
సాక్షి, పశ్చిమ గోదావరి : ఆంధ్రప్రదేశ్‌లో మీడియా ఏకపక్షంగా వ్యవహరిస్తుందనీ, చంద్రబాబు ప్రభుత్వానికి కొమ్ము కాస్తోందని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు విమర్శించారు. శనివారం తాడేపల్లి గూడెంలోని డీఎస్‌ఆర్ కళ్యాణ మండపలంలో ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మీడియా అంతా ఒకపైపే ఉండటం వల్ల ప్రజలకు నిజాలు తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తటస్థ మీడియా లేకపోవడం వల్ల ఏపీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.
పార్లమెంట్‌లో నాయకులు మాట్లాడిన మాటలు కూడా ప్రజలకు పూర్తిగా చూపించడం లేదని ఆరోపించారు. విభజన చట్టంలోని హామీలను కేంద్రం అమలు చేయడం లేదని అనడంలో వాస్తవం లేదన్నారు. పునర్విభజన చట్టంలో ఎక్కడా కూడా ప్రత్యేక హోదా గురించి లేదని, సెక్షన్ 94లో రెండు రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాలకు ఆర్థిక సహాయం ఇవ్వాలని మాత్రమే ఉందన్నారు. ఆ విధంగా ఏపీలో 7 జిల్లాలను గుర్తించి మూడు సంవత్సరాలకు రూ.350 కోట్ల చొప్పున కేంద్రం ఇచ్చిందని చెప్పారు.
నాలుగో సంవత్సరంలో కేంద్రం ఇచ్చిన డబ్బును మళ్లీ వెనక్కి తీసుకుందని, యూటిలైజెడ్ సర్టిఫికేట్ ఇచ్చాక వెనక్కి ఇస్తామని చెప్పిందన్నారు. ఏపీకి ఆర్థిక సహాయం కింద రూ. 5000 కోట్లు ఇస్తామని కేంద్రం ముందుకు వచ్చింది కానీ, రూ. 16,500 కోట్లు నాబార్డ్ నుంచి కావాలని రాష్ట్ర ప్రభుత్వం అడిగిందన్నారు. దాని ప్రకారం రూ. 12,500 కోట్లు ఇచ్చెందుకు కేంద్రం అంగీకరించిందిని కానీ చంద్రబాబు రాజకీయ వ్యూహంతో దానిని వద్దని చెప్పారని ఆరోపించారు. కేంద్రం ప్యాకేజీకి మొదట అంగీకరించిన చంద్రబాబు.. రాజకీయ లబ్దికోసమే యు టర్న్ తీసుకున్నారని విమర్శించారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రం నష్ట పోతుందని ఐవైఆర్ కృష్ణారావు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment