టీటీడీ పాలక మండలి సమావేశంలో మాట్లాడుతున్న బోర్డు చైర్మన్ సుధాకర్
సాక్షి, తిరుపతి/తిరుమల: టీటీడీ ప్రధాన అర్చకునిగా ఉన్న రమణదీక్షితులును రిటైర్‌మెంట్ పేరుతో ఇంటికి పంపిన పాలకమండలి తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఆగమ సలహాదారునిగా ఉన్న ఆయనను ఆ హోదా నుంచి కూడా తొలిగిస్తున్నట్లు చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ ప్రకటించారు. రమణదీక్షితులు ఆగమసలహాదారునిగా కొనసాగుతారని సోమవారం స్వామివారి ఆభరణాల పరిశీలన సమయంలో చెప్పిన ఆయనే 24 గంటలు గడవక ముందే నిర్ణయం మార్చుకోవడం చర్చనీయాంశమైంది. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. నూతనంగా ఏర్పాటైన పాలకమండలి వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నెలరోజుల వ్యవధిలోనే మూడు పర్యాయాలు పాలకమండలి సమావేశాలు నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకుంది. మొదటి సారిగా నిర్వహించిన పాలకమండలి సమావేశంలో రమణదీక్షితులిని ప్రధాన అర్చకుని బాధ్యతల నుంచి రిటైర్‌మెంట్ పేరుతో తొలగించి వివాదాలకు తెరతీశారు. తాజా సమావేశంలో మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుని చర్చనీయాంశంగా మార్చారు.
సినీ నటుడు బాలకృష్ణ నియోజక వర్గంపై టీటీడీకి అమితమైన ప్రేమ
హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ, టీడీపీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి నియోజకవర్గాల అభివృద్ధి కోసం గతంలో టీటీడీ నుంచి నిధులు కేటాయించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి హిందూపురం నియోజక వర్గంలో శ్రీఆంజనేయస్వామి ఆలయ పునరుద్ధరణకు టీటీడీ రూ.25 లక్షలు కేటాయించింది. అదే విధంగా ప్రకాశం జిల్లా దొడ్డుకూరు గ్రామంలో చెన్నకేశవస్వామి ఆలయ పునరుద్ధరణకు రూ.25లక్షలు, అనంతపురం జిల్లా పరిగి గ్రామం శ్రీ ఆంజనేయస్వామి, రొద్దకంభ ఆలయం సమీపంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.1.50 కోట్లు టీటీడీ కేటాయించింది. కాగా తిరుమలలో యాత్రికుల వసతి సముదాయాలు నిర్మించకూడదని గతంలో టీటీడీ నిర్ణయం తీసుకోగా తిరుమలలో కొత్తగా పీఏసీలు నిర్మించేందుకు రూ.79 కోట్లు కేటాయించాలని నిర్ణయించడం తీవ్ర చర్చనీయాంశమైంది.
పాలకమండలి ముఖ్యమైన నిర్ణయాలు:
- తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ గోపురం బంగారు తాపడానికి రూ.32.26 కోట్లు.
- గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు తలనీలాల ద్వారా రూ.133.32 కోట్లు రాబడి.
- తిరుమలలో మరో పీఏసీల నిర్మాణానికి రూ.79 కోట్ల అంచనాలతో ఆమోదం.
- ఆగమసలహాదారుగా రమణదీక్షితులు స్థానంలో వేణుగోపాల్ దీక్షితులు నియామకం.
- మీరాశీ వంశీకుల నుంచి అర్హత కలిగిన 12 మంది అర్చకులుగా నియామకం.
- రమణదీక్షితులకు ఇచ్చిన నోటీసులపై ఇంకా వివరణ అందలేదు. మరో మూడు రోజుల్లో రమణదీక్షితులు, వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వివరణ ఇవ్వాలి.
- ఒంటిమిట్ట అభివృద్ధి కోసం రూ.36 కోట్లు, యాత్రికుల వసతి గృహాలకు 5.25 కోట్లు .
- రాష్ట్ర ప్రభుత్వం 2017లో ప్రవేశపెట్టిన దివ్యదర్శనం పథకం అమలు చేయటంలో భాగంగా రవాణా సౌకర్యం కోసం 50 శాతం వ్యయాన్ని టీటీడీ ఖర్చు చేసేందుకు ఏపీఎస్‌ఆర్‌టీసీకి రూ.1.25 కోట్లు చెల్లించేందుకు ఆమోదం.
- చిల్లర నాణేల మార్పిడి కోసం ఆర్‌బీఐతో సంప్రదింపుల కోసం కమిటీ.
- నూతన కల్యాణమండపాల నిర్మాణంపై సబ్‌కమిటీ నివేదిక తర్వాత నిర్ణయం.
- తిరుమలలో మాస్టర్‌ప్లాన్‌లో రూ.15 కోట్లు వెచ్చించి మురుగుదొడ్ల నిర్మాణం.
Comments
Please login to add a commentAdd a comment