ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో భాగంగా విభజన చట్టంలోనూ ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రకటనలోనూ ఆంధ్రప్ర దేశ్ రాష్ట్రానికి కొన్ని వాగ్దా నాలు చేయడమైనది. విద్య మౌలిక సదుపాయాల సంస్థల ఏర్పాటు గురించి ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టంలోని 93 సెక్షన్లో ప్రస్తావించారు. రెండు రాష్ట్రాల స్థిరమైన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్ 13లో పేర్కొన్న చర్యలను కేంద్ర ప్రభుత్వం పదేళ్ల కాలపరిమితిలో చేపట్టాలని పేర్కొన్నారు. తదనుగుణంగా 13వ షెడ్యూల్లో విద్యాపరమైన కొన్ని సంస్థలను మౌలిక సదుపాయాలకు సంబంధించి మరికొన్ని సంస్థలను ప్రస్తావించటం జరిగింది.
విద్యాపరమైన సంస్థలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఐఎం, ఐఐటీ, ఎన్.ఐ.టి, ఐసీఆర్, ఐఐఐటీ, గిరిజన విశ్వవిద్యాలయం, కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఎయిమ్స్, ఎన్.ఐ.డి.ఎం, పెట్రోలియం విశ్వవిద్యాలయం, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడానికి 13వ షెడ్యూల్లో పొందుపరచడమైనది. దీనికి అనుగుణంగా వేగవంతంగా ఈ సంస్థలో చాలా వాటిని ఏర్పాటు చేయడం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్థలన్నీ 2015–16 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలని గట్టిగా ప్రయత్నం చేసినప్పటికీ, అధికారిక స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో మాత్రం పూర్తి మౌలిక సౌకర్యాలు ఏర్పడిన తర్వాతనే అంటే నాలుగు లేక అయిదేళ్ల తర్వాత ఏర్పాటు చేయడానికి మొగ్గుచూపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయపరంగా గట్టి ప్రయత్నం జరిపి తాత్కాలిక భవనాల్లోనైనా పర్వాలేదు త్వరగా ప్రారంభించండి అని అభ్యర్థించి ఈ సంస్థలను అనతికాలంలో సాధించుకున్నది. ఇతర రాష్ట్రాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఈ సంస్థలను స్థాపించడానికి గణనీయమైన సమయమే పట్టింది.
కానీ సంస్థలు ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించిన తీరు గర్హనీయం. ఆరోజు తాత్కాలికమైన భవనాల్లో వెంటనే సంస్థలను ప్రారంభించమని ప్రాధేయపడి ఈరోజు అవి తాత్కాలిక భవనాల్లో నడుస్తున్నాయని అపవాదు వేయటం దురదృష్టకరం. అదే విధంగా ఈ సంస్థలన్నిటికీ 10 వేల కోట్ల రూపాయలు కావాల్సి ఉంటాయని ఇప్పుడున్న విధంగా బడ్జెట్ కేటాయింపులు జరిగితే పదిహేనేళ్లు పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వాదన సహేతుకం కాదు. పూర్తిగా వాస్తవాలను వక్రీకరించి చేస్తున్న ఆరోపణ.
ఏ సంస్థ అయినా ప్రారంభించిన మొదటి సంవత్సరంలో ఎక్కువ నిధులను ఖర్చు పెట్టలేదు. క్రమేణా పనులు వేగం పుంజుకుని నిర్ణీత కాలంలో పూర్తయ్యే క్రమంలో అన్ని సదుపాయాలు ఏర్పడతాయి. జాతీయ విద్యా సంస్థలను కేంద్రం అనేక ఇతర రాష్ట్రాలలో కూడా ఏర్పాటు చేసింది. ప్రతి సంస్థకు ఒక డైరెక్టర్ ఉంటాడు. సదుపాయాల ఏర్పాటు పురోగతి తాను చూసుకుంటాడు. ఇటువంటి విధి విధానాలు ఉన్నప్పుడు తనకు సంబంధించని అంశాల్లో వాస్తవాన్ని వక్రీకరించి చూపెడుతూ ఈ సంస్థలు పూర్తవటానికి 15 ఏళ్లు పడుతుందని అసత్య ప్రచారం చేయటం రాష్ట్ర ప్రభుత్వానికి తగదు. ఇతర రాష్ట్రాల్లో పూర్తయిన విధంగానే నిర్ణీత కాలంలో ఈ సంస్థలన్నీ పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలతో పని చేయడం జరుగుతుంది.
ఇక రెండవ అంశం, 13వ షెడ్యూల్లోని మౌలిక సదుపాయాలకు సంబంధించిన సంస్థలు. వీటిలో ప్రధానంగా విమానాశ్రయాల ఆధునీకరణ, వైజాగ్ చెన్నై పారిశ్రామిక కారిడార్ పనులు సంతృప్తికరంగా జరుగుతున్నాయని నాకు అందిన సమాచారం. ఇక దుగరాజపట్నం నౌకాశ్రయం పర్యావరణ సమస్యల మూలంగా ముందుకు పోవటం లేదు. మిగిలిన అన్ని మౌలిక సదుపాయాల సంస్థల విషయంలో చట్టంలో సాధ్యాసాధ్యాల పరిశీలన గురించి ప్రస్తావించడం జరిగింది గానీ వీటిని ఇదమిత్థంగా నెలకొల్పాలని పేర్కొనలేదు.
ఈ సంస్థలన్నీ వాణిజ్యపరమైన సంస్థలు. ఎక్కువ మొత్తంలో పెట్టుబడి కావాల్సిన వ్యవస్థలు. ఈ విషయం తెలిసి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టంలో వీటి సాధ్యాసాధ్యాల పరిశీలనను ప్రస్తావించి వదిలేసింది కానీ ఏర్పాటు చేయాలని స్పష్టంగా పేర్కొనలేదు. పైపెచ్చు వీటిని ఏర్పాటు చేయడానికి పది సంవత్సరాల సమయాన్ని కూడా పేర్కొనడం జరిగింది. ఈ అంశాలన్నీ వివిధ దశల పురోగతిలో ఉన్నాయి.
చట్టంలో అంశాలు పై విధంగా ఉండగా, 10 సంవత్సరాలు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్న చాలా సంస్థలను రికార్డు స్థాయిలో మొదటి సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వం నెలకొల్పినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పని కట్టుకుని ఈ వాస్తవాలన్నీ మరుగున పరుస్తూ ఏర్పాటు చేయడానికి ఇంకా సమయం ఉన్న కొన్ని అంశాలను మాత్రమే భూతద్దంలో చూపెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఒక దోషి లాగా చూపెట్టాలనే ప్రయత్నాన్ని చేయడం దురదృష్టకరం.
వ్యాసకర్త: ఐవైఆర్ కృష్ణారావు, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి iyrk45@gmail.com
Comments
Please login to add a commentAdd a comment