన్‌ టికెట్ల దర్శనానికి వచ్చే భక్తులు కూడా విధిగా సంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించాలన్న నిబంధన ఉంది. 
పురుషులు: ధోవతి–ఉత్తరీయం, కుర్తా –పైజామా
మహిళలు: చీర–రవిక, లంగా–ఓణి, చున్నీ/ పంజాబీ దుస్తులు, చుడీదార్‌ ధరించాల్సి ఉంటుంది.

ఇలా టీటీడీ సమాచారం తెలుసుకోవచ్చు 
టీటీడీ కాల్‌సెంటర్‌లో శ్రీవారి ఆర్జిత సేవలు, వసతి సమాచారం కోసం సంప్రదించాల్సిన నెంబర్లు: 0877–22 33333, 2277777, 2264252 
టీటీడీ వెబ్‌సైట్‌ :www.tirumala.org
ఈ–మెయిల్‌:www.tirupati.org
టీటీడీ కాల్‌సెంటర్‌:  webmaster@.tirumala.org
సేవలు, వసతి ఆన్‌లైన్‌ బుకింగ్‌:www.ttdsevaonline.com
టీటీడీ దాతల విషయ వివరాల కేంద్రం: 0877–2263472 

∙ఉచిత సేవలకు డబ్బులు అడిగితే టీటీడీ విజిలెన్స్‌ టోల్‌ఫ్రీ నెం: 18004254141 సంప్రదించవచ్చు
∙ప్రతి నెల మొదటి శుక్రవారం ‘డయల్‌ యువర్‌ ఈవో’ కార్యక్రమంలో  0877–2263261 ఫోన్‌ చేసి నేరుగా కార్యనిర్వహణాధికారితో భక్తులు మాట్లాడవచ్చు. టీటీడీ పరిధిలో తమకు ఎదురైన  సమస్యలు, సంఘటనలపై ఫిర్యాదులు, పరిష్కార మార్గాలపై సూచనలు చేయవచ్చు.

ఇక్కడ ఫిర్యాదులు చేయొచ్చు
అసౌకర్యానికి గురైన భక్తులు తమ ఫిర్యాదులను యంత్రాంగానికి తెలియజేసేలా కూడా టీటీడీ చర్యలు చేపట్టింది.

కేంద్ర విచారణ కార్యాలయం 
∙వైకుంఠం క్యూకాంప్లెక్స్, అన్నదానం, కళ్యాణకట్ట, కాటేజీ విచారణ కార్యాలయాల వద్ద ఈ ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేశారు ∙ఎక్కడైనా ఉచిత సేవలకు, ఇతర కార్యక్రమాలకు డబ్బులు అడిగితే విజిలెన్స్‌ టోల్‌ఫ్రీ నెం: 18004254141 సంప్రదించవచ్చు. ∙ప్రతి నెల మొదటి శుక్రవారం ‘డయల్‌ యువర్‌ ఈవో’ కార్యక్రమంలో నేరుగా కార్యనిర్వహణాధికారికి భక్తులు ఫిర్యాదులను, సలహాలను అందజేసే సౌకర్యం కూడా ఉంది. 

దాతల విభాగంలో విరాళాలు ఇవ్వవచ్చు
టీటీడీ నిర్వహిస్తున్న ట్రస్టులు, స్కీముల కోసం విరాళాలు ఇచ్చే భక్తులు నేరుగా తిరుమలలో ఆదిశేషు అతిథి గృహంలోని దాతల విభాగంలో అందజేయవచ్చు. ఈవో, టీటీడీ పేరుతో తీసిన డీడీ, చెక్‌లు మాత్రమే తీసుకుంటారు. నేరుగా నగదు స్వీకరించరు. రూ.లక్ష ఆపైన విరాళం అందజేసిన దాతలకు బస, దర్శనం, ఇతర బహుమానాలను టీటీడీ అందజేస్తోంది. దాతలకు పాస్‌ పుస్తకాలు ఇస్తారు. పోస్టులో పంపే డీడీలు కూడా స్వీకరిస్తారు. అదనపు సమాచారం కోసం... 087722–63472, 2263727కు సంప్రదించవచ్చు.

నిత్యాన్న ప్రసాదానికి కూరగాయల విరాళం 
అన్నప్రసాదాల తయారీ కోసం రోజూ టన్నుల కొద్దీ కూరగాయలు వాడతారు. వాటిలో టమోటాలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వంటి కూరగాయల్ని భక్తులు విరాళంగా ఇస్తే టీటీడీ అధికారులు స్వీకరిస్తారు. అదనపు వివరాల కోసం 0877–226458 నెంబరుకు సంప్రదించవచ్చు. 

విరాళాలిచ్చే దాతలకు బస, దర్శనంలో కోటా 
టీటీడీ నిర్వహిస్తున్న ట్రస్టులు, స్కీముల కోసం విరాళాలు ఇచ్చే భక్తులు నేరుగా తిరుమలలో ఆదిశేషు అతిథి గృహంలోని  దాతల విభాగంలో అందజేయవచ్చు. ఈవో, టీటీడీ పేరుతో తీసిన డీడీ, చెక్‌లు మాత్రమే తీసుకుంటారు. నేరుగా నగదు స్వీకరించరు. రూ.1 లక్ష ఆ పైన విరాళం అందజేసిన దాతలకు బస, దర్శనం, ఇతర సత్కారాలను టీటీడీ అందజేస్తోంది. పోస్టులో పంపే డీడీలు కూడా స్వీకరిస్తారు. అదనపు సమాచారం కోసం ఫోన్‌:087722–63472, 2263727 నంబర్లకు సంప్రదించవచ్చు.

తిరుమల పురోహిత సంఘంలో పెళ్లి చేసుకోవాలంటే? 
తిరుమలలోని టీటీడీ పురోహిత సంఘంలో పెళ్లి చేసుకోవాలంటే కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.
∙భారతీయ వివాహ చట్టాల ప్రకారం వధూవరులకు నిర్ణీత వయోపరిమితి ఉండాలి
∙వధూవరుల తల్లిదండ్రులు లేదా వారి సంరక్షకులు గుర్తింపు కార్డులు చూపాలి
∙ప్రభుత్వం ద్వారా వచ్చిన రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు, పాస్‌ పోర్టు, ఓటరు కార్డు .. వంటి వాటిల్లో ఫొటోతో ఉన్న వాటిని అందజేయాలి.          

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement