సాక్షి, అమరావతి: నిక్షేపాల కోసం శ్రీవారి పోటులో కొందరు తవ్వకాలు జరిపారని టీటీడీ ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు తీవ్ర ఆరోపణలు చేశారు. తవ్వకాలు జరిగాయనడంలో ఎలాంటి సందేహం లేదని.. ఆ వంట గదిలో జరిగిన మార్పులే ఇందుకు సాక్ష్యమని ఆయన చెప్పారు. గతేడాది డిసెంబర్ 8న రహస్యంగా ఈ తవ్వకాలు జరిగాయన్నారు. సోమవారం ఓ జాతీయ చానల్‌కు రమణ దీక్షితులు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నిక్షేపాల కోసం వంటగదిలో తవ్వకాలు జరిపారు. పల్లవులు, చోళ రాజులిచ్చిన విలువైన ఆభరణాలను ముస్లింలు, విదేశీయుల దండయాత్రల నుంచి రక్షించుకునేందుకు అక్కడే దాచి పెట్టేవారని మా పెద్దలు చెప్పేవారు. అంతేకాదు.. అదే సమయంలో సీఎం కార్యాలయం ఆదేశాల మేరకే ఏపీలోని ఓ పురాతన కోటలో కూడా తవ్వకాలు జరిగాయి. అది కూడా దాచిపెట్టిన నిధులు, నిక్షేపాల కోసమే. తిరుమల ఆలయంలో బయటి వాళ్లు ఇలాంటి పనులు చేయడానికి ఉండదు. ప్రభుత్వం నియమించిన అధికారులు.. టీటీడీ సిబ్బందే ఈ పనిచేసి ఉండాలి. బయటి వాళ్లకు సాధ్యం కాదు’ అని పేర్కొన్నారు. దీనికి సంబంధించి తన వద్ద ఉన్న సాక్ష్యం ఏదైనా ఉందంటే అది వంటగదిలో జరిగిన మార్పులేనని రమణ దీక్షితులు చెప్పారు. ఆ వంటగదిలో ఇప్పుడు కొత్త ఫ్లోరింగ్‌తో పాటు ఇటుకలు, గోడలు ఇలా అన్ని మారాయన్నారు. దీనంతటికీ ఎవరు బాధ్యత వహించాలని టీవీ వ్యాఖ్యాత ప్రశ్నించగా.. సీఎం చంద్రబాబుదే బాధ్యత అని రమణ దీక్షితులు స్పష్టంగా బదులిచ్చారు.
టీడీపీ ప్రభుత్వ బ్రాంచ్ ఆఫీస్‌లా టీటీడీ..
టీటీడీ.. టీడీపీ ప్రభుత్వ బ్రాంచ్ ఆఫీస్‌లా మారిపోయిందని రమణ దీక్షితులు ఆరోపించారు. ముఖ్యమంత్రి.. అంటే ప్రభుత్వం నియమించిన వారే ఆలయంలో పనిచేస్తున్నారని.. సీఎం సామాజిక వర్గానికి చెందిన వారు, ఆయన మనుషులే ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. ఆయన మనుషుల ద్వారానే ఇదంతా జరుగుతున్నందున దీనికి చంద్రబాబుదే బాధ్యత అని రమణ దీక్షితులు వ్యాఖ్యానించారు. అలాగే రూ.50 వేల కోట్లు విలువ చేసే ఆభరణాలను రిటైర్డ్ ఉద్యోగి అయిన ‘డాలర్’ శేషాద్రి వద్ద ఉంచారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా టీటీడీ సొమ్మును సీఎం చంద్రబాబు ప్రభుత్వ అవసరాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. ‘సైన్స్ కాంగ్రెస్‌కు ప్రధాని వచ్చినప్పుడు తిరుపతి నగర సుందరీకరణ కోసమంటూ ప్రభుత్వం టీటీడీ సొమ్ము తీసుకుంది. ఒంటిమిట్ట దేవాలయం అభివృద్ధి కోసమంటూ రూ.వంద కోట్లు తీసుకున్నారు. ఈ విషయం పత్రికల్లో కూడా వచ్చిందని గుర్తు చేశారు. అలాగే తిరుపతిలో కాంక్రీట్ రోడ్డు కోసం రూ.పది కోట్లు మళ్లించారు. శ్రీవారి సొమ్మును ఇలా ఇతర పనులకు మళ్లించడం నిబంధనలకు విరుద్ధం. ప్రభుత్వ తీరుపై కొందరు కోర్టుకు కూడా వెళ్లారు’ అని రమణ దీక్షితులు చెప్పారు.
అమిత్‌షాకు చెప్పినందుకే బాధితుడినయ్యా..
‘అమిత్ షా ఇటీవల తిరుమల వచ్చినప్పుడు ఆయనకు పోటులో జరిగిన తవ్వకాలను చూపించా. అందువల్లే ఈరోజు బాధితుడిని అయ్యా’ అని రమణ దీక్షితులు చెప్పారు. ‘బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఇటీవల స్వామివారి దర్శనానికి వచ్చారు. ప్రొటోకాల్ ప్రకారం నేనే ఆయనకు స్వాగతం పలికి ఆలయం లోపలికి తీసుకెళ్లా. సంప్రదాయం ప్రకారం ఆశీస్సులు అందజేశాక.. ఆయన్ని ప్రసాదాలు తయారుచేసే వంటగది వద్దకు తీసుకెళ్లా. అక్కడ ఏం జరిగిందో అంతా చూపించా. ఆ వంటగదిని శ్రీవారి ప్రసాదాలు తయారు చేసేందుకే వాడతారు. వెయ్యేళ్లుగా ఇదే జరుగుతోంది. ఆ వంటగదిని ఎప్పుడూ మూసేయలేదు. కానీ గతేడాది డిసెంబర్ 8న దానిని మూసివేశారు. ‘ఆగమ’ సలహాదారుడినైన నా దృష్టికి తీసుకురాలేదు. అక్కడ చేస్తున్న మార్పులను నాకు చెప్పలేదు. కానీ ప్రసాదాలను మొదటి ప్రాకారానికి బయట ఎక్కడో తయారుచేశారు. శాస్త్రం ప్రకారం ఇలా చేయటం సరికాదు. ఆ తర్వాత నేను వంటగదిలోకి వెళ్లి చూసినప్పుడు అక్కడ చాలా ఇటుకలు తీసి ఉన్నాయి. దాదాపు ఫ్లోరింగ్ అంతా తీసేసి ఉంది. అక్కడ వాతావరణం చూస్తే భూకంపం వస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. దీంతో నేను ఎగ్జిక్యూటివ్ అధికారిని ఈ విషయం అడిగా. అసలిక్కడ ఏం జరుగుతోందని అడిగా? కానీ ఆయన కూడా తనకేమీ తెలియదని చెప్పారు..’ అని రమణ దీక్షితులు వివరించారు.
నిక్షేపాల కోసం తవ్వేశారు
Published Wed, May 23 2018 2:26 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment