
సాక్షి, అమరావతి : టీటీడీ ఆలయ ప్రధానార్చకులు రమణ దీక్షితులు అర్చక వృత్తిని వదిలేసి, రాజకీయ వృత్తిని తీసుకున్నారు...పబ్లిసిటీ కోసమే ఇంత బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ...ఈ మధ్య కాలంలో రమణ దీక్షితులు హద్దుమీరి వ్యవహరిస్తున్నారని, ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని అన్నారు. పురావస్తు వారిని నియమించాలని చెప్పడానికి ఆయనకు ఏం అధికారముందని ప్రశ్నించారు.
‘రమణ దీక్షితులు చాలా తప్పులు చేసారు. ప్రధానాలయంలోకి మనవడిని తీసుకెళ్లారు, వీఐపీలు వస్తే గెస్ట్‌హౌస్‌ల్లోకి వెళ్లి ఆశీర్వాదం ఇచ్చేవారు. అలాగే కొంత మందిని ఆయన అర్థరాత్రి ఆలయంలోకి తీసుకెళ్లి పూజలు చేయించారు. ఆ చర్యలను భరించలేకే టీటీడీ రమణ దీక్షితులను విధులనుంచి తొలగించింది. ఇంతవరకూ నేను రమణ దీక్షితులు వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆయన తన హద్దులను దాటి మరి ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఉపేక్షించేది లేదు...ఆయన చేసిన పనులపై ప్రత్యేక విచారణ జరిపిస్తాం.
స్వామి వారి ఆస్తుల గురించి కూడా అవాకులు చేవాకులు మాట్లాడుతున్నారు. కానీ ప్రతియేడు స్వామి వారి అభరణాలను లెక్కిస్తున్నాము. 1996లో స్వయంగా రమణ దీక్షితులే అన్ని నగలు భద్రంగా ఉన్నాయన్నారు, మరి ఇప్పుడు ఇలా ఎందుకు అబద్దమాడుతున్నారో ఆయనకే తెలియాలన్నారు. రమణ దీక్షితులు ముగ్గురు కొడుకులు పూజలు, అర్చనలుకు హజరవ్వటం లేదు, అయినా వారిని అర్చకులుగా కొనసాగించాలనుకుంటున్నారు. అందుకే ఈ విషయంలో రమణ దీక్షితులుకు, మిగతా అర్చకులకు గొడవలు వచ్చాయి. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా శ్రీవారి దర్శనకు వచ్చినప్పుడు మేమే ఆయనకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయించాం. అలానే డాలర్ శేషాద్రి విషయం గురించి కూడా ఆరా తీస్తాం. కేవలం పబ్లిసిటీ కోసమే రమణ దీక్షితులు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు.’ అని కేఈ కృష్ణమూర్తి విమర్శించారు.