
సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో కులాల మధ్య చిచ్చు పెట్టిన విధంగానే, అర్చకుల కుటుంబాల మధ్య చంద్రబాబు నాయుడు చిచ్చు పెడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వారసత్వ అర్చకత్వం ఎన్నో ఏళ్ల నుంచి అమలవుతోందని తెలిపారు. నాలుగు వారసత్వ కుటుంబాలకు ఎంతో విశిష్టత ఉందని.. ఈ కుటుంబాలు వేలాది ఏళ్లుగా శ్రీవారికి సేవ చేస్తున్నాయన్నారు. తరతరాల సంప్రదాయాలపై ఎవ్వరికీ పెత్తనం ఉండొద్దని పేర్కొన్నారు. అన్యమతస్థుల పాలనకాలంలో కూడా స్వామివారి ఆచార వ్యవహారాల్లో తలదూర్చలేదని గుర్తు చేశారు. అమరావతిలో బౌద్ధ మతానికి ప్రాధాన్యత ఇస్తున్న చంద్రబాబు స్వామివారి ఆచారాల్లో తలదూరుస్తున్నారన్నారు.
హిందూ సంప్రదాయాలకు గండికొట్టి, దైవ సమానులైన అర్చక కుటుంబాలను స్వామి సేవల నుంచి దూరం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఉచ్చులో పడి అర్చకులు తగాదాలు పడుతున్నారని తెలిపారు. బాబు జీవితమంతా కులాల మధ్య వైరాన్ని సృష్టించడమేనని విమర్శించారు. ప్రశ్నించే వారిపై క్షక్ష సాధింపులకు గురిచేస్తున్నారని, రమణ దీక్షితులు ఆరోపణలపై చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. తన అవసరాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి జీవోలు తెస్తున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment