రమణ దీక్షితులుతో పదవీ విరమణ చేయించే అధికారం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి లేదని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. టీటీడీపై ప్రభుత్వ నియంత్రణ ఉండకూడదని వ్యాఖ్యానించారు. ఆభరణాల మాయం అంశంపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ మూడు అంశాలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు పేర్కొన్నారు. తక్షణమే రమణ దీక్షితులు రిటైర్మెంట్‌పై స్టే ఇవ్వాలని కోరతానని చెప్పారు. టీటీడీపై సమీక్ష నిర్వహించే అధికారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదని పేర్కొన్నారు. దేవాలయ నిర్వహణ సాధువులకు ఇవ్వాలని, లేదంటే లూటీ ఇలాగే కొనసాగుతుందని అన్నారు.
బీజేపీకి ఈ కేసుకు సంబంధం లేదని చెప్పారు. విరాట్ హిందూ సంఘటన ఆధారంగా కేసు వేస్తున్నట్లు స్వామి వెల్లడించారు. దేవాలయానికి బంగారుపూత కేసులో విజయం సాధించినట్లే, ఈ కేసులో సైతం విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.