
సాక్షి, అమరావతి: ‘ఎవరా రమణ దీక్షితులు.. బొక్కలో వేసి నాలుగు తగిలిస్తే నిజాలు బయటకు వస్తాయి’ అంటూ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులుపై పరుష వ్యాఖ్యలు చేశారు. ఆగ్రహంతో ఊగిపోతూ బెదిరింపులకు దిగారు. నాశనమైపోతారంటూ శాపనార్థాలు పెట్టారు. విజయవాడలోని కానూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద శనివారం మంత్రి సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వివాదంపై స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేంకటేశ్వర స్వామి గురించి ఆడుకుంటున్నారా మీరు? నీచమైన భాష వాడతారా, ఏమనుకుంటున్నారు మీరు? వేంకటేశ్వర స్వామిని పావుగా చేయాలని చూస్తే అనుభవిస్తారు మీరు. చెత్త భాష, నీచమైన భాష వాడుతున్నారు. బీజేపీ వాళ్లు అధికారం కోసం, రాజకీయం కోసం వేంకటేశ్వర స్వామిని వాడుకుంటారా? ఎవరీ రమణ దీక్షితులు.. దేవుడ్ని బజారుకెక్కించాలని చూస్తారా? నాశనమైపోతారు.. బాబుగారి గురించి ఏం మాట్లాడతారు మీరు? అంత భయం లేకుండా పోతుందా మీకు? అంటూ సోమిరెడ్డి చిందులు తొక్కారు.
ఎవరతను రమణ దీక్షితులు.. బొక్కలో వేసి నాలుగు తగిలిస్తే నిజం బయటకు వస్తుంది. అతను ఏమేం తప్పులు చేశాడో, వేంకటేశ్వరస్వామి దగ్గరుండి ఏంచేశాడో మొత్తం బయటకు వస్తుంది. రమణ దీక్షితులు.. హద్దులు మీరి మాట్లాడుతున్నారు.. అనుభవిస్తారు మీరు.. ఎన్నో రోజులు అవసరం లేదు. పత్రికల్లో, చానళ్లలో మీరన్న మాటల గురించి వార్తలు చదవాలా? ఈ రోజు మీరు చేసే దానికి తప్పక అనుభవిస్తారు మీరంటూ పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. నరేంద్ర మోదీ, అమిత్‌షాల నియంతల పాలనకు కర్ణాటక వేదికగా మారిందని, రాహుల్ గాంధీతో చంద్రబాబు వేదిక పంచుకుంటే తప్పేంటని మీడియాను ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment