పేరాల చంద్రశేఖరరావు (ఫైల్ ఫోటో)
సాక్షి, అమరావతి: అలిపిరిలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్‌పై వేసిన రాళ్లే...టీడీపీ సమాధికి పునాదిరాళ్లు అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు పేరాల చంద్రశేఖరరావు వ్యాఖ్యానించారు. ఆయన గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ‘టీటీడీ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన తెలపడం చంద్రబాబు పతనానికి నాంది అవుతుంది. మాయమైన పింక్ డైమండ్ 50 రూపాయల విలువ కూడా ఉండదని డాలర్ శేషాద్రి ఎలా చెబుతారు.
పదవీ విరమణ చేసిన డాలర్ శేషాద్రి లాంటి వారిచేత మాత్రమే వ్యవస్థ నడపటం మంచిది కాదు. ఒక విలువైన వజ్రం ముక‍్కలు చేయబడినట్లు రమణకుమార్ నివేదికలో ఉంది. ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన నివేదిక ప్రజల ముందుంచాలి. శ్రీకృష్ణదేవరాయులు తిరుమల సందర్శనలో దేవుడికి సమర్పించిన విలువైన కానుకలు ఇచ్చారని పురావస్తు శాఖలో వివరాలు ఉన్నాయి. రాజులు ఇచ్చిన కానుకులు, భూముల వివరాలు అక్కడ స్పష్టంగా ఉన్నాయి.
అన్యమతస్తులు ఉద్యోగులుగా ఉండటం కూడా అనుమానాలకు తావిస్తోంది. వారిని విధుల నుంచి వెంటనే తొలగించాలి. డూప్లికేట్, గిల్ట్, అనుకరణ నగలను పెట్టి స్వామివారి ఒరిజినల్ ఆభరణాలు మాయం చేస్తున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోటును 12 రోజులు ఎలా మూసేస్తారు. టీటీడీ వ్యవహారంలో సీబీఐ విచారణ జరగాలి. ఆస్తులు, నగలు దేశాలు మారాయని ఆరోపణ ఉంది కాబట్టే సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాం. రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు ఆయన వ్యక్తిగతం కాదు.’ అని అన్నారు. కాగా తిరుమల శ్రీవారిని దర్శించుకొని తిరిగి వెళ్తున్న అమిత్‌షా కాన్వాయ్‌పై ఈ నెల 4న అలిపిరి వద్ద టీడీపీ శ్రేణులు రాళ్లదాడికి పాల్పడ్డాయి. దీంతో కాన్వాయ్‌లోని ఓ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment