అర్చకులకు శఠగోపం | IYR Krishna Rao Guest Columns On Chandrababu Governance In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

అర్చకులకు శఠగోపం

Published Tue, Mar 5 2019 2:01 AM | Last Updated on Tue, Mar 5 2019 2:01 AM

IYR Krishna Rao Guest Columns On Chandrababu Governance In Andhra Pradesh - Sakshi

ఫైల్‌ ఫోటో

షేక్సి్పయర్‌ రాసిన హేమ్లెట్‌ నాటకంలో హేమ్లెట్‌ తన తల్లిని గురించి తలుచుకుంటూ బలహీనత రూపం స్త్రీ అని వ్యాఖ్యానిస్తారు. ఈమధ్య ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్‌లో గ్రామీణ అర్చకుల దారుణ పరిస్థితి ఆయన హృదయాన్ని కలిచివేసింది అన్న ట్వీట్‌ చూసిపై వ్యాఖ్యానం గుర్తుకొచ్చి ‘కపటత్వమా నీ పేరు బాబు గారు’ అనిపించింది.  

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న దేవాలయాల అర్చకుల పరిస్థితి అతి దారుణంగా ఉందనేది నిర్వివాదాంశమైన విషయం. ఏమి చేస్తే ఆ పరిస్థితులు బాగుపడతాయనే దానికి కూడా ఒక స్పష్టమైన ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం ముందు గత ఐదు సంవత్సరాల నుంచి నలుగుతూనే ఉంది. దానిమీద ఎటువంటి చర్య తీసుకోకుండా ప్రాథమికంగా ఇచ్చిన జీవో 76ను ఆమోదిస్తూ తుది ప్రకటన చెయ్యకుండా ఈరోజు ఎన్నికల ముందు గ్రామీణ ప్రాంతాల అర్చకుల పరిస్థితి చూస్తే నా హృదయం కలత చెందుతోంది అని ముఖ్యమంత్రి ప్రకటిస్తే నాకైతే నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఇక ప్రధాన సమస్యను అవతల పెట్టి కంటితుడుపు చర్యగా 5,000 పారితోషకాన్ని 8,000కు పెంచుతామని, 10,000 నుంచి 12,500 చేస్తామని ప్రకటించారు.

ఈ కేటగిరీ కింద వచ్చే అర్చకుల సంఖ్య పదిహేను వందలకు మించి లేదు. 16 కోట్లు దీనికోసం టీటీడీ నుంచి వస్తుందని ప్రకటించారు. వాస్తవానికి 5 సంవత్సరాల క్రితం అర్చక సంక్షేమానికి టీటీడీ 100 కోట్లు ప్రకటించి మొదటి  2 సంవత్సరాలు 25 కోట్ల చొప్పున 50 కోట్లు ఇచ్చి గత రెండు సంవత్సరాల నుంచి మిగిలిన 50 కోట్లు ఇవ్వకుండా నిలుపుదల చేసింది. ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రకటించిన 16 కోట్లు ఆ 50 కోట్ల లోనివే. అదనంగా ఇచ్చింది ఏమీలేదు. ఈ హామీ అమలు చేయాలన్న టీటీడీ మిగిలిన పెద్ద ఆలయాల నుంచి ఒక వంద కోట్ల తో మూల నిధి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దానిని గురించి కార్యాచరణ గానీ, ఆలోచన గానీ లేదు. కానీ అసలు సమస్య 5 వేల కన్నా తక్కువ పారితో షికాన్ని పొందుతూ గ్రామీణ ప్రాంతాల్లో 25 వేల దేవాలయాలలో పనిచేస్తున్న అర్చకులది.  

భారతదేశంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో దేవాలయ వ్యవస్థ ఒక ప్రత్యేక రీతిలో రూపుదిద్దుకుంది. దేవాలయాల మనుగడకు నిర్వహణకు ఆనాటి పాలకులు భూములు ఇచ్చారు. వాటిని దేవాలయ ఈనాము అంటారు. అదేవిధంగా అర్చకత్వం, భజంత్రీలు మొదలైన కార్యక్రమాలు నిర్వ హించేవారి భుక్తి కోసం ప్రత్యేకంగా సర్వీసు ఈనాములు కేటాయించడం జరిగింది. ఈ విధంగా పాలకుల ప్రాపకంతోను స్థానిక సమాజం మద్దతు తోనే దేవాలయాలు స్వయంప్రతిపత్తి కలిగిన ఆధ్యాత్మిక సామాజిక కేంద్రాలుగా పరిణతి చెందాయి. ఈ విధానాన్ని 1987 దేవాదాయ చట్టం మార్పుల ద్వారా సవరించి ఈ చిన్న దేవాలయాలు అన్నింటిని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకొని రావటం జరిగింది.

అసలే ఆదాయం లేక అంతంతమాత్రంగా నడుస్తున్న దేవాలయాలు, ఈ దేవాదాయ శాఖ అధికారుల జీతభత్యాలు కూడా మోయాల్సి రావటంతో వాటి అస్తిత్వం పూర్తిగా దెబ్బతింది. ఈరోజు అర్చకుల ప్రధాన అభ్యర్థన, ఆదాయం లేని 25వేల దేవాలయాలను దేవాదాయ శాఖ పరిధి నుంచి తప్పించి స్థానిక సమాజం సహకారంతో అర్చకుడు నిర్వహించే విధంగా మార్చమని. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రతి అర్చకుడి కి నెలకు కనీస వేతనం 10,000 వచ్చే విధంగా ఏర్పాటు చేస్తే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడానికి కూడా వారికి ఎటువంటి అభ్యంతరం లేదు.ఈ రెండిట్లో ఏదో ఒకటి అమలు చేయాల్సింది పోయి, 1,500 మందికి కొద్దిగా సహాయపడే చిన్న కార్యక్రమాన్ని ప్రకటించి ఏదో అర్చకుల అందరికీ ఈ ప్రభుత్వం మేలు చేసిందన్న స్థాయిలో రాజకీయ లబ్ది కోసం ప్రకటన ఇచ్చుకున్నారు.

సమస్యపై అవగాహన, చిత్తశుద్ధి ఉంటే సమస్యకు పరిష్కారాలు లభిస్తాయి. దీనికి తెలంగాణ ప్రభుత్వ చర్యలే నిదర్శనం. ఈ అంశాలను క్షుణ్ణంగా పరిశీలించడానికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి వారి సిఫార్సుల మేరకు అర్చకులకు 10,000 కనీస పారితోషికం ఇచ్చే విధంగా రూపొందించి, ఒక మూలనిధిని ఏర్పాటుచేసి ఆ నిధికి రాష్ట్ర బడ్జెట్‌ నుంచి గ్రాంట్‌ ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నాయకత్వం ఈ విషయంపై అవగాహన లేకుండా సమస్యకు సరైన పరిష్కారాలు ఆలోచించకుండా ఐదు సంవత్సరాలు కాలం వెళ్లదీసి, ఇప్పుడు కూడా ప్రధాన సమస్యలు పక్కనపెట్టి అసలు సమస్యలకు పరిష్కారం కనుక్కోకుండా రాజకీయ లబ్ధికోసం ప్రచార ఆర్భాటానికి పరిమితం అవుతున్నది.

వ్యాసకర్త: ఐవైఆర్‌ కృష్ణారావు, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి
iyrk45@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement