
సాక్షి, హైదరాబాద్: తిరుమల వ్యవహారాలపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడిన తీరు, చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. రమణ దీక్షితులును బొక్కలో వేసి నాలుగు తగిలించాలని మంత్రి మాట్లాడడం ఆయన అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యతిరేకంగా మాట్లాడే వారందరినీ బొక్కలో వేసి నాలుగు తగిలించే స్థాయికి దిగజారారా? అని ప్రశ్నించారు.
స్వామి సన్నిధిలో ఉన్న భక్తులను సైతం బొక్కలో తోసే పరిస్థితి వచ్చిందంటే చట్టం ఏమై పోయింది? అసలు పాలన సాగిస్తున్నారా లేక పశువులు కాస్తున్నారా? అని నిలదీశారు. దమ్ముంటే నాలుగు తగిలించి బొక్కలో వేసి చూడు, నీ సంగతి చూస్తాం అని సోమిరెడ్డిని హెచ్చరించారు. వెంటనే అహంకారపూరిత వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, క్షమాపణలు చెప్పాలని సోమిరెడ్డిని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారనే అక్కసుతో రమణ దీక్షితులును బొక్కలో వేయాలనడం దారుణమన్నారు.
బీజేపీ, వైఎస్సార్‌సీపీ కుమ్మక్కై కుట్రలు చేస్తున్నాయని మంత్రి వ్యాఖ్యానించడాన్ని అంబటి తప్పుపట్టారు. తిరుమల కొండపై అపచారాలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలన్నారు. అపుడు ఎవరిని బొక్కలో వేయాలో దర్యాప్తు సంస్థ తేలుస్తుందన్నారు. టీడీపీ పాలకుల అహంకారానికి వేంకటేశ్వరస్వామి తగిన శాస్తి చేస్తారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment