
సాక్షి, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తీరుపై విద్యాగణేషానంద భారతీస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీలో పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. తిరుమలలో పరిస్థితులపై భక్తులు సైతం ఆందోళన చెందుతున్నారని చెప్పారు. మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని భారతీ స్వామి డిమాండ్ చేశారు.
టీటీడీలో అన్యమతస్తులు ఉన్నారని, దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పాలకమండలిని, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శ్రీవారి పింక్ వజ్రం పగిలిపోయే ఆస్కారం లేదని చెప్పారు. పూలు, నాణెలు పడినంత మాత్రాన వజ్రాలు పగిలిపోతాయా? అని ప్రశ్నించారు. అర్చకత్వం, సన్నిధి, గొల్లల విషయంలో వంశపారంపర్య పరంపరలపై పీఠాధిపతులు శనివారం సమావేశమయ్యారు.
టీటీడీ బోర్డులో సభ్యులుగా నియమితులు అయ్యేవారికి ఆగమ సంప్రదాయాలు తెలిసి ఉండాలని పీఠాధిపతులు పేర్కొన్నారు. ప్రస్తుతం బోర్డులో అలాంటి వ్యక్తులు లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీలో పరిణామాలు కలతకు గురి చేస్తున్నాయని చెప్పారు. ఇదివరకటి రీతిలోనే కైంకర్యాలు జరగాలని సూచించారు. రమణ దీక్షితులు లేవనెత్తిన ఆరోపణలపై ప్రభుత్వం తప్పనిసరిగా సమాధానం చెప్పాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment