సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. 65 ఏళ్లు దాటిన అర్చకులను తొలగించాలని బుధవారం జరిగిన పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ కొత్త పాలకమండలి ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాలకమండలిలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ వెంటనే అమలులోకి తీసుకువచ్చింది. దాంతో శ్రీవారి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సహా అర్చకులు నరసింహదీక్షితులు, శ్రీనివాసమూర్తి దీక్షితులు, నారాయణదీక్షితులపై వేటు పడింది. రమణ దీక్షితులు సహా నలుగురు ప్రధాన అర్చకులు పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే టీటీడీ తీసుకున్నఈ నిర్ణయంపై అర్చకులు మండిపడుతున్నారు.
కాగా, టీటీడీ నిర్ణయాలపై రమణదీక్షితులు మంగళవారం చెన్నైలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని ఆచార వ్యవహారాలపై పలు విమర్శలు చేసి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది జరిగి 24 గంటలకు గడవక ముందే 65 ఏళ్ల పరిమితి సాకు చూపి రమణదీక్షితులపై పాలకమండలి వేటు వేసింది. అంతేకాకుండా రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై వివరణ కోరుతామని దేవస్థానం ఈవో సింఘాల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment