తిరుమల తిరుపతి దేవస్ధానం అర్చకులు రమణ దీక్షితులకు టీటీడీ నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల క్రితం టీటీడీ పాలక మండలి, అధికారులు, ఏపీ ప్రభుత్వంపై రమణ దీక్షితులు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై వివరణ ఇవ్వాల్సిందిగా రమణ దీక్షితులుకు అధికారులు నోటీసు జారీ చేశారు. అయితే టీటీడీ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు రమణ దీక్షితులు ఇంటికి వెళ్లగా.. ఆ సమయంలో ఆయన లేరు. దీంతో నోటీసులను అధికారులు ఇంటికి అంటించారు.
కాగా, మంగళవారం చెన్నైలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన రమణ దీక్షితులు.. టీటీడీ అధికారులు, ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అనాదిగా వస్తున్న అర్చక వారసత్వాన్ని ప్రభుత్వం రద్దు చేయడం ఆగమ శాస్త్ర విరుద్ధమంటూనే ఎన్నో అవమానాలను భరించాల్సి వస్తోందని ఆవేదన వెలిబుచ్చారు. టీటీడీలోని అధికారులు కొంతమంది అధికార బలంతో ఆలయ నిబంధనలను విస్మరిస్తున్నారని, సినీ, రాజకీయ ప్రముఖులకు భజన చేస్తూ ఆలయ సంప్రదాయాలను, కైంకర్యాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. రమణ దీక్షితులు చేసిన విమర్శలు, ఆరోపణలు టీటీడీ అధికారులు, వేదపండిత, ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపాయి.