మీడియాతో మాట్లాడుతున్న రమణ దీక్షితులు
హైదరాబాద్: ఇటీవల కాలంలో కొందరు టీటీడీ అధికారులు, రాజకీయ నాయకులు చేస్తున్న ఆరోపణలపై తాను సీబీఐ విచారణకైనా సిద్ధమని టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు స్పష్టం చేశారు. అయితే ఆరోపణలు చేసే వారూ, వారి బినామీలూ సీబీఐ విచారణకు సిద్ధమేనా? అని ప్రశ్నించారు. సోమవారం సికింద్రాబాద్‌లోని ఓ హోటల్‌లో మీడియాతో మాట్లాడారు. తనపై వస్తున్న ఆరోపణలకు బాధపడ్డానని, భక్తులకు వాస్తవాలు తెలియాలనే మీడియా ముందుకు వచ్చినట్లు వెల్లడించారు.1994 నుంచి స్వామి వారి సన్నిధిలో అర్చకుడిగా ఉన్నానని గతంలో జేఈవోలుగా పనిచేసిన బాల సుబ్రమణ్యం, ధర్మారెడ్డి, శ్రీనివాసరాజు.. బ్రాహ్మణ, అర్చక వ్యతిరేకులుగా, నాస్తికులుగా పనిచేశారన్నారు.
వెయ్యి కాళ్ల మంటపాన్ని మాస్టర్‌ప్లాన్ కోసం అంటూ కూల్చిన సమయంలో గట్టిగా పోరాటం చేశానని అన్నారు. తనపై కక్ష కట్టిన అధికారులు ఎంతో ప్రాచీనమైన, వంశపారంపర్యంగా వచ్చిన తన ఇంటిని కూడా కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బాలసుబ్రమణ్యం చట్టవ్యతిరేక విధానాలు, వ్యసనాలకు అలవాటుపడి అర్చకులను క్రూరంగా హింసించేవాడన్నారు. ఇక శ్రీనివాసరాజు అవినీతి, అక్రమాలు ప్రపంచానికి మొత్తం తెలుసని ఆరోపించారు. 24 ఏళ్లుగా ఇలాంటి అధికారులతో హింసకు గురయ్యానని చెప్పారు.
2001లో పింక్ డైమండ్ మాయమైందని, ఇది నాణేలు తగిలి పగిలిపోయిందని అధికారులు చెబుతున్నారని.. ఎంతో కఠినంగా ఉండే వజ్రం ఎలా పగులుతుందని ప్రశ్నించారు. 1800లో బ్రిటిష్ మ్యానువల్స్‌లో స్వామివారి వంటశాల పక్కనున్న నేలమాలిగల్లో నిధులున్నాయని ఉందని.. అక్కడ తవ్వకాలపైనా సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. 2 నెలలకోసారి అపోలో ఆస్పత్రికి వైద్య పరీక్షల కోసం వస్తానని, ఇప్పుడు కూడా దీని కోసమే వచ్చినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment