
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 8కి కాలదోషం పట్టడానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే అనే విషయం లోతుగా పరిశీలించిన వారెవరికైనా తెలుస్తుందని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ‘నవ్యాంధ్రతో నా నడక’ పుస్తకంలో స్పష్టం చేశారు. సెక్షన్ 8కి కాలదోషం ఎందుకు పట్టిందనే అంశాన్ని అందులోని ఓ అధ్యాయంలో ఆయన వివరించారు. ఆ అంశాలు యధాతధంగా...
‘హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా నిర్ణయించినందున సెక్షన్ 8కి ప్రాధాన్యం ఏర్పడింది. సెక్షన్ 8 ప్రధానంగా ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన వారి ప్రాణ, ధన, ఆస్తి పరిరక్షణకు ఉద్దేశించింది. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం హైదరాబాద్ పదేళ్ల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉండాలి. ఉమ్మడి రాజధానిలో పరిపాలనకు సెక్షన్ 8 వీలు కల్పిస్తుంది. ఈ ప్రాంతంలో నివసించే ప్రజల స్వేచ్ఛ, ఆస్తులను కాపాడే బాధ్యతను గవర్నర్‌కు అప్పగించారు. ముఖ్యంగా శాంతి భద్రతలు, అంతర్గత భద్రత, కీలక ప్రదేశాల భద్రత, ప్రభుత్వ భవనాల నిర్వహణ, కేటాయింపు గవర్నర్ బాధ్యత. తెలంగాణ మంత్రి మండలిని సంప్రదించిన తర్వాత ఆయన స్వీయ విచక్షణ మేరకు నిర్ణయం తీసుకుంటారు. గవర్నర్‌కు సలహాదారులుగా ఇద్దరు అధికారులను నియమించే ఏర్పాటు కూడా సెక్షన్ 8లో ఉంది.
ఈ చట్టం ప్రకారం అవసరమైన నిబంధనలను రూపొందించాలని, హైదరాబాద్‌లో శాంతి భద్రతలు, ప్రజల రక్షణ విషయంలో అధిక పాత్ర నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావించింది. సెక్షన్ 8 సమర్ధవంతంగా అమలు కావాలంటే హైదరాబాద్ నగర పోలీసు వ్యవస్థలో రెండు రాష్ట్రాల పోలీసులకు తగిన ప్రాతినిధ్యం ఉండాలని మేమే కోరాం. కానీ తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ప్రతిఘటించింది. హైదరాబాద్ పూర్తిగా తెలంగాణలో ఉన్నందువల్ల శాంతి భద్రతలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ అంశమని, ఈ విషయంలో గవర్నర్‌కు ఎలాంటి నిర్దిష్టమైన పాత్ర లేదని పేర్కొంది. సెక్షన్ 8 విషయంలో అప్పుడు కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ఉన్న అనిల్ గోస్వామితో నాకు వాగ్వివాదం జరిగింది. అనిల్ గోస్వామి పూర్తిగా తెలంగాణకు అనుకూలంగా కనపడ్డారు.
ఇతర ప్రాంతాల ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు తెచ్చిన సెక్షన్ 8ను ఎందుకు విస్మరిస్తున్నారని గోస్వామిని నిలదీశా. దీనిపై ఆయన తీవ్ర అసహనాన్ని ప్రదర్శించారు. హోంశాఖ కార్యదర్శి విభజన అంశాల గురించి పూర్తి ఉదాశీనంగా వ్యవహరించారు. కనీసం రెండు రాష్ట్రాల మధ్య సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా ఆసక్తి కనపరచలేదు. తాంబూలాలిచ్చాం... తన్నుకు చావండి అన్నట్లుగా వ్యవహరించారు. దీంతో పరస్పర సర్దుబాటు, కోర్టు ద్వారా సమస్యలను పరిష్కరించుకున్నాం. ఇక ఏడాది తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఈలోపు చంద్రబాబు రాజధానిని హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించాలని నిర్ణయించారు.
మీ ప్రభుత్వమే ఇక్కడ లేనప్పుడు సెక్షన్ 8 అవసరం ఏముంది?
ఒకసారి రాజధానిని విజయవాడకు తరలించిన తర్వాత సెక్షన్ 8 అనే దానికి ప్రాధాన్యం లేకుండా పోయింది. దానికి కాలదోషం పట్టింది. మీ ప్రభుత్వమే ఇక్కడ లేనప్పుడు సెక్షన్ 8 అవసరం ఏముంది? అనే వాదన కేంద్ర ప్రభుత్వంలో వినిపించింది. దీనిపై కేంద్ర హోంశాఖకు సరైన జవాబు చెప్పలేక ఆ అంశాన్ని నిశ్శబ్ధంగా సమాధి చేశారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రజలు ఆస్తులు, శాంతి భద్రతల విషయంలో తెలంగాణ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం వ్యవహరించిన తీరు ప్రశంసనీయం. ఎలాంటి ఫిర్యాదులు లేకుండా ఉండగలమన్న విశ్వాసం ప్రజల్లో కలిగింది. సెక్షన్ 8 అమలులో లేదన్న విషయమే అందరూ మరిచిపోయారు. సామాస్య ప్రజలు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లోని సచివాలయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు బ్లాకులు కేటాయించారు. గవర్నర్, ఆయన సలహాదారులు ఆంధ్రప్రదేశ్‌కు హెచ్, ఎల్, బ్లాకులు అలాట్ చేశారు. హెచ్ బ్లాకు ముఖ్యమంత్రి కార్యాలయానికి కేటాయించారు. కానీ వాస్తు ప్రకారం హెచ్ బ్లాకు సరైంది కాదని అన్నిటికన్నా ఎతైన ఎల్ బ్లాక్ 8వ అంతస్థు నుంచి పనిచేస్తానని సీఎం చంద్రబాబు చెప్పారు. దీంతో ఎల్ బ్లాకులోని 8వ అంతస్తును అత్యాధునాతనంగా రూపొందించాం. దీనికి భారీ ఎత్తున ఖర్చు అయింది.
Comments
Please login to add a commentAdd a comment