
తిరుమల: శ్రీవారికి నైవేద్యాల సమర్పణలో ఎలాంటి లోపాలు జరగలేదని తిరుమల పోటు ప్రెసిడెంట్ వరదరాజన్ తెలిపారు. స్వామి వారికి నైవేద్య సమర్పణ జరగలేదని రమణ దీక్షితులు ఆరోపించడం బాధాకరమన్నారు. ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై పోటు సిబ్బంది స్పందించారు. జాయింట్ సెక్రటరీ ఆల్వార్‌తో కలిసి వరదరాజన్ మీడియాతో మాట్లాడారు. ఆగమశాస్త్రం ప్రకారం ప్రసాదాలు తయారు చేస్తున్నామని చెప్పారు.
24 గంటల పాటు విడతల వారీగా సిబ్బంది పోటులో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2001, 2007, 2017 సంవత్సరాల్లో పోటులో మరమ్మతులు జరిగాయని వివరించారు. 2001, 2007లో రమణ దీక్షితులు అనుమతితోనే సంపంగి ప్రాకారంలో ప్రసాదాలు తయారు చేశామన్నారు. పోటులో తవ్వకాలు జరిగాయనడం అవాస్తవమన్నారు. ఇలాంటి ఆరోపణలు మళ్లీ చేస్తే చట్టపరంగా ముందుకు వెళతామని హెచ్చరించారు. మీరాసీ అర్చకులు శ్రీవారి ఆలయానికి రాలేదని చెప్పారు. కాగా, ఆలయం లోపల వెండి వాకిలి పక్కన బూంది పోటులో 15 రోజుల పాటు ప్రసాదాలు తయారు చేశామని.. అవి కూడా ఆలయ ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా చేయలేదని వారు తెలిపారు.