Perala Chandra Sekhar Rao
-
ఆ రాళ్లే.. టీడీపీ సమాధికి పునాది రాళ్లు..
సాక్షి, అమరావతి: అలిపిరిలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్‌పై వేసిన రాళ్లే...టీడీపీ సమాధికి పునాదిరాళ్లు అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు పేరాల చంద్రశేఖరరావు వ్యాఖ్యానించారు. ఆయన గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ‘టీటీడీ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన తెలపడం చంద్రబాబు పతనానికి నాంది అవుతుంది. మాయమైన పింక్ డైమండ్ 50 రూపాయల విలువ కూడా ఉండదని డాలర్ శేషాద్రి ఎలా చెబుతారు. పదవీ విరమణ చేసిన డాలర్ శేషాద్రి లాంటి వారిచేత మాత్రమే వ్యవస్థ నడపటం మంచిది కాదు. ఒక విలువైన వజ్రం ముక్కలు చేయబడినట్లు రమణకుమార్ నివేదికలో ఉంది. ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన నివేదిక ప్రజల ముందుంచాలి. శ్రీకృష్ణదేవరాయులు తిరుమల సందర్శనలో దేవుడికి సమర్పించిన విలువైన కానుకలు ఇచ్చారని పురావస్తు శాఖలో వివరాలు ఉన్నాయి. రాజులు ఇచ్చిన కానుకులు, భూముల వివరాలు అక్కడ స్పష్టంగా ఉన్నాయి. అన్యమతస్తులు ఉద్యోగులుగా ఉండటం కూడా అనుమానాలకు తావిస్తోంది. వారిని విధుల నుంచి వెంటనే తొలగించాలి. డూప్లికేట్, గిల్ట్, అనుకరణ నగలను పెట్టి స్వామివారి ఒరిజినల్ ఆభరణాలు మాయం చేస్తున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోటును 12 రోజులు ఎలా మూసేస్తారు. టీటీడీ వ్యవహారంలో సీబీఐ విచారణ జరగాలి. ఆస్తులు, నగలు దేశాలు మారాయని ఆరోపణ ఉంది కాబట్టే సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాం. రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు ఆయన వ్యక్తిగతం కాదు.’ అని అన్నారు. కాగా తిరుమల శ్రీవారిని దర్శించుకొని తిరిగి వెళ్తున్న అమిత్‌షా కాన్వాయ్‌పై ఈ నెల 4న అలిపిరి వద్ద టీడీపీ శ్రేణులు రాళ్లదాడికి పాల్పడ్డాయి. దీంతో కాన్వాయ్‌లోని ఓ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. -
యువత ఉపాధికే ‘స్కిల్ ఇండియా’
నెహ్రూ యువకేంద్రం జాతీయ ఉపాధ్యక్షుడు చంద్రశేఖరరావు శ్రీరాంనగర్‌లో వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం మొయినాబాద్: యువతకు ఉపాధి కల్పించడం కోసమే ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్కిల్ ఇండియా పథకాన్ని ప్రవేశపెట్టారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, నెహ్రూ యువకేంద్రం జాతీయ ఉపాధ్యక్షుడు పేరాల చంద్రశేఖరరావు అన్నారు. మండల పరిధిలోని శ్రీరాంనగర్‌లో గ్రామ పంచాయతీ పాలకవర్గం మూడో వార్షికోత్సవం సందర్భంగా బుధవారం నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సన్వెల్లి ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యువత అన్నిరంగాల్లో నైపుణ్యం పెంచుకోవాలన్నారు. యువతలో వృత్తి నైపుణ్యం పెంపొందించడంతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. అనేక రకాల పథకాలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తుందన్నారు. యువత క్రీడల్లోనూ రాణించాలన్నారు. ప్రభుత్వం క్రీడల అభివృద్ధి కోసం ఎన్నో నిధులు ఖర్చు పెడుతుందన్నారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, మాజీ అధ్యక్షుడు అంజన్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర నాయకుడు కంజర్ల ప్రకాష్, చేవెళ్ల నియోజకవర్గం కన్వీనర్ బి.జంగారెడ్డి, మండల అధ్యక్షుడు క్యామ పద్మనాభం, మాజీ అధ్యక్షుడు గున్నాల గోపాల్‌రెడ్డి, నర్సింహారెడ్డి, ఉపసర్పంచ్ మహిపాల్, మాజీ సర్పంచ్ భిక్షపతి, వార్డు సభ్యులు, యువజన సంఘాల సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
రైతు ఆత్మహత్యలను నివారించండి
మంచాల: టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే రైతు ఆత్మహత్యలను నివారించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల చంద్రశేఖర్‌రావు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మండల పరిధిలోని శ్రీబుగ్గ రామలింగేశ్వర స్వామి వారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని ఆయన చెప్పారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో ప్రజలు సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారని దుయ్యబట్టారు. అర్హులకు పింఛన్లు అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత వరకు సంక్షేమ పథకాలకు కోతపెట్టాలని చూస్తోందని పేరాల చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి అర్హులందరికి సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో రైతులు అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతూ ఆత్మహత్యలకు పాల్పడుతుంటే సర్కార్ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి అన్నదాత బలవన్మరణాలకు నివారించాలని కోరారు. నవంబర్ 30 బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలవుతోందని.. కార్యకర్తలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా పరిధిలో 2.5 లక్షల మంది సభ్యత్వం తీసుకునేలా కృషి చేయాలని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని బలమైన శక్తిగా మార్చాలని కార్యకర్తలకు సూచించారు. బీజేపీ రాష్ట్ర దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి బోసుపల్లి ప్రతాప్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొక్క నర్సింహా రెడ్డి, రాష్ట్ర మజ్దూర్ మోర్చా ఉపాధ్యక్షుడు గోగిరెడ్డి లచ్చిరెడ్డి, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొప్పు భాషా, మండల వైస్ చైర్మన్ దన్నె భాషయ్య, ప్రధాన కార్యదర్శి వెంకటేష్ గౌడ్, ఆరుట్ల సర్పంచ్ యాదయ్య తదితరులు ఉన్నారు.